అట్లాంటాలో వెల్లువెత్తిన బతుకమ్మ సంబరాలు | TDF Celebrates Bathukamma And Dussehra Festivals In Atlanta | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published Wed, Oct 9 2019 3:10 PM | Last Updated on Wed, Oct 9 2019 3:34 PM

TDF Celebrates Bathukamma And Dussehra Festivals In Atlanta - Sakshi

అట్లాంటా: ప్రకృతిని పూజించే సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అట్లాంటాలో ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో ఈ కార్యక్రమం హోరెత్తిపోయింది. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌(టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 5న సౌత్‌ ఫోర్సిత్‌ మిడిల్‌ స్కూల్‌లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. అట్లాంటాలో వందల సంఖ్యలో నివసిస్తోన్న తెలంగాణ మహిళలు వేడుకకు తరలి వచ్చారు. వారంతా కలిసి గౌరీదేవీని తీర్చిదిద్దిన బతుకమ్మలతో హాజరయ్యారు. అందంగా పేర్చి తీసుకువచ్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి దాని చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడిపాడారు. ఈ వేడుకలో పసి పిల్లల నుంచి పండు ముసలి దాకా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా సంబరాలకు 2,500మంది పైచిలుకు హాజరయ్యారు


ఇక దసరా పండగను జమ్మి పూజతో ప్రారంభించారు. కోలాటాల కోలాహలంతో వేడుక కన్నులవిందుగా సాగింది. అందంగా తయారు చేసిన బతుకమ్మలకు టీడీఎఫ్‌ జ్యూరీ బహుమతులను అందజేసింది. టీడీఎఫ్‌ బృందం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ బతుకమ్మ ప్రాముఖ్యతను చాటిచెప్పడమే కాక, తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్‌ పాత్రను గుర్తు చేయడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని తెలిపింది. నానమ్మ-మనుమరాలు థీమ్‌తో ఈ యేడాది తీసుకువచ్చిన ఆన్‌సైట్‌ బతుకమ్మకు విశేష స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని భావి తరాలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహించామని పేర్కొంది.  టీడీఎఫ్‌  సంస్థ తెలంగాణలో చేపడుతోన్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ఈ కార్యక్రమానికి టైటిల్‌ స్పాన్సర్‌ చేసిన ఈఐఎస్‌ టెక్నాలజీస్‌కు టీడీఎఫ్‌ బృందం కృతజ్ఞతలు తెలిపింది. వేడుకలు విజయవంతమవడానికి సహాయ సహాకారాలు అందించిన రాపిడ్‌ ఐటీ ఇన్‌కార్పొరేటెడ్‌ కంపెనీ, పీచ్‌ క్లినిక్‌, ఫార్మర్స్‌ ఇన్సూరెన్స్‌, డ్రవ్‌ ఇన్ఫో, ఆర్పైన్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ కంపెనీ, శేఖర్‌ పుట్ట రియల్టర్‌, సువిధ గ్రోసరీస్‌, పటేల్‌ బ్రదర్స్‌, ఏజెంట్‌ రమేశ్‌, ఓర్దశన్‌ టెక్నాలజీస్‌కు ధన్యవాదాలు తెలిపింది . ఈ ప్రోగ్రాంకు రఘు వలసాని ఫొటోగ్రఫీ, డీజే దుర్గం సౌండ్‌ సిస్టమ్‌ను అందించారు. సువిధ ఇండో పాక్‌ గ్రోసరీస్‌, బిర్యానీ పాట్‌, అడ్డా ఈటరీ వారు విందును ఏర్పాటు చేశారు. స్వప్న కట్ట, స్థానిక కళాకారులైన శ్రీనివాస్‌ దుర్గమ్‌లు వారి గాత్రంతో ప్రేక్షకులను అలరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement