జార్జియా: అట్లాంటాలో స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బిరియానీ పాట్ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ వేడుకలు జరిగాయి. సుమారు వందమందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ చిరకాల మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌తో తన అనుభవాలను కొన్నింటిని అక్కడి ప్రవాసాంధ్రులతో పంచుకున్నారు. వంద రోజుల పాటు తాను రాజకీయాలు మాట్లాడకూడదని నిశ్చయించుకున్నందున, వాటి గురించి ప్రస్తావించకుండా వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా వారితో తన అనుబంధాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడతానంటూ ప్రసంగాన్ని ప్రారంభిచారు. వైఎస్ఆర్‌తో తనకున్న అనుబంధం ఒక పార్టీ అధినేతకు, కార్యకర్తకు ఉన్న సంబంధం మాత్రమేనని అయితే ఆయనకు నాలో కొన్ని అంశాలు నచ్చటం వలన తనను అభిమానించి ఎంపీని చేశారన్నారు.
పార్టీలకతీతంగా అందరి హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్‌ఆర్ అని తెలిపారు. ఆయన మరణవార్తను విని తట్టుకోలేక గుండె ఆగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అలా ప్రాణాలు కోల్పోయిన ఒక కుటుంబం గురించి సవివరంగా చెప్పారు. ఆయన ప్రసంగం విన్నవారందరికీ ఒక్కమారు కన్ను చెమర్చిన మాట వాస్తవం. చివరగా అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ఒకమాట చెప్పమని అడిగారు. దీనికి ఉండవల్లి స్పందిస్తూ జగన్ కేవలం మంచి పరిపాలన అందిస్తే సరిపోదు. తన తండ్రి ఇచ్చినటువంటి అద్భుతమైన పాలనను మరిపించగలిగేలా, గొప్పగా పాలన అందించాలి. అది అతని ముందున్న సవాలు. ప్రస్తుత ప్రభుత్వం వేసే అడుగులు ఆ దిశగానే ఉన్నాయి. తన ప్రయత్నంలో సఫలీకృతుడవుతాడనే భావిస్తున్నాను.
ఎప్పుడూ ఏ సభలకు హాజరవ్వని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకసారి వైఎస్ఆర్ ఆహ్వానం మేరకు విశాఖపట్నం సభకు రావడం, ఆ సభలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలుపరుస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి నేతల వల్ల దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందంటూ అభినందించడాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ అందరి మనసుల్లో ఉన్నారంటే అందుకు ఆయన చేసిన మంచి పనులే కారణమని కొనిడియారారు. విదేశాల్లో ఉన్న వైఎస్‌ఆర్ అభిమాలు మాతృదేశ అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అట్లాంటా వైఎస్‌ఆర్‌సీపీ విభాగాన్ని, వైఎస్ఆర్ అభిమానుల్ని ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment