- సత్యదేవుని సన్నిధిలో రూ.200 వ్రతాల భక్తులపై వివక్ష
- ఏటా జరిగే ఆరు లక్షల వ్రతాల్లో సగం ఇవే..
- ఈ వ్రతంలో దేవస్థానానికి మిగిలేది రూ.10 మాత్రమే..
- అందుకేనేమో వారంటే ఈ చిన్నచూపు!
కాలిబాట ద్వారా తిరుపతి వెంకన్న సన్నిధికి వచ్చే భక్తులకు తిరుమల - తిరుపతి దేవస్థానం దర్శనం, ప్రసాదం తదితర విషయాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తుంది. కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం సామాన్య భక్తులపట్ల దేవస్థానం అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. ముఖ్యంగా రూ.200 వ్రతాలాచరించేవారి విషయంలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వ్రతానికున్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఆలయానికి విచ్చేసే భక్తుల్లో 80 శాతం మంది స్వామివారి వ్రతమాచరిస్తారు. ఏటా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు వ్రతాలాచరిస్తున్నారు. వీటి ద్వారా దేవస్థానానికి రూ.25 కోట్ల ఆదాయం వస్తోంది. దేవస్థానం వార్షికాదాయంలో వ్రతాల ద్వారా వస్తున్న ఆదాయం సుమారు 20 శాతం. ప్రస్తుతం దేవస్థానంలో రూ.200, రూ.400, రూ.800, రూ.1,500, రూ.2,000 టిక్కెట్లతో వ్రతాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ దాదాపు 50 శాతం మంది అంటే సుమారు 3 లక్షల మంది రూ.200 వ్రతాలే ఆచరిస్తారు. కానీ వారికి ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. టిక్కెట్లు అమ్మే కౌంటర్ వద్ద నుంచి వ్రతమండపాల వరకూ అన్నిచోట్లా ఈ వ్రతాలాచరించే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిన్నచూపు చూస్తున్నారిలా..
- మొత్తం వ్రతాల్లో సగం రూ.200 టిక్కెట్టు పైనే జరుగుతున్నందున దేవస్థానంలో ఉన్న వ్రత మండపాల్లో సగం ఈ వ్రతాలాచరించే భక్తుల కోసమే ఉపయోగించాలి. దేవస్థానంలో మొత్తం 16 వ్రత మండపాలు ఉంటే కేవలం మూడు మాత్రమే ఈ వ్రతాలకు కేటాయించారు.
- ఈ మూడు మండపాల్లో ఒక బ్యాచ్‌కు 200 మంది మాత్రమే వ్రతాలాచరించే అవకాశం ఉంది. ఒక బ్యాచ్‌కు సుమారు రెండు గంటలు పడుతుంది. రోజుకు 2 వేల వ్రతాలు జరిగితే అందులో వెయ్యి రూ.200 టిక్కెట్టువే ఉంటాయి. బ్యాచ్‌కు 200 చొప్పున లెక్కిస్తే వెయ్యి వ్రతాలు పూర్తవడానికి సుమారు 10 గంటలు పడుతుంది. అంతసేపూ భక్తులు క్యూలో లేదా వ్రత మండపాల్లో వేచి ఉండాల్సిందే.
- రూ.200 వ్రతాల క్యూ మీద ఎటువంటి షెల్టర్ లేదు. దీంతో భక్తులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. 200 మంది భక్తులు ఈ వ్రతాలాచరించడానికి టిక్కెట్లు తీసుకుని కుటుంబ సభ్యులతో క్యూలో నిల్చోవడానికి వస్తే సగం మంది మాత్రమే క్యూలో పడతారు. మిగిలినవారు వెలుపల నిలబడాల్సిందే. లోపల వ్రతాలాచరించే భక్తులు వ్రతం పూర్తయి, మండపాన్ని శుభ్రం చేశాక మాత్రమే వీరిని లోపలకు అనుమతిస్తారు.
- దేవస్థానంలో సన్నిధి (మెయిన్ కౌంటర్) వద్ద, పశ్చిమ రాజగోపురం కౌంటర్ వద్ద వ్రతాల టిక్కెట్లు విక్రయిస్తారు. అయితే రూ.200 వ్రతాల టిక్కెట్లను సన్నిధి వద్ద మాత్రమే విక్రయిస్తారు. సత్రాల్లో బస చేసేవారికి పశ్చిమ రాజగోపురం కౌంటర్ దగ్గరగా ఉన్నా అక్కడ విక్రయించడం లేదు.
- రూ.200 వ్రతాలాచరించే భక్తులపై ఇంత చిన్నచూపు ఎందుకు చూస్తున్నారంటే.. ఈ వ్రతంలో దేవస్థానానికి మిగిలేది చాలా తక్కువ మొత్తం కావడమే. ఒక రూ.200 వ్రతం నిర్వహణకుగాను దేవస్థానానికయ్యే ఖర్చు దాదాపు రూ.190. ఇందులో మిగిలేది తక్కువ. అందువల్ల భక్తులను ఇబ్బంది పెడితే వారు విసిగిపోయి రూ.400 లేదా రూ.800 వ్రతాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు.
- ధనికులు ఆచరించే వ్రతాల ద్వారా అధికంగా వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఈ సామాన్యుల వ్రతాలకు ఖర్చు చేయవచ్చు. కానీ, ఈ వ్రతాలను తగ్గించాలనే ఆలోచనతో వీటిని ఆచరించే భక్తులను పొమ్మనకుండా పొగబెట్టే పద్ధతిని దేవస్థానం అవలంబిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సామాన్య భక్తుడు తక్కువ బడ్జెట్‌తో ఆలయానికి వస్తే అదనపు ఖర్చు ఎలా భరించగలడనే అంశాన్ని అధికారులు పట్టించుకోవడంలేదు.
రూ.200 వ్రత భక్తుల ఇబ్బందులు పరిష్కరిస్తాం
రూ.200 వ్రతాలాచరించే భక్తులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. వీటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. తొలుత ఈ వ్రతాల క్యూ మీద షెల్టర్ వేయడానికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు రూపొందించాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాను. ఈ వ్రతాలు చేసే వ్రత మండపాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ వ్రతం టిక్కెట్లను పశ్చిమ రాజగోపురం కౌంటర్ వద్ద కూడా విక్రయించేందుకు చర్యలు తీసుకుంటాం.
- ఈరంకి జగన్నాథరావు, ఇన్‌ఛార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం