vratham
-
సింగపూరులో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం
కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూరు వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం పెరుమాళ్ కోవెల ప్రాంగణంలోని పీజీపీ హాలులో ఘనంగా జరుపుకున్నారు. సింగపూరు తెలుగువారితోపాటు, కన్నడ ప్రజలు కూడా ఈ వ్రతంలో పాల్గొనడం విశేషం. ఎంతో భక్తి శ్రద్దలతో 100 జంటలు ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. దాదాపు 500 మంది స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వ్రతం చేసుకున్న దంపతులకు స్వామివారి కండువాలు, రూపులను నిర్వాహకులు అందించారు. ఈ అనంతరం స్వామి వారి ప్రసాద వితరణ జరిగింది. సంస్థ అధ్యకులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ కోవిడ్ అనంతరం తమ సంస్థ తరపున జరిపిన మొదటి ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఘనవిజయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే కార్యక్రమాన్ని అనుకున్న క్షణం నుండీ నిర్విరామంగా శ్రమించిన కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను రేపటి తరాలకు గుర్తుండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని చెప్పారు. -
Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ, పునః పూజ
క్లిక్: Ganesh Chaturthi: వ్రతకల్పము.. పూజా ద్రవ్యములు, వరసిద్ధి వినాయక పూజ క్లిక్: విఘ్నేశుని కథా ప్రారంభం.. తదుపరి... పునఃపూజ : ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి) శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాధునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వారచెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘ సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘ పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘ కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘ అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘ పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘ బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘ పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘ మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘ దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘ మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘ శో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా! (ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను) ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్. (వ్రతకల్ప పూజా విధానం సమాప్తం). -
దీపావళి నోము: మనోబలానికి సంకల్పం
‘ఏ పని తలపెడుతున్నామో అది పూర్తయ్యేంతవరకు మనలో సంకల్పం బలంగా ఉండాలి’ అంటారు పెద్దలు. కుటుంబ శ్రేయస్సుకు తపించే మనసుకు తగినంత బలం అందాలంటే అందుకు దైవ శక్తి కూడా తోడవ్వాలి అనేది పండితుల వాక్కు. అందుకే, అనాది నుంచి కుటుంబ క్షేమం కోసం చేసే దైవారాధనలలో నోములు, వ్రతాలు మన జీవనంలో ఓ భాగమయ్యాయి. వాటిలో కొన్ని ప్రాంతాలలో దీపావళి రోజున చేసుకునే కేదారేశ్వర వ్రతం (నోము)కు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ నోమును సాక్షాత్తు పార్వతీదేవే నోచిందని, పరమేశ్వరుడి అనుగ్రహం పొందిందని పురాణోక్తి. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీ దేవి కేదారేశ్వర వ్రతాన్ని ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమినాడు మొదలుపెట్టి అమావాస్య వరకు ఆచరించినట్టుగా చెబుతారు. ఈ వ్రతాన్ని స్త్రీలు చాలా వరకు దీపావళి అమావాస్య రోజున ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో గౌరీ సమేత కేదారేశ్వరుడిని పూజించి, ఆ ఆది దంపతుల కృపను పొందుతుంటారు. కల్పవల్లి.. పాలవెల్లి.. పీఠం మధ్యన ధాన్యరాశిని పోసి, అందులో పూర్ణకుంభాన్ని ఉంచి, ఇరవై ఒక్క దారాలతో సూత్రాన్ని చుట్టి, గంధ పుష్పాక్షతలను ఉంచాలి. పీఠానికి పై భాగాన మామిడి ఆకుల తోరణాలు, పూలతో అలంకరించిన పాలవెల్లిని అమర్చుకోవాలి. పసుపు గౌరి, పసుపు గణపతి. జాకెట్టు ముక్క, నోము దండ, 21 తమలపాకులు, 21 నల్ల పోకలు, 21 ఖర్జూర పండ్లు. వత్తిపత్తి, పసుపు, కుంకుమ, 2 ఎండుకొబ్బరి చిప్పలు, 2 కొబ్బరికాయలు, హారతి కర్పూరం, కంకణం(చేతికి కట్టుకునే తోరం), ధూప, దీప, నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. గౌరీ తనయుడితో ఆరంభం.. ముందుగా గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి (పసుపు గణపతిని) ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకొని, సంకల్పం చెప్పుకోవాలి. కేదారేశ్వరుని ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృతస్నానం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పాలతో షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అథాంగపూజ, అష్టోత్తర శతనామ పూజ, అధసూత్ర గ్రంధిపూజ చేసి శ్రీ కేదారేశ్వర వ్రత కథ విని, బ్రాహ్మణులు, పెద్దల ఆశీర్వచనం తీసుకుంటారు. ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఉపవాస దీక్షను విరమిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలుగా భావించే నోముదండలను మెడలో ధరించి, పసుపు, కుంకుమ, పండు, ఆకు, వక్కలను ముల్తైదువులకు వాయినంగా ఇవ్వడంతో నోము పూర్తవుతుంది. మరుసటి ఏడాది దీపావళి నోము వరకు తమ ఇంట కేదారేశ్వరుని అనుగ్రహంతో ఆయురారోగ్య, సౌభాగ్య, ఐశ్వర్యాభివృద్ధి మెండుగా కలుగుతుందన్న నమ్మకమే కొండంత అండగా భక్తులు తమ జీవనప్రయాణాన్ని కొనసాగిస్తారు. సర్వేజనా సుఖినోభవంతు! -
మౌనవ్రతం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
మహాశివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయాలు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు వ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును పరమ శివునిపై కేంద్రీకరించాలి. వీలైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఫరవాలేదు. జాగారం చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ, పరనింద, పరాన్నభోజనం, చెడుతలపుతో, అశ్లీలపుటాలోచనలతో చేసే ఉపవాస, జాగారాలకు ఫలితం లేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమకచమకాలను వినడం కూడా ఫలదాయకమే! మహిమాన్వితం... మంత్ర జపం మహాశివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. ఓం నమః శివాయ!! చదవండి: ఉపవాసం రోజు ఏం చేయాలి? ఆరు రకాల ఉపవాసాలు మంచివట! -
సింగపూర్‌లో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ శివన్ టెంపుల్లో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. చంద్ర మాన క్యాలెండర్లో అత్యంత శుభప్రదమైన నెలలలో ఒకటి అయిన కార్తీక మాసంలో ఏర్పాటు చేసిన ఈ పవిత్ర వ్రతంలో సుమారు 30 వరకు జంటలు పాల్గొన్నాయి. ఈ వ్రతంను హైదరాబాదు నుండి ప్రత్యేకంగా విచ్చేసిన జగదాంబా త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య ప్రశ్నా పండితులు “శ్రీముఖ గ్రహీత” భక్తనిధి” బ్రహ్మశ్రీ తాళ్లూరి బెనారస్ బాబు చేతుల మీదుగా నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న జంటలకు సొసైటి వారు పూజ సామాగ్రితోపాటూ యదాద్రి నుండి తెప్పించిన శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. వ్రతానంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినందుకు టీసీఎస్‌ఎస్‌ను వ్రతములో పాల్గొన్న జంటలు అభినందించారు. బ్రహ్మశ్రీ తాళ్లూరి బెనారస్ బాబుని టీసీఎస్ఎస్ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ వ్రతానికి సమన్వయకర్తలుగా నల్ల భాస్కర్ గుప్త, బూర్ల వాణి శ్రీనివాస్, గర్రేపల్లి కస్తూరి శ్రీనివాస్, గోపగొని పద్మ దామోదర్‌లు వ్యవహరించారు. ఈ వ్రత కార్యక్రమాన్ని సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పెద్ది కవిత చంద్ర శేఖర్ రెడ్డి, ముదం స్వప్న అశోక్, కోశాధికారి గడప రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, ఏళ్ల ప్రియాంక రాం రెడ్డి, దుర్గా ప్రసాద్, చిలుక సురేష్, గార్లపాటి లక్ష్మా రెడ్డి పర్యవేక్షించారు. తొలి సారి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వ్రతములో పాల్గొని విజయవంతం చేసినందుకు వ్రతము లో పాల్గొన్న జంటలకు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు పిల్లి రంజిత్, రవికుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. -
వ్రతం రూ.రెండొందలు.. ఇబ్బందులు పదింతలు
- సత్యదేవుని సన్నిధిలో రూ.200 వ్రతాల భక్తులపై వివక్ష - ఏటా జరిగే ఆరు లక్షల వ్రతాల్లో సగం ఇవే.. - ఈ వ్రతంలో దేవస్థానానికి మిగిలేది రూ.10 మాత్రమే.. - అందుకేనేమో వారంటే ఈ చిన్నచూపు! కాలిబాట ద్వారా తిరుపతి వెంకన్న సన్నిధికి వచ్చే భక్తులకు తిరుమల - తిరుపతి దేవస్థానం దర్శనం, ప్రసాదం తదితర విషయాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తుంది. కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం సామాన్య భక్తులపట్ల దేవస్థానం అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. ముఖ్యంగా రూ.200 వ్రతాలాచరించేవారి విషయంలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వ్రతానికున్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఆలయానికి విచ్చేసే భక్తుల్లో 80 శాతం మంది స్వామివారి వ్రతమాచరిస్తారు. ఏటా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు వ్రతాలాచరిస్తున్నారు. వీటి ద్వారా దేవస్థానానికి రూ.25 కోట్ల ఆదాయం వస్తోంది. దేవస్థానం వార్షికాదాయంలో వ్రతాల ద్వారా వస్తున్న ఆదాయం సుమారు 20 శాతం. ప్రస్తుతం దేవస్థానంలో రూ.200, రూ.400, రూ.800, రూ.1,500, రూ.2,000 టిక్కెట్లతో వ్రతాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ దాదాపు 50 శాతం మంది అంటే సుమారు 3 లక్షల మంది రూ.200 వ్రతాలే ఆచరిస్తారు. కానీ వారికి ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. టిక్కెట్లు అమ్మే కౌంటర్ వద్ద నుంచి వ్రతమండపాల వరకూ అన్నిచోట్లా ఈ వ్రతాలాచరించే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నచూపు చూస్తున్నారిలా.. - మొత్తం వ్రతాల్లో సగం రూ.200 టిక్కెట్టు పైనే జరుగుతున్నందున దేవస్థానంలో ఉన్న వ్రత మండపాల్లో సగం ఈ వ్రతాలాచరించే భక్తుల కోసమే ఉపయోగించాలి. దేవస్థానంలో మొత్తం 16 వ్రత మండపాలు ఉంటే కేవలం మూడు మాత్రమే ఈ వ్రతాలకు కేటాయించారు. - ఈ మూడు మండపాల్లో ఒక బ్యాచ్‌కు 200 మంది మాత్రమే వ్రతాలాచరించే అవకాశం ఉంది. ఒక బ్యాచ్‌కు సుమారు రెండు గంటలు పడుతుంది. రోజుకు 2 వేల వ్రతాలు జరిగితే అందులో వెయ్యి రూ.200 టిక్కెట్టువే ఉంటాయి. బ్యాచ్‌కు 200 చొప్పున లెక్కిస్తే వెయ్యి వ్రతాలు పూర్తవడానికి సుమారు 10 గంటలు పడుతుంది. అంతసేపూ భక్తులు క్యూలో లేదా వ్రత మండపాల్లో వేచి ఉండాల్సిందే. - రూ.200 వ్రతాల క్యూ మీద ఎటువంటి షెల్టర్ లేదు. దీంతో భక్తులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. 200 మంది భక్తులు ఈ వ్రతాలాచరించడానికి టిక్కెట్లు తీసుకుని కుటుంబ సభ్యులతో క్యూలో నిల్చోవడానికి వస్తే సగం మంది మాత్రమే క్యూలో పడతారు. మిగిలినవారు వెలుపల నిలబడాల్సిందే. లోపల వ్రతాలాచరించే భక్తులు వ్రతం పూర్తయి, మండపాన్ని శుభ్రం చేశాక మాత్రమే వీరిని లోపలకు అనుమతిస్తారు. - దేవస్థానంలో సన్నిధి (మెయిన్ కౌంటర్) వద్ద, పశ్చిమ రాజగోపురం కౌంటర్ వద్ద వ్రతాల టిక్కెట్లు విక్రయిస్తారు. అయితే రూ.200 వ్రతాల టిక్కెట్లను సన్నిధి వద్ద మాత్రమే విక్రయిస్తారు. సత్రాల్లో బస చేసేవారికి పశ్చిమ రాజగోపురం కౌంటర్ దగ్గరగా ఉన్నా అక్కడ విక్రయించడం లేదు. - రూ.200 వ్రతాలాచరించే భక్తులపై ఇంత చిన్నచూపు ఎందుకు చూస్తున్నారంటే.. ఈ వ్రతంలో దేవస్థానానికి మిగిలేది చాలా తక్కువ మొత్తం కావడమే. ఒక రూ.200 వ్రతం నిర్వహణకుగాను దేవస్థానానికయ్యే ఖర్చు దాదాపు రూ.190. ఇందులో మిగిలేది తక్కువ. అందువల్ల భక్తులను ఇబ్బంది పెడితే వారు విసిగిపోయి రూ.400 లేదా రూ.800 వ్రతాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. - ధనికులు ఆచరించే వ్రతాల ద్వారా అధికంగా వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఈ సామాన్యుల వ్రతాలకు ఖర్చు చేయవచ్చు. కానీ, ఈ వ్రతాలను తగ్గించాలనే ఆలోచనతో వీటిని ఆచరించే భక్తులను పొమ్మనకుండా పొగబెట్టే పద్ధతిని దేవస్థానం అవలంబిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సామాన్య భక్తుడు తక్కువ బడ్జెట్‌తో ఆలయానికి వస్తే అదనపు ఖర్చు ఎలా భరించగలడనే అంశాన్ని అధికారులు పట్టించుకోవడంలేదు. రూ.200 వ్రత భక్తుల ఇబ్బందులు పరిష్కరిస్తాం రూ.200 వ్రతాలాచరించే భక్తులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. వీటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. తొలుత ఈ వ్రతాల క్యూ మీద షెల్టర్ వేయడానికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు రూపొందించాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాను. ఈ వ్రతాలు చేసే వ్రత మండపాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ వ్రతం టిక్కెట్లను పశ్చిమ రాజగోపురం కౌంటర్ వద్ద కూడా విక్రయించేందుకు చర్యలు తీసుకుంటాం. - ఈరంకి జగన్నాథరావు, ఇన్‌ఛార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం -
శ్రీ వ్రతం సంపదలిచ్చే మాసం సిరులిచ్చే వ్రతం
పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన విష్ణుచిత్తులవారికి సంతానం లేదు. ఆయన భక్తికి మెచ్చి, సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మీ దేవియే పసిపాపగా ఆయనకు తులసివనంలో దొరికింది. ఆ పాపకు కోద అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకున్నాడాయన. కోద అంటే పూలమాల అని అర్థం. పసితనం నుంచి శ్రీ రంగనాథునే చిత్తంలో నిలుపుకుని ఆరాధిస్తున్న కోద యుక్తవయస్కురాలైంది. ఫలితంగా ఆమెకు తన ఆరాధ్యదైవాన్నే పతిగా పొందాలన్న కోరిక కలిగింది. అయితే ఆ మాటను ఆమె తండ్రికి చెప్పలేదు. వచ్చిన సంబంధాలన్నింటినీ తిరస్కరించేది. ఇది ఇలా ఉండగా స్వామివారికి రకరకాల పూలతో అందమైన మాలకట్టేవాడు విష్ణుచిత్తుడు. మాలలు కట్టే పనిని కోద తనంత తానుగా తండ్రి నుంచి స్వీకరించింది. రోజూ ఆమె తాను కట్టిన మాలను తానే తలలో పెట్టుకుని చూసి మురిసిపోతుండేది. అది తెలియని విష్ణుచిత్తుడు వాటినే స్వామికి సమర్పించేవాడు. ఒకరోజు ఆమె కట్టిన మాలలో పొడవాటి వెంట్రుక కనిపించింది విష్ణుచిత్తునికి. దాంతో అనుమానం వచ్చి కూతురిని నిలదీశాడు. తాను చేసిన పనిని అంగీకరించింది కోద. అపరాధభావనతో విష్ణుచిత్తుడు ఆ రోజు కట్టిన మాలను స్వామికి సమర్పించలేదు. అంతేకాదు, ఆ రోజు పూజ కూడా సరిగా చేయలేకపోయాడు. వ్యాకులచిత్తంతో ఉన్న విష్ణుచిత్తునికి కలలో శ్రీ రంగనాథుడు కనిపించి, కోద ధరించిన పూలమాల అంటే తనకెంతో ఇష్టమని చెప్పి, ఇకముందు కూడా ఆమె ధరించిన తర్వాతనే తాను పూలమాలను స్వీకరిస్తానని చెప్పాడు. నిద్ర మేలుకొన్న విష్ణుచిత్తుడు జరిగినదంతా కుమార్తెకు చెప్పాడు. అంతవరకూ తెలియక చేసిన పనిని సాక్షాత్తూ శ్రీరంగనాథుడే మెచ్చుకునేసరికి తానంటే స్వామికి కూడా ఇష్టమేమోననే భావన కలిగి కోదకు సిగ్గుతో చెంపలు కెంపులయ్యాయి. ఆ రోజు స్వామిని తలచుకుంటూ కలతనిద్రపోయింది. ఆ నిద్రలో తాను రంగనాథుని వివాహం చేసుకున్నట్లు అద్భుతమైన కల కనింది. ఆ కలను సాఫల్యం చేసుకునేందుకు ఒక వ్రతం చేయాలని ఆమె సంకల్పించింది. ఆ వ్రతమే శ్రీవ్రతం. నైమిశారణ్యంలో సూతమహాముని శౌనకాది మునులకు ఈ వ్రతవిధానం బోధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీవ్రతాన్ని ధనుస్సంక్రమణం మొదలు మకర సంక్రమణం వరకు ఆచరించాలి. దీనినే గోపికలు కాత్యాయనీ వ్రతంగా ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందారని పురాణ వచనం. ఇదీ ఈ వ్రతవిధానం సూర్యుని కన్నా ముందే నిద్ర మేల్కొనాలి. నిత్యకర్మలను పూర్తి చేసుకుని ఈ వ్రతంపై శ్రద్ధఉంచి విష్ణువును పూజించాలి. అందుకోసం శక్తిమేరకు ఒక ప్రతిమను తయారు చేయించి, దానికి మధుసూదనుడు అని పేరు పెట్టి అర్చామూర్తిగా నిలపాలి. ఈ విగ్రహంలోనికి నారాయణుని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి. విగ్రహ ప్రతిష్ఠాపన చేసింది మొదలు ప్రతిరోజూ పంచామృతస్నానం చేయించాలి. తులసీదళాలతో అలంకరించాలి. అష్టోత్తర శత నామాలతో అర్చనచేయాలి. నైవేద్యంగా నెయ్యి ఓడేలా బియ్యం, పెసరపప్పు సమపాళ్లలో తయారు చేసిన పప్పు పొంగలిని సమర్పించాలి. మొదటి పదిహేను రోజులూ ముద్గాన్నాన్ని అంటే పప్పు పొంగలిని, తరువాతి పదిహేనురోజులూ దానితోబాటు దధ్యోదనాన్ని నివేదించాలి. చివరిగా మంత్రపుష్ప, నీరాజనాదులిచ్చి, ఆత్మ ప్రదక్షిణ చేసి, తీర్థప్రసాదాలను స్వీకరించాలి. ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాచరణ చేసిన కోద రోజుకో పాశురంతో స్వామిని స్తుతించేది. ఆమె భక్తికి మెచ్చిన రంగనాథుడు ఆమెను పత్నిగా స్వీకరించాడు. ఆమే ఆండాల్. - డి.వి.ఆర్. భాస్కర్ వ్రతనియమాలేమిటి? ఈ వ్రతమంతటినీ సూర్యోదయానికి పూర్వమే పూర్తిచేయడం ఉత్తమం. ఆవునేతితో వెలిగించిన అఖండదీపం శ్రీహరికి అత్యంత ప్రీతికరం. ఈనెలరోజులూ శ్రీహరి చరితామృతాన్ని వినాలి. గానం చేయాలి. తులసి, గోపూజలు చేయాలి. విష్ణుపురాణ పఠనం, శ్రవణం శుభఫలితాలనిస్తుంది. అర్హతలేమిటి? నియమాలను పాటించేందుకు ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ వ్రతాన్ని ఆచరించేందుకు అర్హులే. భక్తి, శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఇంటిలోనే వ్రతాన్ని ఆచరించవచ్చు. అందుకు కుదరనివారు సమీపంలోని ఏదైనా దేవాలయంలోగాని, భాగవతోత్తముల ఇండ్లకు వెళ్లిగాని ఆచరించవచ్చు. ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ప్రయోజనాలేమిటి? వివాహం కాని వారు ఈ మార్గళీ వ్రతాన్ని ఆచరిస్తే శీఘ్రంగా వివాహమవుతుందని, సౌభాగ్యవతులు వ్రతాచరణ చేసి తమ సంసారంలోని చిక్కులను రూపుమాపుకోవచ్చునని, భగవంతునిపై భక్తితో వ్రతాచరణ చేస్తే శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని ఫలశ్రుతి చెబుతోంది.