‘దేనికీ వెరువని ధైర్యసాహసాలు, ముక్కుసూటితనంతో దూసుకుపోయే యువతే ఈ దేశ భవిష్యత్ నిర్మాతలు!’
– స్వామి వివేకానంద
యూఎన్‌ఎఫ్‌పీఏ.. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 నివేదిక ప్రకారం (ఆ నివేదిక విడుదలయిన నాటికి) మన దేశ జనాభా.. 142.86 కోట్లు. 142.57 కోట్ల జనాభాతో ఉన్న చైనాను దాటేసి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా పాపులేషన్ లిస్ట్‌లో ముందున్నాం. ప్రపంచమంతటా 15 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు జనాభా 65 శాతం ఉంటే.. అది ఒక్క మన దగ్గరే 68 శాతం ఉంది. ఈ జనాభాను ప్రపంచం.. వర్కింగ్ పాపులేషన్ అంటోంది. అంటే శక్తియుక్తులున్న మానవ వనరుల సమూహం.. మనకు అనుకూలమైన అంశం.
ప్రపంచంలోకెల్లా అధిక జనాభా గల దేశంగానే కాదు.. అత్యధిక యువత ఉన్న దేశంగానూ ప్రథమ స్థానంలో ఉన్నాం. అంటే స్వామి వివేకానంద కోరుకున్న లక్షణాలతో ఉన్న యువతరం అన్నమాట. అడ్డూ అదుపూ లేని జనాభాతో వనరులను హరిస్తూ.. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తుందని అభివృద్ధి చెందిన దేశాలు ఆగ్రహపడినా.. వెంటనే అసూయపడేలా చేస్తోంది ఈ యువతే. ప్రపంచానికి అతి పెద్ద మార్కెట్‌గానే కాదు.. ప్రపంచ ఉత్పాదక రంగానికి అవసరమైన అద్భుత మానవ వనరులకూ మన నేలను కేంద్రంగా మలుస్తోంది. ఈ మనుషుల ఎడారిలో కనిపిస్తున్న ఆ ఒయాసిస్సే ఈ దేశం శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశాన్నీ కల్పిస్తోంది. జపాన్‌తోపాటు అభివృద్ధి చెందిన చాలా దేశాలు జనాభా.. అందులో యువత తక్కువగా ఉండడంతో తీవ్రమైన వర్క్‌ఫోర్స్‌ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ఆయా దేశాల ఉత్పాదక రంగం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దాంతో ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఆ క్రమంలోనే 68 శాతం వర్కింగ్ పాపులేషన్‌తో మనం చాలా రిచ్‌గా ఉన్నాం.. అనే భావనలోనే కాదు.. ఆ దిశగా కృషిచేస్తే ప్రాక్టికల్‌గానూ ధనికదేశంగా మారగలం. ప్రపంచ మార్కెట్‌ని శాసించగలం. ఈ విషయంలో చైనానూ అధిగమించగలం.
సవాళ్లు
దేశ ఆర్థికాభివృద్ధికి యువతను ప్రధానవనరుగా మలచుకోవడం అత్యంత అవసరం. కానీ కార్యాచరణలో అదంత ఈజీ కాదు. ఆ లక్ష్యం చేరుకోవడానికి మౌలిక సదుపాయాలు, నిర్మాణాత్మకమైన ప్రణాళికలూ లేవు. ఏ జనాభాలోంచి వర్కింగ్ పాపులేషన్‌ను చూసి మురిసిపోతున్నామో.. ఆ వర్కింగ్ పాపులేషన్‌లోనే ఏ ఉపాధిమార్గంలేని వాళ్ల శాతం ఎక్కువగా ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) లెక్కల ప్రకారం.. 2022 నాటికి మన దగ్గరున్న నిరుద్యోగిత 23.22 శాతం. 2018లో ఇది 4.9 శాతమే. ఈ పెరుగుదలకు కరోనా పరిస్థితులూ ఒక కారణం. పాండమిక్‌లో కోటీ తొంభైలక్షల యువత ఉద్యోగాలను కోల్పోయిందని కొన్ని సర్వేల సారాంశం. పని ఉన్నవారు కూడా చదువుకు సరిపడా కొలువులు దొరకక దొరికిన కొలువుల్లో తక్కువ వేతనాలతో సర్దుకోవాల్సిన పరిస్థితి.
ది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎమ్‌ఐఈ) అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే (2022) ప్రకారం ..ఈ నిరుద్యోగ పర్వంలో హరియాణ 37. 4 శాతం, రాజస్థాన్ 28.5 శాతం, ఢిల్లీ 20.8 శాతం పెరుగుదలతో మొదటి మూడు స్థానాల్లో తలవంచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతం, తెలంగాణలో 4.1 శాతం పెరిగింది. ఉపాధి కల్పన లేమి.. పట్టణాలు, నగరాల్లో కన్నా గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణాల్లో మళ్లీ అధిక జనాభాదే మొదటి స్థానం. మిగతా కారణాల్లో.. అక్షరాస్యత.. ఉపాధి కల్పనల మధ్య అసమాన నిష్పత్తి, వ్యవసాయాధారిత పరిశ్రమలు తగినంతగా లేకపోవడం.. వ్యవసాయం నుంచి వలసలు (ఈ రెండిటినీ పరిగణించాలి), కుటీర, చిన్నతరహా పరిశ్రమలు దెబ్బతినడం, ఉమ్మడి కుటుంబాలు ఉన్న చోట్ల.. ఆ కుటుంబంలో ఒకరే వారసత్వ వ్యాపారాన్ని నిర్వహిస్తూండడం.. మిగిలిన వాళ్లకు పనిలేకపోవడం, కుటుంబ బాంధవ్యాలకు లోబడి కార్మికులు, శ్రామికులు స్వస్థలం వదిలి వెళ్లలేకపోవడం వంటివాటితోపాటు మార్కెట్ డిమాండ్‌కి అనుగుణమైన నైపుణ్య శిక్షణ లేకపోవడమూ కనిపిస్తున్నాయి.
నైన్ టు ఫైవ్
దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరచడంలో యువత ప్రధాన వనరుగా ఉపయోగపడకపోవడానికి ఆ తరం ఎదుర్కొంటున్న రెండు ముఖ్యమైన అడ్డంకులను చూపిస్తున్నారు నిపుణులు. మొదటిది.. కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టేందుకు కావల్సిన సాఫ్ట్ స్కిల్స్ వారిలో లేకపోవడం. రెండవది.. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి కావల్సిన మెళవకువలూ కరువవడం. ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండూ ఉన్న యువతకూ తగినంత ప్రోత్సాహం లేదు. ముఖ్యంగా కుటుంబపరమైన మద్దతు లభించడం లేదు.
సొంతంగా వ్యాపారం చేద్దామనే యువత ఆశయం, ఉత్సాహం మీద సొంత కుటుంబాలే నీళ్లు చల్లుతున్నాయి.. కెరీర్‌తో తమ పిల్లలు ఎలాంటి ఆటలు ఆడకుండా నెలనెలా వేతనంతో భద్రమైన జీవితాన్ని గడపాలనే కోరికతో! ప్రయోగాలకు పోయి పిల్లలు నష్టాలను తెస్తే నెత్తికెత్తుకునే ఆర్థిక సామర్థ్యం.. వాళ్లకు అండగా నిలబడే నైతిక స్థయిర్యం లేకపోవడమే ఆ వెనుకడుగుకు కారణం కావచ్చు. అందుకే పిల్లల ఉత్సాహం కన్నా భరోసానిచ్చే ఆర్థిక భవిష్యత్ పట్లే పెద్దలు మొగ్గు చూపుతున్నారు. నెలవారీ జీతపు ఉద్యోగాల దిశగానే వారిని ప్రోత్సహిస్తున్నారు. అయితే నైన్ టు ఫైవ్ జాబులే సర్వస్వం కాదనే సత్యాన్ని గ్రహించాలి. అలాగని ఇలా వ్యాపారం పెట్టగానే అలా కోట్లలో లాభాలు వచ్చిపడతాయి.. అవి తిరిగి పెట్టుబడులుగా మారి.. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనే నమ్మకాన్ని ఎవరూ ఇవ్వలేరు. కానీ ప్రయత్నం జరగాలి. ఈ రోజు యువత ఆ ధైర్యం చేయలేకపోతే రేపటి యువతకు ఎక్కడి నుంచి ప్రేరణ అందుతుంది?
నేడు విజయపథంలో ఉన్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటియం, ఓలా వగైరా సంస్థలు నిన్న ధైర్యం చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టినవే. ఒడిదుడుకులు తెలిసి.. తట్టుకునే మెకానిజమూ అర్థమై నేడు మార్కెట్‌లో తమ సేవలకు డిమాండ్ కల్పించుకుంటున్నవే! అందుకే దిగితేకానీ లోతు అంతుబట్టదు. ఐడియాలను కార్యాచరణలో పెడితే కానీ సక్సెస్ చేతికి చిక్కదు. గ్లోబలైజేషన్ తర్వాత రోజ్‌గార్ బజార్ రూపురేఖలు మారిపోయాయి. సర్కారు కొలువుల పరిధి తగ్గుతూ వస్తోందా.. ప్రైవేట్ జాబ్స్ విస్తృతమవుతున్నాయా అనేది తెలియదు కానీ పెను మార్పయితే స్పష్టమయింది. తదనుగుణంగానే యువత అడుగులూ అనివార్యం అయ్యాయి. కంప్యూటరీకరణ నేపథ్యంలో ఉద్యోగాల కోసం సాంకేతిక పరిజ్ఞానం ఎలా తప్పనిసరి అయిందో ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార దక్షత కూడా అంతే తప్పనిసరి అవుతోంది. మారిన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో అందరూ నైన్ టు ఫైవ్ ఉద్యోగాల కోసమే దరఖాస్తు చేసుకుంటే వాటిని సృష్టించే సంస్థలు ఉండొద్దూ? ఆ సంస్థలను నడిపే వ్యాపారవేత్తలు.. పారిశ్రామిక గణం రావద్దూ? ఆ చొరవ తీసుకోవడానికి.. చూపడానికి కావల్సిన శక్తియుక్తులున్న యువత మన దగ్గరే ఉంది. వారికి కావల్సింది ప్రభుత్వం నుంచి కాస్త ఆర్థిక ఆలంబన.. కుటుంబం నుంచి కాసింత నమ్మకం! ఆ రెండూ ఇస్తే ఐడియాలతో స్టార్టప్‌లను పండిస్తూ వాప్యార దక్షతను పెంపొందించుకుంటుంది. బడా పారిశామికవేత్తల పెట్టుబడులను రాబట్టుకుంటుంది. వేలసంఖ్యలో కొత్త కొలువులను సృష్టిస్తుంది.
ఆశాకిరణాలు..
నికరంగా వేతనాలు అందే ఉద్యోగాలే చేయాలనే తల్లిదండ్రుల ఒత్తిడినీ, పెట్టుబడుల కొరతనూ లెక్కచేయక ముందడుగు వేస్తున్న యువతా ఉన్నారు. కాబట్టే మన దగ్గర స్టార్టప్ కల్చర్ దినదిన ప్రవర్థమానమవుతోంది. ఎంతోమంది యంగ్ అంట్రప్రెన్యూర్స్‌ని సృష్టిస్తోంది. ఇందుకు ఓయో రూమ్స్ సీఈఓ రితేశ్ అగర్వాల్ చక్కటి ఉదాహరణ. 2013లో.. అంటే తన పందొమ్మిదో ఏట .. ‘ఓయో రూమ్స్’ ప్రారంభించాడు. సరసమైన ధరలో.. సౌకర్యవంతమైన ఒక బసను వెదకడంలో విఫలమైన ఫ్రస్ట్రేషన్‌తో అతను ఈ కంపెనీని స్థాపించాడు. ఈ రోజు ప్రపంచంలోకెల్లా యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా పేరుపొందాడు. ఫోర్బ్స్ – 30 అండర్ 30 లిస్ట్ ఫర్ ఆసియాలోనూ స్థానం సంపాదించుకున్నాడు.
ఈ వరుసలోనే లాజిస్టిక్ స్టార్టప్ ‘పోర్టర్’ ఫౌండర్ ప్రణవ్ గోయెల్‌నీ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్టార్టప్ 500 సభ్యుల టీమ్‌గా..సిఖోయా కాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి ఇన్వెస్టర్స్‌తో వంద మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో విరాజిల్లుతోంది. లెన్స్‌కార్ట్ గురించి తెలుసు కదా! దాని ఫౌండర్ పియూష్ భన్సాల్ కూడా యంగ్‌చాప్.. 2010లో ఆ పోర్టల్‌ను స్థాపించినప్పుడు! ఫోర్బ్స్ – 30 అండర్ 30లో ఉన్నాడు.
అందరూ అబ్బాయిలేనా.. మరి అమ్మాయిలూ? అనే క్వశ్చన్ మార్క్ ఇమోజీని డిలీట్ చేయండి. అంట్రప్రెన్యూర్స్‌గా అమ్మాయిల సంఖ్యా తక్కువేం లేదు మన దగ్గర. దేశంలోని 58 శాతం మహిళా అంట్రప్రెన్యూర్స్ .. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులోనే ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించారు. వీళ్లంతా తమ తాతల, తండ్రుల వ్యాపారాన్ని నడుపుతున్నవారు కాదు. ఇండిపెండెంట్ అంట్రప్రెన్యూర్స్. వాళ్లలో ‘మెన్‌స్ట్రుపీడియా’ ఫౌండర్ అదితి గుప్తా.. మోస్ట్ సక్సెస్‌ఫుల్ అంట్రప్రెన్యూర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది.
శ్రీలక్ష్మి సురేశ్.. దేశంలోకెల్లా అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా అంట్రప్రెన్యూర్. 2020లో తన ఇరవయ్యొకటో ఏటకల్లా.. ప్రపంచంలోనే యంగెస్ట్ వెబ్ డిజైనర్ కమ్ సీఈఓగా పేరు పొందింది. తన ఎనిమిదవ ఏటనే కోళికోడ్‌లోని తన స్కూల్‌కి వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసింది. శ్రీలక్ష్మి ‘ఎస్‌ఈఓ’ అనే వెబ్ డిజైన్ కంపెనీని ప్రారంభించేనాటికి ఆమెకు పదేళ్లు. ఒక్క తన స్కూల్‌కే కాదు దేశంలోని ఇతరత్రా వాటికోసం ఆమె ఓ వంద వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేసింది. వీళ్లంతా దేశంలో స్టార్టప్ కల్చర్ వృద్ధికి ఆశాకిరణాలు!
మేధో వలస..
దేశానికి యువత.. బలంగా మారకుండా అడ్డంపడుతున్న మరో సవాలు మేధో వలస. తమ ప్రతిభాపాటవాలకు సరైన గుర్తింపు, జీతభత్యాలు, వాళ్లు కోరుకున్న జీవన ప్రమాణాలు లేక ఎంతోమంది యువతీయువకులు విదేశాల బాట పడుతున్నారు. పైగా మన దగ్గర ఉద్యోగాలకు పోటీ ఎక్కువ. ఈ వలస తాత్కాలిక పరిణామంలాగే కనిపిస్తుంది కానీ మన ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాల నష్టాన్ని చేకూరుస్తోంది. ఈ మేధో వలసల్లో ముఖ్యంగా ఐఐటీయన్లే ఉంటున్నారు. మన ఐఐటీల్లో శిక్షణ పొందిన విద్యార్థులను అత్యుత్తమ మానవ వనరులుగా గుర్తిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అందుకే ఐఐటీ పట్టభద్రుల పట్ల విదేశీ సంస్థలకు విపరీతమైన క్రేజ్! దాంతో వీళ్లకు ఊహించని రీతిలో వేతనాలిస్తూ తమ సంస్థల్లో ప్లేస్‌మెంట్స్‌ని కల్పిస్తున్నాయి.
వాళ్లు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులవడానికి విదేశాల్లో ఉన్నత విద్యను అందించడానికీ పోటీ పడుతున్నాయి. అందుకే బ్రెయిన్ డ్రెయిన్‌కి బ్రేక్ పడడం లేదు. ఈ వలసలన్నీ ప్రధానంగా అమెరికాకే తరలుతున్నాయి. విదేశాలకు వెళుతున్న ఐఐటియన్లలో 65 శాతం మందికి అమెరికాయే మజిలీ. ప్రపంచంలోని 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ జారీ చేసే హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసాల లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్నది మన ఐఐటీ విద్యార్థులే. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఐఐటీ హోదా కల్పించిన తరువాత ఆ ఇన్‌స్టిట్యూట్‌లోని స్టూడెంట్స్‌కి విదేశాల్లో 540 శాతం ప్లేస్‌మెంట్స్ పెరిగాయంటే మన ఐఐటీలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2015 నుంచి దాదాపు లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు అంచనా. 2014 నుంచి దాదాపు 2300 మంది సంపన్నులు దేశాన్ని వీడి విదేశాలకు వెళ్లిపోయారు. వీళ్లంతా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాలే! త్వరిత గతిన మన దేశాన్ని అభివృద్ధి పరచగల ప్రతిభాసామర్థ్యాలే! అందుకే వేగిరంగా ఈ మేధో వలసను ఆపే ప్రయత్నాలు మొదలుపెట్టాలి.
అమ్మాయిల భాగస్వామ్యం..
ఎన్‌ఎస్‌ఎస్‌ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) సర్వే ప్రకారం.. పదిహేను నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిల్లో దాదాపు యాభై శాతం మంది అమ్మాయిలు ఇటు చదువుకోవడమూ లేదు అటు ఉద్యోగాల్లోనూ లేరు. కారణం.. కుటుంబ బాధ్యతలు, పెళ్లి! ఆశ్చర్యపోకండి! ఈ దేశంలో చాలా విషయాల్లో వైవిధ్యమైన పరిస్థితులు ఉన్నట్లే స్త్రీ సమానత్వం విషయంలోనూ భిన్నమైన వాతావరణం ఉంది. స్త్రీవాద ఉద్యమాలతో చైతన్యం పొందిన ప్రాంతాల్లోనే ఇంకా అసమానతలు కన్పిస్తుంటే అసలు ఆ ఊసే లేని ప్రాంతాల్లో అమ్మాయిల స్థితి ఎలా ఉండొచ్చు! దీనికి సమాధానమే ఆ సర్వే. దాన్నిబట్టే అర్థమవుతోంది వర్క్‌ఫోర్స్‌లో అమ్మాయిల భాగస్వామ్యం ఎంతో! ఆడపిల్ల ఉద్యోగం చేయాలా? వద్దా? ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలి? ఆ మాటకొస్తే చదువు దగ్గర నుంచే ఆ నిర్ణయం మొదలవుతోంది. అయితే అమ్మాయిది కాదు.. కుటుంబానిది. విద్యావంతుల కుటుంబంలోని అమ్మాయిలకు తమకు ఇష్టమైన చదువు చదివే స్వేచ్ఛ దొరికినా.. కెరీర్ విషయానికి వచ్చేసరికి పెళ్లి అనేది దాన్ని సాగనివ్వడంలేదు. ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడకు వెళ్లి బాధ్యతలు నిర్వర్తించాలి. ఇది పెళ్లికాని అమ్మాయికి కూడా అడ్డంకిగానే ఉంది. ‘ఇంకా ఇలాంటి పరిస్థితులున్నాయా విడ్డూరం కాకపోతే అని ముక్కున వేలేసుకునే పనిలేదు. ఇప్పటికీ మనదేశంలో.. అమ్మాయిలకు చదువు, ఉద్యోగం కన్నా పెళ్లే ఆర్థిక భద్రతను, భరోసాను ఇస్తుంది అని భావించే కుటుంబాలే ఎక్కువ’ అంటారు ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత్రి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ లేఖా చక్రవర్తి. ఇలా పెళ్లి, పిల్లలు అనే బాధ్యత వర్క్‌ఫోర్స్‌లో అమ్మాయిల భాగస్వామ్యాన్ని తగ్గిస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. ఈ విషయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యత్యాసం తగ్గాలి. అవగాహనా కార్యక్రమాలు పెరగాలి.
ప్రభుత్వం అందిస్తున్న కొన్ని సహాయాలు..
దేశంలో ఇప్పుడు అంట్రప్రెన్యూర్ రంగంలో చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రాణించేందుకు యువతకు అవసరమైన శిక్షణను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వంలోని స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ అంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ. ఆ శిక్షణతో యువత అంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగి.. ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించే చాన్స్ ఉంది. స్కిల్ ఇండియా మిషన్.. పాతికేళ్లలోపు యువతకు వృత్తి శిక్షణ, పాలిటెక్నిక్, ఐటీ, సాఫ్ట్‌స్కిల్స్ డెవలప్‌మెంట్ వంటి కోర్సులను బోధిస్తోంది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వగైరాల ద్వారా స్టార్టప్ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్స్‌ను చేపడుతోంది. అంట్రప్రెన్యూర్‌షిప్ దిశగా యువతను ప్రోత్సహించడానికి పెట్టుబడుల కోసం ఆర్థిక మద్దతునూ అందిస్తోంది. పన్ను రాయితీలు కల్పిస్తోంది. కొత్త ఇంక్యుబేటర్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఉన్న ఇంక్యుబేటర్ల సామర్థ్యాన్ని పెంచుతోంది. దేశంలోని పట్టణ, నగరాల్లోని యువత కన్నా గ్రామీణ యువతే అంట్రప్రెన్యూర్‌షిప్ పట్ల ఉత్సుకతతో ఉన్నారు. అందుకే ప్రధాన్‌మంత్రి కుశల్ కేంద్రాలు అంట్రప్రెన్యూర్‌షిప్ హబ్స్‌గా మారి ఆసక్తి ఉన్న ట్రైనీలను అంట్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దుతున్నాయి. అంతేకాదు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్‌ఐడీబీఐ, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్‌ఎస్‌ఈటీఐఎస్) వంటి స్థానిక సంస్థలతో కలసి చదువుకున్న యువతకు స్టార్టప్స్‌లో శిక్షణనిస్తోంది. విజయవంతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నేషనల్ అంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డ్స్‌నీ స్థాపించింది. కాలేజ్‌స్టూడెంట్స్‌లోని అంట్రప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌ని వెలికి తీసి వారికి శిక్షణనిస్తోంది. నైపుణ్యంగల మానవ వనరులను తయారు చేస్తోంది.
సృజనాత్మక రంగాల్లో..
ఉన్నత విద్య మీద నిర్వహించిన ఆల్ ఇండియా సర్వే రిపోర్ట్‌లో ఇంజినీరింగ్ (బీటెక్ అండ్ ఎమ్‌టెక్)లో కోవిడ్ కంటే ముందు అయిదేళ్లలో దాదాపు 6,37,781 అడ్మిషన్లు పడిపోయాయని తేలింది. అదే సమయంలో సృజనాత్మక రంగాలైన ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ, డిజైనింగ్, లింగ్విస్టిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది. 2018–19 విద్యా సంత్సరంలో 53, 213 మంది విద్యార్థులు పలురకాల ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు పొందారు. ఈ వృద్ధి ఆయా రంగాల్లో కొత్త కొలువులు ఏర్పడేందుకు దోహదపడుతోందనేది విద్యావేత్తలు, ఆర్థికవేత్తల అభిప్రాయం. ‘భారతీయ సినిమా మీద సోషల్ మీడియా, డిజిటలైజేషన్ ప్రభావాన్ని కాదనలేం. థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద సినిమా ప్రదర్శన గురించి ఏనాడైనా ఊహించామా? ఈ మార్పు ఆయా రంగాల్లో ఎన్నో కొత్తరకాల∙ఉద్యోగాలకు దారితీస్తోంది. వాటిల్లో వీడియో అండ్ ఫిల్మ్ ఎడిటింగ్, ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సౌండ్ రికార్డింగ్ వంటివి మచ్చుకు కొన్ని. నేటి యువత ఇదివరకటిలా కెరీర్‌కి సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలను పట్టుకు వేళ్లాడట్లేదు. సాంకేతిక విప్లవ ప్రపంచంలో ఎలాగైనా బతకగలమనే ధైర్యం వాళ్లకుంది. ఏ ఉద్యోగమైనా తిండి పెడుతుంది అనే భరోసా కలిగింది. అందుకే నచ్చిన ఉద్యోగాలను ఇచ్చే చదువులను ఎంచుకుంటున్నారు. కొందరైతే చదివిన చదువుతో సంబంధం లేకుండా కొత్త కొత్త కొలువులతో ప్రయోగాలు చేస్తున్నారు.
అమ్మాన్నానల అంచనాలను సంతృప్తి పరచడమా లేక తమకు నచ్చినట్టు ఉండడమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు కచ్చితంగా తమకు నచ్చిన ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛనే వాళ్లు తీసుకుంటున్నారు. అలాగని పిల్లల ఇష్టాల్ని సపోర్ట్ చేయని తల్లిదండ్రులే అందరూ అని చెప్పడానికీ లేదు. చాలా మంది పెద్దలు కూడా పిల్లల సృజనాత్మకత మీద నమ్మకంతో వాళ్లకు నచ్చిన దారిలో వాళ్లు వెళ్లే స్వతంత్రాన్నిస్తున్నారు. అండగా నిలబెడుతున్నారు. దాంతో సృజనాత్మక రంగాలైన డిజైనింగ్, ఫ్యాషన్, రైటింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ వంటివాటిల్లో నేటి యువత రాణిస్తోంది. ఆ రంగాలకూ డిమాండ్ పెరిగి.. ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. కాబట్టి సృజనాత్మక రంగాలను పాఠశాల, కళాశాల స్థాయిలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌గానే చూడకుండా.. మంచి ఉద్యోగావకాశాలు కల్పించే రంగాలుగానూ గుర్తించి.. ఆ దిశగా వాటిని సిలబస్‌లో చేర్చాలి’ అంటారు న్యూ ఢిల్లీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని కల్చర్ డిపార్ట్‌మెంట్ అధిపతి మిర్ ఇంతియాజ్. ‘విదేశాల్లో లాగా బయటి క్రియేటివ్ ఇండస్ట్రీకి, అకాడమిక్స్‌కి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేసేలా ఓ పాలసీని తయారు చేయాలి. అప్పుడే యువతకు ఫలానా కోర్స్ చదివితే ఫలానా రంగంలో ఫలానా ఉద్యోగాలు ఉన్నాయనే అవగాహన కలుగుతుంది. ఇప్పుడెలాగైతే కంప్యూటర్ సైన్స్ చదివితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలున్నాయని తెలుస్తోందో అలాగా’ అని అభిప్రాయపడుతున్నారు పుణెలోని ఎమ్‌ఐటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లోని ఫిల్మ్ అండ్ వీడియో డిజైన్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఇంద్రజిత్ నియోగి. ‘సీబీఎస్‌ఈ సిలబస్ ఎడ్యుకేషన్ పాటర్న్‌లో ఈ రకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం క్రియేటివ్ కోర్సుల్లో అంట్రప్రెన్యూర్ షిప్ కరిక్యులమ్‌ని తప్పనిసరి చేసింది. దీని వల్ల ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రుల ఆలోచనా తీరు మారి.. పిల్లల్లోని సృజనాత్మకత పెంపొందే అవకాశం ఉంటుంది’ అని చెబుతున్నారు విద్యారంగ నిపుణులు.
ముగింపు
దేశంలో ప్రతి ఏటా దాదాపు కోటి మంది యువత వర్క్‌ఫోర్స్‌లోకి వస్తోందని అంచనా. ఇప్పుడున్న అవకాశాలు సరిపోవడం లేదు. అదీగాక మన దగ్గరున్న యువతరం దాదాపుగా.. ఉపాధి కల్పన అంతగాలేని గ్రామీణ, చిన్న చిన్న పట్టణాలకు చెందినదే. చిన్న చిన్న పట్టణాల్లో చాలామంది అమ్మాయిలు సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా మారాలని ఆశిస్తున్నారు. వారిలో నేర్చుకునే తపనకు.. సృజనాత్మక ఆలోచనలకేం కొదువలేదు. కావల్సిందల్లా సరైన మార్గదర్శకత్వం.. అవసరమైన మౌలిక సదుపాయాలు. ఇందాకే చెప్పుకున్నట్టు వీళ్లంతా మన దేశ ఆర్థిక ప్రగతికి అవాకాశాలు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన చాలా దేశాలు యువ జనాభా లేక ఉస్సూరుమంటున్నాయి. వాటిల్లో జపాన్ ఒకటి. అలాంటి దేశాలకు మన యూత్ వరం. మన దగ్గరి ప్రతిభావంతులైన యువతకు వాళ్ల దేశంలో మంచి కొలువులు ఇస్తానని ఇప్పటికే జపాన్ మనదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి ఒప్పందాలను మనం ఇంకెన్నో దేశాలతో చేసుకునే వీలుంది.
అయితే ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన యువతను తయారు చేయాలి. మనకున్న మరో అనుకూలాంశం. పెరుగుతున్న మధ్యతరగతి. వీళ్లే అతిపెద్ద వినియోగదారులు. మన డొమెస్టిక్ గ్రోత్‌కి డ్రైవర్స్. అందుకే పెట్టుబడులకూ మన దేశాన్ని మించింది లేదు. ఆ పెట్టుబడులే ఉద్యోగాలనూ సృష్టిస్తున్నాయి. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ యువతకు ఉపాధి కల్పించినప్పుడే సాధ్యమవుతుంది. ఇదే ప్రభుత్వాల ఎజెండా కావాలి. అప్పుడే మనం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతాం!
Comments
Please login to add a commentAdd a comment