ఎంపికలో పొరబడుతున్నామా? | Are you missing in the selection? | Sakshi
Sakshi News home page

ఎంపికలో పొరబడుతున్నామా?

Published Thu, Jun 22 2017 1:34 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

ఎంపికలో పొరబడుతున్నామా? - Sakshi

ఎంపికలో పొరబడుతున్నామా?

►సందర్భం
భారత్‌  చైనా సరిహద్దులలో గత 40 ఏళ్లుగా ఒక్క బుల్లెట్‌ కూడా పేలలేదని మన ప్రధాని మోదీయే తన రష్యా పర్యటనలో అన్నారు. ఏ విధంగా చూసినా మనకు అమెరికాతో సాన్నిహిత్యం కంటే చైనాతో దగ్గరితనమే మేలు చేస్తుంది!

గత 30 ఏళ్లుగా, ముఖ్యంగా సోవియట్‌ పతనం, దేశీయంగా నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు ఆరంభం తరువాత మన దేశానికి అమెరికాతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్థిక లావాదేవీలు పెరగడం, భారత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు అమెరికాలో ఉపాధి అవకాశాల వంటివి, ఇరుదేశాలను ఆర్థికంగానూ రాజకీయంగానూ కూడా సన్నిహితం చేశాయి. ఈ క్రమంలోనే అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య దిశగా పాలకులు దేశాన్ని నడిపించారు.

కాగా ఈ క్రమంలో మనకు చైనాతో గతంలోనే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు రాజకీయ పరంగా మరింత దిగజారాయి. దలైలామా అంశం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం తదితర అంశాలు  మన ఇరు దేశాల మధ్యన అగ్గి రగుల్చుతూనే ఉన్నాయి. పైగా పాకిస్తాన్‌తో బలపడుతోన్న చైనా సంబంధాలు మనలను మరింత కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా తలపెట్టిన వన్‌ రోడ్‌ వన్‌బెల్ట్‌ (ఆధునిక సిల్క్‌ రూట్‌)లో కూడా మనం పాలుపంచుకోవడంలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిం చతలపెట్టిన రహదారి; పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోంచి నిర్మిం చనుండడం, భారత్‌ సందేహాలకూ, ఆందోళనకూ ప్రధాన కారణం. కాగా, నేడు ఆసియా, యూరప్‌లోని పలు దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతున్నాయి. మన దేశం చుట్టూరా ఉన్న అనేకానేక చిన్న దేశాలు కూడా చైనాతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాయి. దరిదాపు అవన్నీ ఈ ప్రాజెక్టులో భాగస్వాములే. ఈ క్రమంలోనే భూటాన్‌ వంటి ఒకటీ అర దేశాలు మినహా, మనతో సరిహద్దును పంచుకుంటోన్న అన్ని దేశాలు చైనాకు సన్నిహితంగా జరుగుతున్నాయి. ఇక అమెరికాకు ఈ ప్రాజెక్టు ఇచ్చగించకున్నా, సుదీర్ఘకాలంగా అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉన్న యూరోపియన్‌ దేశాలు కూడా, నేడు మెల్లమెల్లగా అమెరికా విధానాలకు దూరంగా జరుగుతూ చైనాతో ప్రస్తుత ప్రాజెక్టులో కూడా భాగస్వాములవుతున్నాయి.


మరోవైపు స్వాతంత్య్రానంతర చరిత్రలో అలీనోద్యమ సారథిగానూ, సోషలిస్ట్‌ సోవియట్‌కు సన్నిహితంగా ఉన్న మనం, నేడు మిగతా ప్రపంచం తీరుకు భిన్నంగా అమెరికాకు అత్యంత సన్నిహితంగా వెళుతున్నాం. అయితే సహజాతంగానే తన సొంత ప్రయోజనాలకు తప్ప మరి దేనికీ విలువనివ్వని చరిత్ర అమెరికాది. ఇటువంటి ఆలోచనా విధానానికి ఆ దేశం పెట్టుకున్న పేరు ‘‘ఆచరణాత్మకత’’ (ప్రాగ్మాటిజమ్‌). ఈ అవకాశవాద ధోరణి మన విషయంలో కూడా ఇప్పటికే బయటపడుతోంది. హెచ్‌1బీ వీసాలపై నియంత్రణలు, జాతి వివక్ష ధోరణులూ, నిన్నగాక మెున్న పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగుతూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతదేశం ఎటువంటి జవాబుదారీతనం లేకుండానే ఈ ఒప్పందం క్రింద బిలియన్ల డాలర్లను అప్పనంగా తమనుంచి పొందుతోం దంటూ ఆక్షేపించడం వంటి వాటిని గమనించాలి. ఇక, నేడు అమెరికా వాణిజ్య లోటులో 43.9% చైనాతోనే ఉంది.

అలాగే పెద్ద ఎత్తున తన ఆర్థిక మనుగడ కోసం చైనాపై ఆధారపడుతోంది. కాగా, అధికారంలోకి రాకముందు, చైనా మెడలు వంచి ఈ వాణిజ్య లోటు సమస్యను పరిష్కరిస్తానన్న ట్రంప్, నేడు తోకముడిచాడు. చైనాతో సాన్నిహిత్యం చెడకుండా జాగ్రత్త పడుతున్నాడు. కానీ మరో ప్రక్కన అమెరికాతో భారత్‌తో ఉన్న వాణిజ్య లోటు, దాని మెుత్తం వాణిజ్య లోటులో కేవలం 2.5%గా మాత్రమే ఉంది. అయితే, భారత ప్రధాని మోదీ త్వరలో జరపనున్న అమెరికా పర్యటన సందర్భంగా ఈ కాస్తంత వాణిజ్య లోటును కూడా తగ్గించుకోమనీ, దానికోసం భారత మార్కెట్‌ను మరింతగా అమెరికా సరుకులకు తెరవమనీ ట్రంప్‌ ఒత్తిడి చేయనున్నాడు.


అంటే, మెత్తగా ఉంటే మెుత్తబుద్ధి అయినట్లు, తనకు వ్యాపారిగా అలవాటైన ధోరణితోనే అమెరికాతో సన్నిహితం అవుతోన్న భారత్‌తో మాత్రం ‘‘మా ఇంటికొస్తూ ఏమి తెస్తావు? మీ ఇంటికొస్తే ఏమిస్తావు?’’ తీరులోనే వ్యవహరిస్తున్నాడు. ఒక పక్కన ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడం కోసమూ, భారత్‌ వంటి విశాలమైన మార్కెట్‌ను తన సరుకులూ, ఆయుధాల ఎగుమతులకు కలిగివుండడం వంటి అంశాలలో భారత ప్రభుత్వపు సహకారాన్ని కోరుకుంటూనే, మరో పక్కన భారతదేశానికి నష్టం కలిగించే భారత్‌ ఎగుమతులకు టారిఫ్‌ అవరోధాలూ, వీసా నిబంధనలూ, పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగుతూ చేసిన వ్యాఖ్యానాలు అమెరికా తీరుకు అద్దం పడుతున్నాయి.
మెుత్తంగా నేడు అమెరికాతో సాన్నిహిత్యం మనకు మేలు చేయకపోగా హానే చేస్తోంది. నిజానికి మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్‌ వంటి వారు కూడా ఈ విషయంలో చేసిన సూచనలు, హెచ్చరికలు ఇక్కడ గమనార్హం. పైగా అమెరికా నేడు పేరుకే సూపర్‌ పవర్‌. నిజానికి అది ఆ స్థానాన్ని కోల్పోయింది.

అనేక యూరోపియన్‌ దేశాలు కూడా నేడు ఆర్థిక కారణాలతోనో లేకుంటే అమెరికా ధోరణితో విసిగి వేసారో చైనా వైపు చూస్తున్నాయి. అంటే నేడు ఇంకా అది అధికారికంగా ‘‘అగ్రరాజ్య’’ గుర్తింపును పొందకున్నా, వాస్తవంలో చైనా ఆ దిశగానే సాగుతోంది. ఈ సందర్భంలోనే తన రష్యా పర్యటనలో భార™Œ  చైనా సరిహద్దులలో గత 40 ఏళ్లుగా ఒక్క బుల్లెట్‌ కూడా పేలలేదని స్వయానా మన ప్రధాని మోదీయే అనడం ముదావహం. కాబట్టి ‘నకిలీ మిత్రుడి కంటే నిజమైన శత్రువే మేలు’ అన్న విధంగా నేడు ఏ విధంగా చూసినా మనకు అమెరికాతో సాన్నిహిత్యం కంటే చైనాతో దగ్గరితనమే మేలు చేస్తుంది.


- డి.పాపారావు
వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు
ఫోన్‌ నెం. 98661 79615

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement