ద్రవ్యలోటును దాటితేనే సంక్షేమం | D Paparao Review On Indian Economy And Union Budget 2022 | Sakshi
Sakshi News home page

ద్రవ్యలోటును దాటితేనే సంక్షేమం

Published Sat, Feb 5 2022 1:02 AM | Last Updated on Sat, Feb 5 2022 1:54 AM

D Paparao Review On Indian Economy And Union Budget 2022 - Sakshi

నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి చాలా దేశాలు ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్‌ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగాలంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. 

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో 2022–23 ఆర్థిక సంవత్సరం తాలూకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌ ఎలా ఉండాలనే దాని గురించి కొన్ని మౌలిక ఆకాంక్షలు దేశ ప్రజలలో అప్ప టికే ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ప్రాధాన్యతాంశాల గురించిన పలు రకాల ఒత్తిడులు ఉన్నాయి. వీటిలో కీలకమైనవి: 1. సంవత్సర కాలం పైబడి సాగిన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్లు. 2. కోవిడ్‌ రెండో వేవ్‌ కాలంలో కోల్పోయిన తన ప్రాధాన్యాన్ని తిరిగి ఎంతోకొంత పొంద వలసిన ఆగత్యం ప్రధాని మోదీకి ఉండటం. 3. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక, నిజానికి ఉన్న ఉద్యోగాలే ఊడిపోయిన స్థితి. రికార్డు స్థాయి నిరు ద్యోగానికి ఎంతో కొంత ఆచరణాత్మక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత.

4.కోవిడ్‌ ముందరి 2018 జనవరి–మార్చి కాలం నుంచే పతనమవుతూ, కోవిడ్‌ కాలంలో అగాథంలోకి పడిపోయిన స్థూల జాతీయోత్పత్తి గణాంకాన్ని తిరిగి నిలబెట్టగలగడం. 5. యూపీఏ ప్రభుత్వ పతనానికి ఒక ప్రధాన కారణమైన ద్రవ్యోల్బణం నేడు మరల తీవ్రస్థాయిలో పెరుగుతున్న స్థితి. దీనికి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి పరిష్కారాల ఆవశ్యకత. 6. కోవిడ్‌ కాలంలో భారీ సంఖ్యలో ఉపాధిని కోల్పోయిన, అప్పుల పాలైన, పేదరికంలోకి జారిపోయిన కోట్లాదిమంది మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగించే అవసరం.

స్థూలంగా మింట్‌ సి ఓటర్‌ సర్వేలో బడ్జెట్‌ నుంచి ప్రజలు కోరుకుంటున్న అంశాలుగా ఈ నాలుగు ప్రస్ఫుటమైనాయి. (ఎ) విద్యా వైద్యానికి కేటాయింపును భారీగా పెంచడం. (బి) నిరుద్యోగ భృతి వంటి అంశంపై దృష్టి పెట్టడం. (సి) దేశంలో రైతాంగ వర్గానికి చెందనివారు కూడా కోరుకుంటున్న విధంగా రైతు అనుకూల విధానాలు. (డి) సంక్షేమ రాజ్యాన్ని భారీగా విస్తరించాలన్న ఆకాంక్షకు రూపాన్ని ఇవ్వటం.

ముందుగా రైతు ఉద్యమ నేపథ్యంలో ముందుకు వచ్చిన రైతాంగ ఎజెండా బడ్జెట్‌లో ఎలా ప్రతిఫలించిందో చూద్దాం. సంవ త్సరం పాటు ఉద్యమం నడిపి ఇరకాటంలో పెట్టిన రైతాంగం పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి చూపిందనే ఆరోపణ ఉంది. పంటల సేకరణను అన్ని పంటలకూ విస్తరించి, లబ్ధిదారుల సంఖ్యను పెంచా లనే రైతుల కోరికకు భిన్నంగా... పంటల సేకరణకు కేటాయించిన మొత్తాన్ని 2021–22 బడ్జెట్‌లోని 2.48 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం 2.37 లక్షల కోట్లకు తగ్గించారు. పంటల సేకరణ తాలూకు లబ్ధిదారుల సంఖ్యను గతేడాదిలోని 1.97 కోట్ల మంది నుంచి 1.63 కోట్ల మందికి కుదించారు... అదీ కథ! ఎరువులపై ఇచ్చే సబ్సిడీ 2021–22 బడ్జెట్‌ తాలూకు 1,40,122 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 1,05,222 కోట్లకు అంటే 25 శాతం మేరకు తగ్గింది. మరో పక్క గ్రామీణ పేదలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఉపాధి పథకానికి 73 వేల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇది 74 వేల కోట్లు (అదనపు కేటాయింపులతో ఈ మొత్తం లక్ష కోట్ల మేరకు చేరుకుంది.) 

ఉపాధి హామీ చట్ట ప్రకారం, గ్రామీణ ప్రాంతంలోని పేదలకు, వారు పని చేయాలని కోరుకుంటే, సంవత్సరానికి కనీసం వంద పని దినాలకు హామీ ఇవ్వాలి. కానీ చాలా ఏళ్లుగా ఈ పథకానికి కేటా యింపులు తగినంతగా లేవు. దీనివల్ల 2020 ఆర్థిక సంవత్సరంలో కల్పించిన పని దినాలు 34.76 మాత్రమే. 2021 ఆర్థిక సంవత్సరంలో అవి మరింతగా దిగజారి 27.16కు పరిమితమయ్యాయి. అంతకు ముందటి కాలంలో ఇవి సగటున 42గా ఉన్నాయి. ఉపాధి పనులకు ఏర్పడ్డ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ పథకం సంతృప్తికర అమలు కోసం 2.64 లక్షల కోట్ల రూపాయలు అవసరమని ఒక ప్రఖ్యాత సంస్థ లెక్కించింది.

స్థూలంగా 2013–2019 మధ్యకాలంలో సాగుబడి ద్వారా రైతుల ఆదాయం తగ్గిపోయింది. ఒక రైతు కుటుంబానికి వారి ఆదాయంలో 48 శాతంగా ఉన్న సాగుబడి ఆదాయ వాటా ప్రస్తుతం 37 శాతానికి తగ్గింది. పేద ప్రజలకిచ్చే ఆహార సబ్సిడీపై కోత పడ్డది. 2,86,469 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుత బడ్జెట్‌లో 2,06,831 కోట్లకు తగ్గింది. ప్రపంచ క్షుద్బాధ సూచీలో 2021 సంవత్సరానికి మొత్తం 116 దేశాలలో భారతదేశం ర్యాంకు 94 నుంచి 101కి దిగజారింది. కోవిడ్‌ కాలంలో మరింత తీవ్రమైన ఆకలి సమస్యను ఈ ఆహార సబ్సిడీల కోత మరింత పెంచుతుంది.

దీన్ని మరింత జఠిలం చేస్తూ ధరలు పెరుగుతున్నాయి. దీని వెనుక అంతర్జాతీయంగా కమోడి టీల ధరల పెరుగుదల, దేశీయంగా విపరీతమైన పన్నుల భారం వలన పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదల, ఎస్మా వంటి చట్టాల రద్దు వలన పట్టపగ్గాలు లేని వ్యాపారస్తులు, దళారుల చేతివాటం, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కావడం వలన ధరలపై నియంత్రణ ఉంచ గల సమాంతర వ్యవస్థ దెబ్బతినడం వంటివి అన్నీ ఉన్నాయి. ఈ కారణాలలో మొదటిదాన్ని వదిలేస్తే, మిగతావన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలే. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అడ్డు రావడం వలన గత రెండు నెలలుగా నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు ఎన్నికల తరువాత పైకి ఎగసేందుకు సిద్ధంగానే ఉంది. ఈ నిర్వాకం చాలద న్నట్లు, ఈ మధ్య కాలంలో జీఎస్టీ శ్లాబులలో మార్పు చేస్తామంటూ ప్రస్తుతం 0 శాతం జీఎస్టీ ఉన్న కొన్ని సరుకులపై పన్నును విధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ సమస్యలన్నీ ఇలా ఉండగా, నిరుద్యోగం దేశ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగా లిస్తామనే హామీని తుంగలో తొక్కి... రానున్న కాలంలో 60 లక్షల ఉద్యోగాలంటూ కొత్త పల్లవిని అందుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చుతున్న బీజేపీ ప్రభుత్వం, నగర ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ పథకం కావాలనే డిమాండ్‌కు సహజంగానే అనుకూలంగా స్పందించలేదు.

ఈ మొత్తం క్రమంలో దేశ స్థూల జాతీయోత్పత్తి దిగజారింది. అనేకమంది అంతర్జాతీయ ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం, భారతదేశపు జీడీపీ గణాంకాలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో మోదీ ఘనంగా ప్రకటించిన జీడీపీని 5 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్ళడం అనేది వట్టి నీటిమూటే కాగలదు. పెద్ద నోట్ల రద్దు, అవకతవక జీఎస్టీ వంటి నిర్ణయాలకు తోడుగా కోవిడ్‌ వల్ల దిగజారిన పరిస్థితులను పునరుజ్జీవింప జేసేందుకు ఆర్థిక ఉద్దీపన ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ కొట్టాయి.

ప్రపంచమంతటా కూడా వామపక్ష ఆలోచనా విధానం బల పడుతోంది. ఫలితంగానే మింట్‌  సి ఓటర్‌ సర్వేలో మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్‌ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగా లంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. ఈ దిశగా, అమెరికా, యూరోప్‌ దేశాలూ, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా కొంత ప్రయత్నం మొదలైంది. ఉదాహరణకు, అమెరికా ప్రభుత్వం ద్రవ్య లోటును పట్టించుకోకుండా (14% పైగా ఉంది) ప్రజల కొనుగోలు శక్తిని, మార్కెట్‌ డిమాండ్‌ను పెంచేందుకు భారీ వ్యయాలు చేస్తోంది. యూరోపియన్‌ యూనియన్, చైనా కూడా అదే పని చేస్తున్నాయి. అంటే ఈ దేశాలు ప్రజలకు నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి.


వ్యాసకర్త ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు ‘ 98661 79615 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement