రెపో రేటు తగ్గింపు వృద్ధి సంకేతమేనా? | Guest Column By Paparao Over Repo Rate | Sakshi
Sakshi News home page

రెపో రేటు తగ్గింపు వృద్ధి సంకేతమేనా?

Published Sat, Jun 8 2019 4:29 AM | Last Updated on Sat, Jun 8 2019 4:29 AM

Guest Column By Paparao Over Repo Rate - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సందర్భం

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) జూన్‌ 6, 2019న తన వడ్డీరేట్లను (రెపో రేటు) 25 పాయింట్ల మేర తగ్గించింది. దీనితో ఆర్బీఐ రెపో రేటు ప్రస్తుతం 5.75కు చేరింది. ఈ విధంగా రెపోరేటును తగ్గించడం ఈ మధ్యకాలంలో ఇది 3వ దఫా! ఈ రెపో రేటు తగ్గింపు వలన గృహ, వాహన రుణాలపై వడ్డీల స్థాయి తగ్గి, అవి మరింత చౌక అవుతాయి. అంతిమంగా ఈ రేట్ల తగ్గింపు ఉద్దేశ్యం కూడా రుణ స్వీకరణను పెంచడం, ఇప్పటికే తీసుకున్న రుణాలపై వడ్డీల చెల్లింపు భారాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే! మన దేశ ఆర్థిక వృద్ధి రేటు గత అనేక మాసాలుగా, గణనీయంగా దిగజారుతోంది. 2018–2019 కాలానికి సంబంధించిన 3వ త్రైమాసికంలో 6.6%గా ఉన్న స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి) వృద్ధిరేటు 4వ త్రైమాసికంలో 5.8%కి దిగజారింది. దీని వలన, 2018–2019 ఆర్థిక సంవత్సర మొత్తం కాలానికి గానూ జీడీపీ స్థాయి. 6.8 గానే ఉంది. అంటే గత రెండేళ్లుగా చైనా కంటే అధిక వృద్ధి రేటును సాధించి ఆర్థిక అబివృద్ధిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నామని అనుకున్న మనం నేడు ఆ స్థానాన్ని కోల్పోయాం!!

ఈ నేపధ్యంలోనే, దిగజారుతున్న వృద్ధిరేటును పెంచడం, 45 సం‘‘ల గరిష్ట స్థాయికి (6.1%) చేరిన నిరుద్యోగాన్ని తగ్గించడం అనే లక్ష్యాలకు నేటి ఆర్బీఐ రెపోరేట్లు తగ్గింపు కూడ దోహదపడగలదనే అంచనాలు వున్నాయి. కాగా, వాస్తవాలు ఈ అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. తొలి రెండు దఫాల రెపోరేట్ల తగ్గింపు ద్వారా ఆర్బీఐ ఇప్పటివరకూ మొత్తంగా 50 పాయింట్ల మేర (0.5%) వడ్డీ రేట్లను తగ్గించింది. కానీ,  ఈ తగ్గిన రెపోరేట్లు లేదా వడ్డీ రేట్ల లబ్దిని పొందిన కమర్షియల్‌ బ్యాంకులు మాత్రం తామిచ్చే రుణాలపై తమ తమ వడ్డీ రేట్లను కేవలం 5 నుంచి 10 పాయింట్ల మేరకే (0.05% నుంచి 0.1%) తగ్గించాయి అంటే, కమర్షియల్‌ బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్బీఐ తగ్గించిన స్థాయిలో లేదు. తద్వారా,  అవి ఆర్బీఐ వడ్డీరేటు తగ్గింపు ప్రయోజనాన్ని తమ రిటైల్, కార్పోరేట్‌ కస్టమర్లకు పూర్తి స్థాయిలో అందించడం లేదు.

దీనికి ఒక ప్రధాన కారణం తాము గనక తమ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించుకుంటే, తమకు లభించే ఆదాయం తగ్గిపోతుందని బ్యాంకులు ఆందోళన చెందడమే! ఈ రకంగా, బ్యాంకుల ఆదా యం తగ్గితే అవి తమ వ్యయాలను కూడ తగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే, అవి తాము ప్రజల నుంచి తీసుకునే డిపాజిట్లపై, తామిచ్చే వడ్డీరేట్ల స్థాయిని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇదే జరిగితే  రాబడి తగ్గిన డిపాజిటర్లు తమ సొమ్ముపై మెరుగైన రాబడి కోసం, మరో దారి వెతుక్కుంటారు. ఇప్పటికే పెరిగిపోయిన మొండి బకాయిలూ, అలాగే పెద్దనోట్ల రద్దుతో తగిలిన దెబ్బవలన పలు బ్యాంకులకు మూల ధన కొరతలు లేదా లోట్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దానికి తోడు తగ్గించిన వడ్డీరేట్ల ప్రభావం వలన ఆయా బ్యాంకులలో కస్టమర్ల డిపాజిట్లు విత్‌డ్రా కావడం లేదా కొత్త డిపాజిట్లు రాకపోవడం గనుక తోడయితే, ఇది ఆయా బ్యాంకులకు మూలిగే నక్కమీద తాటికాయే కాగలదు.

కాబట్టి రెపోరేట్లు తగ్గింపు లక్ష్యమైన, ప్రజల చేతిలో అదనపు ఆదాయం ఉండేలా చూసి, తద్వారా మార్కెట్లో సరుకులూ, సేవల డిమాండ్‌ను పెంచాలనే లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈ చర్య ఉండజాలదు. దానితో పాటుగా మొండి బకాయిలు భారీగా పెరిగి పోయాక, నేడు మన ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా పెద్దగా కొత్త రుణాల మంజూరుకు సానుకూలంగా లేవు. అలాగే ఒకవేళ రుణాల మంజూరును డిమాండ్‌ మేరకు భారీగా పెంచుకోవాలన్నా నేడు పలు బ్యాంకుల వద్ద, తగిన మేరకు నగదు లేదు. అందుకే ప్రభుత్వం వివిధ బ్యాంకులకు మూల ధనాన్ని (రూ. 40,000 కోట్లు) సమకూర్చాలనే డిమాండ్‌ కూడా వినపడుతుంది.

దీనంతటితో పాటుగా, బ్యాంకింగ్‌యేతర ఫైనాన్స్‌ సంస్థలలో కూడా త్రీవ స్థాయిలో నెలకొన్న సంక్షోభం, దివాలాలు ప్రజలకూ, కార్పోరేట్లకూ రుణ అందుబాటు సమస్యను మరింత తీవ్రతరం చేసాయి. కాబట్టి, ప్రస్తుతం దేశంలోని ఆర్థిక వృద్ధిరేటు దిగజారుడు, పెరిగిపోతున్న నిరుద్యోగం ఫలితంగా పడిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి వంటి సమస్యలను పరిష్కరించేందుకు రెపోరేట్ల తగ్గింపు వంటి పైపై ఉపశమన, ఉద్దీపన చర్యలు ఏమాత్రం సరిపోవు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం దాని తాలూకు దుస్థితిలో కావల్సింది కాయకల్ప చికిత్స మాత్రమే!! ఆ చికిత్స ఖచ్చితంగా, దేశంలోని మెజారిటీ ప్రజల జీవనాధారం అయిన వ్యవసాయ రంగాన్ని లాభదాయకం చేయడంలో మాత్రమే ఉంది!! ఆర్బీఐ రెపోరేట్లను తగ్గించిన రోజునే (జూన్‌ 6, 2019) షేర్‌ మార్కెట్‌ సూచీలు ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పతనాన్ని (552 పాయింట్లు సెన్సెక్స్‌) నమోదు చేయడం దీన్నే చెబుతోంది.

డి. పాపా రావు
వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు
మొబైల్‌ : 98661 79615 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement