తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ ఉపాధ్యక్షులు, వ్యవస్థాపక సభ్యులు బూర్ల శ్రీనివాస్(ఫైల్ ఫోటో)
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్(టీసీఎస్‌ఎస్) ఉపాధ్యక్షులు, వ్యవస్థాపక సభ్యులు బూర్ల శ్రీనివాస్ (42) స్థానిక చాంగి జనరల్ హాస్పిటల్‌లో సోమవారం మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న సింగపూర్ లో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల వారితో పాటు స్థానికులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బూర్ల శ్రీనివాస్ గత 15 సంవత్సరాల నుంచి తన కుటుంబంతో సహా శాశ్వత నివాస హోదాలో సింగపూర్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ పార్థివదేహాన్ని మంగళవారం మిత్రుల సందర్శనార్థం ఉంచారు. వందల సంఖ్యలో సందర్శనకు వచ్చిన వారు ఆశ్రు నివాళులు అర్పించారు. శ్రీనివాస్ సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృదు స్వభావి, మరియు ప్రతి ఒక్కరిని చిరు నవ్వుతో పలకరించే వారని గుర్తు చేసుకొన్నారు.
ఈ దుఃఖ సమయంలో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ సభ్యులు ఆయన కుటుంబం వెన్నంటే ఉండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించి, ఆయన పార్థీవ దేహాన్ని ఇండియా కు తరలించారు. వారి కుటుంబానికి తెలంగాణ కల్చరల్ సొసైటి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా టీసీఎస్‌ఎస్ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి వారి వెంటే భారత్‌కు వచ్చారు. ఆదిలాబాద్‌లో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మంత్రి జోగు రామన్న శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment