నీచ భాషకు ‘రాచ’ గౌరవం | giving respect to ugly language | Sakshi
Sakshi News home page

నీచ భాషకు ‘రాచ’ గౌరవం

Published Fri, Jul 3 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

giving respect to ugly language

 (సమకాలీనం)

ఒక పక్షం నుంచి ఎన్నికై, ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అభ్యర్థిని ఓడించారో అదే పార్టీలోకి పదవుల కోసమో, ఇతర ప్రయోజనాల కోసమో నిస్సిగ్గుగా వెళ్లటం తెలుగునాట  మామూలై పోయింది. తెలంగాణలో తెరాసలోకి, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలోకి
 ఈ ‘అధికారిక వలసలు’ నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలు, ప్రజాభిప్రాయం,
 ఓట్ల రూపంలో వెల్లడించిన ప్రజాభీష్టం అన్నీ గాలికి పోతున్నాయి. ఎన్నికల ముందు
 ఎన్ని మాటలు చెప్పినా... ఎన్నికలయ్యాక ఏం చేసైనా అధికారపక్షం ఒడిలో వాలాలి.

 ‘బుద్ధిభూములేలాలని ఉంటే, వంతు వాకిలి ఊడవమంటుంద’ని సామెత. దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరస్పర విరుద్ధ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని సామాజిక మాధ్యమాలు క్రియాశీల పాత్ర పోషిస్తు న్నాయి. పాలనతో సహా వివిధ వ్యవస్థల్లో పారదర్శకత పెరుగుతోంది. ఫలితంగా ప్రజలు నిత్య చైతన్యంతోఅన్నీ తెలుసుకుంటున్నారు. మరోపక్క పాలనాపగ్గాలు చేతబట్టిన రాజకీయ వ్యవస్థ మాత్రం రోజు రోజుకు తోలు మందం వ్యవస్థగా మారడమే విచిత్రం.

సభ్య సమాజం సిగ్గుతో తలదించు కునేలా నాయకుల మాటలైనా, నిస్సిగ్గుగా పార్టీలు మారే ప్రజాప్రతినిధుల చేష్టలయినా, వాటిని నగ్నంగా ప్రోత్సహిస్తున్న పార్టీల వైఖరులైనా, ప్రజలకి చ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా అధికారం చెలాయిస్తున్న పాలకపక్షాల పోకడలైనా... ‘ఔరా! ఎంత తోలుమందం?’ అనిపిస్తున్నాయే తప్ప మరో ఆలోచన కలిగించడంలేదు. జనమేమనుకుంటారో అనే భావనే లేకుండా ఇవన్నీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇదివరలో ఉన్నట్టు, ఇటు వంటి నిర్వాకాలకు కాసింత మొహమాటమో, తెరచాటుతనమో, దాపరికమో ఏమీలేదు. వారి విచ్చలవిడితనం వల్లో, సంప్రదాయ ప్రసారమాధ్యమాలకు తోడైన సోషల్‌మీడియా క్రియాశీలత వల్లో ఇప్పుడీ విషయాలు ప్రజలకు తేటతెల్లమౌతున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ దుశ్చేష్టలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయే తప్ప అదుపులోకి రావడం లేదు.

 నరంలేని నాలుకలకింత స్వేచ్ఛా?
 ఇదివరలో, ఓసారి ఒకమాట మరోమారు ఇంకోమాట మాట్లాడితేనే రెండు నాల్కల ధోరణి అని విమర్శించేవారు. ఇప్పుడు, నాయకులు ఏం మాట్లాడు తున్నారో వారికీ స్పృహలేదేమో అనే అనుమానం కలిగిస్తున్నారు. బెయిల్‌పై విడుదలై వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు వివిధ వర్గాల్లో విస్మయం కలిగించాయి. ముఖ్యమంత్రిపైన, మంత్రులపైన ఆయన చేసిన వ్యాఖ్యలు స్థాయికి తగ్గట్టు లేవు. సీఎంతోపాటు ఇద్దరు మం త్రుల గురించి చేసిన వ్యాఖ్యల్ని పత్రికలు ప్రచురించినా... ఇంకో మంత్రి నుద్దేశించి చెప్పిన మాటలు ప్రచురణార్హంగా లేకపోవడంతో వదిలేశాయి. రేవంత్‌రెడ్డి ఏం తెలియని వ్యక్తి కాదు. బాగా చదువుకొని ఒకసారి ఎమ్మె ల్సీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం షరతులతో బెయిల్ మంజూరు చేసి ఒక రోజైనా గడవక ముందే ఇలా మాట్లాడటాన్ని ఎవరైనా ఎలా పరిగణిస్తారు? ఆయన ఇంకా నిందితుడే కనుక హుందాగా వ్యవహరించి, సంయమనం పాటించాల్సిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.  గద్దె దించుతానని, పోరాటం కొనసాగిస్తానని... సాక్షాత్తూ ముఖ్యమంత్రినే లెక్కచేయనితనంతో మాట్లాడటం, మంత్రుల్ని తూలనా డటం పరోక్షంగా దర్యాప్తు అధికారుల్ని, సాక్షుల్ని ప్రభావితం చేసేలా ఉందనే కారణంతో ఆయన చేసిన ప్రసంగం టేపుల్ని వివిధ మీడియా సంస్థల్నించి దర్యాప్తు బృందం సేకరిస్తోంది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ముందు వినిపించే వాదనల్లో ఈ టేపుల్ని భాగం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

అభిమానులు ఆయనకు స్వాగతం పలికిన తీరు, ఆయా బృం దాల్ని పార్టీ నాయకత్వం సమాయత్తపరచిన వైనం, అది వేదికగా ఆయన చేసిన గర్జన ఒక కొత్త సంస్కృతికి తెరలేపినట్టుగా ఉంది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సహజ న్యాయసూత్రాల ప్రకారం ఏ కేసులో అయినా బెయిల్ ఇవ్వడం సాధారణ నియమం, ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్ నిరాకరిం చడం మినహాయింపు, కనుక బెయిల్ లభించింది. నేర నిర్ధారణ జరిగేవరకు ప్రతి నిందితుడూ నిరపరాధి అయినట్టే, బెయిల్ లభించినప్పటికీ విడుదలైన వ్యక్తి, కడపటి తీర్పు వచ్చే వరకు నిందితుడే! ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, రాజకీయ ప్రత్యర్థులపై నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇటీవల ఓ ఫ్యాషన యింది. ‘మా తెలంగాణలో ఇట్లాగే మాట్లాడుతాం...’ అనే ముసుగు కింద ఇటువంటి నిందాపూర్వక మాటలకు, తిట్లకు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీయారే ఆద్యుడని నిందించేవారూ ఉన్నారు. తమచే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌నే ‘గంగిరెద్దు‘ అని తూలనాడిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరి మాటలకు తెలుగువారంతా సిగ్గుతో బిక్కచచ్చిపోయారు.

కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు, కీలకస్థానాల్లో-హోదాల్లో ఉన్న ఎంపీలు, ఇతర నేతలు కొందరి నోటికి హద్దూపద్దూ ఉండట్లేదు. దేశంలోని మైనారిటీలపైన, ముఖ్యంగా ముస్లిం మైనారిటీల మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రికీ, ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికీ తలవంపులు తెచ్చిన సందర్భాలు కొల్లలు. ప్రజలేమనుకుంటారో! అన్న ఇంగితం కూడా లేకపోవడాన్ని చూసి వ్యవస్థ చాలా తోలుమందంగా తయా రయిందనే భావన వ్యక్తమౌతోంది.

 నైతిక విలువలే కాదు చట్టాలూ బేఖాతర్!
 ఒక పక్షం నుంచి ఎన్నికై, ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అభ్యర్థిని ఓడించారో అదే పార్టీలోకి పదవులకోసమో, ఇతర ప్రయోజనాల కోసమో నిస్సిగ్గుగా వెళ్లటం తెలుగునాట మామూలై పోయింది. తెలంగాణలో తెరాసలోకి, ఆంధ్రప్ర దేశ్‌లో టీడీపీలోకి ఈ ‘అధికారిక వలసలు’ నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలు, ప్రజాభిప్రాయం, ఓట్ల రూపంలో వెల్లడించిన ప్రజాభీష్టం అన్నీ గాలికి పోతున్నాయి. ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పినా... ఎన్నికల య్యాక ఏం చేసైనా అధికారపక్షం ఒడిలో వాలాలి. వీలయితే పెద్ద పైరవీనో- ఓ మాంచి పదవో కొట్టేయడం, ముందు అది మాట్లాడుకొనే గోడ దూకడం, ఇవ్వాళ పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్నదే! ప్రత్యర్థి రాజకీయ పక్షాల ఉనికినే మట్టుపెటి,్ట వచ్చే ఎన్నికల నాటికి తాము మాత్రమే నిలవాలనుకుం టున్న రెండు పాలకపక్షాల ధ్వంసనీతి కూడా ఇదే! నిజానికిది తిమ్మరుసు ధీయుక్తిలోని పెద్దగీత లాంటిది! ఎందుకంటే, దీన్ని చూపించే.... తమ కేసు చిన్నదని తేలిక చేసి చూపడానికి తెలుగుదేశం నాయకత్వం పరోక్షంగా యత్ని స్తోంది. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు 5 కోట్ల రూపాయల బేరానికి ఓ ఎమ్మెల్యే ఓటు కొనుగోలు వ్యవహారంలో 50 లక్షల నగదుతో పట్టుబడ్డ కేసు రేవంత్‌ది. ప్రభుత్వ పనుపుతో, ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్ని పట్టుకుంటే బట్టబయలైన ఈ కేసును కూడా బలహీనపరచడా నికి.... ఇదే పాలకపక్షం తమ ఎమ్మెల్యేల్ని కొల్లగొట్టుకుపోయిన నిర్వాకం గురించి టీడీపీ అరిచి గీపెడుతోంది. తమ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుల్ని పార్టీలో చేర్చుకొని ఏకంగా మంత్రిపదవులే ఇవ్వడమేమిటని నిలదీస్తోంది. పార్టీ ఫిరాయింపుల చట్ట నిబంధనల్ని తుంగలో తొక్కడాన్ని ఎత్తిచూపుతు న్నారు. వారి సభ్యత్వాల్ని రద్దు చేయమన్న తమ విజ్ఞప్తులపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్‌లు తప్పుపడుతున్నాయి.

తెలంగాణలో ఈ వాదన వినిపించే టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లో తానూ అదే ‘దొమ్మీ’ వ్యవహారం నడుపుతోంది కనుక తేలుకుట్టిన దొంగలా అక్కడ కిమ్మ నటం లేదు. వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికైన ఎంపీల్ని, ఎమ్మెల్సీల్ని, ఇతర కింది స్థాయి ప్రజాప్రతినిధుల్ని ఎరవేసి లాక్కొని తానూ అదే నిర్వాకాన్ని దర్జాగా వెలగబెట్టడాన్ని ఎవరూ చూడటం లేదనుకోవడమే విచిత్రం! ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కాదు, ఇతర పక్షాల్లో ఉండి ఓడిపోయిన నాయకులు, ‘పెద్ద మను షులూ’ పాలకపక్షాల వైపు దొంగ చూపులు చూస్తున్నారు. రాజ్యసభ- ఎమ్మెల్సీ వంటి ఎగువసభల సభ్యత్వాలో, ఇతర నామినేటెడ్ పదవులో.... అవీ కుదరవంటే కనీసం నాలుగైదు పనులన్నా అవుతాయన్న ఆశే ఇంధ నంగా అధికారపక్షాలతో అంటకాగాలని చూస్తున్నారు. పైకి మాత్రం, తాము పాలకపక్షంలోకి చేరేది నియోజకవర్గ ప్రజల కోసమే అని అందమైన ముసుగు కప్పుతున్నారు.

 పాలనలోనూ ప్రతిబింబిస్తున్న పెడధోరణి
 ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా రాజకీయ వ్యవస్థలో బలపడుతున్న ఈ తోలుమందం వైఖరి పాలనలోనూ కనిపిస్తోంది. కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఏడాదిలోనే పలురకాల అవినీతి ఆరోప ణల్ని ఎదుర్కొంటున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పరీక్షా కాలమే! ఎన్డీయే ప్రభుత్వపు పెద్దన్న బీజేపీకి చెందిన పలువురు కేంద్ర మంత్రులు, ఓ ముఖ్యమంత్రి, ఇంకా చాలా మంది వివిధ రాష్ట్రాల్లోని మంత్రులు అవినీతి ఆరోపణలనెదుర్కొంటున్నారు. లలిత్‌గేట్ వణుకు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఒత్తిడి పెంచుతోంది. దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉంది. తీయని మాటలు, గంభీరోపన్యాసాలు, దేశభక్తి భావోద్వే గాలు తప్ప... హామీ ఇచ్చిన ‘మంచిరోజులి’ంకా మొదలు కావేమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలుగునేలపై పరిస్థితీ ఏం భిన్నంగా లేదు. ఎన్నికల ముందరి హామీలు, అధికారంలోకొచ్చాక ఇచ్చిన వాగ్దానాల మేరకు తెలం గాణలో కొన్ని పనులు మొదలయినట్టు కనిపిస్తున్నా... ఫలాలు, ఫలితాలు తామింకా చవి చూడనేలేదని ఇక్కడి జనం వాపోతున్నారు. రాజకీయ క్రీడ మాత్రం ముప్పొద్దులా సాగుతోంది.
 ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, ప్రగతి-సంక్షేమ ఫలాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే అభిప్రాయం పాలకపక్ష అనుకూల వాదులూ వినిపిస్తున్నారు. ఏ కొత్త నిర్ణయానికీ ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తామెలా స్పందించాలో ప్రజలకు ఇదమిత్థంగా తోచడం లేదు. సామాజిక మాధ్య మాలు క్రియాశీలంగా మారుతున్న తరుణంలో రాజకీయ వ్యవస్థ ఇంత స్పందనా రహితంగా, ప్రజాభీష్టాన్ని బేఖాతరంటూ ఉండటం పట్ల మేధావి వర్గం కూడా విస్మయానికి గురవుతోంది. రానున్నది డిజిటల్ విప్లవమే!

అన్న ప్రధానమంత్రి మోదీ మాటల్ని ప్రజలు, ప్రజా సమూహాలు జాగ్రత్తగా విశ్లేషించుకుంటున్నాయి. వివక్ష నుంచి ఆడపిల్లలను కాపాడుకోవా లనే సదుద్దేశంతో ‘సెల్ఫీ విత్ డాటర్’ అన్న ప్రధాని పిలుపు వల్ల సామాజిక ఆలోచనా దృక్పథంలో పెనుమార్పులు

సంభవిస్తాయని అధినాయకత్వం ఆశిస్తున్న తరుణమిది. నిజంగానే, మారిన పరిస్థితుల్లో పౌరులు, పౌర సంఘాలు స్వీయ చేతన పొంది స్పందిస్తే.... మందగించిన మన రాజకీయ వ్యవస్థ తోలు పలచబడదా? ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా జనా భిప్రాయం మేరకు సర్కార్లు స్పందించవా? చూడాలి!

 

 

సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్

ఆర్. దిలీప్ రెడ్డి

ఈమెయిల్ : dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement