అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం పట్ల తీవ్ర నిరసన | Protest Against Destruction Of Gandhi Statue In America | Sakshi
Sakshi News home page

అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం పట్ల తీవ్ర నిరసన

Published Thu, Jun 4 2020 10:03 PM | Last Updated on Thu, Jun 4 2020 10:20 PM

Protest Against Destruction Of Gandhi Statue In America - Sakshi

డల్లాస్ : వాషింగ్టన్ డి.సి లో ఇండియన్ ఎంబసీకి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని దౌర్జన్యకారులు ధ్వంసం చేయడాన్ని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస భారతీయులను, గాంధేయవాదులను తీవ్రంగా కలచి వేసిందన్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న జాతివివక్షత  నిరసనకు ఈ ధ్వంసానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో మే 25న ఒక పోలీస్ అధికారి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ మెడను ఎనిమిది నిమిషాల పాటు తొక్కి పట్టి ఉంచడం ద్వారా అతని మరణానికి కారణం అవడం ఒక అనాగరిక, పాశవిక చర్య అని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన మొదటిది కాదని, గతంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదన్నారు. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో ముప్పై కి పైగా నగరాల్లో అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. ఆఫ్రికన్ అమెరికన్ల ఆగ్రహానికి, ఆవేదనకు, నిరసనకు అర్థం ఉందని, తప్పనిసరిగా అందరూ మద్దతు పలకాలని ప్రసాద్ అన్నారు.

అయితే ఆఫ్రికన్ అమెరికన్లకు న్యాయం జరగాలని ఏ ఉద్దేశ్యంతో ఆందోళన ప్రారంభించారో, గత పది రోజులుగా జరుగుతున్న ఈ దౌర్జన్యాలు, దహనకాండ, ధ్వంసంతో ఆ ఆశయం పక్క మార్గం పట్టి దహనాలు, దోపిడీలు, విధ్వంసాలకు దారి తీయడం శోచనీయమన్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ల ఆత్మ గౌరవాన్ని, వారి హక్కులకై నిరంతర పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంటి నాయకులు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని శాంతియుత పంథాలో ఉద్యమాలను నిర్వహిస్తే అదే గాంధీ విగ్రహాన్ని ఇప్పుడు  ధ్వంసం చేయడం ఒక అనాలోచిత చర్య అని  డా. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు .

ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులలో ప్రభుత్వం, ప్రభుత్వాధికారుల వ్యాఖ్యానాలు ఆఫ్రికన్ అమెరికన్లకు స్వాంతన చేకూర్చే విధంగా ఉండాలే తప్ప అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉండకూడదు. ప్రజల రక్షణలో చాలా మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోవడం కూడా ప్రజలందరూ గుర్తుంచుకోవాలని.. అయితే  పోలీసులు నేరస్తులను పట్టుకొని న్యాయస్థానానికి అప్పగించాలే తప్ప, తమకున్న విచక్షణాధికారాలను దుర్వినియోగ పరిచి ఈ విధంగా ప్రాణాలు తీయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement