కాలిఫోర్నియాలోని లివర్ మోర్ శివ విష్ణు దేవాలయం
కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని లివర్ మోర్ శివ-విష్ణు దేవాలయంలో మార్చి 1 నుంచి 11 వరకు అతిరుద్ర మహాయజ్ఞం, శతచండీహోమం జరుగనుంది. పదకొండు రోజుల పాటు సాగే ఈ మహాక్రతువులకు పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు లివర్ మోర్ శివ-విష్ణుదేవాలయ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఇంత భారీ స్థాయిలో లివర్ మోర్ లో యజ్ఞాలు తలపెట్టడం ఇదే ప్రథమం. ఈ క్రతువుల్లో 121 మంది పురోహితులు, ఋత్విక్కులు పాల్గొననున్నారు. వీరిలో చాలా మంది భారతదేశం నుంచి వస్తున్నారు. ఋగ్,యజుర్,సామ,అధర్వణవేదాలు సనాతన ధర్మానికి మూలకందాలుగా ఉన్నాయి. వీటిలోని కృష్ణ యజుర్వేదంలో రుద్రాధ్యాయం, చమకం ఉన్నాయి. పరమ శివారాధనలో రుద్రం అన్నది అత్యంత ప్రధానమైంది, ఎంతో పవిత్రమైంది. పదకొండుసార్లు నమకం ఆపై ఒకసారి చమకం జపిస్తే అది ఒక ఆవృతి. దానిని ఏకాదశరుద్రం అని వ్యవహరిస్తారు. ఇలాంటి ఏకాదశరుద్రాల జపం ఒక లఘురుద్రం అవుతుంది. ఇలాంటి పదకొండు లఘురుద్రాల జపం ఒక మహారుద్రంగా పిలుస్తారు.ఇలాంటి పదకొండు మహారుద్రాల జపం అతిరుద్రమవుతుంది. అంటే ఇందులో మొత్తం 14,641 నమకాలు, 1331 చమకాల పారాయణం లేదా జపం జరుగుంతుదన్నమాట. ఇందులో భాగంగా 11 హోమకుండాల్లో 121 మంది ఋత్విక్కులతో 1331 రుద్రహోమాలు జరుగుతాయి.దీనికి పదకొండు రోజుల సమయం పడుతుంది. ఇదంతా వేదోక్తంగా జరుగుతుంది.
పురాణ ఇతిహాసాల్లో అతిరుద్రానికి విశేష మహత్యం ఉంటుందని చెప్తారు. లంకపై దండయాత్ర చేసే సమయంలో అవరోధాలు ఏర్పడినప్పుడు శ్రీరాముడు అగస్త్య మహామునిని తరణోపాయం చెప్పమని కోరాడట. అందుకు అతిరుద్రజపం చేయమని అగస్త్యులవారు ఉపదేశించారట. ఆ విధంగానే శ్రీరాముడు సేతుబంధనానికి ముందు రామేశ్వరంలో అతిరుద్రం ఆచరించాడని చెబుతారు. అతిరుద్రం అన్ని దుఖాఃలనూ, క్లేశాలనూ ఉపశమింపజేస్తుందని వేదం ఉపదేశిస్తుంది. అతిరుద్రంతో విశ్వశాంతి కలుగుతుందని కూడా వేదపండితులు ప్రవచిస్తారు.
ఇక శక్తిపూజలో అత్యంత శక్తిమంతమైంది శతచండీ యజ్ఞం. దేవీమాహాత్మ్యాన్ని పారాయణం చేస్తూ చండీహోమం చేయడం ఇందులోని విధి. దేవీమాహాత్మ్యం మార్కండేయ పురాణంలో అంతర్భాగం. ఇందులో 700 శ్లోకాలు ఉండటాయి, దీనిని దుర్గాసప్తశతిగానూ వ్యవహరిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చటంలో సప్తశతి అత్యంత ప్రభావపూర్ణమైందని వైదిక శాస్త్రగ్రంథాలు చెబుతాయి. వంద పర్యాయాలు చండీసప్తశతి పారాయణం చేస్తూ ఆహుతులిస్తే అది శతచండీ హోమం అవుతుంది. శివ-విష్ణు ఆలయంలో ఇప్పుడు రోజుకు వందసార్లు చొప్పున దుర్గా సప్తశతిని పారాయణం చేస్తూ ఒకసారి చండీహోమం చేయనున్నారు. ఇలా 11 రోజుల పాటు దీనిని నిర్వహిస్తారు. శత చండీహోమాన్ని అతిరుద్ర మహాయజ్ఞంతో కలిపి చేస్తే దాని ప్రభావం ద్విగుణీకృతమవుతుంది. శివశక్తుల ప్రసన్నత భక్తుల ఈప్సితాలను తీర్చడమే కాదు, అది లోకకళ్యాణానికీ ఉపయుక్తమవుతుంది. హిందూ కమ్యునిటీ అండ్ కల్చరల్ సెంటర్ జయేంద్ర సరస్వతి, స్వామి చిన్మయానంద ఆశీస్సులతో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని లివర్ మోర్ లో ఔత్తరాహిక దాక్షిణాత్య సంప్రదాయాల మేళవింపుతో భవ్యమైన శివ-విష్ణు ఆలయాన్ని నిర్మించింది. 1986లో కుంభాభిషేకాన్నీ, 1998, 2010 సంవత్సరాల్లో మహాకుంభాభిషేకాలను నిర్వహించింది. ఇలా ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతంలో ఈ దేవాలయం హైందవ సంస్కృతికి కేంద్రంగా ఉంది.
ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయం ఇప్పుడు మరో మహాక్రతువు తలపెట్టింది. ఇందులో భాగంగా ఈ పదకొండు రోజులూ రోజుకొక విశేష పూజాకార్యక్రమం జరుగుతుంది. పరశురామ ప్రోక్తమైన మనో వినాయక వ్రతం, అష్టోత్తర శతలింగ బిల్వదళార్చన, వల్లీదేవసేన సుబ్రహ్మణ్యస్వామి వ్రతపూజ, అష్టాదశశక్తిపీఠ సహిత దుర్గాదీపపూజ, త్రిశక్తీకుంకుమార్చన, శివపార్వతీకళ్యాణం, నందివాహన సేవ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రదైవకార్యంలో పాలుపంచుకోవాలని సనాతన సంప్రదాయం పట్ల అసక్తి కలిగిన భక్తులకు హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ విజ్ఞప్తి చేస్తోంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారానికి http://livermoretemple.org/hints/atirudram/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment