మేజిక్ రియలిజం తెలిసిన తొలి తెలుగు కథకుడు... | A first telugu narrator story as known as `Magic realism` | Sakshi
Sakshi News home page

మేజిక్ రియలిజం తెలిసిన తొలి తెలుగు కథకుడు...

Published Mon, Nov 25 2013 4:04 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

మేజిక్ రియలిజం తెలిసిన తొలి తెలుగు కథకుడు... - Sakshi

మేజిక్ రియలిజం తెలిసిన తొలి తెలుగు కథకుడు...

ఆరు దశాబ్దాల కృషి: మునిపల్లె రాజు మొదటి కథ 1953లో అచ్చయ్యింది. అంటే ఇప్పటికి ఆయన రచనా వయసు  60 ఏళ్లు. తన సుదీర్ఘమైన రచనా జీవితంలో కథల వెంట అదే పనిగా పడకుండా ఇప్పటికి కేవలం 64 కథలే రాసి ప్రతి కథనూ తెలుగు కథకు ఒక బలమైన చేర్పుగా చేసిన ప్రతిభాశాలి మునిపల్లె రాజు. తెలుగులో మేజిక్ రియలిజంలో మొదటగా రాసిన రచయిత కూడా.
 
 గొప్ప కథకు నిర్వచనం ఏమిటంటే-జీవిత రహస్యాలను విప్పి చెప్పే వెలుగు అన్నాడు తిలక్. మునిపల్లె రాజు కథలు సరిగ్గా ఆ నిర్వచనానికి సరిపోతాయి. 1953లో అచ్చయిన ‘వారాల పిల్లవాడు’ దగ్గరి నుంచి నిన్న మొన్నటి ‘దివో స్వప్నాలతో ముఖాముఖి’ వరకూ ఆయన రాసిన కథలు అటు వస్తువులో, ఇటు కథనంలో తెలుగు నేలను అల్లుకున్న జీవన వ్యాకరణాలుగా కనిపిస్తాయి. కథకుడిగా మునిపల్లె రాజును గమనించినప్పుడు, ఆయనే తన బాల్యం గురించి, జీవితం గురించి స్వగతించిన స్వరాన్ని విన్నప్పుడు కథకుడిగా ఆయనలో రెండు ప్రధాన దశలు కనబడతాయి. మొదటి దశ కథల్లో ఆయన తన అనుభవంలో చూసిన జీవితాన్ని వ్యాఖ్యానిస్తారు.
 
 రెండవ దశలో తన అధ్యయనంలో నుంచి వచ్చిన మెలకువను పరిచయం చేస్తారు. మొదటి దశకు - వారాల పిల్లవాడు కథ; రెండవ దశకు - వీర కుంకుమ కథ ఉదాహరణలు. వ్యవస్థ నిర్లక్ష్యంతో ఒక కుర్రవాడు నేరస్తుడుగా ఎలా మారాడో మొదటి కథ చెబితే, బలహీనమైన వ్యవస్థలో మనిషి చావుకి ఎలా దగ్గరవుతున్నాడో రెండవ కథ చెబుతుంది. అయితే, మునిపల్లె రాజు కేవలం ఈ రెండు దశల మధ్య ఒదిగే రచయిత కాదు. ఆయన 1953లోనే రాసిన- బిచ్చగాళ్ల జెండా, అరణ్యంలో మానవ యంత్రం కథలు భవిష్యత్తుని పాఠకుడికి చూపెడతాయి. ఆ కాలంలోనే ప్రత్యామ్నాయ పోరాట మార్గాలను ఊహించి చెప్పిన దార్శనికుడిగా మునిపల్లె రాజు ఈ రెండు కథలలోనూ కనపడతారు. వస్తువులోని వైవిధ్యాన్ని చూపెడుతూనే కథనంలో కూడా ఆధునిక కథానిక నిర్మాణాన్ని అన్వయించుకోవడానికి బహుశా రాజుగారి పాశ్చాత్య సాహిత్య అధ్యయనం ఒక కారణం కావచ్చు.
 
 1925లో అమెరికాలో మొదటగా ఫ్రాంజ్ రోహ్ ‘మేజిక్ రియలిజం- పోస్ట్ ఎక్స్‌ప్రెషనిజం’ అనే పుస్తకం రిలీజ్ చేశాడు. యాభైల నాటికి మార్క్వెజ్ తన నవల ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్’లో ఈ మేజిక్ రియలిజంను గొప్పగా ఆవిష్కరించాడు. సరిగ్గా ఆ సమయంలోనే కథలు రాయడం మొదలెట్టిన మునిపల్లె రాజు ఈ మేజిక్ రియలిజంను తన కథలకు ఉపయోగించుకున్నారు. ఒక సంక్షోభ కాలంలో పైగా రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఉండేటటువంటి కాలంలో- రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికపరమైన మార్పులు ఒక సమాజంలో చోటు చేసుకుంటున్నప్పుడు మనిషి నిజ అస్తిత్వ స్థితికి సరిహద్దులు చెరిగిపోతాయి. ఈ సంక్షోభిత వాస్తవాన్ని సంపూర్ణంగా చిత్రించేందుకు రచయితే ఒకేసారి భూత, భవిష్యత్, వర్తమాన కాలాల అవగాహనలోంచి కథనం కొనసాగిస్తాడు.

 

ఇలాంటప్పుడు పౌరాణిక, బీభత్స, చారిత్రక, జానపద వీర  గాథలు, అనేక వర్ణనలు, బీభత్స రస ప్రధానాలైన కల్పనలతో కూడిన ఒక శిల్పం రూపు దిద్దుకుంటుంది. అదే మేజిక్ రియలిజం. విచిత్రం ఏమిటంటే ఇన్ని వైరుధ్యాల మధ్య కూడా బిగి సడలని కథనం కొనసాగించడమే ఈ మేజిక్ రియలిజం గొప్పదనం. ఈ విలక్షణమైన రీతిని దాదాపు అనేక కథలలో అద్భుతంగా ఉపయోగించుకున్నారు మునిపల్లె రాజు. ఇది కూడా కాదు, మేజిక్ రియలిజంలో కనపడే బీభత్సాన్ని దాటి చాలా సాత్విక, తాత్విక రీతులలో తన కథలను ఒక చైతన్యంతో ముగించడం రాజుగారి స్పెషాలిటీ. ‘నైమిశారణ్యంలో సత్రయాగం’ కథ దీనికి మంచి ఉదాహరణ.
 
 మునిపల్లె రాజు చాలా కథలలో ముగింపు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఆయన కథలను చదివినప్పుడు మనకి ‘శంకరాభరణం’ సినిమాలోని ఒక మాట గుర్తుకొస్తుంది. ‘ఆర్ద్రత భాషకందని భావం’ అంటాడు శంకరశాస్త్రి.
 
 జీవితంలోని ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క స్వరం ఉంటుందని గుర్తించిన ఈ రచయిత ఆ జీవన స్వరాల లోంచి జారిన ఒక్కొక్క రాగం ద్వారా పాఠకుడు మనసును తడి చేస్తారు. ‘ఒక బాకీ తీరలేదు’ కథ పాఠకులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కదులుతున్న కాలంతో పాటు మారుతున్న జీవితాన్ని, మారిన అవసరాలని, చేరుతున్న కొత్త అలవాట్లను గమనించడంలో రాజుగారి కథలు ముందంజలోనే ఉన్నాయి.
 
 ప్రఖ్యాత అమెరికన్ కథా రచయిత్రి Eudora Welty  మంచి కథ గురించి మాట్లాడుతూ 'good stories therefore touch us intellectually and emotionally and ignite our imagination' అంటారు. మునిపల్లె రాజు ‘సప్తతి మహోత్సవం’ లాంటి కథ దీనికి మంచి ఉదాహరణ. కథకుడిని జాగ్రత్తగా గమనించినప్పుడు మనిషి జీవితంలో ఒడిదుడుకులను పట్టుకోవడమే కాకుండా వాటిని సరిగ్గా అంచనా వేయగలిగిన నిరాపేక్షతను కూడా రాజుగారిలో చూస్తాం.
 
 మనకి తెలిసిన జీవితంలో తెలియని విలువల గురించి, మనకి తెలిసిన సమాజంలో తెలియని కర్తవ్యాల గురించి, మనకి తెలిసిన ఇష్టాలలో తెలియని ఆప్తత గురించి చెప్పడానికి మునిపల్లె రాజు కథలు ఎప్పుడూ ముందుంటాయి. వాటిని చదవడమంటే బహుశా మళ్లీ మనం మనంగా ఉండడానికి జలపాత స్నానం చేయడమే. తెలుగు కథా సాహిత్యంలో ఆర్ద్రత ఒలికించే ఒకే ఒక కథకుడు మునిపల్లె రాజు.
 - నండూరి రాజగోపాల్, 98481 32208
 బొమ్మ: అన్వర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement