అమృతం కురిపించిన కవి | a brief description about poet tilak | Sakshi
Sakshi News home page

అమృతం కురిపించిన కవి

Published Sun, Dec 15 2013 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

అమృతం కురిపించిన కవి

అమృతం కురిపించిన కవి

 ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు... నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు... నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’... అన్న తిలక్ అన్యులకు సాధ్యంకాని పథంలో నడచిన భావకవి. అభ్యుదయ కవి. అభ్యుదయ భావకవి. ఆయన ్ఛకలం కృష్ణశాస్త్రి. ఆయన గళం శ్రీశ్రీ. కవిత్వం రాసినా, కథలు రాసినా, నాటకాలు రాసినా తిలక్ ముద్ర తిలక్‌దే. అదో నవనీతం. అదే  హాలాహలం. ఆయన కవిత్వం ‘అమృతం కురిసిన రాత్రి’ తెలుగు పాఠక హృదయాలు ఎండకు వడలినప్పుడల్లా అమృతాన్ని కురిపిస్తూనే ఉంది. ఆయన కథలు ‘నల్లజర్ల రోడ్డు’, ‘ఊరి చివర ఇల్లు’, ‘సుందరి - సుబ్బారావు’, ‘అతని కోరిక’ వంటివి తెలుగు కథామాగాణంలో తళుకుబెళుకుల రాళ్ల వలేగాక నిక్కమైన నీలాలుగా మెరుస్తూ ఆ దారిన వచ్చే కొత్త బాటసారులకు మార్గం చూపుతున్నాయి. ఆయన లేఖలు, వ్యాసాలు... అన్నీ తెలుగు సారస్వతానికి ఖజానా. పెన్నిధి.
 
  తిలక్ సాహిత్యం విడివిడిగా అందుబాటులో ఉన్నా మొత్తం లభ్య రచనలను మనసు ఫౌండేషన్‌వారు ఎమెస్కోతో కలిసి ‘దేవరకొండ బాల గంగాధర తిలక్’ పేరుతో బృహత్ సంపుటిగా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సందర్భంగా వెలువరించారు. దాదాపు వెయ్యి పేజీల ఈ పుస్తకంలో పద్యకవిత్వం, వచన కవిత్వం, కథ... ఇలా అన్ని ప్రక్రియల్లో తిలక్ రచనలు ఉన్నాయి. ఆయన తేజస్సును పట్టి చూపుతున్నాయి.  ఈ పుస్తకానికి తిలక్ అభిమాన శిష్యులు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు ప్రత్యేకంగా రాసిన విస్తృత ముందుమాటలోని కొన్ని విశేషాలు....
 
     తిలక్‌గారి దృష్టిలో ‘విశ్వనాథ..  కృష్ణశాస్త్రి..  శ్రీశ్రీ’ ఆధునికాంధ్ర కవిత్వానికి త్రిమూర్తులు. అయితే మరికొందరి దృష్టిలో ‘శ్రీశ్రీ..  తిలక్..  శేషేంద్ర’ నవ్యాధునిక కవిత్వానికి త్రిమూర్తులు. తిలక్ గారిదీ నాదీ ఒకే ఊరు. తణుకు. 1955లో భారతిలో ఆయన కవిత ‘ఆర్తగీతం’ ప్రచురితమైనప్పుడు ఆయనను పరిచయం చేసుకొని పై చదువులకు వెళ్లేవరకు ఐదేళ్లపాటు అంటి పెట్టుకొని శిష్యరికం చేశాను.
 
     తిలక్‌గారి స్వస్థలం తణుకు తాలూకా మండపాక. వీరిది గొప్ప ధనిక కుటుంబం. వీరి తాత తండ్రులు మండపాక జమీందారులుగా ప్రసిద్ధి. వీరు వెలనాటి వైదిక బ్రాహ్మణులు. తిలక్‌గారు మొత్తం పన్నెండు మంది సంతానంలో ఆరవవారు. ఆయన భార్య పేరు ఇందిరాదేవి. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. అందరూ విదేశాల్లో స్థిరపడ్డారు.
 
     తిలక్‌గారు గొప్ప ధనిక కుటుంబంలో పుట్టినా జీవితంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుండే వారు. గుండె జబ్బుకు పెద్ద ఖర్చుతో వైద్యం చేయించుకోవడం వల్ల, ఉద్యోగలేమి వల్ల, స్టెయిన్ లెస్ స్టీల్ వ్యాపారం చేసి నష్టపోవడం వల్ల తిలక్‌గారు ఆర్థికంగా చితికిపోయి ఉంటారని నా ఊహ.
 
     తిలక్‌గారు ఇంటర్‌తో చదువు ఆపేశారు. సొంతగా తెలుగు, సంస్కృత, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. ఆయనకు చాలా మంది మిత్రులు ఉండేవారు. మల్లవరపు విశ్వేశ్వరరావు, పాలగుమ్మి పద్మరాజు, పిలకా గణపతి శాస్త్రి, అనిసెట్టి సుబ్బారావు, అబ్బూరి వరద రాజేశ్వరరావు... ఇలా. రెండవ తరంలో ఆవంత్స, వరవరరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ తదితరులు. తిలక్‌గారు వీరందరితో కలిసి సాహితీ చర్చలు చేస్తుండే వారు.
 
     తిలక్‌గారి జీవితకాలమే తక్కువ (1921 - 66) అనుకుంటే దురదృష్టం అందులో ఆయనకు అనారోగ్య విరామ దశ (1946 - 54) ఉండటం. నరాల జబ్బు అన్నారు. కాని తిలక్‌గారికి ఏ జబ్బూ లేదనీ ఆయన హైపో కాండ్రియాసిస్ (లేని జబ్బును ఊహించుకోవడం)తో బాధ పడుతున్నారని డాక్టర్ల అభిప్రాయం. కాని నిజంగానే ఆయన ఏదో వ్యాధితో బాధ పడేవారు. ఏమైనా ఆయన ఉజ్వలంగా రాయాల్సిన 25వ ఏట నుంచి 33వ ఏట వరకు ‘గదిలో మంచమే ఎల్లలోకమనుచు’ ఉండిపోయారు.
 
     తిలక్ వచన కవితలన్నీ పుస్తకంగా ఆయన బతికి ఉండగా రాలేదు. 1966లో ఆయన మరణించారు. 1968 జూలైలో విశాలాంధ్ర వారు వాటిని ప్రచురించారు. దీనికి కుందుర్తి చేత పీఠిక రాయించారు. ఈ కావ్యానికి ‘అమృతం కురిసిన రాత్రి’ అనే శీర్షిక కూడా కుందుర్తిగారే పెట్టారు. ఈ కవితలలోనే ‘మైల పడిన దుప్పటిలా నాగరికత నన్ను కప్పుకుంది’/ ‘రాత్రిని రంపం పెట్టి కోసినప్పుడు రాలిన పొట్టులా ఉంది వేకువ’ లాంటి కొత్త అలంకారాలను ప్రవేశపెట్టారాయన. ‘అమృతం కురిసిన రాత్రి’కి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చాయి. ఈ సంపుటిలోనే ఒక కవితలో ‘కార్తిక మాసపు రాత్రి వేళ/ చల్లని తెల్లని వెన్నెల’ ఎలా ఉన్నదో చెపుతూ తిలక్ ఇలా అంటారు:
 ‘ఎంత శాంతంగా, హాయిగా, ఆప్యాయంగా ఉందీ!
 చచ్చిపోయిన మా అమ్మ తిరిగొచ్చినట్టుంది’
 
     నేను కొంతకాలం తణుకు పోస్టాఫీసులో గుమాస్తాగా పని చేశాను. ప.గో.జిల్లా తంతి తపాలా శాఖవారు జరుపుకొనే వార్షికో త్సవాల సందర్భంగా పోస్ట్‌మేన్ మీద ఒక గేయం రాయమని వెంటపడ్డాను. చూద్దాం చూద్దాం అంటూనే రాయలేదు. ఉత్సవాలు అయిపోయాయి. తీరా ఒకరోజు పిలిచి ‘పోస్ట్‌మేన్’ కవిత వినిపించారు. అద్భుతం. కాని అప్పుడే రాసి ఉంటే బాగుండేది కదా అని నేను నిష్టూర పడితే ‘నువ్వడిగినప్పుడు రాసుంటే ఏడ్చినట్టు వచ్చేది. ఇంత కాలం నానింది కాబట్టే బాగా వచ్చింది’ అన్నారు. ‘మై డియర్ సుబ్బారావ్! కనిపించడం మానేశావ్’ అని మొదలయ్యే ఆ కవిత నన్ను సంబోధిస్తూ నా జీవితాన్ని ధన్యం చేసింది.
 
  తిలక్‌గారు రాయాలని రాయలేక పోయిన నాటకం- ఖడ్గతిక్కన. ‘చూడు సుబ్బారావ్. ఖడ్గతిక్కనను శత్రువులు చంపలేదు. నెల్లూరి ప్రజలు, తల్లిదండ్రులు, భార్య కలిసి చంపేశారు. ప్రతికూల పరిస్థితులు న్నప్పుడు యుద్ధం నుంచి పారిపోయి వస్తే తప్పేముంది? బెర్నాడ్ షా ‘ఆర్మ్స్ అండ్ ది మేన్’ నాటకం రాసినట్టుగా నేను ఖడ్గ తిక్కన నాటకాన్ని కొత్తగా రాస్తాను’ అనేవారు.
 
  తిలక్‌గారు కథకులుగా ప్రసిద్ధులు. సమకాలీన సంఘటనలకు ఆయన వెంటనే స్పందించేవారు. నవకాళి దురంతాలు జరిగిన కొద్దిరోజులకే ‘అద్దంలో జిన్నా’ రాశారు. ‘ఊరి చివరి ఇల్లు’ కథను ‘ది షాడోస్’ పేరుతో స్వయంగా ఆంగ్లంలోకి అనువదించి ‘ట్రిబ్యూన్’ అమెరికన్ పత్రిక జరిపే ప్రపంచ కథల పోటీకి పంపారు. ఈ పత్రిక జరిపిన పోటీలలోనే గతంలో పాలగుమ్మిగారి ‘గాలివాన’ కథకు బహుమతి వచ్చింది. ఆయనకు మల్లే తనకు కూడా బహుమతి రావాలనే పట్టుదల తిలక్‌గారిలో ఉండేది.
 
     తిలక్ కవిత్వాన్ని గురించి  ఒక్కమాటలో చెప్పాలంటే ‘అద్భుత సౌందర్యం - దుర్భర విషాదం’. శ్రీశ్రీ చెప్పినట్టుగా ‘కవితాసతి నొసట నిత్య రసగంగాధర తిలకం’ స్వర్గీయ దేవరకొండ బాలగంగాధర తిలక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement