‘మహా’ మునక
భూమి లోపల ఉన్న శిలాజ ఇంధన నిల్వలను పూర్తిగా తోడేసినట్లయితే ఒక రోజున మనం అంటార్కిటికా హిమఖండానికి గుడ్‌బై చెప్పక తప్పదని తేలుతోంది. అదే జరిగినట్లయితే ప్రపంచ మహానగరాలు చాలావరకు మునిగిపోయే ప్రమాదం పొంచుకుని ఉంది. కోట్లాది సంవత్సరాల క్రమంలో భూ అంతర్భాగంలో పేరుకుపోయిన బొగ్గు, చమురు, గ్యాస్ నిల్వలను పూర్తిగా దహించివేసినట్లయితే అంటార్కిటికా హిమఖండ ం పూర్తిగా కరిగిపోయి సముద్ర మట్టం 50 నుంచి 60 మీటర్లు (160 నుంచి 200 అడుగులు) పెరుగుతుందని, దీంతో తీర ప్రాంతంలో ఉన్న విశ్వ మహానగరాలు మునిగిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.
ఇలా సముద్రంలో కలిసిపోనున్న మహానగరాల్లో టోక్యో, హాంగ్‌కాంగ్, షాంఘై, హాంబర్గ్, న్యూయార్క్‌తో పాటు మన కోల్‌కతా, చెన్నై, ముంబై కూడా ఉన్నాయని అంచనా. ఇప్పటికే సముద్ర మట్టానికి సమాన స్థాయిలో ఉంటున్న వందకోట్ల జనాభా కలిగిన తీరప్రాంత నగరాలు ఉనికిని కోల్పోనున్నాయి. అంటార్కిటికా ఆ స్థాయిలో కరిగిపోకూడదంటే శిలాజ ఇంధనం జోలికి వెళ్లకూడదని, వాతావరణంలోకి కార్బన్‌ను వదలకూడదని విజ్ఞుల ఉవాచ.