డల్లాస్ (ఇర్వింగ్) : అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్ డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేత పెద్ది రెడ్డి, కేంద్రీయ హిందీ సమితీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సినీ నటి శ్రియ తదితరులు ముఖ్య అతిథులుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికా వ్యాప్తంగా దాదాపు రెండువేలకుపైగా ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రవాసులకు ఆటా- టాటాలు పురస్కారాలను ప్రదానం చేశారు. ఆటా పాటలతో కళాకారులు అతిథులను అలరించారు. ఆటా-టాటాలు సంయుక్తంగా ఇంతటి భారీ స్థాయిలో మూడు రోజుల వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆటా అధ్యుక్షులు ఆసిరెడ్డి కరుణాకర్ అన్నారు. చిన్న చిన్న గొడవలకే కొత్త కొత్త తెలుగు సంఘాలు పుట్టుకొస్తున్న తరుణంలో రెండు అతి పెద్ద తెలుగు సంఘాలు కలిసి నడవడం శుభపరిణామమని పేర్కొన్నారు.
అమెరికాలో ఈ సభల ద్వారా ప్రవాసాంధ్రుల మధ్య స్నేహ, సోదరభావాలు మరింతగా పెంపొందుతాయని టాటా అధ్యక్షుడు డా. పొలిచెర్ల హరనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆధ్యాత్మిక, వ్యాపార, రాజకీయ రంగాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించి, సాయంత్రం యార్లగడ్డకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment