అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు | AAPI 37th Annual Convention In Atlanta | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు

Published Thu, Jul 11 2019 1:58 PM | Last Updated on Thu, Jul 11 2019 2:00 PM

AAPI 37th Annual Convention In Atlanta - Sakshi

అట్లాంటా : అమెరికాలోని అట్లాంటా మహానగరంలో ఆషియన్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫీజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఆపి) 37వ వార్షిక సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు సుమారు మూడువేల మందికిపైగా హాజరయ్యారు. అమెరికాలోని వివిధ నగరాల నుంచి వైద్యులు వారి కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. ఆపి అమెరికాలో అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన భారతీయ వైద్యుల సంఘం. అమెరికాలోని ఈ వైద్యుల సంఘం భారత దేశంలోనూ, అమెరికాలోను అనేకమైన వైద్య సేవలను అందిస్తోంది. ఆపి సంస్థ భారత ప్రభుత్వంతోను, అనేక రాష్ట్రాలతోనూ అనేక స్వచ్చంద సంస్థలతోను ఒప్పందాలు చేసుకుని విరివిగా భారత దేశంలో వైద్య సేవలను అందిస్తోంది. ఆపి 37వ వార్షిక సదస్సు జులై 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో.. మహబూబ్‌నగర్ మూలాలు కలిగిన అట్లాంటా ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ గంగసాని శ్రీనివాసులు రెడ్డి (శ్రీని గంగసాని) ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. జులై 3వ తేదీ సాయంత్రం విశ్వయోగి విశ్వంజీ హిందూ సాంప్రదాయ బద్దంగా జ్యోతిని వెలిగించి ఐదు రోజుల ఆపి మహా సభలను ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికా ప్రభుత్వ అధికారులు, అమెరికా మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు అట్లాంటాలోని భారత ప్రభుత్వ దౌత్య అధికారిని డాక్టర్ స్వాతి కులకర్ణి కూడా పాల్గొని ఐదు రోజుల డాక్టర్ల సదస్సుకు హాజరైన డాక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జులై 4వ తేదీ ఉదయం ప్రముఖ వైద్యులు, ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలు మరియు భారతీయ సంతతి శాస్త్రవేత్తలు పాల్గొన్న ఆపి సదస్సులో ఇషా యోగ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ ముఖ్య ఉపన్యాసం చేస్తూ.. విద్య, వైద్యం, ఆధ్యాత్మికం వ్యాపారం కాకూడదని అన్నారు. ఎప్పుడైతే విద్య, వైద్యం, ఆధ్యాత్మికం వ్యాపారం అవుతాయో అప్పుడే ఆ జాతి పతనం ప్రారంభం అవుతుందని అన్నారు. ఆరోగ్యానికి చిహ్నాలైన వైద్యులు, ప్రజల ఆరోగ్యాన్ని కోరే వైద్యులు మరింత ఆరోగ్యంగా ఉండాలని, లేనిచో ఆ వైద్యుడు రోగుల బాగోగులను ఏం చూడగలడని ప్రశ్నించారు. వైద్యుల, వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని, ఈ పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

37వ వార్షిక ఆపి కన్వెన్షన్‌, సైన్టిఫిక్ అసెంబ్లీ.. వైద్యులకు వైద్య పరిజ్ఞానం, తమ వృత్తి నైపుణ్యం మెరుగు పరచుకోవడానికి దోహదపడుతోంది. అంతేగాకుండా వైద్యుల కుటుంబ సభ్యులకు తమ పాత మిత్రులను కలుసుకోవటానికి ఆపి సదస్సులు ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. అదే ఆపి సదస్సుల దిగ్విజయానికి కారణం. అంతేగాకుండా భారత దేశంలోని వివిధ వైద్య కళాశాలల పాత విద్యార్థుల సమావేశాలు కూడ అత్యంత ఆదరణ పొందుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని గాంధీ, ఉస్మానియా, వరంగల్, వెంకటేశ్వర, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం వైద్య కళాశాలల పాత వైద్య విద్యార్థుల సమావేశాలు ఒక పండుగలా జరిగాయి. ఆపి కన్వెన్షన్, సైంటిఫిక్ అసెంబ్లీలో CME ( కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్) తరగతులు, ప్రొఫెషనల్, బిజినెస్, ఉమెన్స్ ఫోరమ్ వంటి అనేక సదస్సులతో పాటు వైద్య పరికరాలు, వివిధ విక్రయశాలలు, శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వైద్యులు ప్రదర్శించిన నృత్య నాటక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతదేశాన్ని టీబీ నుంచి తప్పించాలనే ఉద్దేశంతో USAID నుంచి తొమ్మిది మిలియన్ల నిధులతో భారత దేశంలో టీబీ నిర్మూలనకు ఆపి సంస్థ చేపట్టిన కృషి.. ఏంతో ప్రశంసనీయమైనిది. భారత ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలతో ఆపి యొక్క భాగస్వామ్యం అనేక నగరాలు టీబీ ఫ్రీగా మారటానికి ఏంతో దోహదపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement