తెగలాగితే అసలుకు మోసం
ఆగ్రా మత మార్పిడుల సమస్యను ప్రతిపక్షం పట్టుకు వేలాడుతుంటే... ప్రభుత్వం మతమార్పిడులను నియంత్రించాలనే తన అసలు వాదనకు బీజేపీ మరింత సమర్థనను జోడిస్తూ వచ్చింది. బీజేపీ చెప్పే ‘మత మార్పిడులపై ప్రభుత్వ నియంత్రణ’ మత స్వేచ్ఛకు సరిగ్గా వ్యతిరేకమైనది.
ఈ కారణంగా, ఈ సమస్యపై ప్రతిపక్షం అవసరమైన దానికంటే ఎక్కువగా లాగడం అవివేకం అవుతుంది. కేంద్రంలోని నేటి ప్రభుత్వానికి లోక్ సభలో మెజారిటీ ఉంది. అయినా గానీ అది కూడా గత ప్రభుత్వంలాగే క్రమం తప్పకుండా సమస్యల్లో ఇరు క్కుంటోంది, ఫలవంతంగా పనిచే యలేకపోతోంది. ప్రధాని నరేంద్రమోదీ మిత్రుల ప్రకటనలు, చర్యలు ఇందుకు కొంత వరకు కారణం. గత వారం నేను ఒక మంత్రి గురించి రాశాను. ఈ వారం రెండు అంశాలపై సమస్యలు తలెత్తాయి. అందులో ఒకటి, ఒక బీజేపీ ఎంపీ గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ చేసిన అనవసర ప్రకటన అని చెప్పనవసరం లేదు. సదరు ఎంపీ నాయకుడు కావాలని నిర్ణయించుకున్న సాధువు. ఇది చెప్పనవసరం లేని, ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమేనని అన్నాను. ఎందుకంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయమనీ, దానిపై రచ్చచేయడం పార్లమెంటును స్తంభింపజేస్తుందనీ తెలిసి కూడా అదే చేయడం ఎందుకు? చివరికి జరిగిందీ అదే.
మోదీ దృఢమైన వైఖరితో, ఆ మంత్రి తన మాటలు తప్పని ఒప్పుకునేట్టు చేశారు. అయితే , ఇదే వారంలో తలెత్తిన మరో సమస్యపై మోదీ ప్రభుత్వానికి అలా ఎదుటి పక్షం లొంగుబాటును చూపడం జరగకపోవచ్చు. అది మత మార్పి డికి సంబంధించిన సమస్య. భారతీయ జనతాపార్టీకి ఇది చాలా కాలంగా ఇబ్బంది కలిగిస్తున్న సమస్య. సాధారణంగా అది హిందువులను ఇస్లాం లోకి లేదా క్రైస్తవంలోకి మత మార్పిడి చెందించడానికి సంబంధించినది. నేడు అలాంటి మత మార్పిడులు చాలా తక్కువ. సాధారణంగా ఇప్పుడు జరిగే మార్పిడులకు కారణం మత విశ్వాసం గాక వివాహమే అవుతోంది.
ఈ వారం పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజధానియైన ఆగ్రాలో జరిగిన మత మార్పిడులు అంటున్న ఘటనలో ముస్లింలను హిందువులుగా మార్చారు. బీబీసీ కథనం ప్రకారం ‘‘దాదాపు 250 మంది ‘హవన్’ (ప్రాథమిక క్రతువు)కు హాజరయ్యారు. ఆ మురికివాడ వాసులలో అత్యధికులు చెత్త ఏరుకునేవారు. కార్యక్రమానికి హాజరైతే రేషన్ కార్డులు ఇస్తామని, ప్రాథమిక సదుపాయాలు కల్పిస్తామని స్థానిక హిందూ కార్యకర్త తమకు వాగ్దానం చేసి నట్టు వారిలో చాలా మంది చెప్పారు.
ఆ మురికివాడలో ఉండే సలీనా అనే ఆమె, తనకసలు అది మతమార్పిడి కార్యక్రమమనే తెలియదని చెప్పింది. కార్య క్రమం మధ్యలో హఠాత్తుగా మా చేత పూజారి చేసినట్టు ప్రతిదీ చేయించారు. ఒక ముస్లిం తన చేతుల్తో ఒక విగ్రహాన్ని పట్టుకునేట్టు కూడా చేశారు.
కార్యక్రమం ముగిశాక, ఇక మేమంతా హిందువులమై పోయామని సదరు స్థానిక కార్యకర్త చెప్పాడు. మేం అసమ్మతి తెలపాలని అనుకున్నాం. కానీ రేషన్ కార్డు, ఇతర సదుపా యాలు కావాలంటే నోరెత్తకుండా ఉండాలని మాకు సూచించారు.
ఆ మురికివాడలోనే ఉండే ముంతాజ్ మాత్రం తనను ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఎవరూ నిర్బంధించలేదని, హాజరైనవారంతా స్వచ్ఛందంగానే హాజరయ్యారని చెప్పింది.’’ నావరకు నాకు ఇదేమీ పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ ఉర్దూ మీడియా మాత్రం ఈ ఘటనకు నివ్వెరపోయింది, ఆగ్రహించింది. దేశంలోని ‘ఇంక్విలాబ్’ అనే అతి పురాతన మైన, అత్యంత గౌరవప్రదమైన ఉర్దూ పత్రిక ‘‘అసత్యాలు, వంచన, దురభిమానం’’ అనే శీర్షికతో సంపాదకీయం ప్రచురించింది.
ప్రతిపక్షం వెనువెంటనే పార్లమెంటులో దాడికి దిగింది. తమకు కూడా ఈ మతమార్పిడులు సమస్యాత్మకంగా ఉన్నా యని, వాటిని నిలుపుదల చేయాలని భావిస్తున్నామని బీజేపీ ప్రతిస్పందించింది. కానీ, చర్చ జరగాల్సిన అంశం దానిపైన కానే కాదు. అయితే ప్రతిపక్షం ఆ విషయాన్ని అదే పనిగా పట్టుకు వేలాడుతుంటే... మతమార్పిడులన్నీ చెడ్డవేనని, ప్రభు త్వం వాటిని నియంత్రించాలనే తన అసలు వాదనకు బీజేపీ మరింత సమర్థనను జోడిస్తూ వచ్చింది. బీజేపీ చెప్పే ‘మత మార్పిడులపై ప్రభుత్వ నియంత్రణ’ మతస్వేచ్ఛకు సరిగ్గా వ్యతిరేకమైనది. ఈ కారణంగా, ఈ సమస్యపై ప్రతిపక్షం అవసరమైన దానికంటే ఎక్కువగా లాగడం అవివేకం అవుతుంది. విశ్వహిం దూ పరిషత్‌కు చెందిన నా మిత్రుడు అశోక్ చౌగులే ఈ సమ స్యపై గాంధీ చేసిన పలు ప్రకటనల జాబితాను నాకు పంపారు. వాటిలో ఇది ఒకటి.
‘‘ఒక మనిషిని మరొకరిగా మార్పిడి చేయడంలో నాకు విశ్వాసం లేదు. మరొకరి మతవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఎన్నటికీ కృషి చేయను. పైగా వారు తమ సొంత విశ్వాసానికి మరింత మంచి అనుయాయిగా మారాలని కోరుతాను. దీని అర్థం అన్ని మతాల సత్యంలోనూ విశ్వాసం, గౌరవం కలిగి ఉండటమని అర్థం. దివ్య కాంతి అన్ని మతాలకు లోపసహి తమైన మాంసపు ముద్ద మాధ్యమం ద్వారానే చేరుతుంది. కాబట్టి అవి ఆ మాధ్యమం యొక్క అపరిపూర్ణతలను కొంత ఎక్కువగా లేదా తక్కువగా కలిగి ఉండవచ్చు. ’’
గాంధీజీ మతమార్పిడి గురించి, అంటే మతమార్పిడులు చేయించుకోవాలని చురుగ్గా ప్రజలను కోరడం గురించి కూడా మాట్లాడారు. ‘‘ఒక పాడు ఉద్దేశం మొత్తం బోధననే ఉల్లంఘి స్తుంది. పాడు చేసేస్తుంది. అది మొత్తం ఆహారాన్నంతటినీ పాడు చేసే ఒక్క విషపు బొట్టులాంటిది. దానివలన నేను ఎలాంటి బోధన లేకుండానే ఉండి పోవాల్సి ఉంటుంది. గులాబీకి బోధన అవసరం లేదు. అది అతి మామూలుగానే అందరికీ సువాసనలను పంచుతుంది.
అదే దాని ప్రబోధం... మత, ఆధ్యాత్మిక జీవితపు పరిమళాలు గులాబీ పరిమళం కంటే మరింత మృదువైనవి, దానికంటే సున్నితమైనవి.’’ భార త రాజ్యాంగం ఎప్పుడో ఈ చర్చను పరిష్కరించింది. చట్టం ఈ విషయంలో సుస్పష్టంగానే ఉంది. అధికరణం 25 భారతీయులందరికీ ‘‘విశ్వాస స్వేచ్ఛ, వృత్తి స్వేచ్ఛ, మత అను సరణ, ప్రచార స్వేచ్ఛ’’లను కల్పిస్తోంది. మతం విషయంలో భారత్‌లో అలాంటి ఉదారవాద చట్టం ఉండటం ఉపఖండంలో అసాధారణమైనది. ప్రతిపక్షం ఈ సమస్యపై ప్రభుత్వంపై దాడి చేసేటప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒక ఘటన ఆ చట్టం పునఃపరిశీలనకు కార ణంగా మారడాన్ని అనుమతించరాదు.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
- aakar.patel@gmail.com
ఆకార్ పటేల్