సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల మీర్జా అహ్మద్ ఆచూకీ లభించడం లేదు. గత శుక్రవారం నుంచి అతని జాడ కనిపించడం లేదు. 2015లో మీర్జా అహ్మద్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. మీర్జా అహ్మద్ కుటుంబ సభ్యులు సంతోష్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. గత శుక్రవారం చివరిసారిగా ఫోన్‌లో తల్లితో భయపడుతూ మాట్లాడి, తన తమ్ముడితో మాట్లాడాలని చెప్పినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆ సమయంలో తాను ఇంట్లో లేనని, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని మీర్జా అహ్మద్ సోదరుడు మీర్జా షుజాత్ తెలిపాడు. తర్వాత మళ్లీ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పాడు. ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత పెన్సిల్‌వీనియాలోని గన్నాన్ విశ్వవిద్యాలయంలో ఎయిరోనాటికల్ విభాగంలో ఎంఎస్ చేయడానికి వెళ్లాడు. కొన్ని కారణాల వల్ల తిరిగి న్యూజెర్సీలోని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీలో చేరాడు. విద్యను అభ్యసిస్తూనే న్యూయార్క్‌లోని ఓ మొబైల్ స్టోర్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడు. అమెరికాకు వెళ్లిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అతను హైదరాబాద్ రాలేదని కుటుంబ సభ్యులు చెప్పారు.
మంగళవారం మీర్జా అహ్మద్ ఫోన్ రింగ్ అయిందని, కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదని అతని రూమ్‌మెట్ ఒకరు తనతో చెప్పినట్టు మీర్జా షుజాత్ తెలిపారు. మీర్జా అహ్మద్ కనిపించకుండా పోవడంపై అతని స్నేహితుడు న్యూజెర్సీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరికీ చెప్పకుండానే పని చేస్తున్న మొబైల్ షాప్‌నుంచి తొందర తొందరగా వెళ్లిపోయినట్టు మీర్జా అహ్మద్ పని చేస్తున్న షాపులో సీసీకెమెరాలో పోలీసులు గుర్తించారు. అమెరికాలో తన కుమారుడి ఆచూకీ కనుక్కోవాలని కోరుతూ మీర్జా అహ్మద్ తండ్రి మొహమ్మద్ ఇస్మాయిల్ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. మీర్జా అహ్మద్ జాడ కనిపెట్టాల్సిందిగా ఎంబీటీ నాయకులు అమ్జద్ ఉల్లా అమెరికాలోని భారత దౌత్య కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment