Papa Rao
-
సినిమాలపై ఆసక్తి.. ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసిన తెలుగోడు
ఐఏఎస్.. ఐపీఎస్ కావాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ లక్షల మందిలో అతికొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఎంతో కష్టపడి ఐఏఎస్ ఉద్యోగం కొట్టాడు. తనకు పోస్టింగ్ వేసిన చోట సమర్థవంతంగా పని చేసి శెభాష్ అనిపించుకున్నాడు. కానీ కొన్నేళ్లకు తానే స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. ఇంతకీ ఆయన మరెవరో కాదు, పాపారావు బియ్యాల. ఈ తెలుగోడి పేరు మీరు వినే ఉంటారు. ఆయన గురించే నేటి ప్రత్యేక కథనం.. మధ్యలోనే ఆగిపోయిన పీహెచ్డీ పాపారావు బియ్యాల.. వరంగల్‌లో 1954వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తండ్రి కిషన్ రావు స్వాతంత్య్ర సమరయోధుడు, తల్లి అనసూయా దేవి గృహిణి. వరంగల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన పాపారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పట్టా అందుకున్నాడు. పీహెచ్డీ కోసం న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ అంతలోనే ఐఏఎస్ పరీక్ష రాయడం, అందులో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పీహెచ్డీ మధ్యలోనే ఆపేశాడు. 1982లో ఐఏఎస్ సాధించిన ఇతడు కీలక హోదాల్లో విధులు నిర్వహించాడు. సేవల్లోనూ మేటి అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా, తర్వాత ఆ రాష్ట్ర హోం సెక్రటరీగా సేవలందించాడు. జోర్హాట్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు తీవ్రవాదులకు వ్యతిరేకంగా జిల్లాస్థాయిలో పోలీసు, సైనిక బలగాలను సమన్వయం చేశాడు. 1992లో నదీకోత వల్ల ఇళ్లు కొట్టుకుపోయిన దాదాపు 500 కుటుంబాలకు కొత్త గ్రామాన్ని సృష్టించేందుకు సాయపడ్డాడు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఐదేళ్లపాటు పనిచేశాడు. డ్రగ్స్ రహిత క్రీడలను ప్రోత్సహించడం కోసం 'క్లీన్ స్పోర్ట్స్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థనూ ఏర్పాటు చేశాడు. ఉన్నట్లుండి 2005లో ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాడు. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు ఆ తర్వాత 2014-19వరకు తెలంగాణ ప్రభుత్వానికి పాలసీ అడ్వైజర్‌గా కొనసాగాడు. అయితే ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే 1996లో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో 3 నెలల కోర్సు చేశాడు. 1998లో 'విల్లింగ్ టు సాక్రిఫైస్' అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం తీశాడు. ఈ మూవీ 2000వ సంవత్సరంలో ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ సంతోషంతో వెంటనే సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మ్యూజిక్ స్కూల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. శ్రియ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మే 12న విడుదలవగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మరి నెక్స్ట్ ఆయన ఎటువంటి సినిమాతో ముందుకు వస్తాడో చూడాలి! చదవండి: పార్టీలో స్టెప్పులేసిన చిరంజీవి.. 68 ఏళ్ల వయసులో ఆ స్వాగ్ ఏంటి బాసూ.. -
కేంద్ర బడ్జెట్: పంపకంలో ప్రజలకు వాటా దక్కేనా?
నేడు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. దేశంలో నెలకొని ఉన్న దశాబ్దాల రికార్డు స్థాయి నిరుద్యోగం, పెరిగిపోతోన్న కటిక పేదల సంఖ్య, నింగినంటుతోన్న ధరలు, పడిపోతోన్న దేశీయ ఆర్థిక వృద్ధిరేటు వంటి సమస్యల వలన నేడు ప్రజల దృష్టి, ఈ సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ ఏమైనా చేయగలదా అనే దానిపై కేంద్రీకరించి ఉంది. ఏ బడ్జెట్ అయినా ఒక్కసారిగా, ఆ ఒక్క ఆర్థిక సంవత్సర కాలంలోనే సమస్యలన్నింటినీ పరిష్కరించేయలేదు. కానీ, అందుబాటులో ఉన్న వనరుల మేరకు ఆ దిశగా సాధ్యమైనంత మేరకు ప్రయత్నం చేయటం వీలయ్యేదే! ఆ పని తాజా బడ్జెట్ చేస్తుందా? ఒక దేశం తాలూకూ బడ్జెట్‌ను, ఆ దేశంలోని సంపదను సృష్టించే ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం తదితర సామాన్య జనానికి మేలు చేసే విధంగానూ రూపొందించొచ్చు; ధనవంతులు, కార్పొరేట్లు లేదా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ మదుపుదారుల ప్రయోజనాల కోసమూ రూపొందించవచ్చు. మన దేశీయ బడ్జెట్లు ఇప్పటివరకూ ఏ తరహాలో రూపొందాయి? దీనికి జవాబు సరళం. గతంలో మన బడ్జెట్లు, ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్న సంపదలో అత్యధిక వాటా దానిని సృష్టించిన ప్రజలకు పంపిణీ చేసి ఉంటే, నేడు మన దేశంలో ‘కె’ (ఆంగ్లాక్షరం కె ఆకృతిలో; ధనవంతులు పైకి, పేదలు కిందికి) తరహా తీవ్ర ఆర్థిక అసమానతల పరిస్థితి ఉండేది కాదు. ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నా మన దేశం పై స్థానంలో ఉండడం గమనార్హం. ఆర్థిక సంస్కరణల క్రమంలో సంపద సృష్టి జరిగింది. కానీ, ఆ సంపద సృష్టికర్తలకు చేతిలో మొబైల్ ఫోన్ మినహా దక్కిందేమీ లేదు. ఈ సంస్కరణలు తెచ్చిన ప్రైవేటీకరణ విధానాలు కనీస అవసరాలైన విద్య, వైద్యాలను ఖరీదైనవిగా మార్చేశాయి. మొత్తంగా బడ్జెట్ల క్రమంలో లబ్ధి పొందింది – ఒక వైపున అంతర్జాతీయ (కొంతమేరకు దేశీయ) ఫైనాన్స్ పెట్టుబడిదారులు, మరోవైపున కార్పొరేట్ సంస్థలు మాత్రమే. ఈ రెండు తరహాల వారికీ మేలు చేసేందుకే – ప్రతీ బడ్జెట్లోనూ ద్రవ్యలోటును తగ్గించటం... అలాగే కార్పొరేట్లకు అనేకానేక రాయితీల వంటివి నిండుగా ఉంటాయి. ద్రవ్యలోటును ఆర్థిక వ్యవహారాలకు కేంద్ర బిందువుగా చేయటం ఎందుకోసం? సుమారుగా నాలుగు దశాబ్దాల క్రితం, అంటే 1980ల ముందర – ఈ ద్రవ్యలోటు అంశానికి అటు బడ్జెట్లలోనూ, ఇటు ఆర్థిక వ్యవహారాలలోనూ ప్రాధాన్యత లేదు. నాడు ప్రపంచంలోని మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలోనూ – ‘కీన్స్’ సిద్ధాంతాల ప్రాతిపదికన నడిచిన సంక్షేమ రాజ్యానిదే పెద్దపేట. నాడు ప్రభుత్వాల ప్రధాన బాధ్యత– దేశంలోని ప్రజల బాగోగులు కోరి... అలాగే కార్పొ రేట్ల మనుగడకు కూడా అనుకూలమైన విధంగా – జన సామాన్యం తాలూకూ కొనుగోలు శక్తిని... అంటే మార్కెట్లో సరుకులు, సేవలకు డిమాండును కాపాడటం. ఈ పరిస్థితి 1980ల అనంతరం మారి పోయింది. సరుకులు, సేవలను ఉత్పత్తి చేసి లాభాలను పొందే కార్పొరేట్ సంస్థల ప్రాధాన్యత తగ్గి... గతంలో ఈ కార్పొరేట్ సంస్థల స్థాపనకూ, లేదా వాటి కార్యకలాపాల నిర్వహణకూ పెట్టుబడులను సరఫరా చేసే ఫైనాన్స్ పెట్టుబడులది పై చేయి అయ్యింది. అప్పటి వరకూ పారిశ్రామిక వ్యవస్థకు కేవలం వెన్నుదన్నుగా మాత్రమే ఉన్న ఫైనాన్స్ పెట్టుబడులు పూర్తిస్థాయిలో స్వతంత్రంగానూ... మరో మాటలో చెప్పాలంటే, ఉత్పాదక, పారిశ్రామిక పెట్టుబడుల కంటే శక్తి మంతంగానూ తయారయ్యాయి. ఈ క్రమంలోనే – షేర్ మార్కెట్లు, ఫైనాన్స్ వ్యాపారాలు (ప్రస్తుతం ‘వెంచర్ క్యాపిటల్’ అని పిలిచే వాటితో సహా), రియల్ ఎస్టేట్ వంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులది పై చేయి అయ్యింది. ఈ తరహా పెట్టుబడుల అవసరాల కోసంముందుకు వచ్చిందే ‘ద్రవ్యలోటు’ ఉండరాదు అనే సూత్రీకరణ. దీనిలో భాగంగానే ప్రపంచంలోని దరిదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులకు ద్రవ్యోల్బణాన్ని ఒక నిర్దిష్ట స్థాయిలో అదుపులో ఉంచటం గురుతర బాధ్యత అయింది. ద్రవ్యలోటు అధికంగా ఉండటమంటే, ప్రభుత్వం తాలూకూ ఖర్చులు దాని ఆదాయం కంటే అధికంగా ఉండటం అని. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే ఆ అదనపు ఖర్చుకు అవసరమైన డబ్బును ప్రభుత్వం ముద్రించవలసి రావచ్చు లేదా అప్పుగా తెచ్చుకోవాల్సి రావచ్చు. దీని వలన వాస్తవ ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణీ పెరిగి– ద్రవ్యోల్బణం పెరుగుతుందనేది లెక్క. ద్రవ్యో ల్బణం పెరగటమంటే... అనివార్యంగా ఆ దేశం తాలూకూ కరెన్సీ విలువ తగ్గుదలే. ఈ కరెన్సీ విలువ తగ్గుదల ఆ దేశీయ షేర్ మార్కెట్లలో లేదా ఇతరత్రా స్పెక్యులేటివ్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినవారి లాభాల తాలూకు నికర విలువ తగ్గుదలకు దారితీస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్స్ పెట్టుబడిదారులు – మన కరెన్సీ విలువ తగ్గ రాదని కోరుకుంటారు. ఇది వారి లాభాలను కాపాడుకోవటం కోసం. దీని కోసం వారు మన ప్రభుత్వం ప్రజల అవసరార్థం వ్యయాలను పెంచుకోవడాన్ని అంగీకరించలేరు. కాబట్టి ఈ ద్రవ్యలోటు సిద్ధాంతకర్తలు – వివిధ దేశాల ప్రభుత్వాలు పొదుపు చర్యలను పాటించాలనీ, సాధ్యమైనంతగా ప్రజలకు లభించే సంక్షేమ పథకాలపై కోతలు పెట్టాలనీ కోరుకుంటారు. ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తర్వాత మన పాలకులు కూడా ఈ ద్రవ్యలోటును లక్ష్మణరేఖగా ఆమోదించుకొని, దానికి లోబడే తమ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగం, పేదరికం పెరగటం వంటి ఎన్ని సమస్యలు ఉన్నా మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పనా కార్యక్రమాలపై పెట్టే ఖర్చులను ఇంకా తగ్గిస్తూనే పోతోంది. దీనిలో భాగంగానే నేడు ఆర్థిక మాంద్యం లేదా మందగమన పరిస్థితులు ఉన్నా – ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని ప్రస్తుతం ఉన్న 6.4 శాతం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం చివరికి 5.9 శాతానికి తగ్గించటంగా చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎరువుల సబ్సి డీలపై వేటు, ఆహార సబ్సిడీల కుదింపు వంటివి ఉండనున్నాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సబ్సిడీలకు పాలకులు ఇప్పటికే మంగళ హారతి పాడేశారు. ఇక తరువాతిది కార్పొరేట్ పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వటం. ఇది గత 8 సంవత్సరాల బీజేపీ హయాంలో మరింత నిర్మొహమాటంగా వేగం పుంజుకుంది. 2019లో కార్పొరేట్ ట్యాక్సును భారీగా 10 శాతం మేర తగ్గించేశారు. దీని వలన ప్రభు త్వానికి సాలీనా 1.45 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. అలాగే, కార్మిక సంస్కరణల పేరిట – ఉద్యోగులు, కార్మికులు, గిగ్ వర్కర్ల వంటివారిని పిండి పిప్పిచేసి తమ లాభాలను పెంచుకొనేందుకు కార్పొరేట్లకు మరిన్ని దారులను తెరుస్తున్నారు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ పేరిట – ఉత్పత్తిని తగిన మేరకు పెంచిన కార్పొరేట్లకు రాయితీల పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తున్నారు. ఇంత చేసినా వాస్తవంలో ఈ కార్పొరేట్ల నుంచి – ఇటు కొత్త పెట్టుబడుల రూపంలో గానీ, అటు అదనపు ఉపాధి కల్పన రూపంలో గానీ ఫలితం ఏమీ దక్కడం లేదు. వాస్తవ ఆర్థిక వ్యవస్థలో ప్రజల చేతిలో డబ్బు లేదనీ లేదా వారికి కొనుగోలు శక్తి లేదనే విషయాన్ని విస్మరిస్తూ... బడ్జెట్ తర్వాత బడ్జెట్‌ను మూస తరహాలో వేస్తూనే పోతోంది ప్రభుత్వం. హరిత ఇంధనానికి ప్రోత్సాహం, మౌలిక వనరులకు ఊతం వంటి పేర్లేవి చెప్పినా... అదంతా అంతిమంగా కార్పొరేట్లకు రాయితీలు, కానుకలుగా మాత్రమే ఉండిపోగలదు. స్థూలంగా కాకులను కొట్టి గద్దలకు వేసే సరళిలో సాగుతోన్న ప్రభుత్వ విధానాలు రానున్న ఎన్నికల నేపథ్యంలో కాస్తంత కరుకుదనాన్ని తగ్గించుకున్నా – అవి పెద్దగా మారి ప్రజానుకూలంగా సంపదను పంపిణీ చేసే సాహసానికి దిగలేవు. సంవత్సరానికి ఒక రోజు ముందుకు వచ్చే ఈ బడ్జెట్ రోజునైనా లేకుంటే మిగతా 364 రోజులైనా జరుగుతోంది ఒకటే... అది జనం మీద భారాలు... కార్పొరేట్లు, ధనవంతులకు నజరానాలు! కాదూ కూడదంటే ఈ దేశంలోని కూలీ జనం కులీనులూ లేదా పన్ను చెల్లింపుదారుల పైసలను ‘ఉచితాలుగా’ దిగమింగేస్తున్నారంటూ ఎదురుదాడులు! ధనికుల, ధనస్వామ్య ఆరాధనలో... వినిమయ సమాజపు వస్తు వ్యామోహంలో పడి వాస్తవాలను చూడలేని దుఃస్థితిలో జన సామాన్యం కొనసాగినంత కాలం ఈ దగాకూ, దాని మనుగడకూ ఢోకా లేదు. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
ద్రవ్యలోటును దాటితేనే సంక్షేమం
నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి చాలా దేశాలు ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగాలంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2022–23 ఆర్థిక సంవత్సరం తాలూకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ఎలా ఉండాలనే దాని గురించి కొన్ని మౌలిక ఆకాంక్షలు దేశ ప్రజలలో అప్ప టికే ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ప్రాధాన్యతాంశాల గురించిన పలు రకాల ఒత్తిడులు ఉన్నాయి. వీటిలో కీలకమైనవి: 1. సంవత్సర కాలం పైబడి సాగిన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్లు. 2. కోవిడ్ రెండో వేవ్ కాలంలో కోల్పోయిన తన ప్రాధాన్యాన్ని తిరిగి ఎంతోకొంత పొంద వలసిన ఆగత్యం ప్రధాని మోదీకి ఉండటం. 3. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక, నిజానికి ఉన్న ఉద్యోగాలే ఊడిపోయిన స్థితి. రికార్డు స్థాయి నిరు ద్యోగానికి ఎంతో కొంత ఆచరణాత్మక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత. 4.కోవిడ్ ముందరి 2018 జనవరి–మార్చి కాలం నుంచే పతనమవుతూ, కోవిడ్ కాలంలో అగాథంలోకి పడిపోయిన స్థూల జాతీయోత్పత్తి గణాంకాన్ని తిరిగి నిలబెట్టగలగడం. 5. యూపీఏ ప్రభుత్వ పతనానికి ఒక ప్రధాన కారణమైన ద్రవ్యోల్బణం నేడు మరల తీవ్రస్థాయిలో పెరుగుతున్న స్థితి. దీనికి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి పరిష్కారాల ఆవశ్యకత. 6. కోవిడ్ కాలంలో భారీ సంఖ్యలో ఉపాధిని కోల్పోయిన, అప్పుల పాలైన, పేదరికంలోకి జారిపోయిన కోట్లాదిమంది మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగించే అవసరం. స్థూలంగా మింట్ సి ఓటర్ సర్వేలో బడ్జెట్ నుంచి ప్రజలు కోరుకుంటున్న అంశాలుగా ఈ నాలుగు ప్రస్ఫుటమైనాయి. (ఎ) విద్యా వైద్యానికి కేటాయింపును భారీగా పెంచడం. (బి) నిరుద్యోగ భృతి వంటి అంశంపై దృష్టి పెట్టడం. (సి) దేశంలో రైతాంగ వర్గానికి చెందనివారు కూడా కోరుకుంటున్న విధంగా రైతు అనుకూల విధానాలు. (డి) సంక్షేమ రాజ్యాన్ని భారీగా విస్తరించాలన్న ఆకాంక్షకు రూపాన్ని ఇవ్వటం. ముందుగా రైతు ఉద్యమ నేపథ్యంలో ముందుకు వచ్చిన రైతాంగ ఎజెండా బడ్జెట్లో ఎలా ప్రతిఫలించిందో చూద్దాం. సంవ త్సరం పాటు ఉద్యమం నడిపి ఇరకాటంలో పెట్టిన రైతాంగం పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి చూపిందనే ఆరోపణ ఉంది. పంటల సేకరణను అన్ని పంటలకూ విస్తరించి, లబ్ధిదారుల సంఖ్యను పెంచా లనే రైతుల కోరికకు భిన్నంగా... పంటల సేకరణకు కేటాయించిన మొత్తాన్ని 2021–22 బడ్జెట్లోని 2.48 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం 2.37 లక్షల కోట్లకు తగ్గించారు. పంటల సేకరణ తాలూకు లబ్ధిదారుల సంఖ్యను గతేడాదిలోని 1.97 కోట్ల మంది నుంచి 1.63 కోట్ల మందికి కుదించారు... అదీ కథ! ఎరువులపై ఇచ్చే సబ్సిడీ 2021–22 బడ్జెట్ తాలూకు 1,40,122 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 1,05,222 కోట్లకు అంటే 25 శాతం మేరకు తగ్గింది. మరో పక్క గ్రామీణ పేదలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఉపాధి పథకానికి 73 వేల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇది 74 వేల కోట్లు (అదనపు కేటాయింపులతో ఈ మొత్తం లక్ష కోట్ల మేరకు చేరుకుంది.) ఉపాధి హామీ చట్ట ప్రకారం, గ్రామీణ ప్రాంతంలోని పేదలకు, వారు పని చేయాలని కోరుకుంటే, సంవత్సరానికి కనీసం వంద పని దినాలకు హామీ ఇవ్వాలి. కానీ చాలా ఏళ్లుగా ఈ పథకానికి కేటా యింపులు తగినంతగా లేవు. దీనివల్ల 2020 ఆర్థిక సంవత్సరంలో కల్పించిన పని దినాలు 34.76 మాత్రమే. 2021 ఆర్థిక సంవత్సరంలో అవి మరింతగా దిగజారి 27.16కు పరిమితమయ్యాయి. అంతకు ముందటి కాలంలో ఇవి సగటున 42గా ఉన్నాయి. ఉపాధి పనులకు ఏర్పడ్డ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ పథకం సంతృప్తికర అమలు కోసం 2.64 లక్షల కోట్ల రూపాయలు అవసరమని ఒక ప్రఖ్యాత సంస్థ లెక్కించింది. స్థూలంగా 2013–2019 మధ్యకాలంలో సాగుబడి ద్వారా రైతుల ఆదాయం తగ్గిపోయింది. ఒక రైతు కుటుంబానికి వారి ఆదాయంలో 48 శాతంగా ఉన్న సాగుబడి ఆదాయ వాటా ప్రస్తుతం 37 శాతానికి తగ్గింది. పేద ప్రజలకిచ్చే ఆహార సబ్సిడీపై కోత పడ్డది. 2,86,469 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుత బడ్జెట్లో 2,06,831 కోట్లకు తగ్గింది. ప్రపంచ క్షుద్బాధ సూచీలో 2021 సంవత్సరానికి మొత్తం 116 దేశాలలో భారతదేశం ర్యాంకు 94 నుంచి 101కి దిగజారింది. కోవిడ్ కాలంలో మరింత తీవ్రమైన ఆకలి సమస్యను ఈ ఆహార సబ్సిడీల కోత మరింత పెంచుతుంది. దీన్ని మరింత జఠిలం చేస్తూ ధరలు పెరుగుతున్నాయి. దీని వెనుక అంతర్జాతీయంగా కమోడి టీల ధరల పెరుగుదల, దేశీయంగా విపరీతమైన పన్నుల భారం వలన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఎస్మా వంటి చట్టాల రద్దు వలన పట్టపగ్గాలు లేని వ్యాపారస్తులు, దళారుల చేతివాటం, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కావడం వలన ధరలపై నియంత్రణ ఉంచ గల సమాంతర వ్యవస్థ దెబ్బతినడం వంటివి అన్నీ ఉన్నాయి. ఈ కారణాలలో మొదటిదాన్ని వదిలేస్తే, మిగతావన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలే. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అడ్డు రావడం వలన గత రెండు నెలలుగా నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎన్నికల తరువాత పైకి ఎగసేందుకు సిద్ధంగానే ఉంది. ఈ నిర్వాకం చాలద న్నట్లు, ఈ మధ్య కాలంలో జీఎస్టీ శ్లాబులలో మార్పు చేస్తామంటూ ప్రస్తుతం 0 శాతం జీఎస్టీ ఉన్న కొన్ని సరుకులపై పన్నును విధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగా, నిరుద్యోగం దేశ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగా లిస్తామనే హామీని తుంగలో తొక్కి... రానున్న కాలంలో 60 లక్షల ఉద్యోగాలంటూ కొత్త పల్లవిని అందుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చుతున్న బీజేపీ ప్రభుత్వం, నగర ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ పథకం కావాలనే డిమాండ్‌కు సహజంగానే అనుకూలంగా స్పందించలేదు. ఈ మొత్తం క్రమంలో దేశ స్థూల జాతీయోత్పత్తి దిగజారింది. అనేకమంది అంతర్జాతీయ ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం, భారతదేశపు జీడీపీ గణాంకాలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో మోదీ ఘనంగా ప్రకటించిన జీడీపీని 5 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్ళడం అనేది వట్టి నీటిమూటే కాగలదు. పెద్ద నోట్ల రద్దు, అవకతవక జీఎస్టీ వంటి నిర్ణయాలకు తోడుగా కోవిడ్ వల్ల దిగజారిన పరిస్థితులను పునరుజ్జీవింప జేసేందుకు ఆర్థిక ఉద్దీపన ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ప్రపంచమంతటా కూడా వామపక్ష ఆలోచనా విధానం బల పడుతోంది. ఫలితంగానే మింట్ సి ఓటర్ సర్వేలో మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగా లంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. ఈ దిశగా, అమెరికా, యూరోప్ దేశాలూ, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా కొంత ప్రయత్నం మొదలైంది. ఉదాహరణకు, అమెరికా ప్రభుత్వం ద్రవ్య లోటును పట్టించుకోకుండా (14% పైగా ఉంది) ప్రజల కొనుగోలు శక్తిని, మార్కెట్ డిమాండ్‌ను పెంచేందుకు భారీ వ్యయాలు చేస్తోంది. యూరోపియన్ యూనియన్, చైనా కూడా అదే పని చేస్తున్నాయి. అంటే ఈ దేశాలు ప్రజలకు నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. వ్యాసకర్త ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు ‘ 98661 79615 -
ఫ్రెంచ్ విప్లవ నినాదం విలువ కోల్పోనుందా?
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కొత్త అంతర్జాతీయ భద్రత బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం– ఇకముందెవ్వరూ పోలీసుల తాలూకు దృశ్యా లను చిత్రీకరించి, వారి శారీరక లేదా మానసిక స్థితిని దెబ్బతీయరాదు. అంటే పోలీసులు విధి నిర్వహణలో నిబంధనలను అతిక్ర మించి హింసాత్మకంగా ప్రవర్తించినా, పాత్రికేయులు గానీ, ప్రజలు గానీ వీడియోల చిత్రీకరణలు చేసి ప్రచా రంలో పెట్టరాదు. అంతిమంగా ఇది పోలీసులకు రక్షణ కల్పించే పేరిట, ప్రజలపట్ల వారు అతిగా వ్యవహ రించడానికి లైసెన్స్ ఇచ్చే విధంగా ఉంది. కాగా ఈ బిల్లు చట్టం కావడానికి వ్యతిరేకంగా – ఫ్రెంచ్ ప్రజలు, పాత్రికేయులు రోడ్లెక్కారు. అది పాత్రి కేయుల హక్కులను, ఫ్రెంచ్ విప్లవ నినాదమైన ‘లిబర్టీ’ (స్వేచ్ఛ)ని కాలరాసే విధంగా ఉందని నినది స్తున్నారు. మాటల్లో తప్పితే చేతల్లో స్వేచ్ఛ కనబడని పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి కార్ల్ మార్క్స్ 19వ శతాబ్దంలోనే చెప్పివున్నాడు. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవ నినాదం ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం’. దీనిని మార్క్స్– పెట్టుబడిదారులు ‘స్వేచ్ఛ, సమా నత్వం, సోదరభావం’ అని నినదిస్తారు కానీ నిజానికి ఆ నినాదసారం ‘పదాతి దళం, ఫిరంగి దళం, అశ్విక దళం’ అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం, ఫ్రాన్స్ నల్లచట్టం పరిస్థితి నిరూపి స్తుంది ఇదే. గత అనేక సంవత్సరాలుగా ఫ్రెంచ్ ప్రజలు, ప్రపంచంలోని అనేక ధనిక దేశాల ప్రజల్లా గానే పదే పదే నిరసనలకూ, వీధి పోరాటాలకూ దిగుతున్నారు. ఈ క్రమంలో, పరిస్థితి మరింత చేయి జారిపోతున్నట్లు– పాలకవర్గాలు భావిస్తున్నాయి. వ్యవస్థలో పెరిగిపోతున్న నిరుద్యోగం, అసమాన తలు– కోవిడ్ అనంతర కాలంలో మరింత తీవ్రరూపం దాల్చాయి. దీంతో అటు ఫ్రాన్స్, ఇటు ఇతర ధనిక దేశాల్లోని పాలకులు కూడా తమ ముసుగులను తీసే స్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రజానీకం మీద బహిరంగం గానే దాడికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తమ దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక పునాదులకు మూల మైన ఫ్రెంచ్ విప్లవ నినాదాన్ని కూడా పాలకులు పాతర పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు ఈ అసలు రూపాన్ని రష్యా విప్లవ నేత లెనిన్ కొన్ని ప్రశ్నల రూపంలో వివరించారు. మొదటగా, ‘స్వేచ్ఛ’ అనే దానిని వివరిస్తూ, స్వేచ్ఛ ఎవరికీ, ఎవరి నుంచీ అనే ప్రశ్న వేశారు. స్వేచ్ఛ అనే పదాన్ని వాస్తవ జీవితంతో సంబంధం లేకుండా వాడలేమనీ, అనివార్యంగా ఇది రెండు భిన్న వర్గాలను దృష్టిపథంలోకి తెస్తుందనీ ఆయన ఉద్దేశం. రెండు వర్గాలు లేకుండా, ఒకరిపై ఒకరి పెత్తనాలు లేకుండా– విడిగా స్వేచ్ఛ అంటూ ఉండదనేది ఇక్కడ గమనార్హం. ఇక్కడ ‘సమానత్వం ఎవరికీ, ఎవరినుంచీ’ అని లెనిన్ ప్రశ్నిస్తాడు. సమా నత్వం అనే నినాదమే అసమానుల అస్తిత్వాన్ని సూచి స్తోంది. అసమానులు (ఆర్థిక అసమానతలతో సహా) లేని సమాజంలో, సమానత్వం అనే అంశం తాలూకు అస్తిత్వమే ఉండదు. ఇక ఈ మాటల్లో చివరిది ‘సోదర భావం’. ‘సోదరభావం ఎవరెవరి మధ్య’ అని కూడా లెనిన్ ప్రశ్నించాడు. వర్గాలుగా విడిపోయిన సమా జంలో స్వేచ్ఛను కోల్పోయిన వారికీ, ఆర్థిక అసమాన తల కింద కునారిల్లుతున్న బడుగులకూ– తమను అణ చివేసి, తమ శ్రమశక్తితో ఆర్థికంగా ఎదిగిన పై వర్గాల వారితో సోదరభావం సాధ్యం కాదనేది సారాంశం. ఈ కోణం నుంచి ఫ్రాన్స్, ఇతర దేశాల పరిణామా లను గమనిస్తే, వాస్తవంలో జరుగుతున్నది ఏమిటో అర్థమవుతుంది. అంతర్జాతీయంగా ఫ్రెంచ్ విప్లవ నినాదంతో ప్రభావితం అయ్యామని చెప్పుకుంటున్న వివిధ దేశాలలో ఈ నినాదం తాలూకు హక్కులూ, ఆ హక్కులకు హామీ ఇచ్చే ప్రాథమిక చట్టాలూ కూడా వారికి భరించనలవికానివిగా తయారయ్యాయన్న మాట. ఇగిరి ఆవిరైపోతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు అంతిమ ఫలితం ఇది. నిన్నటివరకూ లాగా, కనీస స్థాయిలో ప్రజలకు రాయితీలు ఇచ్చిన స్థితి కూడా పోయి, ఇక నేడు ప్రజల కడగండ్లు పెరుగుతున్న కాలంలో తాము చేసిన చట్టాలను తామే భరించలేని స్థితికి పాలకులు చేరుకున్నారు. వివిధ దేశాలలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆర్థిక అసమానతల వల్ల రానున్న రోజుల్లో ఫ్రాన్స్ తాలూకు ఈ ‘అంతర్జాతీయ భద్రతా బిల్లు’ విశ్వవ్యాప్త మైనా ఆశ్చర్యంలేని పరిస్థితి. నాడు పెట్టుబడిదారీ ప్రపంచానికి ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం’ నినాదాన్ని అందించిన ఫ్రాన్స్ నుంచి మళ్ళీ మరింత ఉధృత రూపంలో ఇటువంటి చట్టం మొలకలెత్తడం కాలం తాలూకు వైచిత్రి కావచ్చు! వ్యాసకర్త: డి. పాపారావు, సామాజిక విశ్లేషకులు మొబైల్: 98661 79615 -
కొనుగోలు శక్తికి ఉద్దీపన కరువు
భారతదేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు కాలంలో ఉంది. ఒకవైపున మోదీ 2024 నాటికి ఆర్థికవ్యవస్థ స్థాయిని 5 లక్షల కోట్ల రూపాయలకి తీసుకువెళ్ళాలనే లక్ష్యాన్ని ప్రకటిస్తున్నారు. మరో ప్రక్కన దేశ ఆర్థ్ధికవ్యవస్థపై మాంద్యం తాలూకు కారుమబ్బులు కమ్ముకుంటున్నాయనే వార్తలు వస్తున్నాయి. ‘ప్రభుత్వం బయటకు చెప్పకపోయినా, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుంచి అందుతోన్న సంకేతాల మేరకు గడచిన 34 సంవత్సరాల నుంచీ వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంద’ని బజాజ్ ఆటోకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ అన్నారు. ‘పెట్టుబడులకు, డిమాండ్‌కి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏవిధంగానూ ప్రయత్నించడం లేద’ని కూడా ఆయన చెబుతున్నారు. ఆయన ఈ మాటలు అన్నది 2019 జూలై మాసం చివరిలో. కాగా, ఇంతటి తీవ్ర పరిస్థితులలో కూడా నేటి వరకూ ఆర్ధికమాంద్యం నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరో ప్రక్కన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాటల ప్రకారం జూన్ మాసంలో ‘ద్రవ్య విధాన కమిటీ’ సమావేశం జరిగిన నాటికే దిగజారివున్న ఆర్థిక స్థితి, ఈ కొద్ది కాలంలో మరింత అధోముఖంగా జారిపోయింది. ఈ స్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రిజర్వ్ బ్యాంకు తన వంతుగా ఇప్పటివరకూ వడ్డీ రేట్లను 1.1% మేరన తగ్గించింది. అయితే, ప్రభుత్వం తన వంతుగా ఉద్దీపన వంటివి చేపట్టడం కూడా తప్పనిసరి అని రిజర్వ్‌బ్యాంకు పెద్దల అభిప్రాయం. కాగా, కడకు నేడు ఉద్దీపన ప«థకం ఏదీ ఇచ్చే ఉద్దేశం లేదంటూ ప్రధానమంత్రి ప్రధాన ఆర్థ్ధిక సలహాదారు చావు కబురు చల్లగా చెప్పారు. కానీ, షేర్మార్కెట్లలో పతనం గురించి మాత్రం ప్రభుత్వం మెరుపు వేగంతో ప్రతిస్పందిస్తోంది. మొన్నటి బడ్జెట్ అనంతరం అత్యంత ధనవంతుల మీద పెంచిన పన్ను మొత్తం తాలూకు భారం అనేక విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారులను తాకింది. దాంతో వారు షేర్ మార్కెట్ల నుంచిపెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీనితో సెబీ విదేశీ ఫోర్ట్‌ఫోలియో మదుపుదారులకు సంబంధించిన పలు నిబంధనలను సరళీకరించింది. తద్వారా పతన దిశగా సాగుతోన్న షేర్ మార్కెట్‌కు కొంత ఊతాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతోంది. 2008లో అమెరికాలో ఆరంభమైన ఆర్థ్ధిక మాంద్యం మనల్ని తాకకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, మన జాతీయం చేయబడిన బ్యాంకులు. రెండవది దేశంలోని జాతీయ ఉపాధి హామీ ప«థకం. నాడు మన జాతీయ బ్యాంకులు అడ్డగోలు రుణవితరణ చేయలేదు. అవి ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారలేదు. అలాగే, జాతీయ ఉపాధి హామి పధకం వలన దేశంలోని కోట్లాది మందికి కొనుగోలు శక్తి పెరిగింది. నేడు జాతీయ బ్యాంకులలో మొండి బకాయిలు పెరిగిపోయాయి. రుణవితరణలో పెద్ద పాత్ర ఉన్న బ్యాంకింగేతర ఆర్థ్ధికసంస్థల స్థితి కూడా దివాలా బాట పట్టింది. మన నీతిఆయోగ్ ప్రకారమే నేడు ఆర్థ్ధిక సంస్థల స్థితి 70 సంవ త్సరాలలో కనీవినీ ఎరుగనంత దయనీయంగా ఉంది. ఇక, జాతీయ ఉపాధి హామి పథకం పట్ల విముఖత కారణంగా కూలీల వేతనాల చెల్లింపు జాప్యం అవుతోంది. వ్యవసాయ రంగం స్థితి కూడా దిగజారి గ్రామీణ ఆర్థ్ధిక ఆరోగ్యం çకుదేలైపోతోంది. గ్రామాల ఆర్థిక స్థితికి కొలబద్ద అయిన ట్రాక్టర్లు, బైక్‌ల అమ్మకం దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే, తల నూనెలు, సబ్బులు, కడకు బిస్కెట్ల వంటి చిన్న చిన్న వినియోగ వస్తువుల అమ్మకాలు కూడా నేడు గ్రామీణ ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో కంటే దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆసియా దేశాల కరెన్సీల విలువలో కూడా పతనం నెలకొంది. మన రూపాయి విలువ మరింత అధికంగా పతనం చెందింది. అలాగే, మనదేశం నుంచి ఎగుమతి అయ్యే కార్ల అమ్మకాలు ఇతర దేశాలలో డిమాండ్ పతనం వలన 4.2% మేరకు తగ్గాయి. మన దేశీయ మార్కెట్లో ఈ అమ్మకాల తగ్గుదల 19% మేరకు ఉంది. అలాగే, జూలై 2019 మధ్యనాటి స్థితి ప్రకారంగా ప్రపంచంలోని అతిపెద్ద 10 షేర్ మార్కెట్లలో ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది (2.8%) భారతదేశ షేర్ల సూచీయే ! అలాగే గత నాలుగేళ్లలో భారతదేశ ఎగుమతుల వృద్ధి రేటు సగటున 0.2%గా మాత్రమే ఉంది. ప్రపంచదేశాల ఎగుమతుల సగటు వృద్ది రేటు 0.6% గా ఉంది. 2010 2014లో ప్రపంచ దేశాల సగటు ఎగుమతుల వృద్ధి సాలీనా 5.5% గా ఉండగా, మన దేశంలో అది 9.2% గా ఉంది. అంటే, ప్రపంచంలోని ఇతర దేశాలలో కంటే భారత్‌లో మరింత తీవ్ర మాంద్య పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం మన ఆర్థిక రంగాన్ని ఇప్పటికీ వెంటాడటమే. ఇక నోట్ల రద్దుతోపాటుగా హడావుడిగా అమలు జరిగిన జీఎస్టీ వలన కూడా సమస్యలు మరింత జటిలం అయ్యాయి. నిరుద్యోగ సమస్య 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వం మాంద్యం పరిష్కారానికి చేపడుతోన్న చర్యలు కూడా అరకొరగానే మిగిలిపోయాయి. ఒక ఉద్దీపన పథకం అవసరం అయిన దశలో దానిని తిరస్కరించి; కార్పొరేట్లపై పన్ను శాతాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థ్ధిక వ్యవస్థ కోలుకునే అవకాశం కనుచూపు మేరలో లేదని ‘మింట్ స్థూల ఆర్థిక పరిశీలక సూచీ’ చెబుతోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ద్రవ్యలోటును కట్టడి చేసే ఆలోచనలు మానుకొని తన యథాశక్తి ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనను ఇవ్వడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా ఈ ఉద్దీపన గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా ఉండాలి., 2024 నాటికి 5 లక్షల కోట్ల ఆర్థ్ధిక వ్యవస్థ కల కనే ముందు, నేడు మనం స్థూలవృద్ధి రేటులో ప్రపంచంలో ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానానికి పడిపోయిన వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి. పీ.ఎస్: శుక్రవారం ఆర్థికమంత్రి ప్రకటించింది–సామాన్య జనాభా, మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తిని పెంచే ఉద్దీపన పథకం కాదు. అది కేవలం వడ్డీ రేట్ల తగ్గింపు లేదా బ్యాంకుల ద్రవ్యలభ్యతను పెంచేది మాత్రమే. కానీ, ఎస్బీఐ చైర్మన్ ప్రకారం అసలు ప్రజలకు కొనుగోలు శక్తి లేకపోవడమేగానీ, బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత లేకపోవ డం కాదు. కాబట్టి సామాజిక రంగంలోన, మౌలిక వసతుల రంగంలో ఉపాధిని పెంచే చర్యలు మాత్రమే ప్రస్తుత స్థితిలో నిజమైన ఆర్థిక ఉద్దీపనకు దోహదపడతాయి. వ్యాసకర్త: డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
రెపో రేటు తగ్గింపు వృద్ధి సంకేతమేనా?
సందర్భం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జూన్ 6, 2019న తన వడ్డీరేట్లను (రెపో రేటు) 25 పాయింట్ల మేర తగ్గించింది. దీనితో ఆర్బీఐ రెపో రేటు ప్రస్తుతం 5.75కు చేరింది. ఈ విధంగా రెపోరేటును తగ్గించడం ఈ మధ్యకాలంలో ఇది 3వ దఫా! ఈ రెపో రేటు తగ్గింపు వలన గృహ, వాహన రుణాలపై వడ్డీల స్థాయి తగ్గి, అవి మరింత చౌక అవుతాయి. అంతిమంగా ఈ రేట్ల తగ్గింపు ఉద్దేశ్యం కూడా రుణ స్వీకరణను పెంచడం, ఇప్పటికే తీసుకున్న రుణాలపై వడ్డీల చెల్లింపు భారాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే! మన దేశ ఆర్థిక వృద్ధి రేటు గత అనేక మాసాలుగా, గణనీయంగా దిగజారుతోంది. 2018–2019 కాలానికి సంబంధించిన 3వ త్రైమాసికంలో 6.6%గా ఉన్న స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి) వృద్ధిరేటు 4వ త్రైమాసికంలో 5.8%కి దిగజారింది. దీని వలన, 2018–2019 ఆర్థిక సంవత్సర మొత్తం కాలానికి గానూ జీడీపీ స్థాయి. 6.8 గానే ఉంది. అంటే గత రెండేళ్లుగా చైనా కంటే అధిక వృద్ధి రేటును సాధించి ఆర్థిక అబివృద్ధిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నామని అనుకున్న మనం నేడు ఆ స్థానాన్ని కోల్పోయాం!! ఈ నేపధ్యంలోనే, దిగజారుతున్న వృద్ధిరేటును పెంచడం, 45 సం‘‘ల గరిష్ట స్థాయికి (6.1%) చేరిన నిరుద్యోగాన్ని తగ్గించడం అనే లక్ష్యాలకు నేటి ఆర్బీఐ రెపోరేట్లు తగ్గింపు కూడ దోహదపడగలదనే అంచనాలు వున్నాయి. కాగా, వాస్తవాలు ఈ అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. తొలి రెండు దఫాల రెపోరేట్ల తగ్గింపు ద్వారా ఆర్బీఐ ఇప్పటివరకూ మొత్తంగా 50 పాయింట్ల మేర (0.5%) వడ్డీ రేట్లను తగ్గించింది. కానీ, ఈ తగ్గిన రెపోరేట్లు లేదా వడ్డీ రేట్ల లబ్దిని పొందిన కమర్షియల్ బ్యాంకులు మాత్రం తామిచ్చే రుణాలపై తమ తమ వడ్డీ రేట్లను కేవలం 5 నుంచి 10 పాయింట్ల మేరకే (0.05% నుంచి 0.1%) తగ్గించాయి అంటే, కమర్షియల్ బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్బీఐ తగ్గించిన స్థాయిలో లేదు. తద్వారా, అవి ఆర్బీఐ వడ్డీరేటు తగ్గింపు ప్రయోజనాన్ని తమ రిటైల్, కార్పోరేట్ కస్టమర్లకు పూర్తి స్థాయిలో అందించడం లేదు. దీనికి ఒక ప్రధాన కారణం తాము గనక తమ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించుకుంటే, తమకు లభించే ఆదాయం తగ్గిపోతుందని బ్యాంకులు ఆందోళన చెందడమే! ఈ రకంగా, బ్యాంకుల ఆదా యం తగ్గితే అవి తమ వ్యయాలను కూడ తగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే, అవి తాము ప్రజల నుంచి తీసుకునే డిపాజిట్లపై, తామిచ్చే వడ్డీరేట్ల స్థాయిని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇదే జరిగితే రాబడి తగ్గిన డిపాజిటర్లు తమ సొమ్ముపై మెరుగైన రాబడి కోసం, మరో దారి వెతుక్కుంటారు. ఇప్పటికే పెరిగిపోయిన మొండి బకాయిలూ, అలాగే పెద్దనోట్ల రద్దుతో తగిలిన దెబ్బవలన పలు బ్యాంకులకు మూల ధన కొరతలు లేదా లోట్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దానికి తోడు తగ్గించిన వడ్డీరేట్ల ప్రభావం వలన ఆయా బ్యాంకులలో కస్టమర్ల డిపాజిట్లు విత్‌డ్రా కావడం లేదా కొత్త డిపాజిట్లు రాకపోవడం గనుక తోడయితే, ఇది ఆయా బ్యాంకులకు మూలిగే నక్కమీద తాటికాయే కాగలదు. కాబట్టి రెపోరేట్లు తగ్గింపు లక్ష్యమైన, ప్రజల చేతిలో అదనపు ఆదాయం ఉండేలా చూసి, తద్వారా మార్కెట్లో సరుకులూ, సేవల డిమాండ్‌ను పెంచాలనే లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈ చర్య ఉండజాలదు. దానితో పాటుగా మొండి బకాయిలు భారీగా పెరిగి పోయాక, నేడు మన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా పెద్దగా కొత్త రుణాల మంజూరుకు సానుకూలంగా లేవు. అలాగే ఒకవేళ రుణాల మంజూరును డిమాండ్ మేరకు భారీగా పెంచుకోవాలన్నా నేడు పలు బ్యాంకుల వద్ద, తగిన మేరకు నగదు లేదు. అందుకే ప్రభుత్వం వివిధ బ్యాంకులకు మూల ధనాన్ని (రూ. 40,000 కోట్లు) సమకూర్చాలనే డిమాండ్ కూడా వినపడుతుంది. దీనంతటితో పాటుగా, బ్యాంకింగ్యేతర ఫైనాన్స్ సంస్థలలో కూడా త్రీవ స్థాయిలో నెలకొన్న సంక్షోభం, దివాలాలు ప్రజలకూ, కార్పోరేట్లకూ రుణ అందుబాటు సమస్యను మరింత తీవ్రతరం చేసాయి. కాబట్టి, ప్రస్తుతం దేశంలోని ఆర్థిక వృద్ధిరేటు దిగజారుడు, పెరిగిపోతున్న నిరుద్యోగం ఫలితంగా పడిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి వంటి సమస్యలను పరిష్కరించేందుకు రెపోరేట్ల తగ్గింపు వంటి పైపై ఉపశమన, ఉద్దీపన చర్యలు ఏమాత్రం సరిపోవు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం దాని తాలూకు దుస్థితిలో కావల్సింది కాయకల్ప చికిత్స మాత్రమే!! ఆ చికిత్స ఖచ్చితంగా, దేశంలోని మెజారిటీ ప్రజల జీవనాధారం అయిన వ్యవసాయ రంగాన్ని లాభదాయకం చేయడంలో మాత్రమే ఉంది!! ఆర్బీఐ రెపోరేట్లను తగ్గించిన రోజునే (జూన్ 6, 2019) షేర్ మార్కెట్ సూచీలు ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పతనాన్ని (552 పాయింట్లు సెన్సెక్స్) నమోదు చేయడం దీన్నే చెబుతోంది. డి. పాపా రావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
ఎంపికలో పొరబడుతున్నామా?
►సందర్భం భారత్ చైనా సరిహద్దులలో గత 40 ఏళ్లుగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని మన ప్రధాని మోదీయే తన రష్యా పర్యటనలో అన్నారు. ఏ విధంగా చూసినా మనకు అమెరికాతో సాన్నిహిత్యం కంటే చైనాతో దగ్గరితనమే మేలు చేస్తుంది! గత 30 ఏళ్లుగా, ముఖ్యంగా సోవియట్ పతనం, దేశీయంగా నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు ఆరంభం తరువాత మన దేశానికి అమెరికాతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్థిక లావాదేవీలు పెరగడం, భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అమెరికాలో ఉపాధి అవకాశాల వంటివి, ఇరుదేశాలను ఆర్థికంగానూ రాజకీయంగానూ కూడా సన్నిహితం చేశాయి. ఈ క్రమంలోనే అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య దిశగా పాలకులు దేశాన్ని నడిపించారు. కాగా ఈ క్రమంలో మనకు చైనాతో గతంలోనే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు రాజకీయ పరంగా మరింత దిగజారాయి. దలైలామా అంశం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం తదితర అంశాలు మన ఇరు దేశాల మధ్యన అగ్గి రగుల్చుతూనే ఉన్నాయి. పైగా పాకిస్తాన్‌తో బలపడుతోన్న చైనా సంబంధాలు మనలను మరింత కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా తలపెట్టిన వన్ రోడ్ వన్‌బెల్ట్ (ఆధునిక సిల్క్ రూట్)లో కూడా మనం పాలుపంచుకోవడంలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిం చతలపెట్టిన రహదారి; పాక్ ఆక్రమిత కశ్మీర్ లోంచి నిర్మిం చనుండడం, భారత్ సందేహాలకూ, ఆందోళనకూ ప్రధాన కారణం. కాగా, నేడు ఆసియా, యూరప్‌లోని పలు దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతున్నాయి. మన దేశం చుట్టూరా ఉన్న అనేకానేక చిన్న దేశాలు కూడా చైనాతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాయి. దరిదాపు అవన్నీ ఈ ప్రాజెక్టులో భాగస్వాములే. ఈ క్రమంలోనే భూటాన్ వంటి ఒకటీ అర దేశాలు మినహా, మనతో సరిహద్దును పంచుకుంటోన్న అన్ని దేశాలు చైనాకు సన్నిహితంగా జరుగుతున్నాయి. ఇక అమెరికాకు ఈ ప్రాజెక్టు ఇచ్చగించకున్నా, సుదీర్ఘకాలంగా అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉన్న యూరోపియన్ దేశాలు కూడా, నేడు మెల్లమెల్లగా అమెరికా విధానాలకు దూరంగా జరుగుతూ చైనాతో ప్రస్తుత ప్రాజెక్టులో కూడా భాగస్వాములవుతున్నాయి. మరోవైపు స్వాతంత్య్రానంతర చరిత్రలో అలీనోద్యమ సారథిగానూ, సోషలిస్ట్ సోవియట్‌కు సన్నిహితంగా ఉన్న మనం, నేడు మిగతా ప్రపంచం తీరుకు భిన్నంగా అమెరికాకు అత్యంత సన్నిహితంగా వెళుతున్నాం. అయితే సహజాతంగానే తన సొంత ప్రయోజనాలకు తప్ప మరి దేనికీ విలువనివ్వని చరిత్ర అమెరికాది. ఇటువంటి ఆలోచనా విధానానికి ఆ దేశం పెట్టుకున్న పేరు ‘‘ఆచరణాత్మకత’’ (ప్రాగ్మాటిజమ్). ఈ అవకాశవాద ధోరణి మన విషయంలో కూడా ఇప్పటికే బయటపడుతోంది. హెచ్1బీ వీసాలపై నియంత్రణలు, జాతి వివక్ష ధోరణులూ, నిన్నగాక మెున్న పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగుతూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం ఎటువంటి జవాబుదారీతనం లేకుండానే ఈ ఒప్పందం క్రింద బిలియన్ల డాలర్లను అప్పనంగా తమనుంచి పొందుతోం దంటూ ఆక్షేపించడం వంటి వాటిని గమనించాలి. ఇక, నేడు అమెరికా వాణిజ్య లోటులో 43.9% చైనాతోనే ఉంది. అలాగే పెద్ద ఎత్తున తన ఆర్థిక మనుగడ కోసం చైనాపై ఆధారపడుతోంది. కాగా, అధికారంలోకి రాకముందు, చైనా మెడలు వంచి ఈ వాణిజ్య లోటు సమస్యను పరిష్కరిస్తానన్న ట్రంప్, నేడు తోకముడిచాడు. చైనాతో సాన్నిహిత్యం చెడకుండా జాగ్రత్త పడుతున్నాడు. కానీ మరో ప్రక్కన అమెరికాతో భారత్‌తో ఉన్న వాణిజ్య లోటు, దాని మెుత్తం వాణిజ్య లోటులో కేవలం 2.5%గా మాత్రమే ఉంది. అయితే, భారత ప్రధాని మోదీ త్వరలో జరపనున్న అమెరికా పర్యటన సందర్భంగా ఈ కాస్తంత వాణిజ్య లోటును కూడా తగ్గించుకోమనీ, దానికోసం భారత మార్కెట్‌ను మరింతగా అమెరికా సరుకులకు తెరవమనీ ట్రంప్ ఒత్తిడి చేయనున్నాడు. అంటే, మెత్తగా ఉంటే మెుత్తబుద్ధి అయినట్లు, తనకు వ్యాపారిగా అలవాటైన ధోరణితోనే అమెరికాతో సన్నిహితం అవుతోన్న భారత్‌తో మాత్రం ‘‘మా ఇంటికొస్తూ ఏమి తెస్తావు? మీ ఇంటికొస్తే ఏమిస్తావు?’’ తీరులోనే వ్యవహరిస్తున్నాడు. ఒక పక్కన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడం కోసమూ, భారత్ వంటి విశాలమైన మార్కెట్‌ను తన సరుకులూ, ఆయుధాల ఎగుమతులకు కలిగివుండడం వంటి అంశాలలో భారత ప్రభుత్వపు సహకారాన్ని కోరుకుంటూనే, మరో పక్కన భారతదేశానికి నష్టం కలిగించే భారత్ ఎగుమతులకు టారిఫ్ అవరోధాలూ, వీసా నిబంధనలూ, పారిస్ ఒప్పందం నుంచి వైదొలగుతూ చేసిన వ్యాఖ్యానాలు అమెరికా తీరుకు అద్దం పడుతున్నాయి. మెుత్తంగా నేడు అమెరికాతో సాన్నిహిత్యం మనకు మేలు చేయకపోగా హానే చేస్తోంది. నిజానికి మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్ వంటి వారు కూడా ఈ విషయంలో చేసిన సూచనలు, హెచ్చరికలు ఇక్కడ గమనార్హం. పైగా అమెరికా నేడు పేరుకే సూపర్ పవర్. నిజానికి అది ఆ స్థానాన్ని కోల్పోయింది. అనేక యూరోపియన్ దేశాలు కూడా నేడు ఆర్థిక కారణాలతోనో లేకుంటే అమెరికా ధోరణితో విసిగి వేసారో చైనా వైపు చూస్తున్నాయి. అంటే నేడు ఇంకా అది అధికారికంగా ‘‘అగ్రరాజ్య’’ గుర్తింపును పొందకున్నా, వాస్తవంలో చైనా ఆ దిశగానే సాగుతోంది. ఈ సందర్భంలోనే తన రష్యా పర్యటనలో భార™Œ చైనా సరిహద్దులలో గత 40 ఏళ్లుగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని స్వయానా మన ప్రధాని మోదీయే అనడం ముదావహం. కాబట్టి ‘నకిలీ మిత్రుడి కంటే నిజమైన శత్రువే మేలు’ అన్న విధంగా నేడు ఏ విధంగా చూసినా మనకు అమెరికాతో సాన్నిహిత్యం కంటే చైనాతో దగ్గరితనమే మేలు చేస్తుంది. - డి.పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు ఫోన్ నెం. 98661 79615 -
ప్రతిభ గల పేద విద్యార్థులను చదివిస్తాం
ఓయూ పూర్వవిద్యార్థుల ఫోరం హైదరాబాద్: ఓయూ శతాబ్ది ఉత్సవాలను పురస్క రించుకొని ప్రతిభ గల పేద విద్యార్థులను చదివి స్తామని ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం ఛైర్మన్ పాపారావు పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిభగల పేద విద్యార్థులను గుర్తించి ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం తరఫున చదివి స్తామన్నారు. ఉత్సవాల ముగింపునకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా మూడురోజులపాటు ఓయూ జాతీయ పూర్వవిద్యార్థుల ఫోరం ఆధ్వర్యంలో ఉచిత సేవలు అందించనున్నట్లు చైర్మన్ పాపారావు తెలిపారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యే వారికి కలిగే సందేహాలు, ఇతర వివరాలకు 9490747967, 9348812123, 9848125732 నంబర్లకు ఫోన్ చేసి తెలుసు కోవచ్చని చెప్పారు. -
నూరేళ్ల ఓహోహో దక్కన్ పీఠభూమి!
ఆర్ట్@ తెలంగాణ కాఫీ టేబుల్ బుక్ ఈ ఆలోచన అనుకోకుండా వచ్చింది. ఇందుకు కారకులు డా.బి.వి.పాపారావు. 1998-99లో కొసావొ యుద్ధం జరిగినప్పుడు సాంస్కృతికంగా జరిగిన నష్టం గురించి అధ్యయనం చేయడానికి ఆయన యునెటైడ్ నేషన్స్ ప్రతినిధి బృందం నాయకుడిగా కొసావొ వెళ్లారు. అక్కడి మ్యూజియంను సందర్శించారు. ఆ సందర్భంగా ఆ చిన్ని దేశంలోని వెయ్యిమందికి పైగా క్రియాశీల చిత్రకారులు తయారు చేసిన ‘కొసావొ ఆర్ట్’ పుస్తకాన్ని బహుమతిగా పొందారు. హైదరాబాద్‌లో ఆ పుస్తకాన్ని చూసిన ఫిలిం మేకర్ బి.నరసింగరావుకు మన తెలంగాణ ఆర్ట్ గురించి ఇలాంటి ఒక పుస్తకం ఎందుకు రూపొందించకూడదు? ప్రపంచదేశాల మ్యూజియంలకు, దేశంలోని అన్ని ఆర్ట్ సెంటర్స్‌కు ఎందుకు పంపకూడదు? అనే ఆలోచన వచ్చింది. ఫలితంగా రూపొందినదే ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ కాఫీ టేబుల్ బుక్. బి.నరసింగరావు చీఫ్ ఎడిటర్‌గా, ఆనంద్‌కుమార్ గడప కంటెంట్ రచయితగా, ఏలె లక్ష్మణ్ ఆర్ట్ కోఆర్డినేటర్‌గా, అజిత్ నాగ్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేసిన కృషి ఇందులో ఉంది. అకారాది క్రమంలో ఎక్కా యాదగిరిరావు నుంచి యాసల బాలయ్య వరకూ 121 మంది కళాకారులను, అన్సంగ్ హీరోస్ శీర్షికన అజయ్‌కుమార్ బోస్ నుంచి యాసిన్ మహమ్మద్ వరకూ 29 మంది కళాకారులను పరిచయం చేస్తూ వారి వర్క్స్‌ను ప్రచురించారు. 1914 నుంచి 2014 వరకూ వచ్చిన ఎంపిక చేసిన చిత్ర-శిల్ప-లోహ సౌందర్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అన్నీ విలువైన రిఫరెన్సులే. ఆర్ట్ ఎట్ తెలంగాణ ఎందుకు? ఈ ప్రశ్న వేసుకోగానే సహజంగానే ఇ.బి. హావెల్ గుర్తొస్తారు. బ్రిటిష్ ఇండియాలో 1896లో ఆయన కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ బాధ్యతలు తీసుకున్నాడు. గ్యాలరీని ఒకసారి పరికించాడు. ఇంగ్లండ్‌కు చెందిన నాసిరకం దళారీలు వేసిన చిత్రాలు గోడలపై మెరిసిపోతున్నాయి. కాని వేల సంవత్సరాల మానవేతిహాసపు భారతీయ సౌందర్యాలు నేలమాళిగల్లో ఉన్నాయి. గ్యాలరీలో ‘చెత్త’ను తొలగించాడు. భారతీయ సమాజాన్ని ప్రతిఫలించే చిత్రాలను వేలాడ దీశాడు. భారతీయులకు చదువా-సంస్కారమా అన్న మెకాలేను ఎండగట్టి మెకాలే మానస భారతీయ పుత్రులపై జాలి చూపాడు. భారతీయులు తమను గురించి తాము తెలుసుకోవాల్సి ఉందంటూ అత్యుత్తమ భారతీయ చిత్రంగా అబనీంద్రుని ‘కచుడు-దేవయాని’ని ప్రతిపాదించాడు. కచుడు దేవయాని పౌరాణిక పాత్రలే. కాని దేవయాని కచునితో ఇప్పటికీ మోసపోతూనే ఉంది కదా. ఈ నేపథ్యంలో ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ప్రాధాన్యత అవసరమవుతోంది. రక్తమూ లేదా కన్నీళ్లు తడపని నేల భూగోళంలో ఎక్కడా లేదు. ప్రతి ప్రాంతంలోనూ సమాజంలోనూ వ్యక్తీకరించాల్సిన జీవితం ఉంటుంది. పాలకులు ఆ పని చేయనప్పుడు, ఇతరులు కించపరచినప్పుడు చైతన్యవంతులైన ఆయా సమాజాలే, వ్యక్తులే ఇందుకు పూనుకోవాలి. తూర్పు పడమర కనుమల మధ్యన ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్యన ట్రయాంగ్యులర్‌గా ప్రకృతి అమర్చిన పీఠభూమి దక్కన్. ఆదిలాబాద్ డయొనాసార్ బిర్లా ప్లానెటోరియంలో కొండమీద ఉంది. మిలియన్ల సంవత్సరాలుగా ఎగజిమ్మిన లావాలు కోటింగ్‌పై కోటింగ్ వేయగా సారవంతమైన భూమి ఏర్పడింది. ప్రకృతి అమర్చిన ఈ కాన్వాస్‌పై తెలుగు- కన్నడ- మరాఠీ మాట్లాడే ప్రజలు సహజీవనం చేశారు. ‘నయము- భయము- విస్మయము’ వంటి సమ్మిశ్రభావాలను కలిగించిన అనుభవాలెన్నో ఇందులో కళాత్మకంగా ఉన్నాయి. తెలంగాణ మోడరన్ పెయింటింగ్‌కు ఆద్యుడిగా రామకృష్ణ వామన్ దేస్కర్ను పరిగణిస్తారు. ఆయన సాలార్జంగ్ మ్యూజియం తొలి క్యూరేటర్. సాలార్జంగ్ పోర్టరైట్పై కదలాడే వెలుగునీడలను ఆయన పట్టిన తీరు అపురూపం. దేస్కర్, పి.టి.రెడ్డి, కొండపల్లి శేషగిరిరావు, తోట వైకుంఠం, లక్ష్మాగౌడ్, జగదీశ్ మిట్టల్ తదితరుల నుంచి పలువురు ఔత్సాహికుల వరకూ ఇందులో కొలువై ఉన్నారు. తెలంగాణ ప్రకృతిని, గ్రామాలను, ఆటపాటలను, కన్నీళ్లను, ఉత్సవాలను, బతుకమ్మను, సారాంశంలో అనేక పొరల జీవితం ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉంది. అయితే ‘మరికొందరికి ఇందులో చోటు దొరికితే మంచిగుండేది’ అనే అసంతృప్తులు లేకపోలేదు. అవి పుస్తక ప్రాధాన్యతను తెలియజేసేవిగా భావించాలి. చనిపోయిన వారి జనన మరణ సంవత్సరాలు, సజీవుల వయస్సు తదితర వివరాలు ఇవ్వాల్సింది. తోటి తెలుగు రాష్ట్రపు సృజనశీలురు ఈ పుస్తకాన్ని స్పర్థగా తీసుకోవచ్చు. బాలాంత్రపు రజనీకాంతరావు మాటల్లో చెప్పాలంటే ఆర్ట్ ఎట్ తెలంగాణ నూరేళ్ల ‘ఓహోహో దక్కన్ పీఠభూమి’. పుస్తకం ఖరీదైనదే. - పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 7680950863 ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ నూరేళ్ల తెలంగాణ ఆర్ట్‌పై ఇంగ్లిష్ కాఫీ టేబుల్ బుక్ 354 పేజీలు; కాపీలకు: వాల్డెన్; కవర్ ప్రైస్ : రూ.3,500