రాష్ట్ర పతాకంపై అనవసర రభస
హిందీ–హిందూ–హిందుస్థాన్ వాదాన్ని ముందుకు తోస్తూ సంకుచితంగా ఆలోచించే కుహనా జాతీయవాదులు...కర్ణాటకకు ఒక రాష్ట్ర పతాకం ఉండటం అనే భావనను వ్యతిరేకిస్తున్నారు. వారు భారతదేశాన్ని ఒకే భాష, ఒకే మతం గల దేశంగా తప్పుగా గుర్తిస్తున్నారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విశిష్ట చరిత్రలున్నాయి. ఆ కారణంగా వాటికి ప్రత్యేక గుర్తింపులూ ఉన్నాయి. ఈ అస్తిత్వాలు వ్యక్తం కావడాన్ని అనుమతించాలి. వాటికి మన రాజ్యాంగంతో ఎలాంటి వైరు«ధ్యమూ లేదు. వాటిని అణచివేయాలనడానికి ఎలాంటి కారణమూ కనబడదు.
నేను, కర్ణాటకలో నివసిస్తున్న గుజరాతీని. రెండు రాష్ట్రాలకూ సొంత అస్తిత్వాలున్నాయి. నా తల్లిదండ్రులు నేటికీ నివసిస్తున్న సూరత్, 1700 వరకు ఒక అంతర్జాతీయ రేవు పట్టణంగా ఉండేది. అన్ని రకాల ప్రజలూ అక్కడ ఉండేవారు. అన్ని కులాలు, మతాలు, జాతుల వారు అక్కడికి వచ్చి, శతాబ్దాల తరబడి స్థిరపడిపోయారు. దేశీయమైన నానా రకాల కులాల వర్తక వర్గాలను కలిగిన ఏకైక భారత నగరం అదే. బనియా, జైన్, షియా బోరా, ఖోజా, సున్నీ బోరా, మెమన్, పార్సీ.. ఇలా రక రకాల వర్తక వర్గాలు అక్కడ ఉంటాయి. 1970ల నుంచి అగర్వాల్‌లు, ఓస్వాల్‌లు కూడా వేల కొలదిగా అక్కడ నివసిస్తున్నారు.
మునుపటి శతాబ్దాలలోనైతే, విదేశీయులు సైతం ఆ నగరంలో నివసిస్తూ, వ్యాపారం సాగించేవారు. లియో టాల్‌స్టాయ్ ‘‘ద కాఫీ హౌస్ ఆఫ్ సూరత్’’అనే కథ రాశాడు. ఆ కథలో సూరత్‌లోని ఒక ఫలహారశాలలో, ఒక పర్షియన్, ఒక ఆఫ్రికన్, ఒక భారతీయుడు, ఒక యూదు వర్తకుడు, ఒక చైనీయుడు, ఒక తురుష్కుడు, ఒక ఇంగ్లిషువాడు కలసి భగవంతుని స్వభావాన్ని గురించి చర్చిస్తారు. ఆ కథ రాసిన 150 ఏళ్ల తర్వాత నేడు సూరత్‌లో అలాంటి గుంపు జమ కావడాన్ని ఊహించడం కూడా కష్టమే.
తపతీ నది మేట వేసుకుపోవడంతో అలనాటి ఆ రేవు పట్టణం నుంచి నౌకలు అరేబియా సముద్రంలోకి పయనించే వీలు ఇక లేదు. కాబట్టి 1800ల నాటి ఆ కథ నేడు ఊహకు సైతం అందదు. సూరత్‌కు పశ్చిమాన కొత్త రేవు బొంబాయి ఉండేది. నేటి ముంబైలో అలాంటి విభిన్నమైన జాతులవారు యాదృచ్ఛికంగా ఒక చోట చేరడాన్ని ఊహించడం సాధ్యమే.
బెంగళూరు, సూరత్ కంటే ఇటీవలి కాలపు నగరమే. కానీ దానికి కూడా అంతే సుసంపన్నమైన చరిత్ర ఉంది. ఆ నగరానికి అంతర్జాతీయ బ్రాండు గుర్తింపు ఉంది. నేను ప్రపంచవ్యాప్తంగా... యూరప్ లేదా ఆఫ్రికా లేదా నైరుతి ఆసియాలకు ప్రయాణాలు సాగిస్తుంటాను. ఆయా దేశాల వారు నన్ను ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతుంటారు. బెంగళూరు నుంచి అని చెపితే సరిపోతుంది. సమాచార సాంకేతిక విజ్ఞానం విషయంలో ఇక్కడ జరిగిన అద్భుత కృషి కారణంగా, ఈ నగరం పేరు చెబితేనే వారికి అర్థమైపోతుంది. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యాల పరిధిని దాటి కూడా ఈ నగరంలో ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి.
బెంగళూరులో ఎన్నో భాషల ప్రజలున్నారు. మా ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చే మహిళ నిరక్షరాస్యురాలు. కానీ కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషలలో గడగడా మాట్లాడేయగలదు. మలయాళం అర్థం చేసుకుంటుంది కూడా. ఉత్తర భారతీయుల్లో, అక్షరాస్యులలో సైతం అలాంటి వారు ఎంతో మంది ఉంటారనిగానీ, ఇలాంటి వైవిధ్యం వారి నగరాల్లో కనిపిస్తుందనిగానీ అనుకోను. ఈ వాస్తవం గురించి మా బెంగళూరువాసులం గర్విస్తుంటాం. కన్నడ భాషకు ప్రథమ స్థానం ఇవ్వాలని పట్టుబట్టడం (నేను దాన్ని సమర్థిస్తాను) ఉన్నా, ఈ నగరంలో ఇతర భాషలపట్ల గొప్ప సహనశీలత ఉంది. ఇది అత్యంత విశిష్ట లక్షణం.
సుసంపన్నమైన, గర్వించదగిన కర్ణాటక రాష్ట్ర వారసత్వాన్ని ప్రతిబింబించే సంకేతాన్ని ఉపయోగించడంలో ఎలాంటి సమస్యా లేదు.
హిందీ–హిందూ–హిందుస్థాన్ వాదాన్ని ముందుకు తోస్తూ సంకుచితంగా ఆలోచించే కుహనా జాతీయవాదులు... కర్ణాటకకు ఒక రాష్ట్ర పతాకం ఉండటం అనే భావనను వ్యతిరేకిస్తున్నారు. వారు భారత దేశాన్ని ఒకే భాష, ఒకే మతం గల దేశంగా తప్పుగా గుర్తిస్తున్నారు.
ఈ అంశాన్ని కాంగ్రెస్‌ను విమర్శించడానికి ఉపయోగించుకోవడం వల్లనే రాష్ట్ర పతాకం గురించిన ఈ సమస్య చాలా వరకు తలెత్తుతోంది. ఈ సమస్యకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన హక్కుల పరిధికి లోపలే ఉన్నారని నా అభిప్రాయం. రాష్ట్ర పతాకం, జాతీయ పతాకం కంటే దిగువన ఉంటుందని ఆయన ఇప్పటికే సుస్పష్టంగా చెప్పారు.
ఈ మాటతో, రాష్ట్ర పతాకం ఏదో ఒక విధమైన వేర్పాటువాదం దిశగా వేసే తొలి అడుVýæని భావించేవారిని ఆయన ఇప్పటికే నిరాయుధులను చేసేస్తున్నారు. రాజ్యాంగపరంగా కూడా ముఖ్యమంత్రి వైఖరి పూర్తిగా సరిగ్గానే ఉంది. ఆయన నియమించిన కమిటీ కూడా ఇదే చెబుతుందని అనుకుంటాను. ‘‘భారతదేశం, రాష్ట్రాలతో కూడిన గణతంత్రంగా ఉంటుంది’’ ఇది భారత రాజ్యాంగంలోని మొట్ట మొదటి వాక్యం. కాబట్టి మనం ప్రారంభిస్తున్నదే భిన్న రాష్ట్రాలు అనే భావనను గుర్తించడం నుంచి.
ఓసారి మన చుట్టూ పరికించి చూస్తే... సొంత పతాకాలను కలిగిన ఒక విధమైన ఉప జాతీయవాదం ఇప్పటికే ఉన్నదని కనిపిస్తుంది.
ప్రత్యేకించి ఒక నగరానికి (చెన్నై సూపర్ కింగ్స్) లేదా ఒక రాష్ట్రానికి (కింగ్స్‌గీఐ పంజాబ్) చెందిన పతాకాలున్న ఐపీఎల్ జట్లున్నాయి. ఇది మరో రూపంలోని ఉప జాతీయవాదం. ఈ జట్లన్నిటికీ విడిగా వాటి సొంత పతాకాలుండటంతో మనకు సమస్యేమీ లేదు. అలాగే రాజకీయ పార్టీలు, వాటి పతాకాలతోనూ పేచీ లేదు.
ఇక మనలాంటి ఇతర దేశాలను చూస్తే, ఒక రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండటం సర్వసాధారణమే. ఇది, ఈ సమస్యకు సంబంధించిన మరో అంశం. అమెరికాలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ వాటి సొంత పతాకాలున్నాయి. ఇది ఆ దేశ ఐక్యతకు ఏవిధంగానూ భంగకరమనే ఆరోపణ లేదు.
దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విశిష్ట చరిత్రలున్నాయి. ఆ కారణంగా వాటికి ప్రత్యేకమైన గుర్తింపులూ ఉన్నాయి. ఈ అస్తిత్వాలు వ్యక్తం కావడాన్ని అనుమతించాలి. వాటికి మన రాజ్యాంగంతో ఎలాంటి వైరు«ధ్యమూ లేదు. వాటిని అణచి వేయాలనడానికి ఎలాంటి కారణమూ కనబడదు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘aakar.patel@icloud.com
ఆకార్ పటేల్