ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు - ఒక నివాళి | Acharya pullela sriramachandrudu | Sakshi
Sakshi News home page

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు - ఒక నివాళి

Published Sun, Jun 28 2015 3:58 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Acharya pullela sriramachandrudu

కాలం అంతంలేనిది, పృథ్వి విశాలమైనది. కావున మహాపండితులు ఆవిర్భవిస్తారని ఆశించవచ్చుకాని రుషి సంప్రదాయంలో వీరు చివరి దిగ్గజమేమో!
 
 పుల్లెల శ్రీరామచంద్రుడు
 (24 అక్టోబర్ 1927-24 జూన్ 2015)
 
వేదవ్యాసుడు తాను వ్రాసిన భారతగ్రంథాన్ని ప్రస్తావిస్తూ, ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆధ్యాత్మవిదులు వేదాంతమని, కవివృషభులు మహాకావ్యమని, నీతికోవిదులు నీతిశాస్త్రమని, పౌరాణికులు గొప్ప పురాణమని కొని యాడారని వ్రాశారు. అన్ని శాస్త్రాల్నీ సమన్వయం చేయగల దక్షత ఉన్న వ్యక్తి రుషి సంప్రదాయంలోని వాడు. పురాణ వాఙ్మయంలోనూ ఇదే ధోరణి కన్పిస్తుంది. తర్వాతి కాలంలో వేదాంత శాస్త్రం, వ్యాకరణం, తర్కం, సాహిత్యం, ఇలాగ ఆయా శాస్త్రాలకే పరిమితమైన రచనలు కన్పిస్తాయి.
 
 రుషి సంప్రదాయంలో ఉన్నవారు అనేక శాస్త్రాల్ని సమన్వయం చేసి, సమకాలీన సమాజాన్ని అధ్యయనం చేస్తూ సమాజానికి జ్ఞానాన్ని పంచాలనే తపన ఉన్నవాళ్లు. భారతీయ సాంస్కృతిక చరిత్రలో బహుముఖమైన ప్రజ్ఞ, వ్యుత్పత్తికల వ్యక్తులు అక్కడక్కడ దర్శనమిస్తారు. అనేక శాస్త్రాల్ని అవలోకనం చేసి గ్రంథరచన చేసిన అప్పయ్య దీక్షితులు ఇందుకు ఒక ఉదాహరణ. ఆధునిక కాలంలో తెలుగు సంస్కృతిలో ఆవిర్భవించిన పుల్లెల శ్రీరామచంద్రుడు ఈ కోవకు చెందినవారు. కాలం అంతంలేనిది, పృథ్వి విశాలమైనది. కావున మహాపండితులు ఆవిర్భవిస్తారని ఆశించవచ్చుకాని రుషి సంప్రదాయంలో వీరు చివరి దిగ్గజమేమో!
 
 పుల్లెల వారికి శుశ్రూష చేసే భాగ్యం లభించడం నా జీవితంలో ఒక మలుపురాయి. 1994లో హైదరాబాదులో ఒకానొక సాంస్కృతిక కార్యక్రమంలో వారి పరిచయం కల్గింది. భగవద్గీత, ఉపనిషత్తులలాంటి హిందూ సిద్ధాంత గ్రంథాల్ని పాఠం చెప్పగల వారెవరు అనే అన్వేషణలో నేను ఉన్న సమయం. రేమెళ్ల అవధానులుగారు, ప్రొఫెసర్ శశిరేఖ గారు, అరుణావ్యాస్ గారు మొదలైన మిత్రులందరమూ వారిని కలిసి ఆ పుస్తకాల్ని పాఠం చెప్పమని ప్రార్థించాం. ప్రతిదినం ఉదయమే వారి ఇంటికి వెళ్లడం, గంటకు పైగా పాఠం వినడం మా దినచర్య అయింది. భగవద్గీతపై శంకరాచార్యులు వ్రాసిన వ్యాఖ్యతో మొదలైంది మా అధ్యయనం. ఆ తర్వాత భారతీయ తాత్త్విక సంప్రదాయాల్ని తెలిపే ‘సర్వదర్శన సంగ్రహం’, ‘సిద్ధాంతలేశ సంగ్రహం’, ‘బ్రహ్మసూత్ర భాష్యం’ మొదలైనవి క్రమంగా చెప్పుకున్నాం. దాదాపు నాల్గు సంవత్సరాలు ఉదయమే పాఠానికి వెళ్లి తర్వాత పోలీసు డ్యూటీకి వెళ్లడం, మిగతావారు వారివారి ఉద్యోగాలకు వెళ్లడం జరిగాయి.
 
 1999 ప్రాంతంలో అనుకుంటా- పుల్లెల వారికి మొదటిసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. డాక్టర్ గట్టిగా సలహా ఇవ్వడంతో మా పాఠాలు ఆగిపోయాయి. మాకు పాఠం చెప్పేదెవరు? ఆ తరుణంలో కేవలం విద్యార్థుల కోరికపై క్రమక్రమంగా అనేక వేదాంత గ్రంథాలకు తెలుగులో వ్యాఖ్యలు వ్రాశారు. అదివరకే చాలా సంవత్సరాల క్రితం ఉపనిషత్తుల్ని సామాన్య పాఠకుడికి పరిచయం చేయాలనే దృష్టితో వీరు వ్రాశారు. కాని ఈ తర్వాతి రచనలు మరింత పైస్థాయికి చెందినవి. ఒక్కొక్క పుస్తకం ఒక గొప్ప పరిశోధనాఫలితం. గీత, ఉపనిషత్తుల్లాంటి పుస్తకాలపై సంస్కృతంలో ఉన్న అనేక వ్యాఖ్యల్ని అవగాహన చేసుకొని, వాటిలో ఉన్న పారిభాషిక పదాల్ని, వాదాల్ని ఈనాటి పాఠకులకు అందించడం అనితర సాధ్యమైన కృషి. ఒక్కొక్క పుస్తకం ఒక గొప్ప తపస్సులాంటిది. వేదాంతంపై ప్రామాణికంగా రాయాలంటే కనీసం నాలుగు ఇతర శాస్త్రాల్లో మంచి అవగాహన ఉండాలి. అవి వ్యాకరణం, తర్కశాస్త్రం, మీమాంస, సాహిత్యం అనేవి. ఒక శాస్త్రం సరిగా బోధపడాలంటే మిగతా శాస్త్రాల జ్ఞానం కొంత అవసరం. ప్రస్తుతం భౌతికశాస్త్రం చదవాలంటే, గణితం ఎలా అవసరమో అలాగే వేదాంతం గూర్చి రాయాలంటే మిగతా వాటి జ్ఞానం చాలా అవసరం. పుల్లెలవారు పై నాల్గు శాస్త్రాల్లో సమగ్రమైన పాండిత్యం ఉన్నవారు.
 
 ‘బాలానందిని’ పేరిట వీరు రాసిన వ్యాఖ్యలు శిష్ట వ్యావహారికం ఉంటాయి. ఈ పుస్తకాల్ని వ్యావహారిక భాషలో అందిస్తే అపవిత్రమవుతాయని సాంప్రదాయకులు భావిస్తారు. కాని తెలుగు భాషా పాండిత్యం కూడా సన్నిగిల్లుతున్న సమయంలో గ్రాంథిక భాష అనవసరమనే నిర్ణయానికి వచ్చారు. క్లిష్టమైన అంశాల్ని అవతారికల్లోనే స్థూలంగా వివరించడం, పారిభాషిక పదాల్ని ప్రత్యేకంగా వివరించడం వీరి శైలి. కొంత శ్రద్ధ, భాషాజ్ఞానం ఉన్న పాఠకుడు తెలుసుకోదగిన రీతిలో వీరి పుస్తక నిర్మాణం ఉంటుంది.
 
 సాహిత్య విమర్శకు సంబంధించిన శాస్త్రాన్ని అలంకార శాస్త్రం అంటారు. ఈ శాస్త్రానికి సంబంధించిన దాదాపు అన్ని గ్రంథాలకూ పుల్లెలవారు తెలుగులో వ్యాఖ్యలు వ్రాశారు. ఇదంతా దాదాపు 2000 సంవత్సరానికి పూర్వమే పూర్తయింది. ఆశ్చర్యకరంగా 2014లో భరతముని రెండువేల సంవత్సరాల క్రితం వ్రాసిన నాట్యశాస్త్రాన్ని దానిపై ఉన్న సంస్కృత వ్యాఖ్యతో సహా వీరు వ్యాఖ్యానం చేశారు. దాదాపు వెయ్యి పేజీల గ్రంథం. 7, 8 నెలల సమయంలో పూర్తయింది. అప్పటికి వీరి వయసు 86 సంవత్సరాలు. ఇది ఒక విశ్వవిద్యాలయంవారు పండితుల టీమ్ ఏర్పాటు చేసి సాధించగల్గిన ప్రాజెక్టు. ఇంతటి గొప్ప పని ఎలా చేశారు; వీరు మాత్రమే దీన్ని తెలుగులో వ్రాయగల సమర్థులు అని శృంగేరి పీఠాధిపతి స్వయంగా సందేశం పంపి ప్రేరణనిచ్చారు. ఆ ఆదేశం వల్ల ఈ పుస్తక నిర్మాణం జరిగింది.
 
 ఇటీవలే తెలుగు ప్రజలు కోల్పోయిన మరొక మహనీయ వ్యక్తి సద్గురు శివానందమూర్తిగారు పుల్లెలవారికి ఆప్తులు. వారి ఆదేశం, లేదా కోరికననుసరించి, కాశ్మీర శైవ సంప్రదాయానికి చెందిన పుస్తకాల్ని తెలుగు వ్యాఖ్యతో అందించారు. వీరిద్దరి ఆలోచనా ఫలితమే ఒక నూతన స్మృతిగ్రంథం. హిందూ సమాజంలోని రుగ్మతల్ని పారద్రోలడం, చైతన్యం నింపడం అన్న విషయం వీరిద్దరి ఆలోచనలో సమంగా ఉంటుంది. ధర్మం యొక్క మౌళిక స్వరూపం స్థిరంగా ఉన్నా ఆచరణలో దాని స్వరూపం మారుతుందనీ, దేశ, కాల పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందనీ, బహుజన సంక్షేమకరంగా ఉండేదే ధర్మమనీ మన ఉపనిషత్తులే చెపుతాయి. ఈ విషయాన్ని వీరిద్దరూ పరిశీలించారు. దాని ఫలితంగా పుల్లెలవారు ‘కౌండిన్య స్మృతి’ వ్రాశారు. అస్పృశ్యతను ఖండించడం మొదలైన విషయాల్ని ఇందులో చూడగలం.
 
సంస్కృతి సంరక్షణకు సంస్కృతం అవసరం అన్న విషయాన్ని గ్రహించిన వీరు దాదాపు 30 సంవత్సరాల క్రితం శేషాచార్యులు, పుల్లారెడ్డిగారు మొదలైన మిత్రులతో కలిసి సంస్కృత భాషా ప్రచార సమితి ప్రారంభించారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా సురభారతి, సంస్కృత అకాడమీ సంస్థల్ని స్థాపించడంలోను, నిర్వహించడంలోను ముఖ్యపాత్ర వహించారు. పుల్లెల శ్రీరామచంద్రుల అస్తమయంతో భారతీయ సంస్కృతిని ప్రకాశింపజేసిన ఒక మహోజ్జ్వల కాంతి పుంజం అస్తమించింది. ఆ కాంతి పుంజంచే వెలిగింపబడిన చిరుదివ్వెల్లాంటి శిష్యగణం, పండితగణం వారి ఆశయాల్ని ఉజ్జీవనం చేయాల్సిన అవసరం ఉంది.
 (వ్యాసకర్త మాజీ డీజీపీ)
 - కె. అరవిందరావ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement