
నాన్నా నీ పలుకు....
రేపు ఫాదర్స్ డే
నాన్నా... నువ్వు మాకు దూరమై 25 సంవత్సరాలు గడిచాయంటే నమ్మలేకపోతున్నాం. ‘అరె ఇంతకుముందే కదా నాన్నతో మాట్లాడింది’ అనిపిస్తోంది. మా మనసు నిరంతరం భగవంతుడిని ధ్యానిస్తుందో లేదో కాని నీతోటి అనుక్షణం మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు భౌతికంగా బయటి ప్రపంచానికి కనిపించకపోయినా మా మనసులో నీ రూపం శిలాశాసనంలా నిలబడిపోయి ఉంది.నిన్ను అందరూ ‘నలుగురు ఆడపిల్లల తండ్రి’ అంటుంటే నువ్వు ‘అదే నాకు వరం’ అనేవాడివి. నువ్వు మమ్మల్ని ఆడపిల్లలాగో, మగ పిల్లవాడిలాగో కాకుండా వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా తీర్చిదిద్దావు.
అమ్మకి నువ్వు అన్ని పనుల్లోనూ చేదోడువాదోడుగా ఉండేవాడివి. ఎప్పుడైనా అమ్మ మాకు పని చెబితే, మేం చేయం అని చెప్పినా, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అమ్మ చెప్పిన పనిని చేయడం ప్రారంభించేవాడివి. నువ్వు అలా చేయడం మొదలుపెట్టేసరికి మేం వెంటనే ఉక్రోషంతో ఆ పని అందుకునేవాళ్లం. నువ్వు మాకు ఎలా పని నేర్పావో గాని... మనం ఇల్లు మారినప్పుడల్లా రెండో అక్క బల్ల ఎక్కి ఫ్యాన్లు, లైట్లు తీసి మళ్లీ కొత్త ఇంట్లో పెట్టేది. ఫ్యూజ్ పోతే ఫ్యూజ్ వేయడం కూడా నేర్పావు. అప్పుడు ఇదంతా సాధారణమే అనిపించింది కానీ ఇప్పుడు చాలామంది మగ పిల్లల్ని చూస్తే మమ్మల్ని పనిమంతులుగా ఎలా తీర్చిదిద్దావో అర్థం అయ్యింది.
పెద్దక్క ఏడో తరగతి చదువుతున్నప్పుడు నువ్వు నన్ను, పెద్దక్కని, చిన్నక్కని ముగ్గుర్నీ విజయవాడ నుంచి రాజమండ్రికి (1974) పంపడానికి సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కించావు. అసలు అంత చిన్న వయసులో ఉన్న మమ్మల్ని నువ్వు పంపావంటే ఎంతో ధైర్యం ఉండాలి. అప్పుడు కూడా నువ్వు బలే చిత్రమైన పని చేశావు, విజయవాడలో మన ఇంటి అడ్రసుతో నువ్వే ‘నాన్నా! మేము రాజమండ్రికి క్షేమంగా చేరాం’ అని ఒక ఉత్తరం రాసేసి, మా చేతికి ఇచ్చి, రాజమండ్రి స్టేషన్లో దిగగానే పోస్ట్ బాక్స్‌లో వేయమన్నావు. మగపిల్లల్నే ఒంటరిగా వదలని ఈ రోజుల్లో నువ్వు నలభై సంవత్సరాల క్రితమే మమ్మల్ని అలా పంపావంటే పిల్లల పెంపకం నీకు బాగా తెలుసుననిపించింది.
నీకు ప్రతిరోజూ రామాయణమో, భారతమో ఏదో ఒకటి చదువుతూ రాసుకోవడం అలవాటు. కాని మేం చేసే అల్లరికి మమ్మల్ని కేకలేయలేక మీ స్నేహితుల ఇంటి దగ్గర రాసుకునేవాడివి. నిన్ను మేం ఎంత ఇబ్బంది పెట్టామో అప్పుడు తెలియలేదు కాని ఇప్పుడు బాగా అర్థం అవుతోంది. నువ్వు మమ్మల్ని ఎన్నడూ కొట్టలేదు తిట్టలేదు. ఎప్పుడైనా బాగా కోపం వస్తే కళ్లు ఎర్రచేసేవాడివి. మేం బాధ పడతామని తెలిసి వెంటనే వచ్చి సరదాగా ఏవేవో మాట్లాడి మా ఏడ్పు మానిపించేవాడివి.
అసలు నీకు డబ్బులు బీరువాలో పెట్టి తాళం వేయడమే అలవాటు లేదు. ఎప్పుడూ ఎదురుగానే ఉండేవి. ‘నాన్నా... డబ్బులు కావలసినప్పుడు అక్కడి నుంచి తీసుకోండి’ అనేవాడివి. మేం ఎంత అవసరమో అంతమేరకే తీసేవాళ్లం. ఎప్పుడైనా మేం ‘నాన్నా! అంత నమ్మకంగా డబ్బులు అక్కడ ఉంచావు?’ అని ప్రశ్నిస్తే, నువ్వు, ‘నా పిల్లల్ని నేను అనుమానిస్తే నా పెంపకం సరిగ్గాలేనట్టే కదా’ అన్నావు. మమ్మల్ని ‘నాన్నా’ అనే ఆప్యాయంగా పిలిచేవాడివి.
ప్రతిరోజూ రాత్రి భోజనం పూర్తయ్యాక అటుఇటు నడిపిస్తూ భాగవతంలోని నల్లనివాడు, మందార మకరంద, ఇంతింతై వటుడింతై, లలితస్కంధము... వంటి ఎన్నో పద్యాలు నేర్పేవాడివి. ‘అడిగెదనని కడు వడి జను’ పద్యం నేర్చుకోవడం మాకు చాలా సరదాగా ఉండేది. అది నువ్వు గడగడ అప్ప చెప్పేస్తుంటే ఎలాగైనా నేర్చుకోవాలని పట్టుబట్టాం మేం. రామాయణంలోని కబంధుడు, విరాధుడు కథలు నిన్ను పదేపదే అడిగి చెప్పించుకునేవాళ్లం. కుంభకర్ణుడి గురించి నువ్వు ‘రోబోట్’ అని వ్యాఖ్యానించి చెబుతుంటే మాకు సరదాగా ఉండేది.
నేను ఏడో క్లాసు చదువుతుండగా ఒకసారి మమ్మల్ని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి ఇంటికి తీసుకెళ్లావు. ఆయనని చూస్తే ఎంత సామాన్యంగా ఏ భేషజం లేకుండా ఉన్నారా అనిపించింది. నువ్వు కూడా అలాగే ఉండేవాడివి. చిన్న కండువా కట్టుకుని, ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవాడివి.
ఒకటి మాత్రం బాగా జ్ఞాపకం. 1973లో ఆంధ్రా ఉద్యమం సమయంలో విజయవాడలో కర్ఫ్యూ విధించారు. అప్పుడు మేం బయటకు వెళ్లకుండా ఉండటం కోసం మాతో ఎన్నో ఆటలు ఆడేవాడివి. క్యారమ్ బోర్డు, గుళ్ల బోర్డు, చింత గింజలు, ట్రేడ్... ఎన్ని ఆటలో. మాతో సమానంగా తొండి చేస్తూ మమ్మల్ని నవ్విస్తూ ఆడేవాడివి. అందుకే మాకెప్పుడూ నాన్న అనే భయం లేకుండా ఒక స్నేహితునితో ఉండే చనువు ఉండేది. నాకు ఇప్పటికీ ఒక విషయం ఆశ్చర్యం వేస్తుంది, ఆడపిల్లలు అమ్మ దగ్గర చెప్పుకునే విషయాలు కూడా మేం నీకే చెప్పేవాళ్లం. నువ్వు మాకు అంతటి అవకాశం ఇచ్చావు.
నాన్నా... చల్లగాలి వీస్తే నువ్వే గుర్తుకు వస్తావు... మల్లెపూవు విచ్చుకుంటే నువ్వే గుర్తుకు వస్తావు...
మంచి పాట విన్నా, మంచి పద్యం విన్నా... నువ్వే మా కళ్ల ముందు నిలబడతావు.
ఏ పని చేస్తున్నా నిన్ను తలుచుకోకుండా ఉండలేం నాన్నా!
- డా. వైజయంతి (ఉషశ్రీ మూడవ కుమార్తె)