DPT
-
దోపిడీకి అడ్డొస్తుందనే.. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు!
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో 2014–19 మధ్య ఖజానాను దోచేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు దోపిడీకి అడ్డొస్తున్న జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను రద్దు చేసి, పాత విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఉపక్రమించారు. ప్రజా ధనం దోపిడీకి కుటంత్రం పన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.ఆ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత రూ.వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉంటే టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే అడ్డగోలుగా అంచనాలు పెంచినా, కోరుకున్న కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు పెట్టినా ప్రజలు ఎత్తిచూపే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వ పెద్దల భయం. వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, ఇంజినీర్ల నుంచివచ్చిన ఫిర్యాదులు, సూచనల ఆధారంగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి టెండర్ షెడ్యూలులో మార్పులు సూచిస్తే ఆ మేరకు మార్చి టెండర్ నోటిఫికేషన్ మళ్లీ జారీ చేయాలి. అప్పుడు కమీషన్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్‌కు పనులు దక్కవన్నది ప్రభుత్వ పెద్దల భయం. అందుకే తమ అడ్డగోలు దోపిడీకి అడ్డుగా ఉండే జ్యుడిషియల్ ప్రివ్యూను లేకుండా చేసేందుకు సిద్ధమయ్యారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అంచనాల్లో వంచనకు, దోపిడీకి అవకాశం ఉండదనే.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. కోట్ల రూపాయలు వెదజల్లి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని ఓ అస్త్రంగా మల్చుకున్నారు. పనుల ప్రతిపాదన దశలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి.. అంచనా వ్యయాన్ని పెంచేయించడం, అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నిబంధనలు పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, అధిక ధరలకు పనులను కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. ఆ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా అప్పగించిన మొత్తాన్నే కమీషన్‌గా జేబులో వేసుకోవడం నిత్యకృత్యంగా చంద్రబాబు మార్చుకున్నారు.ఆనాటి దోపిడీకి సాక్ష్యాలు ఇవిగో..» గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మాత్రమే మిగిలింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సి నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి.. దొడ్డిదారిన సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్‌కు అప్పగించారు. » హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో 2–బీ ప్యాకేజీలో 2014 నాటికి రూ.99 లక్షల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సి నిబంధన కింద వేటు వేసి, వాటి వ్యయాన్ని రూ.115.08 కోట్లకు పెంచేసి.. సీఎం రమేష్ కు అప్పగించారు. అంటే పెంచిన మొత్తం రూ.114.09 కోట్లు సీఎం రమేష్ కు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. » హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో 3–బీ ప్యాకేజీలో 2014 నాటికి కేవలం రూ.8.69 కోట్ల విలువైన పని మాత్రమే మిగింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పైనా 60–సి నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.149.14 కోట్లకు పెంచేశారు. అంటే పెంచిన రూ.140.45 కోట్లు సీఎం రమే‹Ùకు చెల్లించారు. » హంద్రీ–నీవా రెండో దశలో 2014 నాటికి 4–బి ప్యాకేజీలో రూ.1.34 కోట్లు, 5–బి ప్యాకేజీలో రూ.11.87 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సి నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. 4–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.73.26 కోట్లకు, 5–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.97.40 కోట్లకు పెంచేసి, వాటిని తన సన్నిహితుడైన ఆర్. మహేశ్వరనాయుడు, ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించారు. ఆ మేరకు బిల్లులు చెల్లించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. » వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో 2014 నాటికి రూ.299.48 కోట్ల విలువైన పనులే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పైనా 60–సి నిబంధన కింద వేటు వేసినచంద్రబాబు.. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అంచనా వ్యయాన్ని రూ.597.11 కోట్లకు పెంచేశారు. ఆ పనులను సీఎం రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. సీఎం రమేష్ సంస్థకంటే రూ.61.76 కోట్లకు తక్కువ ధరకు మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఆ టన్నెల్ పనిని పూర్తి చేయించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీవో 22, జీవో 63లను వర్తింపజేయడం ద్వారా కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లను దోచిపెట్టినట్లు తేల్చడం టీడీపీ ప్రభుత్వ అవినీతికి తార్కాణం. » వంశధార స్టేజ్–2 ఫేజ్–2, తోటపల్లి, మడ్డువలస, గుండ్లకమ్మ నుంచి హంద్రీ–నీవా, మిడ్ పెన్నార్ ఆధునికీకరణ పనుల్లోనూ చంద్రబాబుది ఇదే తీరు. » 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకాశం బ్యారేజ్‌కు 21 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేశారు. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నవయుగకు అప్పగించారు. అంటే.. అంచనాలు పెంచడం ద్వారా, అధిక ధరకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ప్రభుత్వ ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 2019లో ప్రభుత్వం రద్దు చేసింది. » మళ్లీ ఇప్పుడూ అదే రీతిలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. అక్రమాలకు అడ్డొస్తుందనే నెపంతోనే జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేయాలని నిర్ణయించారు.ఆదర్శవంతమైన జ్యుడిషియల్ ప్రివ్యూ రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చుతూ 2019 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ ఇన్్రఫ్టాస్టక్చర్ యాక్ట్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) – 2019 చట్టాన్ని నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిని జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జిగా నియమించింది. ఈ చట్టం ప్రకారం.. రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. ఆ ముసాయిదాపై జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జడ్జి మార్పులు సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే.. దానిని యధాతథంగా ఆమోదిస్తారు. ఇలా జ్యూడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌తోనే రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులన్నింటినీ ఇదే విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్లే కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పోటీ పడి.. కాంట్రాక్టు విలువకంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. దీని వల్ల రూ.7,500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యింది. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఈ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. -
ఈ కామర్స్ సంస్థలకు గడువు పొడిగింపు లేదు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో ఈ కామర్స్ సంస్థలకు సవరించిన నిబంధనల అమలుకు ఫిబ్రవరి 1గా ఇచ్చిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువును కనీసం మూడు నెలల వరకైనా పొడిగించాలని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. ‘‘ఈ కామర్స్ రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐల పాలసీ నిబంధనల అమలుకు ఇచ్చిన గడువు పొడిగించాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత గడువును పొగించకూడదని నిర్ణయించాం’’ అని పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (డీపీఐటీ) పేర్కొంది. కొత్త నిబంధనల కార్యాచరణను పూర్తిగా అర్థం చేసుకునేందుకు గాను గడువు పొడిగించాలని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కేంద్రాన్ని కోరాయి. జూన్ 1వరకు పొడిగింపు ఇవ్వాలని అమెజాన్ కోరగా, ఆరు నెలల సమయాన్ని ఫ్లిప్‌కార్ట్ కోరింది. ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేశాయి. నూతన నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులకు వివరించాయి. భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాము నిర్ణయించుకున్నామని, ఈ పెట్టుబడులకు రిస్క్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, దేశీయ వర్తకుల సమాఖ్య సీఏఐటీ మాత్రం గడువు పొడిగించొద్దని డిమాండ్ చేసింది. అమెరికా కంపెనీల ఒత్తిడికి తలగొద్దని దేశీయ ఈ కామర్స్ సంస్థలు స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ సైతం కోరాయి. కాగా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తరహా ఈ రిటైలింగ్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై తమకు వాటాలున్న కంపెనీల ఉత్పాదనలను 25 శాతానికి మించి విక్రయించకుండా నిషేధిస్తూ గత డిసెంబర్ 26న కేంద్రం నూతన నిబంధనలను ప్రకటించింది. కొన్ని కంపెనీల ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ ప్లాట్‌ఫామ్‌పైనే విక్రయించే ఒప్పందాలను సైతం నిషేధించింది. మరోవైపు ప్రభుత్వం గడువు పొడిగించకపోతే నిబంధనల అమలుకు గాను ప్లాన్–బిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సిద్ధం చేసుకున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం: అమెజాన్ నూతన నిబంధనల విషయంలో మరింత స్పష్టత కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, తమ కస్టమర్లు, విక్రయదారులపై ప్రభావాన్ని పరిమితం చేసేందుకు కృషి చేస్తామని అమెజాన్ ప్రకటించింది. ‘‘అన్ని చట్టాలు, నిబంధనలను పాటించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకుని మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటాం. ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం: స్నాప్‌డీల్ చిన్న ఈ కామర్స్ సంస్థలు స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సచ్ఛీలమైన, బలమైన ఈ కామర్స్ రంగానికి ప్రభుత్వ నిర్ణయం దారితీస్తుందని స్నాప్‌డీల్ పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇది విజయం వంటిదని షాప్‌క్లూస్ సీఈవో విజయ్సేతి అభివర్ణించారు. -
ఏడాదికే నూరేళ్లు!
వ్యాక్సిన్లకు దూరమవడంతో రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో చిన్నారుల మృత్యువాత ఏడాదిలోపు 26 వేలు.. ఐదేళ్లలోపు 54 వేల మంది కన్నుమూత తల్లిదండ్రుల్లో వ్యాక్సిన్లపై అవగాహన అంతంతే 34 శాతం మందికి వాటి గురించే తెలియదు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం 36.3 శాతం పిల్లలకు సక్రమంగా అందని డీపీటీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వ్యాధి నిరోధక మందు అందుబాటులో లేకపోవడం, పిల్లలకు వ్యాక్సిన్లు తప్పనిసరిగా ఇప్పించాలన్న అవగాహన తల్లిదండ్రుల్లో లోపించడంతో తెలంగాణలో ఏటా వేలాది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రాణాంతక జబ్బులకు సకాలంలో వ్యాక్సిన్ ఇప్పించకపోవడంతో ఐదేళ్లు దాటకుండానే అనేక మంది చిన్నారులకు నూరేళ్లు నిండుతున్నాయి. రాష్ట్రంలో పిల్లలకు ఒక్క వ్యాక్సిన్ కూడా వేయించని వారు గ్రామీణ ప్రాంతాల్లో 11.1 శాతం మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1.9 శాతం మంది ఉన్నారు. సాధారణంగా మూడేళ్లు నిండేసరికి పిల్లలకు ధనుర్వాతం, కోరింత దగ్గు, డిఫ్తీరియా వ్యాధుల నిరోధానికి మూడు డోసుల డీపీటీ మందు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 36.3 శాతం పిల్లలకు తల్లిదండ్రులు ఒకట్రెండు డోసులు ఇప్పించి ఆపేస్తున్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో పిల్లలకు ఈ మూడు వ్యాధులకు తప్పనిసరిగా మూడు డోసుల్లో వ్యాక్సిన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో చిన్నారులు ఐదేళ్లలోపు చనిపోవడమో లేదా పదేళ్ల లోపే వివిధ వ్యాధుల బారిన పడి ఇబ్బందులను ఎదుర్కోవడమో జరుగుతోంది. చాలా రాష్ట్రాల కంటే వెనుకంజ పసిపిల్లలకు వ్యాధి నిరోధక మందు వేయడంలో రాష్ట్రం వెనుకబడి ఉంది. ఈ విషయంలో తమిళనాడు, కేరళ, ఏపీ, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, పంజాబ్ కంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది మిగతా 2వ పేజీలో ఠ డిసెంబర్లో ప్రారంభించిన చిన్నారులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ‘ఇంద్రధనుస్సు’ కార్యక్రమం చేపట్టింది. మొదటి దశ అమలు తర్వాత కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్రాల వారీగా పసిపిల్లల సంఖ్య, వ్యాక్సినేషన్‌పై వివరాలు సేకరించింది. వ్యాక్సిన్లపై అవగాహన అంతంతే.. రాష్ట్రంలో 34 శాతం మందికి అసలు వ్యాక్సిన్ గురించే తెలియదు. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ గురించి తెలుసు. ఇదే జిల్లాలో అత్యధికంగా 42 శాతం మందికి వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియదు. నల్లగొండ జిల్లాలో 71.9 శాతం మంది పిల్లలకు వ్యాధి నిరోధక డోసులు ఇప్పించినా.. జిల్లాలో 16 శాతం మందికి వ్యాక్సిన్ల గురించి అవగాహన లేకపోవడం గమనార్హం. రాజధాని నగరానికి పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 14 శాతం మందికి పిల్లలకు వ్యాక్సినేషన్ ఇప్పించాలని గానీ, ఇప్పించడం కోసం ఎక్కడకు వెళ్లాలో గానీ తెలియదు. ఆదిలాబాద్ జిల్లాలో 61 శాతం మందికి వ్యాక్సిన్లపై అవగాహన ఉంది. అయితే ఏ సమయంలో వాటిని పిల్లలకు ఇప్పించాలో తెలియదు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్లు ఏ సమయాల్లో పిల్లలకు ఇప్పించాలో తెలియదు. ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జన్మించిన పిల్లల్లో 80 శాతం మంది సరైన సమయానికి వ్యాక్సినేషన్ పొందుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో శిశువులు పుట్టగానే వారికి ఎప్పుడెప్పుడు ఏ వ్యాక్సిన్ ఇప్పించాలన్న కార్డులను ఆరోగ్య కార్యకర్తలు అందజేస్తున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో 98 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని మురికివాడల్లో 90 శాతం మంది వ్యాక్సిన్లు పొందుతున్నారు. ‘‘వ్యాధి నిరోధక వ్యాక్సిన్ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఇంద్రధనుస్సు కార్యక్రమంలో మేం అదే చేస్తున్నాం’’ అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 62 వేల మందికి వ్యాక్సిన్లు ఇంద్రధనుస్సు కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ కార్యక్రమం మొదటి దశ కింద తెలంగాణలో ఇప్పటివరకు 1-3 సంవత్సరాల వయసున్న 48 లక్షల మందిలో 62,173 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 20,820 చిన్నారులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 23,306 చిన్నారులకు నాలుగు విడతల్లో వ్యాక్సినేషన్ ఇప్పించారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో ఒక్క విడత మాత్రమే పూర్తయ్యింది. మూడు డోసులు వేయించకపోతే ప్రయోజనం లేదు నిర్దిష్ట సమయంలో పసి పిల్లలకు మూడు డోసులు వ్యాక్సిన్ వేయాలి. ఒకట్రెండు డోస్‌లతో ఆపేస్తే ప్రయోజనం ఉండదు. పిల్లలు జీవితకాలంలో ధనుర్వాతం, డిఫ్తీరియా, కోరింత దగ్గు బారిన పడకూడదంటే ఈ మూడు డోసులు ఇప్పించాలి. అలా కాకుండా ఒకటి లేదా రెండు డోసులతో సరిపెడితే పన్నెండేళ్ల లోపే వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడా ఇలా.. గ్రామీణ పట్టణ ఏ వ్యాక్సిన్ వేసుకోని వారు 11.1 1.9 బీసీజీ వేసుకోని వారు 15.7 8.2 డీపీటీ 3 డోసులు వేసుకోనివారు 36.3 2.08 తట్టు టీకా వేయించుకోనివారు 19.2 15.7 రక్తహీనతతో ఉన్న చిన్నారులు 71.0 43.0 తీవ్ర రక్తహీనత చిన్నారులు 13.3 6.25 ఇంద్రధనుస్సు కింద ఇప్పటివరకు జిల్లాల్లో వ్యాక్సిన్లు పొందిన పిల్లల సంఖ్య ఆదిలాబాద్ 20,820 మహబూబ్‌నగర్ 23,306 హైదరాబాద్ 3,698 కరీంనగర్ 1,116 ఖమ్మం 857 మెదక్ 3,322 నల్లగొండ 1,526 నిజామాబాద్ 1,562 రంగారెడ్డి 2,483 వరంగల్ 3,483 మొత్తం 62,173