గోరక్షణ మీదున్న శ్రద్ధ పసిబిడ్డలపై లేదేం? | focus on poorness not as much as cow safety | Sakshi
Sakshi News home page

గోరక్షణ మీదున్న శ్రద్ధ పసిబిడ్డలపై లేదేం?

Published Mon, Oct 19 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

గోరక్షణ మీదున్న శ్రద్ధ పసిబిడ్డలపై లేదేం?

గోరక్షణ మీదున్న శ్రద్ధ పసిబిడ్డలపై లేదేం?

భారతదేశం ఇక ఎంత మాత్రం పేద దేశం కాదు. కానీ దేశంలో పేదరికం ఉంది. ఏమిటి ఈ వైరుధ్యం? ప్రపంచంలోనే  అతి పెద్ద కోటీ శ్వరుల్లో  ఒకడైన ముకేష్ అంబానీ మన భారతీయుడే. చెత్తకుప్పల దగ్గర చిత్తుకాగితాలు ఏరుకునే బడి వయసు బాలలు లక్షల్లో ఉన్నారు  మనదగ్గర. వారూ భారతీయులే. ఎందుకిలా? ఈ దేశ తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి జాతి యావత్తు సిగ్గుతో తలవంచుకునేట్లు చేస్తున్నది.  దేశంలో సంవత్సరానికి 9 లక్షల మంది శిశువులు, అనగా నిమిషానికి ఒక బిడ్డ పురిటిమంచం లోనే చనిపోతున్నారని యునిసెఫ్ నివేదిక  చెపుతోంది.

మరణిస్తున్న పిల్లల్లో 54 శాతం పోషకాహారం లేక చనిపోతున్నారని ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. మన ప్రధానమంత్రి స్వంత  రాష్ట్రమైన గుజరాత్‌లో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఈ ప్రభుత్వానికి గోరక్షణ మీదున్న శ్రద్ధ పసిబిడ్డల  రక్షణ మీద లేదు. బాలల సంక్షేమం ప్రభుత్వ బాధ్యతే కానీ బీద పిల్లలపై ప్రభుత్వం చూపే జాలి, కరుణ లేదా భిక్ష కాదు. కనక ముందు, కన్న తరువాత కూడా తల్లి, బిడ్డల సంరక్షణ నేడు ఒక సమస్యగా మారింది. ఇంటి యజమానితోపాటు తల్లీ-పిల్లా అందరూ  చాకిరీ చేస్తే గానీ ఇల్లు గడవని స్థితికి శ్రామిక కుటుంబాలను ఈ ప్రభుత్వాలు నెట్టేశాయి. మెజారిటీ ఆడవాళ్లు ఇంటా బయటా చాకిరీ చేస్తూ  కుటుంబ పోషకులుగా ఉన్నవారే. అటువంటి చాకిరీలో మగ్గిపోయే తల్లుల పిల్లల్ని ఎవరు చూడాలి? ఏ అవ్వనో, అమ్మమ్మనో  బ్రతిమాలుకోవాలి. లేకుంటే ఆ దేవుడే దిక్కు అని ఇంట్లో పెట్టి బయట తలుపు గడిపెట్టి పోవాలి. లేదా తల్లి పని మానుకోవాలి.

గత కాలంలో కనీసం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలోనైనా అవ్వలు, అమ్మమ్మల సంరక్షణలో పిల్లలు పెరిగేవారు. కానీ ఆర్థిక  పరిస్థితుల్లో వచ్చిన మార్పు అవ్వలు, అమ్మమ్మల్ని కూడా వదల్లేదు. వారు కూడా ఏదో ఒక వృత్తి, ఉపాధిని వెతుక్కుంటున్నారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధితోపాటు, ఆటపాటలతో పిల్లల కు చదువుచెప్పడం మొదలుపెట్టి, క్రమంగా ‘బడి-బెత్తం మాస్టారు’ అంటే  ఉండే భయం పోగొట్టి పిల్లల్ని బడికి, బడిలో చదువుకు అల వాటు చేసే కేంద్రమే అంగన్‌వాడీ, ఇంకా చెప్పాలంటే అది అమ్మమ్మ, పెద్దమ్మల  ఒడి. ఆ ఒడికి, బడికి మరింత సత్తువనిచ్చి, పసిబిడ్డలు ఉండ టానికి, ఆడుకోవడానికి, నిద్ర వస్తే పడుకోవడానికి, మలమూత్రాలకు  పోవడానికి మరుగుదొడ్డి, దానికి అవసరమైన నీటి వసతి, ఎదిగే పిల్లల పోషణకు కావాల్సిన తిండి- వీటన్నిటినీ ప్రభుత్వమే సమకూర్చాలి.

నేడు నర్సరీలు కూడా వ్యాపార కేంద్రాలయ్యాయి. నర్సరీ కార్పొ రేట్ కంపెనీలు నిర్వహిస్తున్న నర్సరీ స్కూళ్లతో పోల్చుకుంటే అంగన్ వాడీ  కేంద్రాలు ఎన్నో రెట్లు సేవలు అందిస్తున్నట్లు లెక్క.  అంగన్‌వాడీ కేంద్రం పిల్లల సంరక్షణతోపాటు గర్భవతుల, బాలింతల సంరక్షణకు కూడా  బాధ్యత పడుతుంది. వైద్య సౌకర్యం కాదు కదా కనీసం మాట సహాయం కూడా అందని గ్రామీణ, గిరిజన స్త్రీలకు ఒక అక్కగానో, ఒక పెద్దమ్మ,  పిన్నమ్మగానో వారికి తలలో నాలుకలాగా ఉంటుంది. వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రశంసలతోపాటు సుప్రీంకోర్టు కూ డా ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించింది. ప్రతి ఊరు, వాడల్లో ప్రతి నివాస  ప్రాంతంలో అంగన్‌వాడీ బడులు ఏర్పాటు చేయాలని 2001లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ 2014- 15లో 16 వేల కోట్లు  ఖర్చు పెట్టిన కేంద్రం 2015-16లో సగానికి సగం తగ్గించి రూ.8 వేల కోట్లు కేటాయించింది.

కోట్లాది మంది పేద పిల్లలకు తిండి పెట్టేందుకు  సిద్ధం కాని ప్రభుత్వం వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన కార్పొరే ట్ సంస్థలకు ఏడాదికి 5లక్షల 30 వేల కోట్లు రాయితీలు ఇస్తున్నది.  ప్రపంచంలోనే  అతి పెద్ద కుబేరులుగా వారిని తయారు చేస్తున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను ‘మిషన్ మోడ్’ పేరుతో ‘వేదాంత’ వంటి పెద్ద పెద్ద కంపెనీలకు, ‘ఇస్కాన్’ వంటి స్వచ్ఛంద  సంస్థలకు అప్పచెప్పి చేతులు కడుక్కోవాలని చూస్తోంది.   పసిబిడ్డల ప్రయోజనాలను మించిన జాతి ప్రయోజనం మరొకటి ఉం డదు.  ఐసీడీఎస్ స్కీమును, అంగన్‌వాడీ కేంద్రాలను పరిరక్షించుకో వడం, తద్వారా మన బిడ్డల భవిష్యత్తును, జాతి భవిష్యత్తును కాపాడు కోవడం  మనందరి కర్తవ్యం.
 ఎస్.పుణ్యవతి (వ్యాసకర్త అధ్యక్షురాలు) సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ కమిటీ, ఫోన్ : 0866-2442988

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement