డల్లాస్/ఫోర్ట్ వర్త్: ‘తెలియని వ్యక్తులు మన దగ్గరకు వచ్చి.. మీ సినిమా నా జీవితాన్ని మార్చింది అన్నప్పుడు అంతకేంటే ఆనందం, విజయం ఇంకొకటి ఉండదు’అని అలా మొదలైంది, ఓబేబీ, కల్యాణ వైభోగం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నమహిళా దర్శకురాలు నందినిరెడ్డి అన్నారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోషియేషన్ (వేట) ఆధ్వర్యంలో డల్హాస్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె అతిథిగా పాల్గొన్నారు. ‘పవర్ ఆఫ్ ఉమెన్’పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు అవకాశం కల్పించిన వేట సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు స్విమ్మింగ్, క్రికెట్ అంటే ఇష్టమని తెలిపారు. అన్య సంస్కృతుల గురించి తెలుసుకోవడం, ప్రయాణాలు చెయ్యడమంటే ఆసక్తి అని పేర్కొన్నారు.
ప్రేరణ, శిక్షణ అందించేందుకే..
మహిళల సమతుల్య జీవనానికి, సాధికారతకు కావాల్సిన ప్రోత్సాహం, శిక్షణ, ప్రేరణ అందించడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయురాలు ఝాన్సీరెడ్డి ‘వేట’ జాతీయ తెలుగు సంస్థను 2019 సెప్టెంబర్‌లో స్థాపించారు. వేట ఏ సంస్థకు పోటీ కాదని, ఇది మహిళా సాధికారత కోసం స్థాపించిన సంస్థ అని ఝాన్సీరెడ్డి అన్నారు. ఆధునిక మహిళల జీవితంలో నిత్యం ప్రతిబింబిస్తున్నబహుముఖ ప్రజ్ఞలు ఈ సంస్థ చిహ్నం (లోగో) ద్వారా సుస్పష్టంగా తెలుస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా మనందరం ఒక్కటై అవసరమైన ప్రేరణ, శిక్షణ అందించి మహిళా సాధికారతకు పాటుపడాలని ఆకాక్షించారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణిరెడ్డి శీలం ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తమ స్వాగతోపన్యాసంలో వివరిస్తూ ఆటా, టాంటెక్స్ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ సంధ్య గవ్వ.. ‘మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ వికాసం అవసరం. మనందరికీ ఎన్నో పనులు చేయగల సామర్థ్యం, అనుకున్నది సాధించాలనే బలమైన కోరిక ఉన్నాయి. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు’అని అన్నారు. 500పైగా హాజరైన ఈ కార్యక్రమానికి అను బెనకట్టి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఎన్నికల్లో భాగస్వాములు కావాలి..
► ‘పవర్ ఆఫ్ ఉమెన్’పై చర్చ సందర్భంగా టెక్సాస్‌లో ప్రముఖ న్యాయవాది, యూఎస్‌ఐసీఓసీ అధ్యక్షులు నీల్ గోనుగుంట్ల మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడానికి అవగాహన పెంచుకొని మహిళలు ఎన్నికల వ్యవస్థలో భాగస్వాములు కావాలని అన్నారు. మన నిత్య జీవితంలో ప్రజా ప్రతినిధులు ప్రభావితం చేయగలరని, అందుకే అడుగు అడుగునా ఎన్నికల సమయంలో మీ వంతు కృషి చెయ్యాలని అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఉద్యోగరీత్యా లింగభేదం లేకుండా కావాలిసిన సలహాలను తీసుకోవాలని సూచించారు.
► రాజకీయాల్లోకి ప్రవేశించడం తన జీవితంలో చాలా కష్టమైన నిర్ణయమని డాలస్ కౌంటీకి చెందిన షెరీఫ్ మెరియన్ బ్రౌన్ అన్నారు. ఎప్పుడూ బలంగా, దృఢంగా, అప్రమత్తంగా ఉంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. ‘నా నిర్ణయాల ఫలితాలను నేను స్వీకరించాను, అనుభవిస్తున్నాను, ఆనందంగా జీవిస్తున్నాను’అని ఆమె పేర్కొన్నారు. అమెరికా రాజకీయాల్లో ఉన్న అతికొద్ది మంది నల్ల జాతీయులలో మెరియన్ బ్రౌన్ ఒకరు.
► ఏఏపీఐ ఉపాధ్యక్షులు, ప్రముఖ పీడియాట్రిక్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ అనుపమ గోటిముకుల తన చిన్నతనంలో మెడికల్ కాలేజీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణతకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో వివరిస్తూ.. ‘తెలియని అంశాల వలన కలిగే భయం పోగొట్టుకోవడం విజయానికి శ్రేయస్కరం’అన్నారు.
► అలనాటి బాలీవుడ్ తార మీనాక్షి శేషాద్రి తన జీవిత అనుభవాలను పంచుకుంటూ.. ‘1981లో మిస్ ఇండియా కైవసం చేసుకుని, 15 ఏళ్ల వ్యవధిలో ఎనభై సినిమాల్లో నటించి, వివాహం అనంతరం అమెరికాలో అడుగుపెట్టినప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. మహిళ తన బహుముఖ ప్రజ్ఞ ద్వారా వేసిన పునాది ఎన్నో కుటుంబాలకు, సంబంద బాంధవ్యాలకు మూల స్తంభం కాగలదు’అని అన్నారు. ఓపిక జీవితంలో చాలా అవసరమైన ఆయుధమని, మాతృత్వం మనుగడకు ఇది ప్రధానం అని మీనాక్షి శేషాద్రి చెప్పారు.
సన్మానం..
సమన్వకర్త కృష్ణవేణి రెడ్డి శీలం అతిథులు నందినిరెడ్డి, నీల్ గోనుగుంట్ల, షెరీఫ్ మేరియన్ బ్రౌన్, మీనాక్షి శేషాద్రి, డాక్టర్ అనుపమ గోటిముకులను సంప్రదాయ బద్ధంగా పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమం విజయానికి కృషి చేసిన సేవకులు అను బెనకట్టి, లక్ష్మీ పాలేటీ, ఇందు మాందాడి, సురేష్ పఠానేని, మల్లిక్‌రెడ్డి కొండ, అభితేజ్ రెడ్డి, ప్రసన్న దొంగూర్, శ్రీలక్ష్మీ మండిగ, కల్పన గనపురం, మాధవిరెడ్డి, లతా గద్దె, వాణి ద్రోణవల్లి, రాధా బండార్‌ను గుర్తించి సత్కరించారు.
మహిళ-2020 సంచిక ఆవిష్కరణ
సమన్వయకర్త కృష్ణవేణి రెడ్డి శీలం ప్రముఖ మహిళా సేవకులు, నాయకులు డాక్టర్ సంధ్య గవ్వ, డాక్టర్ కస్తూరి ఇనగంటి, డాక్టర్ కిరణ్ కంచెర్ల, డాక్టర్ శ్రీదేవి జువ్వాడి, డాక్టర్ సుధారెడ్డి, ఇందు మందాడి, గీతా దమ్మన్న సమక్షంలో మహిళ-2020 ప్రత్యేక సంచిక ఆవిష్కరించారు. ఇటీవలే డల్లాస్ మహానగర ప్రాంతంలో క్యాన్సర్ బారినపడి పునర్జన్మ పొందిన ఒక బాలుడికి బోన్ మ్యారో అందించిన స్థానిక తెలుగు వైద్యులు డాక్టర్ ప్రశాంతి గణేశ్‌ను వారు అభినందించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
తీప్తి నీరజ నేడూరి సమర్పించిన పుష్పాంజలి శాస్త్రీయ నృత్యం, కూచిపూడి కళాక్షేత్ర అధినేత్రి పద్మ శొంఠి దర్శకత్వంలో అందించిన ‘తిరు తిరు జవరాల’ జానపద శాస్త్రీయ నృత్యం, రాగలీన డ్యాన్స్ అకాడెమీ నృత్య దర్శకులు స్వప్న గుడిమెట్ల అందించిన ‘అలిగిరి నందిని’ శాస్త్రీయ మిశ్రమ నృత్యం, సాయి నృత్య అకాడెమీ డీఎఫ్‌డబ్ల్యూ నుంచి శ్రీదేవీ యడ్లపాటి దర్శకత్వంలో అందించిన ‘లార్డ్ శివ’ శాస్త్రీయ నృత్యం, కీర్తి చంకూర పాడిన మహిళా దేశభక్తి గేయం, వీణ యలమంచిలి, పూజిత కడ్మి శెట్టి, ప్రభాకర కోట పాడిన ‘మధుర గీతాలు’, ఝాన్సీ చంకూర సమర్పించిన ‘మూవీ మెడ్లీ సాంగ్స్, తీప్తి నీరజ నేడూరి దర్శకత్వంలో అందించిన ‘అల వైకుంఠపురం పాటలు’, సుధారెడ్డి సమర్పించిన ‘మూవీ సాంగ్స్ ఫ్రం ఓ బేబీ’ అందరినీ ఆకట్టుకున్నాయి. శాంతి నూతి నేతృత్వంలో నిర్వహించిన ‘టాలీవుడ్: తారలు దిగి వచ్చిన వేళ’, నహీద్ రాముల్ దుస్తులతో, లెచిక్ బొటిక్ సహకారంతో మీనాక్షి శేషాద్రి అందమైన వస్త్రాభరణాలతో అత్యంత సుందరంగా ప్రదర్శించిన ‘ఫ్యాషన్ షో’ కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.
మీడియా మిత్రులకు, చక్కని ఆడియో, వీడియో, లైటింగ్ అందించిన ఫుల్ హౌజ్ మీడియా సురేష్ పఠానేనికి, సభా ప్రాంగణాన్ని, వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించిన లిటిల్ జెమ్స్ ప్రత్యూషకు, ఫోర్ పాయింట్స్ పెరటాన్‌కు చెందిన సారా, అరుణ్ విట్టకు, జాతీయ/ప్రాంతీయ తెలుగు సంస్థలైన ఆటా, నాటా, నాట్స్, డాటా, దారా, ఐఏఎన్టీ, టాంటెక్స్‌వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment