ఒంటరి | Alone.. an ancient story | Sakshi
Sakshi News home page

ఒంటరి

Published Sat, Aug 2 2014 1:10 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

ఒంటరి - Sakshi

ఒంటరి

తొండమనాటి పరశురామేశ్వరాలయ విప్రపీఠం క్రీ.శ. 850
(నేటి తిరుపతి వద్ద గుడిమల్లం)-పదం నుంచి పథంలోకి 12)

‘ఎండ సలసలమంటాండాది. ఈడ్నే సెట్టు కింద కాసేపాగి పిన్నాలె పోయిడుస్తాం’ అంటూ గుర్రాన్ని చింత చెట్టు కింద ఆపాడు కాటప్ప. ఈడ్నెందుకు? ఆడేదో ఊరు కనిపిస్తాండాది. గుడిమల్లామే! ఆడకే పా. మజ్జిగన్నా దొరకతాది’ అంటూ ముందుకు సాగాడు మునియప్ప. ఇద్దరూ యుద్ధవీరులు.
 ఏ రాజు అడిగితే ఆ రాజు సైన్యంలో ప్రాణాలొడ్డి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. వీరబత్యం, రూకలూ, గుళ్లూ, కోటలూ దోచిన నగానట్రా కలిసే అనుభవించారు. కొంపాగోడూ లేని ఏకాకులు. ఒకరికొకరు తోడు.
 
 ‘వానాకాలం గడిచిందాంకా నెట్టుకొచ్చేందానికి దుడ్లుండాయి. ఈడ్నన్నా పని చిక్కకుంటే కష్టం’ చల్లాడంలో దోపిన జాలీ సంచి తడుముతూ అన్నాడు మునియప్ప.
 ‘అవునప్పా! చెడ్డకాలం! మొన్న కాళాస్త్రిలో పంచాంగం బాపనయ్య చెప్పుండాడు. అదేదో పదేళ్ల ‘శాంతి’ అంట! ఏయుద్ధమూ లేని చెడ్డ కాలం వచ్చుండాది’ నిట్టూర్చాడు కాటప్ప.
 ‘ఊర్లో ఏడకి పోవాల?’ మట్టికోట కావలి వాడు వీరభద్రుడిలా అడ్డం పడ్డాడు.
 ‘గుళ్లో పెద్దాయన! పేరు తెలియదు. ఇంద... కాళాస్త్రి బాపనయ్య కమ్మ రాసిచ్చుండాడు’ అని బొడ్లో దోపిన తాటాకు పత్రం చేతికందించాడు మునియప్ప.
 ‘గుర్రాలూ కత్తులూ ఈడ్నెయిడిచి కూడా రాండి’ అని ఇద్దరిని పరశురామేశ్వరస్వామి గుడి ఎదురు రచ్చబండ వద్దకి తీసుకెళ్లాడు కావలివాడు.
 గావుండు, రడ్డి, కరణం, పూజారి, మిగిలిన పెద్దలతో పంచాయతీ హాజరయింది. తాటాకు కమ్మని ముందు వెనుకా చూసి చదివేందుకు పూజారికి ఇచ్చాడు గవుండు.
 శ్రీకాళహస్తీశ్వర వరప్రసాద సిద్దిరస్తు!
 స్వస్తి.
 శ్రీ వికారి నామ సంవత్సరం, వైశాఖ బహుళ త్రయోదశి నాడు, సదాశివ భక్తుడు శ్రీ కాళహస్తీశ్వర పాదపద్మారాధకుడు అయిన విశ్వేశ్వర దేశికుడు గుడిమల్ల శ్రీపరశురామేశ్వర విప్రపీఠం అర్చకులకు, గ్రామండులకు వ్రాయు సందేశము.
 దేవాలయ పశుసంపదకు, గ్రామానికి రక్షకులు కావాలని తమరు ఇది వరలో చేసిన విన్నపం అనుసరించి ఇద్దరు ఏకాంగ వీరులను తమ వద్దకు పంపుతున్నాను. వీరు బాణరాజు ప్రభుమేరు సైన్యంలో అత్యంత పరాక్రమం చూపిన మహావీరులు. మీరడిగినట్లు స్త్రీలకూ, పిల్లలకూ ఎన్నడూ అపకారం చేయమని వ్రతం పట్టిన వీరసన్యాసులు.
 వారి యోగ్యతని పరిశీలించి కొలువు దయచేయగలరు.
 
 పునఃస్వస్తి
 నెలకి పది మాడల బత్యంతో పులినాటి(శేషాచలం) అడవుల్లో మేతకెళ్ళే గోవుల రక్షణ, గ్రామ కావలిదండుకు మందపోట్లను ఎదిరించడంలో తర్ఫీదు ఇచ్చే బాధ్యతలతో ఏ ఉపద్రవం లేకుండా ఐదేళ్ళు గడిచిపోయాయి.
 గుడిపీఠం ఇచ్చే కావలి బత్యం, కాపులిచ్చే తాంబూళాలతో మిత్రులిద్దరూ ఊర్లో ప్రముఖులూ, ధనవంతులూ అయ్యారు. ఊరి రడ్డి కూతురు చౌడమ్మని పెండ్లాడి, మునియప్పరడ్డి గృహస్తుడయ్యాడు. స్నేహితుడి బిడ్డలతో సాముచేస్తూ ముచ్చట్లాడుతూ అతడి ఇంటనే కాటప్ప నివాసం.
 ‘కాటప్పన్న ఎటుపోయాడో ఏమో నీవన్నా సాపాడప్పా. పొద్దు కంకుతుండాది’ అని మొగుడిని పిలిచింది మునియప్ప భార్య చౌడమ్మ.
 ‘నువ్వూరుకోయే! ఒంటరిగా ఏడకి పోయిడుస్తాడు? అయినా ఆడు లేకుంటే నాకేడ ముద్ద దిగతాదీ?’ కత్తికి సానపడుతూ కూర్చున్నాడు మునియప్ప.
 ‘పోతురాజు జాతరకీ గంగమ్మ తిరునాళకీ వీరంగం చేస్తూ కత్తితిప్పడం తప్ప వీరులకీ గొడ్లుకాసే గొల్లలకీ తేడాయే లేదు. ఇలాగే కొన్నాళ్ళుంటే మగతనం నీరుగారి పోయిడుస్తాది. శత్రువు రక్తం కళ్ళజూసి ఎన్నాళ్ళయిందిరా?’ అని కత్తితో మాట్లాడుతూ తలెత్తి వీధి వంక చూశాడు.
 ఎదురుగా పరుగెత్తుకు వస్తున్న కావలిబంటు ‘అన్నో.. పులినాటి మొరసులు
 పొన్నే రు కాడ మందపోటేసిండ్రే..’
 ‘బిన్నగా బోయి మనోళ్ళని కూడగట్టు. కోట తలుపులు మూసి ఊర్లో దరువేయించమని జెప్పు’ అని గుర్రాల దొడ్డి వంక ఉరుకుతూ ‘కాటప్ప ఏడుండాడు?’ అని కేకేశాడు.
 ‘ఒంటరిగా వెంగడం బాటన ఆళ్ళ ఎంటబడి పోయిండాడు’
 పది మంది దండుతో ఊరొదిలి వెంగడం బాట పట్టాడు మునియప్ప. కోట బాగిల్లో ఎదురొచ్చి ఆరతి బట్టిన చౌడమ్మ ముఖం అతడి కళ్ళముందు అలాగే నిలిచిపోయింది. ఇన్నాళ్ళూ ఎన్ని యుద్ధాలు చేసినా అతడి కోసం ఎదురు చూసేవాళ్ళు లేరు. ఇప్పుడు కొత్తగా.. ఇల్లూ, పెళ్ళాం.. బిడ్డలూ..!
 చీకట్లో పులినాటి అడవిలో మంద జాడలు వెదుకుతూ ముందుకు సాగింది. మునియప్ప దండు. చేతిసైగతో దళాన్ని నిలిపి కళ్ళు చిట్లించాడు. లీలగా తోచిన గుర్రపు కదలిక. అది కాటప్పదే! సందేహం లేదు.
 హుష్ అని వేలితో సైగచేస్తూ ఎదురొచ్చాడు కాటప్ప, దూకుడు నీళ్ల లోయలో రాత్రికి నిలిచారు. పాతిక మందికిపైనే. మందలన్నీ ఆడనే ఉండాయి’ అని దూరంగా మిణుకుమిణుకు అంటున్న మంటలని చూపాడు.
 ‘పాతిక మందా? మన జనం సరిగ్గా కత్తి తిప్పేది పదిమంది’
 ‘అర్ధరాత్రి దాకా ఈడనే ఉండి అదనుచూసి మీద పడితే?’
 ‘ఊ! గొల్లలని గుర్రాలతో ఈడనే ఉంచి మనం పదిమందీ ముందుకు పోవాల. కొండగొర్రెలా నేను మూడు తడవలు కూతబెడతా. అదే సైగ! నువ్వు ఐదుగురు బంట్లతో తూర్పున తాకు. నేను మిగిలిన వాళ్లతో పైనుండి పడతా’
 ‘ఊహూ! కావలి బంట్లతో నేనే అదిక్కు పోతా’ అని ఐదుగురితో కాలినడకన సాగిపోయాడు కాటప్ప.
 ఠి    ఠి    ఠి
 ఊరి పొలిమేరలో మర్రి చెట్టు కింద పదడుగుల వీరభద్రుని మట్టి బొమ్మ. ముఖంలో కాటప్ప పోలికలు కొట్టొచ్చేలా మలిచాడు ఊరి కుమ్మరి. ఎదురుగా వీరగల్లుపైన కొండగొర్రె బొమ్మ. దాని కింద ఆనాటి మందపోటు కథ. అక్షరాలు చదవలేక పోయినా బాపనయ్య చదివి చెప్పినది ఒక్కముక్క కూడా మరిచిపోలేదు. మునియప్ప.
 
 నూరు మంది పులినాటి మొరసులని ఎదుర్కొని విప్రపీఠపు మందలు మళ్లించిన భైరవుడు కాటమయ్య తలవరి పరశురామేశ్వర స్వామి సాక్షిగా కైలాసం నుండి ఈ ఊరికి కాపలా!
 తన మీద బడిన మొరసులని ఒంటిచేత్తో ఎదుర్కొని కత్తిపోట్లకి నెత్తురు పోతున్నా చలించక వెంటబడి తరిమికొట్టిన మిత్రుడి చావుకి కారణమెవరో మునియప్పకి తెలుసు. బంట్లందరూ చచ్చాక భయంతో కత్తి విడిచి గడ్డి నోటగరిచిన తనవంక చూసిన కాటప్ప కళ్ళలో ఎటువంటి ద్వేషమూ ఏహ్యభావమూ కనపడలేదు. తాను కూడా కత్తిబట్టి ఉంటే కాటప్ప బతికేవాడే!
 
 తన పిరికితనానికి కారణం ఇల్లూ, పెళ్లాం, బిడ్డలూ!
 సూర్యుడు పడమట కుంగుతున్నా మునియప్పకి ఇంటికి వెళ్లేందుకు మనసు రాలేదు. ‘ఏమే కల్యాణి! మన కాటప్ప  వీరుల స్వర్గంలో పోయిడ్చుండాడో? మనమూ ఆడకే పోవాల. వస్తావా? అని పక్కన నిలిచిన గుర్రాన్ని అడిగాడు మునియప్ప. సరేనని, గిట్టలతో నేలరాస్తూ సకిలించిందది. కావలి గుడిలో నిలిపిన కాటప్ప కత్తి. వేలకొలదీ శత్రువులని ఊచకోత కోసిన డమస్క (సిరియా లోని డమాస్కస్) ఖడ్గం పెకిలించి, ఒరలో దోపి, పదవే నీకింకా పని ఉంది అని గుర్రమెక్కి, అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఒంటరిగా సాగిపోయాడు మునియప్ప.
 రచయిత: +91 9845034442
  - సాయి పాపినేని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement