అమెరికన్ తెలుగు కన్వెన్షన్
డల్లాస్ (ఇర్వింగ్) : అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహించిన అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలు ఘనంగా ముగిశాయి. మే 31 నుంచి జూన్ 2 వరకు డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో జరిగిన ఈ సంబరాలకు అతిరథ మహారథులు హాజరై వేడుకను దిగ్విజయం చేశారు. రెండు తెలుగు సంఘాలు ఏకమై మరో కొత్త చరిత్రకు నాంది పలికాయి. అమెరికా తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకాలను ఆటా, టాటాలు అందించాయి. సంఘాలుగా వేరైనా తెలుగు వారిగా ఒక్కటన్న స్ఫూర్తితో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు ఆటా స్థాపకులు హన్మంత్ రెడ్డి, టాటా స్థాపకులు పైళ్ల మల్లారెడ్డి. ఇది వరకు జరిగిన తెలుగు వేడుకల్లాగా కాకుండా కొత్తగా రెండు సంఘాల వారి అభిప్రాయాలను స్వీకరించి, వాటిని గౌరవిస్తూ ఆచరణలోకి తీసుకొచ్చారు.
మొదటి రోజు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం విశేష కృషి చేసిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మొదటి రోజు వేడుకలకు ప్రత్యేక అతిథిగా నటి శ్రియా శరణ్ హాజరయ్యారు. ఈ వేడుకలకు 2వేలకు పైగా అమెరికా తెలుగు ప్రజలు హాజరయ్యారు. రెండవ రోజు వేడుకలు పూర్ణకుంభం ఊరేగింపుతో.. అలరించే అందమైన ప్రారంభ నృత్యంతో మొదలైంది. ప్రారంభ వేడుకల్లో పాడిన పాటను ప్రముఖ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వర రావు రాశారు. ఆ పాటకు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు అందించగా సుధా కల్వగుంట్ల ఆలపించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా అందంగా ప్రారంభ నృత్యం సాగింది. మిగిలిన రెండు రోజుల వేడుకలు సాహిత్య అకాడమీ వారి కార్యక్రమాలు కొనసాగాయి. రెండో రోజు వేడుకల్లోనూ శ్రియా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలకు సుమ కనకాల తన దైన శైలిలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కేంద్రీయ హిందీ సమితీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేత పెద్దిరెడ్డి ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా పద్మావతి రెడ్డి హాజరయ్యారు. మూడో రోజు వేడుకలు శ్రీనివాస కళ్యాణంతో మొదలయ్యాయి. ఉదయం జరిగిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి దాదాపు 1000 మంది భక్తులు హాజరయ్యారు. మూడవ రోజు సాయంత్రం జరిగిన వేడుకల్లో నటి త్రిష నృత్యాలు ప్రత్యేక ఆకర‍్షణగా నిలిచాయి. మూడు రోజుల వేడుకలకు మంచి స్పందన రావడంతో ప్రేమ్‌సాగర్ రెడ్డి (నాటా), హన్మంత్ రెడ్డి(ఆటా), పైళ్ల మల్లారెడ్డి(టాటా)లు మూడు సంఘాల ఆధ్వర్యంలో మరో వేడుక జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ మాట వినగానే అక్కడున్న ప్రేక్షకులు కరతాల ధ్వనులతో సంఘీభావం తెలిపారు.
ఈ వేడుకలు ఇంత ఘన విజయం సాధించటానికి కారణమైన కరుణాకర్ అసిరెడ్డి, హరనాథ రెడ్డి, అజయ్ రెడ్డి, విక్రమ్ జనగాం, రఘువీర్ బండారు, అరవింద్ ముప్పిడి, భరత్ మదాది, సతీష్ రెడ్డి, జ్యోతి రెడ్డి, పాశం కిరణ్ రెడ్డి, మహేశ్ అదిభట్ల, మోహన్ పాట్లోల, ధీరజ్ ఆకుల, శ్రీనివాస్ అనుగులతో పాటు వారికి సహకరించిన 36 కమిటీలను 400 మంది వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్‌కు నాయకత్వం వహించిన హన్మంత్ రెడ్డి, పైళ్ల మల్లారెడ్డి, విజయ్‌పాల్ రెడ్డి, హరనాధ్ రెడ్డి, సంధ్యా గవ్వా, పిన్నపు రెడ్డి శ్రీనివాస్ కార్యక్రమం విజయవంతం కావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వేళలా సహకరించిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment