యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను సన్మానిస్తున్న డాలస్ ఎన్నారై వైఎస్సార్‌సీపీ శ్రేణులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ఏపీ హిందీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సోమవారం సాయంత్రం డాలస్ ఎన్నారై వైఎస్సార్‌సీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన జనరంజకంగా సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలు తమ జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయని ఆనందం వెలిబుచ్చుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా రూపొందించిన ‘‘నవరత్నాల’’ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే ధృఢసంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారని యార్లగడ్డ పేర్కొన్నారు. ఎన్నారై వైఎస్సాసీపీ శ్రేణులు ఈ పథకాలకు సామాజిక మాధ్యమాల ద్వారా, వారి వారి సాంకేతిక విజ్ఞానం ద్వారా విస్తృత ప్రాచుర్యం కల్పించాలని కోరారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఆంగ్ల మాధ్యమ జీవోను యార్లగడ్డ విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ పాఠశాలల్లో తెలుగు కనపడి, వినపడి, నేర్పబడి, నేర్చుకోబడుతుందని అన్నారు. ఈర్ష్యా అసూయలకు పోకుండా, అసభ్యత అశ్లీలతలకు తావులేకుండా హుందాగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను డాలస్ ఎన్నారై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ ఎంపీ డాక్టర్ ఆత్మచరణ్‌రెడ్డి, కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి, క్రిస్టపాటి రమణ్‌రెడ్డి, పుట్లూర్ రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment