మోర్తాడ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యాటకులను ఆకర్షించడానికి అక్కడి ప్రభుత్వం ఐదేళ్ల మల్టీ ఎంట్రీ వీసాల జారీకి శ్రీకారం చుట్టింది. కొత్త సంవత్సరం ఆరంభంలో తొలిసారి సమావేశం నిర్వహించిన దుబాయి రూలర్, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ ఐదేళ్ల టూరిస్ట్ వీసా జారీపై ప్రకటన చేశారు. యూఏఈ పరిధిలోని దుబాయి, షార్జా, అబుదాబి తదితర పట్టణాల్లో పర్యటించడానికి 30 రోజులు లేదా 90 రోజుల కాల పరిమితితో కూడిన టూరిస్ట్ వీసాలను జారీచేసేవారు. ఈ వీసాలను విజిట్ వీసాలు అని కూడా అనేవారు. విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన ఎంతో మంది అక్కడ కల్లివెల్లి కావడం లేదా కంపెనీ వీసాలను తీసుకుని అక్కడే స్థిరపడిపోవడం జరిగేది.
అయితే, గతంలో కంటే విజిట్ వీసా లేదా టూరిస్ట్ వీసాలపై కఠిన తరమైన నిబంధనలను విధించిన యూఏఈ ప్రభుత్వం తాజాగా ఐదేళ్ల కాలపరిమితితో కూడిన టూరిస్ట్ వీసాలను జారీచేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ వీసాలను పొందిన వారు ఐదేళ్ల కాల పరిమితిలో యూఏఈకి చేరిన తరువాత ఆరు నెలల కాలంఉండటానికి అవకాశం ఉంది. మరో ఆరు నెలల పాటు తమ సొంత దేశంలో లేదా ఇతర దేశాల్లో నివాసం ఉండాలి. కాగా, యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదేళ్ల టూరిస్ట్ మల్టీ వీసాలతో ఎవరికి ప్రయోజనం కలుగుతుంది.. మరెవరికి ఇబ్బంది ఎదురవుతుందనే విషయంపై యూఏఈ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తరువాతనే వెల్లడి కానుంది.
Comments
Please login to add a commentAdd a comment