సొంత ఆఫీసు లేని ఐఎంజీకి 850 ఎకరాలు
ఎకరా 2 కోట్లు చేసే భూమి... 50 వేలకే
కేబినెట్‌కు తెలియకుండా కేటాయింపులు
విలువైన పచ్చల హారాన్ని, అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్‌లను ధరించిన నారా వారి కోడలు బ్రహ్మణి చిత్రాలివి. బ్రహ్మణి దగ్గరున్న మొత్తం నగలకు బాబు కట్టిన విలువ 9.9 లక్షలు. కానీ ఈ ఫోటోలు చూసిన వారు కనీసం ఆరు కోట్లకు తక్కువ ఉండవంటున్నారు. మరి బాబు ఎన్ని రెట్లు తక్కువ చేసినట్లు?
ఒక బినామీని పెట్టుకుని... ఆ బినామీ చేత కంపెనీ పెట్టించి... దానికి ఆఘమేఘాల మీద 850 ఎకరాలు కేటాయించేసి... ముందు చూపుతో భవిష్యత్తు హక్కుల్ని కూడా ఆ సంస్థకు రాసిచ్చేయటం బహుశా... బాబుకే సాధ్యం. 2003 ఆగస్టు 5న హైదరాబాద్‌లో ‘ఐఎంజీ భారత’ కంపెనీ రిజిస్టరయింది. దాని అధిపతులు అహోబలరావు అలియాస్ బిల్లీరావు, ప్రభాకరరావు అలియాస్ పేట్‌రావు. వీరిద్దరూ నాటి సీఎం బాబుకు బాగా సన్నిహితులు. వాళ్లకు అప్పటికే కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని అమలుచేసే ప్రాజెక్టునూ అప్పగించారు బాబు. కనీసం ఆఫీసు కూడా లేని ఐఎంజీ... రూ.5 లక్షల మూలధనంతో పేపర్‌పై మొదలైంది. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్వరూపాన్ని మార్చేస్తామనే ప్రతిపాదనతో ముందుకొచ్చింది. అంతే! ఫైళ్లు వేగంగా కదిలాయి. నాలుగు రోజులు తిరక్కుండా బాబు ఎంఓయూ చేసుకున్నారు. హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని ఇచ్చేయటానికి సరేనన్నారు. ఈలోపే బాబు మిత్రపక్షమైన ‘ఈనాడు’ పత్రిక శివాలెత్తేసింది. ఐఎంజీకి భూములిస్తే రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ విజేతలు తథ్యమంటూ కథనాలు వండేసింది. ఐఎంజీని ఆకాశానికెత్తేసింది. ఇంతలో చిక్కొచ్చి పడింది.
తమ పేరు బిల్లీ దుర్వినియోగం చేస్తున్నారని, ఆయనతో తమకెలాంటి సంబంధం లేదంటూ ఫ్లోరిడాలోని అసలు ఐఎంజీ లేఖ రాసింది. బాబు లెక్కచేయలేదు. ఎందుకంటే బిల్లీ తన జేబులో మనిషాయె. 2003 సెప్టెంబర్ 1న... ఐఎంజీకి హైదరాబాద్‌లోని స్టేడియాలనూ అప్పగించాలని నిర్ణయించారు. ఐఎంజీకి భూమి అప్పగించాలంటూ... 2004 జనవర్లో నాటి రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. ఫిబ్రవరి 10న భూమి రిజిస్ట్రేషన్ పూర్తయింది. 24 గంటలు తిరక్కుండా బాబు టెంకాయ కొట్టేశారు. భూమి ఒక్కటే కాదు. అప్పటికే హైదరాబాద్‌లో కట్టిన 8 మైదానాలను 45 ఏళ్ల పాటు ఐంఎజీకి లీజుకిచ్చేందుకు బాబు ఓకే చేశారు. లీజు గడువు ముగిశాక... ఐఎంజీ తనకు నచ్చిన రేటుకు, నచ్చిన స్టేడియాన్ని సొంతం చేసుకునే అవకాశంమూ ఉదారంగా కల్పించారు. అంతటితో ఆగలేదు లెండి! ఆ స్టేడియాలకయ్యే నిర్వహణ ఖర్చును ఐదేళ్లపాటు ప్రభుత్వమే భరిస్తుందని, ఏడాదికి రూ.2.5 కోట్ల చొప్పున చెల్లిస్తామని జీవో ఇచ్చేశారు. ఇదంతా చూస్తే బాబుకు బిల్లీ ఎంత పెద్ద బినామీయో తెలియటంలేదూ!!
ఎమ్మార్ చక్రం... తిప్పింది బాబే
2000లో బాబు దేశంలో ఎక్కడా లేనట్లుగా... ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను రాష్ట్రంలో కట్టాలనుకున్నారు. 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్... చుట్టూ శ్రీమంతులకు విల్లాలు.. ఫైవ్‌స్టార్, బిజినెస్ హోటళ్లు.. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్.. ఇదీ ఆ టౌన్‌షిప్ స్వరూపం. ఆసక్తి, అనుభవం ఉన్న సంస్థలు ముందుకు రావచ్చంటూ 2001 జూలై 6న ప్రకటన ఇప్పించారు. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్, మలేసియాకు చెందిన ఐఓఐ ప్రాజెక్ట్స్, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ఆసక్తి వ్యక్తంచేశాయి. వీటిలో సోమ్ ఏసియాను, షాపూర్జీ పల్లోంజీను బాబు ప్రభుత్వం పక్కనపెట్టేసింది.
మిగిలిన మూడింటినే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌కు (ఆర్‌ఎఫ్‌పీ) షార్ట్‌లిస్ట్ చేసింది. చిత్రమేమిటంటే టెండర్లకు ఆఖరుతేదీ అయిన 2001 డిసెంబరు 15 నాటికి ఐఓఐ, ఎల్ అండ్ టీ వెనక్కెళ్లిపోయాయి. ఇక బరిలో మిగిలింది ఎమ్మార్ ఒక్కటే. సహజంగా పోటీదారు లేకుండా ఒకే సంస్థ బరిలో ఉంటే టెండర్లు రద్దు చేస్తారు. కానీ బాబు అలా చేయలేదు. ఎమ్మార్ సంస్థకే కట్టబెట్టేశారు. ఎమ్మార్ కోసం బిడ్లు ఉపసంహరించుకున్న రెండింట్లో ఐఓఐ ఇండియా సంస్థ బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేష్‌ది. ఈ సంస్థకు తరువాతి కాలంలో బాబు హైటెక్ సిటీ రెండో దశను, ఏపీ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ పేరిట బంజారాహిల్స్‌లో విలువైన రెండున్నర ఎకరాలను కట్టబెట్టారు. ఎల్ అండ్ టీతో బాబు దోస్తీ రాష్ట్రం యావత్తూ తెలిసిందే. హైటెక్ సిటీని, కాకినాడ పోర్టును ఇంకెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని కట్టబెట్టినందుకు అది తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను ఉచితంగా నిర్మించిందనే ఆరోపణలూ వచ్చాయి.
కోనేరు ప్రసాద్‌తో అప్పటికే లింకులు
ఎమ్మార్‌లో కీలక సూత్రధారి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు అప్పటికే బాబుతో సన్నిహిత సంబంధాలుండేవి. 2000వ సంవత్సరంలోనే దుబాయ్ అల్యూమినియం కంపెనీని(దుబాల్) రాష్ట్రానికి తెచ్చారు. విశాఖలో బాక్సైట్ గనుల్ని ఆ సంస్థకు కట్టబెట్టబోయారు బాబు. రస్ అల్ ఖైమాకు చెందిన రాక్ సిరామిక్స్‌ను రాష్ట్రానికి పరిచయం చేసిందీ కోనేరే. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఎమ్మార్‌కు కేటాయించిన స్థలానికి సమీపంలో చంద్రబాబుకు మూడెకరాల స్థలం ఉండేది. తల్లి అమ్మణ్ణమ్మ, భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్ పేరిట ఉన్న ఈ స్థలాన్ని 2000లోనే... అంటే ఎమ్మార్‌కు కేటాయించటానికి మూడేళ్ల ముందే బాబు ఏకంగా ఎకరం కోటి రూపాయల చొప్పున అమ్మారు. మరి మూడేళ్ల తరవాత ఎకరా రూ.14 లక్షలకే అప్పజెప్పారంటే ఏమనుకోవాలి?
బాబు భూ పందేరాలు..
బాబు హయాం అంతా భూ పందేరాల మయం. పేరు కూడా తెలియని కంపెనీలను తీసుకొచ్చి... హైదరాబాద్ నడిబొడ్డున పప్పు బెల్లాలకు వందల ఎకరాలు కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబుది. ఐటీ సంస్థల ముసుగులో తన బినామీలకు భూములు కట్టబెట్టిన బాబు... ఐఎంజీ, ఎమ్మార్ వంటి వ్యవహారాల్లో పూర్తిగా బరితెగించేశారు. బినామీ బిల్లీ రావును తీసుకొచ్చి 850 ఎకరాలు రాసిచ్చేశారు. హైటెక్ సిటీ పక్కన ఎకరా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఎమ్మార్‌కు కేవలం 29 లక్షల రూపాయల చొప్పున ధారాదత్తం చేసేశారు. వాటిలో కొన్నింటి వివరాలు చూస్తే...
హెరిటేజ్ సంగతేంటి బాబూ?
హెరిటేజ్ ఫుడ్స్‌లో బాబు కుటుంబానికున్న వాటా 50 శాతం. దానివిలువను ఆయన దాదాపు 28 కోట్లుగా చూపించారు. కానీ దాని మార్కెట్ విలువ 500 కోట్లు. అంటే బాబు వాటా రూ.250 కోట్లు. ఇది కూడా ఎన్నో రెట్లు తక్కువ చూపించినట్లేగా?
హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబునాయుడి ఆరంభ పెట్టుబడి 2 లక్షలు. ఇపుడు బాబు ఆ కంపెనీలో బాబు కుటుంబానికి అధికారికంగా 50 శాతం వాటా ఉంది. దాని విలువ రూ.250 కోట్లు. ఈ సంస్థ కోసం మంత్రిగా, ముఖ్యమంత్రిగా తనకు తానే రాయితీలు ఇచ్చుకుంటూ... జీవోలు విడుదల చేస్తూ... ప్రభుత్వ డెయిరీలను సమాధి చేస్తూ బాబు సాగించిన అరాచకం... నభూతో-నభవిష్యతి.
1992లో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పాలపొడి తయారీ కంపెనీగా శ్రీకారం చుట్టింది హెరిటేజ్ ఫుడ్స్. బాబు రెవెన్యూ మంత్రి కావటంతో దీని దశ తిరిగింది. 1994లో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. 1996 నాటికల్లా పాల ప్రాసెసింగ్‌తో పాటు వెన్న, పెరుగు, మజ్జిగ, నెయ్యి, పాల కోవా, సుగంధపాలు, ఐస్‌క్రీమ్ తయారీ మొదలెట్టింది. బాబు ముఖ్యమంత్రి అయ్యాక హెరిటేజ్‌కు రాయితీల వరద ఆరంభమయింది. బాబు వాటా విలువా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.
డిఫర్‌మెంట్ వల్లే రూ.100 కోట్లపైగా లాభం
హెరిటేజ్ సంస్థకు ట్యాక్స్ డిఫర్‌మెంట్ ద్వారా దక్కింది రూ.15 కోట్లు. దాన్ని తొలి రెండేళ్లలోనే వసూలు చేసుకున్నారు బాబు. ఆ 15 కోట్లను వ్యాపార విస్తరణకు వెచ్చిస్తే ఆ మొత్తం ఎంతవుతుంది? ఊహించలేం!. అలా కాకుండా బ్యాంకులో డిపాజిట్ చేసినా... అప్పట్లో ఉన్న 18 శాతం వార్షిక వడ్డీతో 14 ఏళ్లకు ఇది రూ.152 కోట్లవుతుంది. నెలకు రూపాయి వడ్డీ చొప్పున వేసినా 14 ఏళ్ల తరవాత దాని విలువ రూ.73 కోట్లు. అంతేకాదు. దీన్ని వెంటనే చెల్లించకుండా మరో 14 ఏళ్ల పాటు వాయిదాల్లో చెల్లిస్తారు కనక మొత్తం వడ్డీ రూ.200 కోట్లకు పైమాటే. హెరిటేజా... మజాకా!!
ముఖ్యమంత్రిగా బాబు 1994లో బాధ్యతలు చేపట్టాక 1999లో తొలిసారిగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. భారీ ఎత్తున రియల్ ఎస్టేల్ ఆస్తుల్ని చూపిస్తూ.. వాటి విలువను మాత్రం అతి తక్కువగా కట్టారు. అయినా సరే అప్పటికి మొత్తం కుటుంబ ఆస్తులు రూ.7.79 కోట్ల వరకూ ఉన్నట్లు విలువ కట్టారు. 1986 నుంచి చూసుకుంటే ఒక్కసారిగా ఇన్ని కోట్లకు ఆస్తులెలా చేరాయన్నది ఆయనకు మాత్రమే తెలిసిన రహస్యం.
కర్షక పరిషత్ చైర్మన్‌గా చంద్రబాబు నియామకం చెల్లదంటూ పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై 1988లో బాబు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ఇది. సంప్రదాయ రైతు కుటుంబం నుంచి తాను వచ్చానని, కుటుంబానికి 1986 నాటికి 77 ఎకరాలుండగా అప్పుడు విడిపోయామని, తాను స్వయంగా కూలీల్ని పెట్టి వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.36,000 సంపాదిస్తున్నానని బాబు స్వయంగా పేర్కొన్నారు.