ముని-రాజు | Muni - King | Sakshi
Sakshi News home page

ముని-రాజు

Published Sat, Mar 22 2014 3:42 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

ముని-రాజు - Sakshi

ముని-రాజు

ఆంధ్రదేశంలో బౌద్ధంకన్నా జైనం ముందు  ప్రవేశించింది. ధనుదపురి, అంటే నేటి గుంటూరు జిల్లాలోని చందోలును స్థాపించిన ధనదుడనే  రాజు ద్వారా జైనం ఇక్కడికి వచ్చిందని అంటారు.
 
కష్ణాతీరం పితృఢపురం- క్రీ.పూ.300
 (గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు గ్రామం)


 ఆంధ్ర సంఘటనానికి నాయకుడు, సద వంశం రాజైన కుబీరకుడు సూర్యాస్తమయానికి ముందే వివిధ దళపతులతో చర్చలు ముగించి కోట దక్షిణద్వారం చేరాడు. అతడి  రాజ్యంలోని చతురంగ బలాలు ఎంతటి ఉపద్రవమైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాయి. దండనాయకులూ అప్రమత్తంగానే ఉన్నారు.

 మధ్యాహ్నం చారులు తెచ్చిన వార్త అలాంటిది. ఆర్యావర్తంలో (ఉత్తర భారతదేశం) గత పన్నెండేళ్లుగా కాటకం అలముకొందట. అక్కడి ప్రజల ఆకలి తీర్చేందుకు ఆంధ్ర సంఘటనం నుండి ధాన్యం తరలించాలని మగధరాజు  చంద్రగుప్త మౌర్యుని నిర్ణయమట!

 
ప్రతి ఒక్కరి కన్నూ ఆంధ్ర జనపథాల వైపే. నిజమే. కృష్ణా గోదావరీ పరివాహ ప్రాంతంలో ముప్పై నగరాలలోని గిడ్డంగులలో ధాన్యానికి కొరతలేదు. ఇప్పటికే మగధ భయంతో గోదావరీ తీరంలోని ఆశ్మక (ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు), ములక (మహారాష్ర్టలో గోదావరి  తీరప్రాంతం), మహేంద్రగిరి (కరీంనగర్, ఖమ్మం జిల్లాలో గోదావరి కొండ ప్రాంతం) మొదలైన రాజ్యాలు చక్రవర్తికి ధాన్యం రూపంలో కప్పం చెల్లించేందుకు అంగీకరించాయి. లేకుంటే తమ రాజ్యాలకి పక్కనే ఉన్న విదర్భలో (మహా రాష్ట్రలో నాగ్‌పూర్ ప్రాంతం) నిలిచి ఉన్న మగధ సైన్యాలు దండెత్తి వస్తాయి.
 

అయితే సమస్య అంతా కృష్ణాలోయలోని రాజ్యాలలోనే. నల్లమల అడవుల్లోని మోకూరు గణ నాయకుడు నల్లరాజు ఇందుకు సమ్మతించడం లేదు. ‘మనం నందరాజుకు సామంతులం కానీ అతడిని చంపి పాటలీపుత్రాన్ని (పాట్నా- మగధ రాజధాని) ఆక్రమించిన చంద్రగుప్త మౌర్యునికి కాదు’ అనే అతడి వాదన ఒక విధంగా సమంజసమే! అంతమాత్రాన మౌర్య సైన్యాలని ఎదిరించడం సాధ్యమా?
 అసంభవం! కనుక మగధరాజు ఆజ్ఞ పాటించడమే ఆంధ్ర జనపథాలకి శ్రేయస్కరం. నల్లరాజునూ ఇంకా అలా తల ఎగరేస్తున్న
 మిగిలిన గణాల నాయకులను ఒక్క తాటిపైకి తెచ్చి చక్రవర్తి ఆజ్ఞకు తల వంచేలా చేయవలసిన బాధ్యత ఆంధ్ర సంఘటనానికి నాయకుడైన తన మీద ఉందని కుబీరకుడు గ్రహించాడు.
 

ఆ విధంగా ఆలోచిస్తూ మందిరంలో ప్రవేశించిన కుబీరకుడి కోసం సాయంకాల సమావేశంలో  నగరంలోని గూఢచార దళాల నాయకులందరూ ఎదురు చూస్తున్నారు.

 ‘కనకగిరి (గుల్బర్గా జిల్లా కనగానహళ్ళి), సువర్ణగిరి (కర్పూలు జిల్లా జొన్నగిరి), అశిక (హైదరాబాద్ వద్ద ముసీనది ప్రాంతం), స్కంధగిరి (ఖమ్మం), బ్రహ్మగిరి (కర్నాటకలో చిత్రదుర్గ) మొదలైన రాజ్యాలు తమ సైన్యాలని సమాయుత్త పరిచి కృష్ణాలోయకి వెళ్ళే కనుమ మార్గాలలో మోహరించాయి’ అని గూఢచారులు తెలియ  చేశారు. చూడబోతే ఈ నాయకులు కూడా చగ్రవర్తి ఆజ్ఞను పాటించేలా లేరు. ఆంధ్ర జనపథాలు రెండుగా చీలితే ఇక సర్వనాశనమే! ఈ బాధ  కుబీరకుడి మనసుని ఇంకా తొలుస్తుండగా సమావేశం ముగించిన కుబీరకుని అడుగులు  స్నానశాలకి దారితీశాయి.
 

అరవైయ్యేళ్ళ జీవితంలో ఏ ఒక్క రోజూ అతడి దినచర్య తప్పలేదు. సాయంకాలం స్నానం తరువాత వరియన్నం, శాకమూలాలు, భక్షాలతో అతి సాత్వికమైన భోజనం. వర్ధమాన మహావీరుని జైన ధర్మానికి స్పందించి మాంసాహారం త్యజించి పదేళ్ళయింది. అలవాటైన భోజనమే అయినా ఆ రోజు ఎందుకో సహించలేదు.  ఎడతెగని ఆలోచనలతో హంసతూలికా తల్పం కూడా అంపశయ్యలా తోచింది.
           
 కుబీరకుడు అలవాటు ప్రకారం సూర్యోద యానికి ఇంకా రెండు జాముల ముందే లేచి, మహల్లికలు తనకై ప్రత్యేకంగా తెచ్చిన కృష్ణా
 జలాలతో ముఖ క్షాళనం చేసి, ఉద్యానవనంలో పాలరాతి వేదికపై కూర్చొని చంద్రుడు లేని ఆకాశంలో పరిష్కారం కొరకు వెదకసాగాడు. ఆకాశం కూడా మౌనం వహించింది. ఎటువంటి శకునమూ కనబడలేదు. కిం కర్తవ్యం? జాము గడిచింది. పురోహితులతో కూడి కౌండిన్యామాత్యుడు ఉద్యానంలో ప్రవేశించాడు. కౌండిన్యుడు రాజుకు గురతుల్యుడు. లేచి నమస్కరించిన కుబీరకుని దీవించి- ‘లాభంలేదు రాజా! మనం దౌత్యం కూడా విఫలమయింది. నల్లరాజు ససేమిరా అంటున్నాడు. కప్పపు భారం పెరుగుతుందన్న భయం వల్ల మిగిలిన రాజ్యాలు కూడా తిరుగుబాటుకి సిద్ధమయ్యేలా ఉన్నాయి. మగధతో యుద్ధం అనివార్యమేమో అనిపిస్తుంది. ఇక నీవు వెనుకాడితే నాయకత్వం చేజారిపోయే అవకాశం లేకపోలేదు. నిర్ణయం నీ చేతిలో ఉంది’’ అన్నాడు.
 

‘అది నాకు స్పష్టంగా గోచరమవుతుంది ఆచార్యా! నాకైతే వేరే ఏ ఉపాయమూ తోచటంలేదు. మన విజయేంద్ర (విజయవాడ) విహారానికి మగధ నుంచి జైనముని భద్రబాహు కేవలి స్వయంగా అరుదెంచారు. మగధ పరిస్థితులు ఆ మహనీయునికి తెలియనివి కావు. పైగా చంద్రగుప్త మౌర్యునితో వారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. నేనే స్వయంగా వెళ్ళి వారిని సంప్రదిస్తే ఈ క్లిష్ట సమస్యకు పరిష్కారం చెబుతారేమో? పౌరసభ ముగిసిన వెంటనే బయలుదేరుదాం’’ అని వ్యాయామశాలకి వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు కుబీరకుడు.
           

సాయంత్రం విజయేంద్రకీల విహారంలో లాంఛనాల అనంతరం జైనస్వామి భద్రబాహువు సూచించిన విధంగా అనుచరగణాన్ని విడిచి
 ఒంటరిగా గుహలోకి ప్రవేశించాడు, కుబీరకుడు.  అక్కడ ఆ అరిహంతుని పక్కన అసమానమైన తేజస్సుతో వెలుగుతున్న మరో జైనమునిని చూడగానే అంతరంగంలో మెదలిన భృత్యుభావనతో అతడి ముందు మోకరిల్లాడు. చిరునవ్వుతో కూడిన మౌనం తప్ప ఆ ముని పరిచయం లేదు. ఆయన ఎవరు? అని కుబీరకుని ముఖంపై ప్రస్ఫుటమైన ప్రశ్నకి సమాధానంగా ‘లే రాజా! పరిచయాలు తరువాత. ముందుగా నీవు వచ్చిన పని ఏమిటో చెప్పు’ అన్నాడు భద్రబాహు కేవలి.

 జైన మునీంద్రులకి పరిస్థితి నివేదించి ‘స్వామీ.. ఆంధ్ర గణరాజ్యాల్లో కొందరు మగధకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళని దారిలోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందరూ కలసిరాకపోతే మగధ కోరిన కప్పం చెల్లించడం సాధ్యంకాదు. ఈ సంకట స్థితిలో ఆంధ్రులకి మగధతో శత్రుత్వం తప్పదనిపిస్తుంది. అది నా ఉద్దేశం కాదు. దానిని నివారించడానికి ఇక తమరే ఆంధ్ర జనపథాలకి పరిష్కారం సెలవియ్యాలి’’ అని చేతులు మోడ్చాడు.

సమాధానం భద్రబాహువు పక్కనే ఆసీనుడై అంతవరకూ మౌనంగా ఆలకిస్తున్న ముని నుంచి వచ్చింది-  ‘కుబీరకా! మగధ సార్వభౌమత్వం పట్ల నీకున్న భయగౌరవాలు ప్రశంసనీయం. ఆంధ్ర గణరాజ్యాలని సంఘటితంగా ఉంచే బాధ్యత నీదే. పైగా మీ ఆంధ్ర జానపదులతో యుద్ధం మగధరాజు అభిమతం కాదు. దీనికి ప్రత్యామ్నాయం ఒక్కటే. తిరుగుబాటు అణచేందుకు నీ ప్రయత్నానికి సహాయంగా విదర్భా, ఉజ్జయినిలలో (మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం) ఉన్న పన్నెండు స్కంధాల మగధ సైన్యాన్ని వెంటనే తరలివచ్చేందుకు ఆజ్ఞాపత్రాలు జారీ చేస్తాను. లేఖకులని పిలిపించు. అయితే నీవొక విషయం గుర్తించాలి. ఇది మగధ, ఆంధ్రల మధ్య వైరం కాదు. తిరుగుబాటుదారులని అణచేందుకు  ఆంధ్రభృత్యులకు ఆ చంద్రగుప్త మౌర్యుని సహకారం  మాత్రమే. ఏమంటావ్?’’ అన్నాడు.
 ఆ ముని ఎవరో కాదు. తన సామ్రాజ్యాన్ని కొడుకు బిందుసారుడికి అప్పగించి సంసారాన్ని పరిత్యజించి దక్షిణపథం వచ్చిన చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు!

మరుక్షణం ఒక్కసారిగా మనసు తేలికై మౌర్యచక్రవర్తి చంద్రగుప్త మునిరాజు పాదాల మీద సాగిలపడ్డాడు కుబీరకుడు.

రాజు దినచర్య

పై కథలో అంతర్లీనంగా ఆనాటి రాజుల దినచర్య కనిపిస్తుంది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఒక పగలూ రాత్రి కలిసిన దినాన్ని 16 భాగాలుగా విభజించి రాజు ఆయా సమయాల్లో చేయవలసిన పనులు  వివరించబడ్డాయి. ఈనాటి పాఠకుల సౌలభ్యం కోసం నేడు వ్యవహారంలో ఉన్న కాలమానాన్నిఅనుసరించిన టైం-టేబుల్ ఈ కింద పొందుపర్చబడింది.

 ఉ:    06.30    రక్షణ వ్యవస్థ నుండి నివేదికల పరిశీలన
 ఉ:    08.00    పౌరసభ- ప్రజల సమస్యలను విని పరిష్కరించటం
 ఉ:    09.30    భోజనం, విశ్రాంతి
 ఉ:    11.00    ఆయా శాఖల జమా ఖర్చులు, కార్యాచరణ
 ఉ:    12.30    మంత్రివర్గం, గూఢచారుల సమాచారంపై చర్చ
 ఉ:    02.00    విశ్రాంతి
 ఉ:    03.30    చతురంగ బలాల పర్యవేక్షణ
 సా:    05.00    సైన్యాధ్యక్షులతో చర్చ, వ్యాయామం
 సా:    06.30    సూర్యాస్తమయం, గూఢచారులతో సమాలోచన
 రా:    08.00    స్నానం, భోజనం, వ్యాహ్యాళి
 రా:    09.30    నిద్ర (నాలుగున్నర నుండి ఐదు గంటలు)
 రా:    02.00    మెలకువ, రాజ్య వ్యవహారాలపై ఆలోచన
 రా:    03.00    మంత్రివర్గంతో చర్చ. కార్యాచరణ నిర్ణయం
 ఉ:    04.30    పురోహితుడు, జ్యోతిష్యుడు, వైద్యులు, పూజ
 ‘యథా రాజా తథా ప్రజ’ అనే నానుడి అనుసరించి రాజుల దినచర్యను బట్టి రాజోద్యోగుల, ఇతర పౌరుల దినచర్యలను అంచనా వేయవచ్చు.
 
 
 చరిత్రలో మొట్టమొదటి ఆంధ్రరాజు

 ఆవశ్యకసూత్రం అనే గ్రంధంలో జైనుల ఆఖరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు మోషలిరేవు (గుంటూరు జిల్లాలోని మోటుపల్లి)
 సందర్శించాడని చెబుతుంది. అంటే క్రీ.పూ. 6వ శతాబ్ది అంతానికే ఆంధ్రదేశానికి జైన మతంతో అనుబంధం ఏర్పడిందని అనుకోవాలి. ఇందులో నిజమెంతో తెలియదు.
 

అయితే ఆంధ్రదేశంలో బౌద్ధంకన్నా జైనమతం ముందు ప్రవేశించిందని ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం. ధనుదపురి, అంటే నేటి గుంటూరు జిల్లాలోని చందోలును స్థాపించిన ధనదుడనే సద వంశపు రాజు జైనమతావలంబి అనీ అతడి ద్వారా జైనమతం దక్షిణదేశానికి వచ్చిందనీ అంటారు. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు గాథ మరో ఆధారం. భట్టిప్రొలు స్తూపంలో దొరికిన అవశేషాలపై మౌర్యుల కాలపు లిపిలో కుబీరకుడనే రాజు ప్రస్తావన ఉంది. కుబీరకుడన్నా, ధనుదుడన్నా కుబేరుడి పేర్లే. ఈ రెండు పేర్లూ ఒకరివేనని కొందరభిప్రాయం. తరువాతి కాలంలో సదవంశీయుల శాసనాలు వేల్పూరు, గుంటుపల్లి మొదలైన చోట్ల కనిిపిస్తాయి. సిరిసద, శివమక వంటి పేర్లు వారికి శాతవాహనులతోటి సంబంధాన్ని తె లియజేస్తాయి. ఈ ‘సదవాణ్డే’ సంస్కృతీకరించబడి ‘శాతవాహనుడ’యి ఉండవచ్చు. మొదటి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు కూడా  జైనుడని ఐతిహ్యం.
 

ఇక జైన వాజ్ఞ్మయంలో ఆ మతం దక్షిణదేశానికి విస్తరించడానికి, చంద్రగుప్త మౌర్యునికి విడదీయరాని సంబంధం ఉంది. పరిశిష్ఠపర్వం అనే జైన గ్రంధంలో చంద్రగుప్తుడు తన సామ్యాజ్యాన్ని  కుమారునికి అప్పగించి వానప్రస్థం స్వీకరించి భద్రబాహు కేవలి వెంట కర్నాటకలోని శ్రావణ  బెళగొళకి వెళ్ళి అక్కడే సన్యాసిైయెు సల్లేఖన దీక్షతో శరీరాన్ని కృశింపజేసుకొని మరణించాడనే కథ ఉంది. కథలో ఈ ప్రవాసానికీ ఉత్తరాపథంలో వచ్చిన పన్నేండేళ్ళ కరువుకి సంబంధం ఉంది. శ్రీశైలం వద్ద పాతాళగంగ రేవుకి చంద్రగుప్త పట్టణం అనే పేరు కూడా ఉంది. చరిత్రలో నందరాజు తరువాత దక్షిణదేశంపై మగధరాజులు దండెత్తిన ఆధారాలు లేవు.

అశోకుని దండయాత్ర కూడా కళింగానికే పరిమితయింది. అశోకుని పూర్వమే ఆంధ్రదేశం మగధ సార్వభౌమాధికారం కింద కి వచ్చింది. మలి శాతవాహనుల, ఇక్ష్వాకుల యుగంలో బౌద్ధం విజృంభించి, ఆంధ్రదేశంలో జైనమతం దాదాపు తుడిచిపెట్టుకు పోయింద ని చరిత్రకారుల నిర్ణయం. అయితే తమిళ సంగం వాజ్ఞ్మయంలోని ‘ఆహననూరు’ అనే గ్రంధంలో వడగార్ అంటే ఆంధ్రులు ముందు నడవగా మౌర్య సేనలు మోకూరులో తిరుగుబాటు అణిచివేసాయనే ప్రసక్తి ఉంది. ఇప్పుడు దొరికే ఆధారాలను బట్టి ఈ మోకూరు ఎక్కడా ఉందో నిర్ధారించడం కష్టమే. కానీ అది వేంగడం అంటే తిరుమల కొండలకి ఉత్తరంగా నల్లమల అటవీప్రాంతంలో ఉండవచ్చని మాత్రం ఊహించవచ్చు. ఈ తిరుగుబాటు కూడ అశోకుని ముందే (క్రీ.పూ. 300 ప్రాంతంలో) జరిగి ఉండాలి. ఎందుకంటే అశోకుని చివరి
 రోజులలో (క్రీ.పూ. 230) ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యానికి అంకురార్పణ జరిగింది.
 
 పదం నుంచి పథంలోకి 3: సాయి పాపినేని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement