
అనంతపురం: అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌లో నివసిస్తున్న తెలుగువారు తమ మంచి మనసును చాటుకున్నారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు బోర్లు వేసి వేరుశనగ సాగు చేసేవారు. అయితే పండించిన పంటకి గిట్టుబాటు ధర దక్కకపోవడంతో అతను అప్పుల పాలయ్యారు. అప్పుల బాధ భరించలేక, దిక్కుతోచక నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందని విషయాన్ని ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే.
అయితే దీనిపై స్పందించిన ఆస్టిన్‌లో నివసిస్తున్న తెలుగువారు లక్ష రూపాయల మొత్తాన్ని చెక్కు రూపంలో కలెక్టర్ వీరపాండియన్ చేతుల మీదుగా నారాయణరెడ్డి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్టిన్ ఎన్‌ఆర్‌ఐ బృందం, వారి స్నేహితులు పాల్గొన్నారు. అలాగే ఈ వార్తను ప్రచురించిన సాక్షి శింగనమల రిపోర్టర్ మునియప్పను కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment