సింగపూర్‌లో సీతారాముల కళ్యాణం | Sitha Ramula kalyanam to be conduct in Singpore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో సీతారాముల కళ్యాణం

Published Wed, Aug 29 2018 3:37 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

Sitha Ramula kalyanam to be conduct in Singpore - Sakshi

సింగపూర్‌ : సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న స్థానిక శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయ సమీపంలోని పీజీపీ హాల్‌లో శ్రీ సీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం భద్రాచలం నుంచి అర్చక బృందం రానున్నారు. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం అని పండితులు అంటున్నారు. రాముడు జన్మించిన సంవత్సరం విలంబ అని, మరలా అరవై సంవత్సరాలకు గాని రాని విలంబ నామ సంవత్సరంలో కళ్యాణదర్శన ఫలం ద్విగుణీకృతం అవుతుందని పేర్కొన్నారు. శ్రీరామనవమి రోజున భద్రాద్రిలో ఏవిధంగా సీతారామ కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా జరుపుటకు, భద్రాచల దివ్య మూర్తులతో సింగపూర్ వస్తున్నామని అర్చకులు తెలిపారు.

శ్రీ సీతారామ కళ్యాణము చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివచ్చి శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా తిలకించి పులకితులవుతారని తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అన్నారు. అటువంటి స్వామి స్వయంగా మన సింగపూర్ వచ్చి మనకు కళ్యాణదర్శనం కల్పించడం మన అందరి అదృష్టమని, ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని కోటిరెడ్డి కోరారు. అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరుపుటకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని కార్యదర్శి సత్య చిర్ల తెలిపారు. ఉదయం పూట కళ్యాణమహోత్సవం, సాయంత్రం రామరక్షాస్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ, విశేషపూజ ఇతర సాంసృతిక కార్యక్రమాలు జరుగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానకం, వడపప్పు, అన్నదాన వితరణ జరుగనున్నట్లు నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement