
‘అరుణతార’కు పునర్‌వైభవం
టీడీపీ ఆవిర్భావం తర్వాత కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్నికల రాజకీయాలలో భాగమయ్యాయన్న అపప్రథను మూటగట్టుకున్నాయి. దీంతో నాలుగు సీట్ల కోసం ఏ పార్టీతోనైనా జతకట్టేందుకు అవి సిద్ధపడతాయన్న చులకన ఏర్పడింది.
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రా మం తరువాత దేశంలో జరి గిన రెండవ పెద్ద సాయుధ పోరాటంగా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేరుగాంచింది. కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో జరిగిన ఆ మహత్తర పోరాటంలో, నాలు గైదు వేల మంది అసువులు బాశారు. లక్షమందికి పైగా చిత్రహింసలకు, నిర్బంధా లకు గురయ్యారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పరిధిలో దాదాపు 10 లక్షల ఎకరాలను పరాన్నభుక్కు లైన పెత్తందారీ భూస్వాముల నుండి స్వాధీనం చేసు కుని, రైతు కూలీలకు పంచింది వీర తెలంగాణ విప్ల వోద్యమం! ‘వెట్టి’ చాకిరిని నిర్మూలించింది. ఆ తదుపరి ఎన్నికల్లో కమ్యూనిస్టులు సాధించిన విజయాలు ఆ పోరాట పుణ్యమే.
ఇప్పుడు పూలమ్మిన చోట కట్టెలమ్ముకునే స్థితి కమ్యూనిస్టు ఉద్యమానికి ఎందుకు పట్టింది? అని సాధా రణ జనాన్ని అడిగితే - ఇప్పుడు ఎక్కడ కమ్యూనిస్టు పార్టీ ఉందండీ? సుందరయ్య, రాజేశ్వరరావులతోనే అంతరించింది. వాళ్ల త్యాగమయ ఆదర్శ జీవిత మెక్కడ? నేటి కమ్యూనిస్టు నేతల స్వార్థ, పదవీ వ్యామోహ ఆడం బరమెక్కడ! పెద్ద పెద్ద భవనాలు, ఏసీ గదులు, కార్లు... అంటూ ఇలా తమకు తోచిన రీతిలో వ్యాఖ్యానిస్తుం టారు. కాని అది సంపూర్ణ సత్యం కాదు. పాలకపక్షాలతో పోలిస్తే కమ్యూనిస్టు కార్యకర్తలు నిజాయితీపరులని, త్యాగధనులనీ ఒక నమ్మకం ప్రజల్లో ఆనాడే కాదు ఈనాడు కూడా బలంగా ఉంటోంది. అంతమాత్రాన ప్రస్తుత కమ్యూనిస్టు కార్యకర్తలలో పదవీ వ్యామోహం, అధికార అహంకారం, ధనార్జన కాంక్ష, ఆడంబర జీవ నం వంటి దుర్లక్షణాలు లేవని కాదు. అయితే అవే నేటి కమ్యూనిస్టుల దుస్థితికి కారణంగా భావించలేం.
ఎన్నికలు కూడా కమ్యూనిస్టు ఎత్తుగడల ప్రకారం ఒక పోరాట రూపమే. కానీ దురదృష్టవశాత్తు అదే ఏకైక రూపమనే ధోరణికి పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు వచ్చాయి. ఎన్నికలలో ఏదో విధంగా గెలవాలన్న ఆత్రం ఎక్కువైంది. ఎన్నికల మార్గం ఏదో విధంగా అందలమె క్కడానికే కాదు. ఆ వాతావరణం ఆసరాగా కమ్యూని స్టులు తమ ప్రత్యేకతను నిరూపించుకోవాలి. పార్టీ అవ గాహనలోనూ, ఆచరణలోనూ ఇలాంటి లోపాలే కాదు. అసలు మార్క్సిజాన్ని మన వాతావరణానికి ఇము డ్చుకోగలిగారా కమ్యూనిస్టులు అన్న ప్రశ్న కూడా ఉంది.
చైనా నేత మావో తన ప్రజలకు సైద్ధాంతికంగా వివరించేందుకు అక్కడి కన్ఫ్యూషియస్ అనే తత్వవేత్త బోధనలనే చైనా ప్రజల పరిభాషలోకి తేగలిగారు. కానీ మార్క్సిజానికి ఉన్నంతలో సానుకూలంగా ఉన్న గౌతమ బుద్ధుణ్ణి కూడా ఇక్కడి కమ్యూనిస్టులు సొంతం చేసుకోలేకపోయారు. మార్క్స్ మహనీయుడు తన గతి తార్కిక (డెలైక్టికల్) దృక్పథాన్ని హెగెల్ నుండి స్వీకరిం చారు. మత తత్వశాస్త్రంలో ఉండే భావవాదం అటుంచి గతితర్కాన్ని అయినా మనం మన ప్రజల ముందుంచ లేదు. ఆదిశంకరుని వివేక చూడామణిలో ఉన్న గతితా ర్కికత గురించి, చండ్ర రాజేశ్వరరావు తన జీవిత చర మాంకంలో నాకు పరిచయమైన కొద్ది కాలంలో చర్చిం చారు! మార్క్సిజాన్ని మన ప్రజల ఆలోచనలో అంతర్భా గం చేయడానికి, తగిన రీతిలో మన తత్వశాస్త్రాన్ని అధ్య యనం చేయలేకపోయామని ఆయన గ్రహించారు.
అంబేద్కర్ మహాశయుడు శ్రమ విభజన సర్వజనీ నంగానే ఉన్నది. కాని ప్రత్యేకతకి శ్రామిక (వర్గ) విభజన కూడా ఉందని గుర్తింపజేశారు. వర్ణవ్యవస్థ (కుల) అం దుకు కారణం. వర్గ దోపిడీతోపాటు నిచ్చెనమెట్ల కులవ్య వస్థలో ఈ నిమ్నకులాల వారిపై రాజకీయ ఆర్థిక, సామా జిక, సాంస్కృతిక దోపిడీ సైతం సాగుతున్నది. వర్గర హిత సమాజం అన్న లక్ష్యం ఇక్కడి కులవివక్షతోనే కా దు. కులరహిత సమాజ లక్ష్యంతో కూడా విడదీయరాని బంధంలో ఉందన్నది అంబేద్కర్ ఆవిష్కరణ! ఈ ద్విముఖ పోరాటానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాకు న్నా ఆచరణాత్మక చైతన్యం కొరవడిందని చెప్పుకోవాలి! కనుకనే బాబా సాహెబ్ అంబేద్కర్‌ను సైతం కమ్యూని స్టులు సొంతం చేసుకోలేకపోయారు. అంతేకాదు. ఇ లాంటి సామాజిక అస్తిత్వ ఉద్యమాలు, శ్రామికవర్గ ఉద్యమ ఐక్యతకు భంగం కలిగిస్తాయని, పెడదోవ పట్టి స్తాయన్న భయం కమ్యూనిస్టులను పూర్తిగా వీడలేదు.
చివరిగా జాతుల సమస్య వంటి ప్రధాన సమస్య ను కూడా కమ్యూనిస్టులు తగిన శ్రద్ధతో విశ్లేషించడం లేదు. 1943లో కమ్యూనిస్టు పార్టీ ఈ సమస్యపై చేసిన తీర్మానమే పుచ్చలపల్లి సుందరయ్య ప్రఖ్యాత నినాదం ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’కి భూమిక! తెలుగు జాతి, నూతన ప్రజాస్వామిక పాలనగా స్వయం నిర్ణయాధికార హక్కుతో సహా ఏర్పడాలన్నది ఆ నినాద స్ఫూర్తి. దానిని కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కుదించడం సరికాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోని ప్రజావాంఛ. దాని ప్రజాస్వామిక స్వభా వం గుర్తెరగకుండా, సమైక్య నినాదంతో కమ్యూనిస్టులు ప్రత్యేకించి సీపీఎం తెలంగాణలో తన పార్టీ పరిస్థితిని చెరువు నుండి బయటపడిన చేపల పరిస్థితికి తెచ్చింది. ఈనాడు తెలంగాణ సీపీఎం తిరిగి జనజీవన స్రవంతిలో ఈదేందుకు ఎంతో శ్రమ చేయవలసి వస్తున్నది.
మార్క్సిజం బోధించినట్లు భౌతికవాస్తవ పరిస్థితి పట్ల తగురీతిలో స్పందిస్తూ మార్క్సిజం సాధారణతతో పాటు మన ప్రత్యేకతపై కూడా ప్రత్యేకశ్రద్ధతో అధ్యయ నం చేస్తూ-తమ గత తరం నేతల త్యాగనిరతి, ప్రజా సేవానురక్తి ఆదర్శంగా ప్రజా ఉద్యమాలలో ఆయా సమ స్యలపై కలసి వచ్చే వారందరినీ కలుపుకుంటూ తమ పూర్వ వైభవాన్ని కమ్యూనిస్టులు మన దేశ, రాష్ట్ర, జాతి ప్రయోజనాల కోసం సాధిస్తారని ఆశిద్దాం!
- వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు
ఫోన్: 98480 69720
- డా॥ఏపీ విఠల్