నివాళి
అందరి కోసం కనులు నవ్వు తాయి/నాకోసం కాటుక ఏడుస్తుంది (సబ్ కె లియె ఆంఖే హస్ తీ హై/ మేరే లియే కాజ ల్ రోతా హై) తాను తరచూ ఆలపించే గజల్ చరణం పండిట్ విఠల్ రావ్ శివ్‌పుర్‌కార్‌కు వర్తించడం ఎంత విషాదం! ‘సుకవి జీవించు ప్రజల నాల్కల మీద’ అన్నట్లుగా హైద్రాబాద్ స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మగ్దుం మొహియుద్దీన్ రచన ‘ఏక్ చమేలీ కె తలే’ను విఠల్‌రావు గాత్రంలో వినని గజల్ ప్రియులు లేరు! మే 29న షిర్డీలో విఠల్‌రావు తప్పిపోయారు. మరు సటి రోజు రాష్ట్రప్రభుత్వం వివిధరంగాల ప్రముఖులకు తెలంగాణ అవార్డులను ప్రకటించింది.
జూన్ 2న పెరేడ్ గ్రౌండ్స్‌లో అవార్డు స్వీకరించేందుకు విఠల్‌రావూ వస్తారని అందరూ ఎదురు చూశారు. రాలేదు! ఎందుకు? అప్పుడు తెలిసింది...
విస్మృత వ్యాధి!
ఆయన అల్జీమర్స్ డిసీజ్(ఎడి)కు గురైనారని, తప్పిపో యారని! జూన్ 27న విఠల్‌రావు అనామకుడిగా ‘గాంధీ’ మార్చురీకి చేరారు! తాను జీవించి ఉండగా ప్రకటితమైన అవార్డును కుటుంబసభ్యులు వేద నాశ్రువులతో స్వీకరిం చారు! అవాంఛిత ప్రొటీన్‌లు మెదడులో గడ్డకట్టడం వలన అరవయ్యేళ్లు దాటిన వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవ కాశం ఉంది. వస్తువులు ఎక్కడ పెట్టిందీ గుర్తుండక పోవడంతో మొదలై స్నేహితులను, కుటుంబ సభ్యులను, స్థలాన్ని, కాలాన్ని, తనను, భాషనూ మరచిపోయే స్మృతి హీనతకు దారితీస్తుంది!
ప్రాచీనస్మృతులు తప్ప వర్తమానం గుర్తుండదు! ప్రతి పది మంది వృద్ధుల్లో ఒకరికి, వయసు పెరిగే కొద్ది ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి నిర్దుష్టమైన వైద్య చికిత్స లేదు. ఈ వయసులో ఇది సహజమే అనుకుంటూ కుటుంబ సభ్యులే సంరక్షిస్తారు. ఫలితంగా పాశ్చాత్య ప్రపంచంలో వలె మన ప్రభుత్వ వైద్యశాఖ రికార్డుల్లో అల్జిమీర్స్ వ్యాధిగ్రస్తుల గణాంకాలు ఖచ్చితంగా ఉండవు.
చివరి నిజాం ఆస్థాన గాయకుడు, నిజాంకు ఆయన షహజాదీ (కుమార్తె)కి, వివిధ సంస్థానాధీశులకు గజల్స్ వినిపించిన విఠల్‌రావుకు ఆ వ్యాధి ఉందని ఆయన కుటుంబ సభ్యులకు, కొందరు సన్నిహితులకు తప్ప ఇతరు లకు తెలియదు. శిష్యులకూ తెలీదు. కెనడా దేశపు అత్యు న్నత గాయనిగా జునొ అవార్డు పొందిన విఠల్‌రావు శిష్యు రాలు కిరణ్ అహ్లువాలియాకూ తెలీదు. విఠల్‌రావు శిష్యరి కం చేసిన హరిహరన్‌కూ తెలీదు! తెలిసినా చేయగలిగిందే మైనా ఉందా? పోలీసులకు ఫిర్యాదు చేయడం, తెలిసిన వారికి చెప్పడం, కళ్లుకాయలు కాసేలా కుటుంబసభ్యులు ఎదురుచూడడం తప్ప!
సంస్థలు ఏర్పడాలి!
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల మం ది వృద్ధులు వివిధ దశల అల్జిమర్స్ బాధితులని విఠల్‌రావు ఉదంతం వెలుగులో మనం గుర్తించాల్సి ఉంది. గుర్తిస్తేనే... అభివృద్ధి చెందిన దేశాల్లో వలె మనకూ అల్జి మర్స్ అసోసియేషన్స్, ఫౌండేషన్స్, ఆదు కునే యంత్రాంగం ఏర్పడతాయి. ఆయా దేశాల్లో వ్యాధికి గురైన వ్యక్తులకు తేలికగా తీసుకునేందుకు వీలుకాని కడియాలు, లాకెట్స్ అమర్చవచ్చు. అవి, సంబంధితుల ఫోన్ కాల్స్‌కు స్పందిస్తాయి. వ్యాధిగ్రస్తుడు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. శబ్దమూ, వెలుతురు ద్వారా పౌరసమాజం గుర్తిస్తుం ది. ఆ పరికరాల్లోని మెడికల్ రికార్డు, వైద్యు లకు ఉపకరిస్తుంది.
లోకం చుట్టిన గాయకుడు...
అమెరికాతో సహా అనేక యూరోప్ దేశాలు, మధ్యప్రా చ్య దేశాలు పర్యటించిన విఠల్‌రావును ఆయా దేశాల్లో స్థిరప డమని ప్రముఖులు కోరారు. తాను ఘోషామహల్ వీడ నని ఒక గజల్ (సారే ఫలక్ కీ సైర్ కియా...) ద్వారా చెప్పారు! లోకం చుట్టిన గాయకుడు అల్జీమర్స్ కారణంగా తన గూటికి చేరుకోలేకపోయారు! ‘రాత్రి నిశ్శబ్దంగా వెళ్లిపోయిందని ఒక పిచ్చివాడు ఏడ్చాడు’ అనే చరణాన్ని అభిమానులకు మిగిల్చి! ఆ సాంస్కృతిక రాయబారి పేరుతో 108 తరహాలో ఒక ‘స్మృతి’దాయక వైద్యవ్యవ స్థను ఏర్పాటు చేయడం ప్రజలందరూ హర్షించే నివాళి కాగలదు!
(వ్యాసకర్త, ఇండిపెండెంట్ జర్నలిస్ట్) మొబైల్: 7680950863
- పున్నా కృష్ణమూర్తి