ఏడాదికే నూరేళ్లు! | small childrens dies for not having Vaxines | Sakshi
Sakshi News home page

ఏడాదికే నూరేళ్లు!

Published Fri, Nov 13 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

ఏడాదికే నూరేళ్లు!

ఏడాదికే నూరేళ్లు!

వ్యాక్సిన్లకు దూరమవడంతో రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో చిన్నారుల మృత్యువాత
ఏడాదిలోపు 26 వేలు..
ఐదేళ్లలోపు 54 వేల మంది కన్నుమూత
తల్లిదండ్రుల్లో వ్యాక్సిన్లపై అవగాహన అంతంతే
34 శాతం మందికి  వాటి గురించే తెలియదు
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం
36.3 శాతం పిల్లలకు సక్రమంగా అందని డీపీటీ

 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
వ్యాధి నిరోధక మందు అందుబాటులో లేకపోవడం, పిల్లలకు వ్యాక్సిన్లు తప్పనిసరిగా ఇప్పించాలన్న అవగాహన తల్లిదండ్రుల్లో లోపించడంతో తెలంగాణలో ఏటా వేలాది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రాణాంతక జబ్బులకు సకాలంలో వ్యాక్సిన్ ఇప్పించకపోవడంతో ఐదేళ్లు దాటకుండానే అనేక మంది చిన్నారులకు నూరేళ్లు నిండుతున్నాయి. రాష్ట్రంలో పిల్లలకు ఒక్క వ్యాక్సిన్ కూడా వేయించని వారు గ్రామీణ ప్రాంతాల్లో 11.1 శాతం మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1.9 శాతం మంది ఉన్నారు.
 
సాధారణంగా మూడేళ్లు నిండేసరికి పిల్లలకు ధనుర్వాతం, కోరింత దగ్గు, డిఫ్తీరియా వ్యాధుల నిరోధానికి మూడు డోసుల డీపీటీ మందు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 36.3 శాతం పిల్లలకు తల్లిదండ్రులు ఒకట్రెండు డోసులు ఇప్పించి ఆపేస్తున్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో పిల్లలకు ఈ మూడు వ్యాధులకు తప్పనిసరిగా మూడు డోసుల్లో వ్యాక్సిన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో చిన్నారులు ఐదేళ్లలోపు చనిపోవడమో లేదా పదేళ్ల లోపే వివిధ వ్యాధుల బారిన పడి ఇబ్బందులను ఎదుర్కోవడమో జరుగుతోంది.
 
చాలా రాష్ట్రాల కంటే వెనుకంజ
పసిపిల్లలకు వ్యాధి నిరోధక మందు వేయడంలో రాష్ట్రం వెనుకబడి ఉంది. ఈ విషయంలో తమిళనాడు, కేరళ, ఏపీ, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, పంజాబ్ కంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది     మిగతా 2వ పేజీలో ఠ
 డిసెంబర్‌లో ప్రారంభించిన చిన్నారులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ‘ఇంద్రధనుస్సు’ కార్యక్రమం చేపట్టింది. మొదటి దశ అమలు తర్వాత కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్రాల వారీగా పసిపిల్లల సంఖ్య, వ్యాక్సినేషన్‌పై వివరాలు సేకరించింది.
 
వ్యాక్సిన్‌లపై అవగాహన అంతంతే..
రాష్ట్రంలో 34 శాతం మందికి అసలు వ్యాక్సిన్ గురించే తెలియదు. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ గురించి తెలుసు. ఇదే జిల్లాలో అత్యధికంగా 42 శాతం మందికి వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియదు. నల్లగొండ జిల్లాలో 71.9 శాతం మంది పిల్లలకు వ్యాధి నిరోధక డోసులు ఇప్పించినా.. జిల్లాలో 16 శాతం మందికి వ్యాక్సిన్ల గురించి అవగాహన లేకపోవడం గమనార్హం. రాజధాని నగరానికి పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 14 శాతం మందికి పిల్లలకు వ్యాక్సినేషన్ ఇప్పించాలని గానీ, ఇప్పించడం కోసం ఎక్కడకు వెళ్లాలో గానీ తెలియదు. ఆదిలాబాద్ జిల్లాలో 61 శాతం మందికి వ్యాక్సిన్లపై అవగాహన ఉంది. అయితే ఏ సమయంలో వాటిని పిల్లలకు ఇప్పించాలో తెలియదు.
 
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్లు ఏ సమయాల్లో పిల్లలకు ఇప్పించాలో తెలియదు. ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జన్మించిన పిల్లల్లో 80 శాతం మంది సరైన సమయానికి వ్యాక్సినేషన్ పొందుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో శిశువులు పుట్టగానే వారికి ఎప్పుడెప్పుడు ఏ వ్యాక్సిన్ ఇప్పించాలన్న కార్డులను ఆరోగ్య కార్యకర్తలు అందజేస్తున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో 98 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని మురికివాడల్లో 90 శాతం మంది వ్యాక్సిన్లు పొందుతున్నారు. ‘‘వ్యాధి నిరోధక వ్యాక్సిన్ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఇంద్రధనుస్సు కార్యక్రమంలో మేం అదే చేస్తున్నాం’’ అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
 
62 వేల మందికి వ్యాక్సిన్లు
ఇంద్రధనుస్సు కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ కార్యక్రమం మొదటి దశ కింద తెలంగాణలో ఇప్పటివరకు 1-3 సంవత్సరాల వయసున్న 48 లక్షల మందిలో 62,173 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 20,820 చిన్నారులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 23,306 చిన్నారులకు నాలుగు విడతల్లో వ్యాక్సినేషన్ ఇప్పించారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో ఒక్క విడత మాత్రమే పూర్తయ్యింది.

మూడు డోసులు వేయించకపోతే ప్రయోజనం లేదు
నిర్దిష్ట సమయంలో పసి పిల్లలకు మూడు డోసులు వ్యాక్సిన్ వేయాలి. ఒకట్రెండు డోస్‌లతో ఆపేస్తే ప్రయోజనం ఉండదు. పిల్లలు జీవితకాలంలో ధనుర్వాతం, డిఫ్తీరియా, కోరింత దగ్గు బారిన పడకూడదంటే ఈ మూడు డోసులు ఇప్పించాలి. అలా కాకుండా ఒకటి లేదా రెండు డోసులతో సరిపెడితే పన్నెండేళ్ల లోపే వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాక్సిన్ల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడా ఇలా..
                                                 గ్రామీణ        పట్టణ
 ఏ వ్యాక్సిన్ వేసుకోని వారు           11.1            1.9
 బీసీజీ వేసుకోని వారు                  15.7            8.2            
 డీపీటీ 3 డోసులు వేసుకోనివారు    36.3            2.08
 తట్టు టీకా వేయించుకోనివారు     19.2            15.7
 రక్తహీనతతో ఉన్న చిన్నారులు     71.0            43.0
 తీవ్ర రక్తహీనత చిన్నారులు          13.3            6.25
 
ఇంద్రధనుస్సు కింద ఇప్పటివరకు జిల్లాల్లో వ్యాక్సిన్లు పొందిన పిల్లల సంఖ్య
ఆదిలాబాద్            20,820
 మహబూబ్‌నగర్            23,306
 హైదరాబాద్            3,698
 కరీంనగర్                1,116
 ఖమ్మం                857
 మెదక్                3,322
 నల్లగొండ                1,526
 నిజామాబాద్            1,562
 రంగారెడ్డి                2,483
 వరంగల్                3,483
 మొత్తం                62,173

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement