
మాటలతో మాయ చేయడం ఎన్నాళ్లు?
సందర్భం
టీఆర్‌ఎస్ 16వ ఆవిర్భావ సభ వరంగల్‌లో అట్టహాసంగానే సాగింది. ఎండలు మండుతున్నా లక్షలాది జనం రావడం, అధికార పార్టీ ప్రతిష్టకు తగ్గట్టుగానే ఉన్నది. జనాన్ని తీసుకురావడానికి బస్సులు, రైళ్లు, ట్రాక్టర్లు పెట్టారు. వాహనాలు సమకూర్చారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. 15 లక్షల మందితో సభ చేస్తామని ప్రకటించినా, దాంట్లో మూడో వంతు మందే హాజరయ్యారు. సభ జరిగిన తీరు వచ్చిన జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. కేసీఆర్ అధ్యక్షత వహించి, కేశవరావు, కడియం శ్రీహరి, మహమూద్ అలీలను మాట్లాడించిన తీరు మార్పుకు నాందిగా అనిపించినా, వారందరూ కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తడంలో పోటీ పడ్డారు. అసలు చర్చ ఏమంటే కేసీఆర్ కేంద్ర బిందువు.. పార్టీ, ప్రభుత్వ నేత కావడం. ఆయన కనుసైగలలో పార్టీ, ప్రభుత్వం నడుస్తున్న తీరుపట్ల లోలోపల అభ్యంతరాలున్నా, మౌనంగా ‘‘కుక్కిన పేనులాగా’’ పడి ఉండటమే ప్రధాన నాయకుల దుస్థితికి నిదర్శనం.
కేసీఆర్ ప్రసంగం ఆసాంతం ఆత్మస్తుతి, పరనిందకు పరాకాష్ఠ. గతంలో కాంగ్రెస్‌పై, సీపీఐ నారాయణపైన చేసిన విమర్శలనే మరొకసారి పేర్కొన్నారు. ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ శిఖండి పాత్ర పోషిస్తున్నదనడం, అక్కసును తెలియచేస్తున్నది. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి, డిజైన్‌ల మార్పుపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే శత్రువులాగా చూడటమేమిటి? నిర్వాసితులకు అన్యాయం చేస్తానంటే ప్రేక్షకపాత్ర వహించాలా? ప్రతిపక్షాలంటే ప్రభుత్వానికి డబ్బాకొట్టాలా? ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రజల పక్షంగా ఉంటాయి. టీఆర్‌ఎస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా అదే చేసింది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆ బాధ్యతను నెరవేరుస్తున్నాయి. దానినెందుకు భూతద్దంలో చూస్తున్నారనేది ప్రశ్న?
కేసీఆర్ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను చేసిన వాగ్దానాలు, అమలు చేసిన పథకాలపై ప్రజలకు ప్రగతి నివేదన పేరుతో ఈ సభ పెట్టారు. అందరం మ్యానిఫెస్టోలో ఏమి వాగ్దానాలు చేశారు. వాటిని ఎంత వరకు అమలు చేశారనే విషయాన్ని చెబుతారేమోనని ఆసక్తిగా చూశాం. కాని నిరాశే మిగిలింది. కేసీఆర్‌కు ఓట్లు, అధికారాన్ని సాధించి పెట్టిన దళి తులు, ఆదివాసులు, మూడెకరాల భూమి కొనుగోలు పథకం, డబుల్ బెడ్ రూమ్ పథకం వంటి అంశాలను తాకను కూడా లేదు. విద్యుత్ సరఫరా మెరుగుగానే ఉన్నదనేది వాస్తవం. మిగతా ఏ పథకంలో మీ వాగ్దాన క్రమం అమలవుతున్నది?
కేసీఆర్‌కు ఇప్పటికైనా వ్యవసాయం, రైతులు గుర్తుకు రావ డం మంచిదే. వచ్చే ఏడాది నుండి పంటకు ఎకరానికి రూ.4 వేలు ఇస్తానని చెబుతున్నాడు. నిజంగా రైతులపై అంత ప్రేమ ఉన్నట్లయితే ఈ ఏడాదే అమలు చేసేది కదా? పోయినేడాది ప్రతిపక్షాలన్నీ కూడా ముక్తకంఠంతో మద్దతిచ్చి మీరు పెట్టిన వ్యవసాయ రుణ విమోచన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాయి. చట్టం సిద్ధమై ఏడాది దాటింది. ఇది వెంటనే అమలు చేసి ఉంటే ఏడాది క్రితమే రైతులకు తక్షణ రుణ భారం నుంచి విముక్తి లభించేది వాస్తవం కాదా? ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి ఉపశమనం లభించేది కాదా? తెలంగాణ వచ్చినా, మూడేళ్ళుగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఏనాడూ భరోసా కల్పించని వ్యక్తికి తానిచ్చిన వాగ్దానాలు అమలు సాధ్యం కాదని తెలియడంతో వ్యవసాయం, గ్రామాలపై అకస్మాత్తుగా వల్లమాలిన ప్రేమ గుర్తొచ్చింది. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలలో ప్రతి రైతు మెడ మీద రూ. 50 వేల వడ్డీ కత్తిలా వేలాడుతున్నది. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే వడ్డీ చెల్లింపు గురించి ఎందుకు ప్రస్తావించలేదు?
తెలంగాణలో రైతు చితికి పోవడానికి భూమి రికార్డులు తప్పుల తడకగా ఉండటం ప్రధాన కారణం. ఒకసారి రెవెన్యూ కోర్టులు, వివిధ కోర్టులలో భూములకు సంబంధించి సివిల్ కేసులు ఎన్ని ఉన్నాయో కేసీఆర్ తెప్పించుకుంటే వాస్తవాలు బయటికొస్తాయి. సర్వే నంబర్ సరిహద్దు సమస్యలు, దొంగ రికార్డులు వాటిపైన అధ్యయనం చేసి పరిష్కార మార్గం చూపించడం సబ బుగా వుంటుంది.
84 లక్షల గొర్రెలు కొనుగోలు, చేప పిల్లల ఉచిత సరఫరా, నాయీ బ్రాహ్మణులు, గీతవృత్తి, రజకులు, వడ్ల, కుమ్మర ఇతర వృత్తులను ప్రస్తావించడం మంచిదే, అయితే వాటి అమలు గురించి విధి విధానాలుండాలి కదా! ఇప్పటికే వీటికి రాష్ట్రస్థాయిలో ఫెడరేషన్‌లున్నాయి. వాటికి అధికారాలిచ్చి, నిధులిచ్చి అమలు చేయించాలి కదా! ప్రచారం వల్ల ఫలితాలు శూన్యం.
తెలంగాణ వ్యతిరేకులపై బాణం ఎక్కుపెడతాను, బంగారు తెలంగాణ సాధనే లక్ష్యమన్నారు. తెలంగాణ వచ్చినాక వ్యతిరేకులెవ్వరు లేరు. ఉండటానికి ఆస్కారం లేదు. తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అపహాస్యం చేసినవాళ్ళు, వ్యతిరేకించిన వారందరినీ నేడు క్యాబినెట్‌లో ఉంచుకోవడంతో దీపం కింద చీకటి పరిస్థితి తెలియపరుస్తున్నది. కేసీఆర్ తెలివిగా మీడియా పల్స్ దొరికిచ్చుకున్నారు. అందుకే ప్రజాస్వామ్యం గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆచరణలో శృంగభంగం తప్పదు. ‘‘ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలవుతాయి’’ అని మర్చిపోవద్దు. అందుకని, ప్రతిపక్షాలను కించపరుస్తూ పబ్బం గడుపుకుంటామంటే చరిత్రలో కనుమరుగుకాక తప్పదు. తన వైఖరి మార్చుకోవడం సరిౖయెన మార్గం.
వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
చాడ వెంకటరెడ్డి