ముంబై: 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.375 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, జీడీపీ వృద్ధి ఏటా 8 శాతానికి పైనే నమోదు చేయాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ‘‘5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే అందుకు 5–6 శాతం వృద్ధి కచ్చితంగా సరిపోదు. 8 శాతం కంటే ఎక్కువే వృద్ధి సాధించాలి’’ అంటూ ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో భాగంగా అన్నారు. 8 శాతానికి మించిన వృద్ధి కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం అవుతాయన్నారు. తక్కువ పన్ను రేట్ల అమలుతో ప్రజలు, కార్పొరేట్ల చేతుల్లో నిధులు మిగులు ఉండేలా చూడాలన్నారు. వ్యాపార నిర్వహణ సులభతరం కావాల్సి ఉందని గుర్తు చేశారు. కార్పొరేట్ పన్నును కేంద్రం తగ్గించినందున ఈ విషయంలో వేలెత్తి చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసినప్పటికీ, జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి మెరుగుపడలేదని రజనీష్‌కుమార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో కఠిన నిర్ణయాలు, కఠిన సంస్కరణలు తీసుకునే ధోరణి ఉన్నా కానీ, అమలు పరంగా బ్యూరోక్రసీ వైపు నుంచి సమస్యలు నెలకొన్నట్టు పేర్కొన్నారు. ‘‘నేడు నేను కానీ, మీరు కానీ జిల్లా స్థాయిలో ఒక యూనిట్ పెట్టాలనుకుంటే భయానక అనుభవాన్ని ఎదుర్కోవాల్సిందే. జిల్లా స్థాయికి వెళితే అధికారుల తీరుతో వ్యాపార సులభతర నిర్వహణ అంతా కనిపించకుండా పోతుంది’’ అని రజనీష్ వాస్తవ పరిస్థితులను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment