ఒమాన్‌లో ఏడాదిగా జీతాలు ఇవ్వని కంపెనీ | Hasan Juma Backer construction firm allegedly failed to pay wages of Telangana employees in Oman | Sakshi
Sakshi News home page

ఒమాన్‌లో ఏడాదిగా జీతాలు ఇవ్వని కంపెనీ

Published Thu, Sep 12 2019 1:58 PM | Last Updated on Thu, Sep 12 2019 2:02 PM

Hasan Juma Backer construction firm allegedly failed to pay wages of Telangana employees in Oman - Sakshi

ఒమాన్‌లోని మస్కట్‌లో హాసన్ జుమా బాకర్ అనే భవన నిర్మాణ కంపెనీలో తెలంగాణకు చెందిన కార్మికులకు ఏడాదికాలంగా వేతనాలు ఇవ్వనందున ఎడారిలో అష్టకష్టాలు పడుతున్నారు. వీరు ఆర్థిక ఇబ్బందులతోనే మస్కట్ నుండి హైదరాబాద్‌కు బయలు దేరుతున్న విషయం తెలుసుకున్న 'ఓమాన్ తెలంగాణ ఫ్రెండ్స్' అనే సామాజిక సేవా సంస్థ కన్వీనర్ నరేంద్ర పన్నీరు వీరిని లేబర్ క్యాంపులో కలుసుకొని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ. 500 నగదు సహాయం అందజేశారు. వీరిలో 11 మంది తెలంగాణ వారు కాగా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ విమానాశ్రయానికి గురువారం చేరుకున్నారు.    

ఈ సందర్బంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ... వేతన బకాయిల కోసం న్యాయపోరాటానికి ఇండియన్ ఎంబసీ కృషి చేస్తుందని, కార్మికులు అధైర్య పడవద్దని అన్నారు. గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చిన కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ  కార్యక్రమంలో నరేంద్రతో పాటు సంస్థ సభ్యులు మంచికట్ల కుమార్, వడ్ల గంగాధర్, బొక్కెన దేవేందర్ లు పాల్గొన్నారు. 
  
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన గనిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒక్కొక్క కార్మికునికి రూ.1 లక్షా 50 వేల నుండి రూ. 2 లక్షల 50 వేల వరకు జీతం బకాయిలు రావాల్సి ఉన్నాయని, తెలంగాణకు చెందిన 45 మంది కార్మికులకు కంపెనీ యాజమాన్యం రూ. ఒక కోటి వరకు బాకీ పడిందని అన్నారు. ఎడారిలో ఒక్కొక్క చెమటచుక్క ఒక్క రూపాయితో సమానమని, తమ కష్టార్జితాన్ని మన భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement