small kids
-
చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: చిన్న పిల్లల కిడ్నాప్‌కు పాల్పడే ముఠాను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను సీఐ మురళీకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. నగరంలోని ఇందిరానగర్‌లో జగన్నాథ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతనికి ప్రగతి, పూజిత అనే కుమార్తెలు ఉన్నారు. గత నెల 18న ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులతో కొంతమంది మాటలు కలిపారు. చాక్లెట్లు ఇస్తుండగా గమనించిన తల్లిదండ్రులు వారిని వారించారు. నిందితులు, తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగింది. అనంతరం అనుమానం వచ్చిన జగన్నాథ్ జరిగిన విషయాన్ని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాజాగా బుధవారం వారు మరోసారి ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు. నిందితులను పసిగట్టిన జగన్నాథ్ పోలీసులకు తెలిపాడు. గురువారం రైల్వేస్టేషన్ సమీపంలోని శివాలయం దగ్గర ముఠా ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో డోన్‌కు చెందిన ఎరికల రవి, నల్లచెరువు మండలానికి చెందిన వడ్డె రామాంజనేయులు, డోన్‌కు చెందిన అర్జున్ ఉన్నారు. వీరితో పాటు భారతి, సరోజ అనే మహిళలు కూడా ముఠాలో ఉన్నట్లు గుర్తించారు. మహిళా నేరస్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. -
చిట్టి బుర్రలు.. గొప్ప ఆవిష్కరణలు
- ఆకట్టుకున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ - అద్భుత సైన్స్ ప్రాజెక్టులతో విద్యార్థులు అదుర్స్ జంగారెడ్డిగూడెం : ‘భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు సజనాత్మకత అనేది తాళం చెవిలాంటిది.. ప్రాథమిక దశలోనే విద్యార్థులలోని సజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీయాలి.’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారు. ఆ దిశగా సాగే ప్రయత్నాల్లో భాగంగానే విద్యాశాఖ విద్యార్థుల్లో సజనను వెలికితీసేందుకు ఏటా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది. సైన్స్‌లో వినూత్నమైన ప్రయోగాలతో విద్యార్థులూ తమలోని సజనాత్మకతను చాటుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో వివిధ రకాల ప్రాజెక్టులతో విద్యార్థులు ఇలా ఆకట్టుకున్నారు. పవనం.. శక్తిదాయకం పవనాల ద్వారా చేంజ్ ఆఫ్ ఎనర్జీ నమూనా ప్రదర్శించాడు శనివారపు పేట హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి కె.ప్రవీణ్. పవనాల ద్వారా విండ్ ఎనర్జీని, మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా తయారు అవుతుందో వివరించారు. పవనాల ద్వారా మెకానికల్ ఎనర్జీ సష్టించి భూగర్భ జలాలను వెలికి తీసుకురావచ్చని అలాగే విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని నిరూపించాడు. – పవనాల ద్వారా చేంజెస్ ఆఫ్ ఎనర్జీ ప్రాజెక్టు నమూనా తయారుచేసిన విద్యార్థి ప్రవీణ్, ఉపాధ్యాయుడు –––––––––––––––––––––– వరద ముప్పునకు ఆటోమేటిక్ చెక్ వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా డ్యామ్ గేట్లు ఎత్తివేసే ప్రదర్శన ఇది. కె.గోకవరం హైస్కూల్ విద్యార్థిని నిట్టా ఉదయప్రియ ఈ నమూనాను ప్రదర్శించింది. వరదలు సంభవించిన సమయంలో జలాశయం గేట్లు ఎత్తకపోతే కాలువగట్లు, చెరువు గట్లు తెగిపోయే ప్రమాదం ఉన్నందున జలాశయంలోకి నీరు చేరగానే సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్‌గా జలాశయం గేట్లు ఎత్తుకుంటాయని వివరించింది. తద్వారా వరదముంపును అరికట్టవచ్చని చెబుతోంది. – వరదల సమయంలో ఆటోమేటిక్‌గా జలాశయం గేట్లు ఎత్తివేసే ప్రదర్శన –––––––––––––––––––––––––––––––––– చెత్త నుంచి సంపద ఉత్పత్తి వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసుకోవడం ద్వారా పునర్ వినియోగం ఎలా చేసుకోవాలి, పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే అంశంపై భీమడోలు డిపాల్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని ఎన్.జ్యోత్సS్న ప్రాజెక్టు తయారు చేసింది. వథా నీరు శుద్ధి చేయడం, వివిధ రకాల వస్తువుల వినియోగం తరువాత పడవేయకుండా వస్తువులుగా మలచడాన్ని ప్రయోగాత్మకంగా వివరించింది. – వథా నీరు, వ్యర్థ పదార్థాలను రీ సైక్లింగ్ చేసే విధానాన్ని వివరిస్తున్న విద్యార్థిని ––––––––––––––––––––––––– పంటను జంతువు తాకగానే సైరన్‌మోత అటవీ ప్రాంతంలో గిరిజనులు సాగుచేసే పోడు వ్యవసాయంలో పంటలను ఎలా రక్షించుకోవాలో నమూనాను ప్రదర్శించాడు ఈస్ట్ యడవల్లి హైస్కూల్ విద్యార్థి ఎం.కిశోర్‌బాబు. పంటలను అటవీ ప్రాంతంలోని జంతువులు తాకగానే సెన్సార్ల ద్వారా సైరన్ మోగే విధంగా నమూనాను ప్రదర్శించాడు. సైరన్ నుంచి వచ్చే శబ్దం కారణంగా జంతువులు పారిపోతాయని, తద్వారా పంటను రక్షించుకోవచ్చని వివరించాడు. – పోడు వ్యవసాయాన్ని రక్షించుకునే వి«ధానం తెలిపే నమూనాతో విద్యార్థి –––––––––––––––––––––––––––– మా ఊరు.. సమస్యల సుడిగుండం తమ గ్రామ సమస్యలను గ్రామ నమూనా తయారుచేసి కళ్లకు కట్టేలా ప్రదర్శించాడు పెదపాడు మండలం వడ్డిగూడెం ఎంపీయూపీ స్కూల్ విద్యార్థి ఎం.సుధీర్. తమ గ్రామంలో చేపల పెంపకం సానుకూల అంశం అని, అయితే అపరిశుభ్రత, డ్రైన్లు, రవాణా సౌకర్యం లేక అభివద్ధికి నోచుకోవడం లేదని వివరించాడు. సౌకర్యాలు కల్పించాలని నమూనాలో ప్రదర్శించాడు. – మా ఊరు సమస్యల సుడిగుండం అంటూ గ్రామ నమూనా ప్రదర్శిస్తున్న వడ్డిగూడెం విద్యార్థులు ఇంజిన్‌ఆయిల్ ద్వారా విద్యుదుత్పత్తి వాహనాల్లో వినియోగించి, తొలగించే ఇంజన్ ఆయిల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిరూపించాడు కామవరపుకోట హైస్కూల్ విద్యార్థి ఎ.వెంకన్న. వ్యర్థ ఇంజిన్ ఆయిల్‌ను బాయిల్ చేయడం ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుందని, ఆ ఆవిరికి నీటిని సంయోగపరిచి కెమికల్ ఎనర్జీని సష్టించడం ద్వారా విద్యుత్ శక్తిగా మార్చవచ్చని నిరూపించాడు. – మోటార్వాహనాల్లోని తీసివేసిన ఇంజిన్ ఆయిల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారుచేసే ప్రాజెక్టును ప్రదర్శిస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయుడు -
15 లీటర్ల తల్లిపాలను పారబోయించారు
లండన్: నిబంధనల పేరుతో తన పసి బిడ్డ కోసం ఓ మహిళ తీసుకెళుతున్న 14.8 లీటర్ల తల్లిపాలను లండన్‌లోని హీత్రూ విమానాశ్రయ భద్రతా సిబ్బంది బలవంతంగా పారబోయించారు. అర్థం లేని నిబంధనలతో తన కుమారుడికి రెండు వారాలకు సరిపోయే పాలను నేలపాలు చేశారంటూ అమెరికాకు చెందిన జెస్సికా కోక్లే మార్టినెజ్ ఫేస్బుక్లో తెలిపారు. బిడ్డ తన వెంట లేకుండా ప్రయాణం చేసిన ఆమె విమానాశ్రయ అధికారుల తీరును తప్పు పట్టారు. పసి పిల్లలు వెంట లేనప్పుడు భారీగా పాలను తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉండాలని ఆమె కోరారు. -
ఏడాదికే నూరేళ్లు!
వ్యాక్సిన్లకు దూరమవడంతో రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో చిన్నారుల మృత్యువాత ఏడాదిలోపు 26 వేలు.. ఐదేళ్లలోపు 54 వేల మంది కన్నుమూత తల్లిదండ్రుల్లో వ్యాక్సిన్లపై అవగాహన అంతంతే 34 శాతం మందికి వాటి గురించే తెలియదు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం 36.3 శాతం పిల్లలకు సక్రమంగా అందని డీపీటీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వ్యాధి నిరోధక మందు అందుబాటులో లేకపోవడం, పిల్లలకు వ్యాక్సిన్లు తప్పనిసరిగా ఇప్పించాలన్న అవగాహన తల్లిదండ్రుల్లో లోపించడంతో తెలంగాణలో ఏటా వేలాది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రాణాంతక జబ్బులకు సకాలంలో వ్యాక్సిన్ ఇప్పించకపోవడంతో ఐదేళ్లు దాటకుండానే అనేక మంది చిన్నారులకు నూరేళ్లు నిండుతున్నాయి. రాష్ట్రంలో పిల్లలకు ఒక్క వ్యాక్సిన్ కూడా వేయించని వారు గ్రామీణ ప్రాంతాల్లో 11.1 శాతం మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1.9 శాతం మంది ఉన్నారు. సాధారణంగా మూడేళ్లు నిండేసరికి పిల్లలకు ధనుర్వాతం, కోరింత దగ్గు, డిఫ్తీరియా వ్యాధుల నిరోధానికి మూడు డోసుల డీపీటీ మందు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 36.3 శాతం పిల్లలకు తల్లిదండ్రులు ఒకట్రెండు డోసులు ఇప్పించి ఆపేస్తున్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో పిల్లలకు ఈ మూడు వ్యాధులకు తప్పనిసరిగా మూడు డోసుల్లో వ్యాక్సిన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో చిన్నారులు ఐదేళ్లలోపు చనిపోవడమో లేదా పదేళ్ల లోపే వివిధ వ్యాధుల బారిన పడి ఇబ్బందులను ఎదుర్కోవడమో జరుగుతోంది. చాలా రాష్ట్రాల కంటే వెనుకంజ పసిపిల్లలకు వ్యాధి నిరోధక మందు వేయడంలో రాష్ట్రం వెనుకబడి ఉంది. ఈ విషయంలో తమిళనాడు, కేరళ, ఏపీ, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, పంజాబ్ కంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది మిగతా 2వ పేజీలో ఠ డిసెంబర్లో ప్రారంభించిన చిన్నారులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ‘ఇంద్రధనుస్సు’ కార్యక్రమం చేపట్టింది. మొదటి దశ అమలు తర్వాత కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్రాల వారీగా పసిపిల్లల సంఖ్య, వ్యాక్సినేషన్‌పై వివరాలు సేకరించింది. వ్యాక్సిన్లపై అవగాహన అంతంతే.. రాష్ట్రంలో 34 శాతం మందికి అసలు వ్యాక్సిన్ గురించే తెలియదు. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ గురించి తెలుసు. ఇదే జిల్లాలో అత్యధికంగా 42 శాతం మందికి వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియదు. నల్లగొండ జిల్లాలో 71.9 శాతం మంది పిల్లలకు వ్యాధి నిరోధక డోసులు ఇప్పించినా.. జిల్లాలో 16 శాతం మందికి వ్యాక్సిన్ల గురించి అవగాహన లేకపోవడం గమనార్హం. రాజధాని నగరానికి పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 14 శాతం మందికి పిల్లలకు వ్యాక్సినేషన్ ఇప్పించాలని గానీ, ఇప్పించడం కోసం ఎక్కడకు వెళ్లాలో గానీ తెలియదు. ఆదిలాబాద్ జిల్లాలో 61 శాతం మందికి వ్యాక్సిన్లపై అవగాహన ఉంది. అయితే ఏ సమయంలో వాటిని పిల్లలకు ఇప్పించాలో తెలియదు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్లు ఏ సమయాల్లో పిల్లలకు ఇప్పించాలో తెలియదు. ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జన్మించిన పిల్లల్లో 80 శాతం మంది సరైన సమయానికి వ్యాక్సినేషన్ పొందుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో శిశువులు పుట్టగానే వారికి ఎప్పుడెప్పుడు ఏ వ్యాక్సిన్ ఇప్పించాలన్న కార్డులను ఆరోగ్య కార్యకర్తలు అందజేస్తున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో 98 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని మురికివాడల్లో 90 శాతం మంది వ్యాక్సిన్లు పొందుతున్నారు. ‘‘వ్యాధి నిరోధక వ్యాక్సిన్ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఇంద్రధనుస్సు కార్యక్రమంలో మేం అదే చేస్తున్నాం’’ అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 62 వేల మందికి వ్యాక్సిన్లు ఇంద్రధనుస్సు కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ కార్యక్రమం మొదటి దశ కింద తెలంగాణలో ఇప్పటివరకు 1-3 సంవత్సరాల వయసున్న 48 లక్షల మందిలో 62,173 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 20,820 చిన్నారులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 23,306 చిన్నారులకు నాలుగు విడతల్లో వ్యాక్సినేషన్ ఇప్పించారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో ఒక్క విడత మాత్రమే పూర్తయ్యింది. మూడు డోసులు వేయించకపోతే ప్రయోజనం లేదు నిర్దిష్ట సమయంలో పసి పిల్లలకు మూడు డోసులు వ్యాక్సిన్ వేయాలి. ఒకట్రెండు డోస్‌లతో ఆపేస్తే ప్రయోజనం ఉండదు. పిల్లలు జీవితకాలంలో ధనుర్వాతం, డిఫ్తీరియా, కోరింత దగ్గు బారిన పడకూడదంటే ఈ మూడు డోసులు ఇప్పించాలి. అలా కాకుండా ఒకటి లేదా రెండు డోసులతో సరిపెడితే పన్నెండేళ్ల లోపే వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడా ఇలా.. గ్రామీణ పట్టణ ఏ వ్యాక్సిన్ వేసుకోని వారు 11.1 1.9 బీసీజీ వేసుకోని వారు 15.7 8.2 డీపీటీ 3 డోసులు వేసుకోనివారు 36.3 2.08 తట్టు టీకా వేయించుకోనివారు 19.2 15.7 రక్తహీనతతో ఉన్న చిన్నారులు 71.0 43.0 తీవ్ర రక్తహీనత చిన్నారులు 13.3 6.25 ఇంద్రధనుస్సు కింద ఇప్పటివరకు జిల్లాల్లో వ్యాక్సిన్లు పొందిన పిల్లల సంఖ్య ఆదిలాబాద్ 20,820 మహబూబ్‌నగర్ 23,306 హైదరాబాద్ 3,698 కరీంనగర్ 1,116 ఖమ్మం 857 మెదక్ 3,322 నల్లగొండ 1,526 నిజామాబాద్ 1,562 రంగారెడ్డి 2,483 వరంగల్ 3,483 మొత్తం 62,173 -
గోరక్షణ మీదున్న శ్రద్ధ పసిబిడ్డలపై లేదేం?
భారతదేశం ఇక ఎంత మాత్రం పేద దేశం కాదు. కానీ దేశంలో పేదరికం ఉంది. ఏమిటి ఈ వైరుధ్యం? ప్రపంచంలోనే అతి పెద్ద కోటీ శ్వరుల్లో ఒకడైన ముకేష్ అంబానీ మన భారతీయుడే. చెత్తకుప్పల దగ్గర చిత్తుకాగితాలు ఏరుకునే బడి వయసు బాలలు లక్షల్లో ఉన్నారు మనదగ్గర. వారూ భారతీయులే. ఎందుకిలా? ఈ దేశ తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి జాతి యావత్తు సిగ్గుతో తలవంచుకునేట్లు చేస్తున్నది. దేశంలో సంవత్సరానికి 9 లక్షల మంది శిశువులు, అనగా నిమిషానికి ఒక బిడ్డ పురిటిమంచం లోనే చనిపోతున్నారని యునిసెఫ్ నివేదిక చెపుతోంది. మరణిస్తున్న పిల్లల్లో 54 శాతం పోషకాహారం లేక చనిపోతున్నారని ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. మన ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఈ ప్రభుత్వానికి గోరక్షణ మీదున్న శ్రద్ధ పసిబిడ్డల రక్షణ మీద లేదు. బాలల సంక్షేమం ప్రభుత్వ బాధ్యతే కానీ బీద పిల్లలపై ప్రభుత్వం చూపే జాలి, కరుణ లేదా భిక్ష కాదు. కనక ముందు, కన్న తరువాత కూడా తల్లి, బిడ్డల సంరక్షణ నేడు ఒక సమస్యగా మారింది. ఇంటి యజమానితోపాటు తల్లీ-పిల్లా అందరూ చాకిరీ చేస్తే గానీ ఇల్లు గడవని స్థితికి శ్రామిక కుటుంబాలను ఈ ప్రభుత్వాలు నెట్టేశాయి. మెజారిటీ ఆడవాళ్లు ఇంటా బయటా చాకిరీ చేస్తూ కుటుంబ పోషకులుగా ఉన్నవారే. అటువంటి చాకిరీలో మగ్గిపోయే తల్లుల పిల్లల్ని ఎవరు చూడాలి? ఏ అవ్వనో, అమ్మమ్మనో బ్రతిమాలుకోవాలి. లేకుంటే ఆ దేవుడే దిక్కు అని ఇంట్లో పెట్టి బయట తలుపు గడిపెట్టి పోవాలి. లేదా తల్లి పని మానుకోవాలి. గత కాలంలో కనీసం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలోనైనా అవ్వలు, అమ్మమ్మల సంరక్షణలో పిల్లలు పెరిగేవారు. కానీ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పు అవ్వలు, అమ్మమ్మల్ని కూడా వదల్లేదు. వారు కూడా ఏదో ఒక వృత్తి, ఉపాధిని వెతుక్కుంటున్నారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధితోపాటు, ఆటపాటలతో పిల్లల కు చదువుచెప్పడం మొదలుపెట్టి, క్రమంగా ‘బడి-బెత్తం మాస్టారు’ అంటే ఉండే భయం పోగొట్టి పిల్లల్ని బడికి, బడిలో చదువుకు అల వాటు చేసే కేంద్రమే అంగన్వాడీ, ఇంకా చెప్పాలంటే అది అమ్మమ్మ, పెద్దమ్మల ఒడి. ఆ ఒడికి, బడికి మరింత సత్తువనిచ్చి, పసిబిడ్డలు ఉండ టానికి, ఆడుకోవడానికి, నిద్ర వస్తే పడుకోవడానికి, మలమూత్రాలకు పోవడానికి మరుగుదొడ్డి, దానికి అవసరమైన నీటి వసతి, ఎదిగే పిల్లల పోషణకు కావాల్సిన తిండి- వీటన్నిటినీ ప్రభుత్వమే సమకూర్చాలి. నేడు నర్సరీలు కూడా వ్యాపార కేంద్రాలయ్యాయి. నర్సరీ కార్పొ రేట్ కంపెనీలు నిర్వహిస్తున్న నర్సరీ స్కూళ్లతో పోల్చుకుంటే అంగన్ వాడీ కేంద్రాలు ఎన్నో రెట్లు సేవలు అందిస్తున్నట్లు లెక్క. అంగన్వాడీ కేంద్రం పిల్లల సంరక్షణతోపాటు గర్భవతుల, బాలింతల సంరక్షణకు కూడా బాధ్యత పడుతుంది. వైద్య సౌకర్యం కాదు కదా కనీసం మాట సహాయం కూడా అందని గ్రామీణ, గిరిజన స్త్రీలకు ఒక అక్కగానో, ఒక పెద్దమ్మ, పిన్నమ్మగానో వారికి తలలో నాలుకలాగా ఉంటుంది. వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రశంసలతోపాటు సుప్రీంకోర్టు కూ డా ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించింది. ప్రతి ఊరు, వాడల్లో ప్రతి నివాస ప్రాంతంలో అంగన్వాడీ బడులు ఏర్పాటు చేయాలని 2001లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ 2014- 15లో 16 వేల కోట్లు ఖర్చు పెట్టిన కేంద్రం 2015-16లో సగానికి సగం తగ్గించి రూ.8 వేల కోట్లు కేటాయించింది. కోట్లాది మంది పేద పిల్లలకు తిండి పెట్టేందుకు సిద్ధం కాని ప్రభుత్వం వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన కార్పొరే ట్ సంస్థలకు ఏడాదికి 5లక్షల 30 వేల కోట్లు రాయితీలు ఇస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరులుగా వారిని తయారు చేస్తున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలను ‘మిషన్ మోడ్’ పేరుతో ‘వేదాంత’ వంటి పెద్ద పెద్ద కంపెనీలకు, ‘ఇస్కాన్’ వంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పి చేతులు కడుక్కోవాలని చూస్తోంది. పసిబిడ్డల ప్రయోజనాలను మించిన జాతి ప్రయోజనం మరొకటి ఉం డదు. ఐసీడీఎస్ స్కీమును, అంగన్వాడీ కేంద్రాలను పరిరక్షించుకో వడం, తద్వారా మన బిడ్డల భవిష్యత్తును, జాతి భవిష్యత్తును కాపాడు కోవడం మనందరి కర్తవ్యం. ఎస్.పుణ్యవతి (వ్యాసకర్త అధ్యక్షురాలు) సీఐటీయూ ఆంధ్రప్రదేశ్ కమిటీ, ఫోన్ : 0866-2442988 -
పాపం.. పసివాళ్లు!