తాత్త్విక పరీమళాల కథల మల్లె | Sudhama Writes Special Story On Munipalle Raju Birth Anniversary | Sakshi
Sakshi News home page

తాత్త్విక పరీమళాల కథల మల్లె

Published Mon, Mar 16 2020 12:39 AM | Last Updated on Mon, Mar 16 2020 12:39 AM

Sudhama Writes Special Story On Munipalle Raju Birth Anniversary - Sakshi

వర్తమాన సమాజంలోని సంక్షోభాన్ని– అస్తిత్వ జీవన తాత్త్వికతా ఆలోచనా ధోరణులతో, పౌరాణిక, జానపద, చారిత్రక గాథల శిల్పంతో రాసిన మేజిక్‌ రియలిజం కథకుడు మునిపల్లె రాజు. మనిషిలోని అంతర్ముఖ భిన్న పార్శా్వలను, మానవ జీవన వైవిధ్యాలను, సంవేదనలను వివరించిన ‘కథన మాంత్రికుడు’. ‘అస్తిత్వ నదం ఆవలి తీరాన’ కథాసంపుటికి 2006లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్న మునిపల్లె రాజు, పోరంకి దక్షిణామూర్తి అన్నట్లు– ‘రాజుగారు హృదయమున్న మార్క్సిస్టు, జీవితం తెలిసిన సైంటిస్టు, అన్నింటినీ రంగరించగల ఆల్కెమిస్టు.’

1925 మార్చి 16న గుంటూరులో మునిపల్లె బక్కరాజుగా జన్మించిన ఈయన మునీంద్ర, మునిపల్లె రాజు పేర్లతో కథలు, కవిత్వం రాశారు. మునిపల్లె రాజు కథలు, పుష్పాలు–ప్రేమికులు–పశువులు’, దివోస్వప్నాలతో ముఖాముఖి కథాసంపుటాలు వెలువరించారు. ఆయన రాసిన పూజారి నవల వెండితెరపై పూజాఫలంగా అలరించింది.

వేరొక ఆకాశం– వేరెన్నో నక్షత్రాలు కవితా సంపుటి ఆయన కవిహృదయాన్ని ఆవిష్కరిస్తుంది. జర్నలిజంలో సృజన రాగాలు, అలసిపోయిన వారి అరణ్యకాలు వంటి వ్యాస సంపుటాలు ఆయన మేధోపటిమకు దర్పణంగా నిలుస్తాయి. మొదటి సంపుటిలోని మొదటి కథ వారాలబ్బాయి లగాయతు, అస్తిత్వ నదం ఆవలి తీరాన ఆఖరి కథ వరకూ ఆయన ఆలోచనా ధోరణులు సమగ్ర మానవ నాగరికతా స్వభావానికి ప్రతీకాత్మకంగా ప్రస్తానించినవే. బిచ్చగాళ్ల జెండా, సవతి తమ్ముడు, యశోద కొడుకు, వీర కుంకుమ, అంతా విషాదాంతం కాదు, దంపతులు వంటివి చదివిన పాఠకులను వెంటాడే కథలు. నిశ్శబ్దం ఒక పదం కాదు, నైమిషారణ్యంలో సత్రయాగం లాంటి ప్రయోగాత్మక కథలు ఆయన నవ్య పరిణామ కథాభివ్యక్తులు.

చిన్న విషయాన్నో సంఘటననో కథలుగా అల్లగల కథకులు ఎందరో వున్నారు. కానీ బాల్యం నుంచి జీవన పర్యంతం ‘జీవితపు బైప్రొడక్ట్‌’గా కథలను మలిచిన ఘనత రాజుగారిది. అందుకే ఆయన కథలు నిడివిలో కూడా పెద్దవిగా ఉంటాయి. ‘మీ ఆకాశవాణి ప్రసార సమయంలో పది నిమిషాల వ్యవధిలో చదవగలిగే కథలు నేను రాయగలిగినపుడు వస్తానులే సుధామా’ అని రేడియో కథకు ఆహ్వానించినపుడు ఆయన అనడమూ, వారి కథారచన అనుభవాలూ జ్ఞాపకాలను అందుకే ఓ గంట వ్యవధి కార్యక్రమంగా రూపొందించి హైదరాబాద్‌ ఆకాశవాణి నుండి ప్రసారం చేయడమూ ఒక మధుర స్మరణికే.

రక్షణ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేసి పాఠకులకు తన ఆలోచనలతో బతుకు రక్షణనిచ్చే దిశానిర్దేశక కథా రచయితగా తెలుగు సాహిత్యంలో సుస్థిరుడు మునిపల్లె రాజు. తొంభై రెండేళ్లపాటు జీవించి 2018 ఫిబ్రవరి 24న అస్తమించి పాఠక హృదయాల్లో జీవిస్తున్న కీర్తిశేషుడు.

- సుధామ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement