
ఫిలడెల్ఫియా : ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకోవడంలో నాట్స్ ఎప్పుడూ ముందుంటుందనేది మరోసారి రుజువైంది. అమెరికాలో ఇటీవల ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్న కొయ్యలమూడి రామ్మూర్తి ప్రాణాలు నిలబెట్టేందుకు నాట్స్ తన వంతు సాయం చేయాలని ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రామ్మూర్తి వైద్య ఖర్చులను భరించేందుకు అతని కుటుంబసభ్యులకు నాట్స్ హెల్ప్‌లైన్ ద్వారా విరాళాల సేకరణ చేయాలని నిశ్చయించింది. ఇందుకోసం ఫిలడెల్ఫియాలోని స్థానిక తెలుగు సంఘం టీఏజీడీవీతో కలిసి నాట్స్ 'రన్ ఫర్ రామ్' పేరుతో 5కె రన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని రామ్మూర్తి కుటుంబానికి నాట్స్ విరాళంగా అందించనుంది.
5కె రన్‌లో భాగంగా స్థానికంగా ఉన్న 120 మందికి పైగా తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫిలడెల్ఫియా తెలుగు అసోసియేషన్, ఆటా, నాటా, తానా, పలు సేవా సంస్థ ల ప్రతినిధులు మద్దతు తెలిపారు. నాట్స్ బోర్డు డిప్యూటీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, టీఏజీడీవీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి కిరణ్ కొత్తపల్లి, చైతన్య పెద్దు, రామ్ కొమ్మన బోయిన, వేణు సంఘాని తదితరులు హాజరై తమ వంతు సంఘీభావాన్ని ప్రకటించారు.





Comments
Please login to add a commentAdd a comment