విభజనపై వెనక్కు తగ్గాల్సిందే
రాష్ట్ర జలసంపద సద్వినియోగం సమష్టి ప్రభుత్వంతోనే సాధ్యమని ఫజల్ ఆలీ కమిషన్ స్పష్టం చేసింది. గోదావరి జలాలతో ఆహార భద్రతను సాధించడం, దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం సమైక్య రాష్ట్రంలోనే సాధ్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిరాఘాటంగా సాగాలన్నా, దుమ్ముగూడెం, టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు నిరాక్షేపణీయంగా అమలు జరగాలన్నా సమైక్య రాష్ట్రం తప్పనిసరి.
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల మధ్య ఉన్న అవిభాజ్యమైన ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక ఐక్యతను, పరస్పరాధీనతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విస్మరించింది. కాబట్టే అది సంకుచితమైన ఓట్లు, సీట్ల లెక్కలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయించింది. మూడు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు హామీని ఇచ్చే ఏకాభిప్రాయ ఒప్పందం కోసం ప్రయత్నమైనా చేయలేదు. అందుకే సీమాంధ్రలోని అన్ని వర్గాల ప్రజలు అపూర్వమైన రీతిలో రాష్ట్ర సమైక్యతను కోరుతూ ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇళ్లకు వెళ్లలేనంతటి తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రాజకీయ మనుగడే ప్రశ్నార్థకం కావడంతో వారు కూడా సమైక్య మంత్రంతో కొంగ జపం చేయక తప్పడం లేదు. స్వాతంత్య్రోద్యమ కాలాన్ని గుర్తుకు తెస్తున్న నేటి సమైక్యాంధ్ర ఉద్యమం సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనం కానే కాదని ప్రకటిస్తోంది. జన సముద్రపు ఆకాం క్షలను పెడచెవిన పెడితే కాంగ్రెస్‌కు ఇక రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు.
సమస్య సున్నితం, జటిలం!
ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు మధ్యప్రదేశ్, బీహార్, యూపీ శాసనసభలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జూలై 30 తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు దానితో పోలికే లేదు. ఆ రాష్ట్రాల ఏర్పాటుకు హైదరాబాద్, కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకం వంటి ప్రతిబంధకాలు లేవు. అలాగే తెలుగు వారంతా ఒకటి కావాలన్న చిరకాల కాంక్ష, అందుకోసం పోరాడిన సుదీర్ఘ చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. ఇవేవీ లెక్క చేయకుండా పార్లమెంటులో బిల్లు పెట్టాలనడం బాధ్యతారాహిత్యం. రాజ్యాంగంలోని 3వ అధికరణం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. అయితే అది రాష్ట్ర విభజనపై శాసనసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కూడా నిర్దేశించింది. విభజనవల్ల రాష్ట్రంలో ఏ ప్రాంతానికి నష్టం వాటిల్లరాదని, అన్ని ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయ సాధన అవసరమనే దాని అంతరార్థం. కాంగ్రెస్ అధిష్టానం సైతం మొదటి నుంచి చెబుతున్న ఏకాభిప్రాయ సూత్రాన్ని పాతర వేసి సీడబ్ల్యూసీ ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు నిర్ణయించింది. 1969, 1972లలో వేర్పాటు ఉద్యమాలు సాగినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర సమైక్యతకు కట్టుబడింది. నేడు అది అడ్డగోలుగా రాష్ట్రాన్ని చీల్చాలని నిర్ణయించడాన్ని మెజారిటీ రాష్ట్ర ప్రజలు, శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. కుహనా ప్రతిష్టలకు పోక కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం మంచిది. డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన నుంచి అది వెనుకడుగు వేయలేదా? రెండవ ఎస్సార్సీయే పరిష్కారమన్న సీడబ్ల్యూసీ
నిర్ణయం నుంచి వెనుకడుగు వేయలేదా?
ఫజల్ ఆలీ కమిషన్ సహేతుక ఆలోచన
1953లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యపై జస్టిస్ ఫజల్ అలీ అధ్యక్షులుగా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీని నియమించింది, 1955లో అది సమర్పించిన తుది నివేదిక ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలకు కలిపి హైదరాబాద్ రాజధానిగా చక్కగా ఉపయోగపడుతుందని సూచిం చింది. కృష్ణా, గోదావరి వంటి నదులపై అత్యుత్తమమైన ప్రాజెక్టుల నిర్మాణానికి, నిర్వహణకు ఐక్య ప్రభుత్వం అవసరమని భావించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తదుపరి గత 57 ఏళ్లలో మూడు ప్రాంతాల తెలుగు ప్రజలందరి రాజధానిగానే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. నిజాం కాలంతో పోలికే లేని నేటి హైదరాబాద్ ఆభివృద్ధిలో సీమాంధ్రుల కృషి ప్రత్యేకించి కీలకమైనది. సీమాంధ్రలోని దాదాపు ప్రతి కుటుంబానికి నేడు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. అందువల్లనే అన్ని వర్గాలు సమైక్యత కోసం నడుం బిగించాయి. ఉద్యోగులు జీతాలు కోల్పోడానికి సిద్ధపడుతున్నారు. రాష్ట్ర జలసంపద సద్వినియోగం సమష్టి ప్రభుత్వంతోనే సాధ్యమని ఫజల్ ఆలీ కమిషన్ స్పష్టం చేసింది. గోదావరి జలాలతో ఆహార భద్రతను సాధించడం, దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం సమైక్య రాష్ట్రంలోనే సాధ్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిరాఘాటంగా సాగాలన్నా, దుమ్ముగూడెం, టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు నిరాక్షేపణీయంగా అమలు జరగాలన్నా సమైక్య రాష్ట్రం తప్పనిసరి. ఏటా 3,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి. వాటిలో 15 శాతం కృష్ణలోకి మళ్లించి, కష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను మళ్లిస్తే తప్ప దుర్భిక్ష ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టులకు నికర జలాలను ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిషన్ కూడా తమ మొదటి ప్రాధాన్యం సమైక్య రాష్ట్రమేనని విస్పష్టంగా తెలిపింది. విభజన తప్పనిసరే అయితే అది ఏకాభిప్రాయంతోనే జరగాలని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్ష వైఖరి
సీడబ్ల్యూసీ రాష్డ్ర విభజన సమస్యను ఎనిమిదిన్నర కోట్ల ప్రజలకు సంబంధించిన సున్నిత సమస్యగా చూడలేదు. తమ సొంత ఇంటి వ్యవహారంగా చూసింది. ఇందిరాగాంధీ ఆనాడు పార్టీ కంటే దేశం, ప్రజలు గొప్పవారని భావించి, రాష్ట్ర ఐక్యతను పరిరక్షించారు. అలాగే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ విలీనమైనప్పుడు తెలుగువారి సమైక్యత కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని త్యజించారు. తెలంగాణ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి తెలుగువారి ఐక్యతను సమర్థించారు. సోనియాగాంధీ సహా నేటి కాంగ్రెస్ నాయకత్వానికి ఆ స్పృహే లేదు. ఏకపక్షంగా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని తెచ్చి, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా దాన్ని అమలుచేయాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్ బతికి ఉంటే రాష్ట్రంలో ఈ కల్లోలం ఉండేదే కాదని పార్టీలకతీతంగా అన్ని ప్రాంతాల ప్రజలు, రాజకీయ నేతలు భావిస్తున్నారు. వైఎస్ కుటుంబం మీద, ప్రత్యేకించి జగన్‌మోహన్‌రెడ్డి మీద కక్షసాధింపు ప్రయత్నాల్లో సోనియా పదేపదే భంగపడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో అదే జరిగింది. సోనియా అంచనాలను తలకిందులు చేసి నేడు సీమాంధ్రలో పెల్లుబుకుతున్న సమైక్య ఉద్యమం ఆమెకు రెండవ ఓటమిని చవి చూపుతోంది. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఇంకా ఏ మాత్రం గౌరవం మిగిలి ఉన్నా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుంది. లేకపోతే ప్రజల చేతిలో ఎన్నడూ ఎరుగని ఘోర పరాభవాన్ని ఎదుర్కోక తప్పదు.