సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ శివన్ టెంపుల్లో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. చంద్ర మాన క్యాలెండర్లో అత్యంత శుభప్రదమైన నెలలలో ఒకటి అయిన కార్తీక మాసంలో ఏర్పాటు చేసిన ఈ పవిత్ర వ్రతంలో సుమారు 30 వరకు జంటలు పాల్గొన్నాయి. ఈ వ్రతంను హైదరాబాదు నుండి ప్రత్యేకంగా విచ్చేసిన జగదాంబా త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య ప్రశ్నా పండితులు “శ్రీముఖ గ్రహీత” భక్తనిధి” బ్రహ్మశ్రీ తాళ్లూరి బెనారస్ బాబు చేతుల మీదుగా నిర్వహించారు.
వ్రతంలో పాల్గొన్న జంటలకు సొసైటి వారు పూజ సామాగ్రితోపాటూ యదాద్రి నుండి తెప్పించిన శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. వ్రతానంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినందుకు టీసీఎస్‌ఎస్‌ను వ్రతములో పాల్గొన్న జంటలు అభినందించారు. బ్రహ్మశ్రీ తాళ్లూరి బెనారస్ బాబుని టీసీఎస్‌ఎస్ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు.
ఈ వ్రతానికి సమన్వయకర్తలుగా నల్ల భాస్కర్ గుప్త, బూర్ల వాణి శ్రీనివాస్, గర్రేపల్లి కస్తూరి శ్రీనివాస్, గోపగొని పద్మ దామోదర్లు వ్యవహరించారు. ఈ వ్రత కార్యక్రమాన్ని సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పెద్ది కవిత చంద్ర శేఖర్ రెడ్డి, ముదం స్వప్న అశోక్, కోశాధికారి గడప రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, ఏళ్ల ప్రియాంక రాం రెడ్డి, దుర్గా ప్రసాద్, చిలుక సురేష్, గార్లపాటి లక్ష్మా రెడ్డి పర్యవేక్షించారు. తొలి సారి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వ్రతములో పాల్గొని విజయవంతం చేసినందుకు వ్రతము లో పాల్గొన్న జంటలకు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు పిల్లి రంజిత్, రవికుమార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment