Samakalinam
-
దొంగ‘చూపు’లెవరివి?
హక్కుల కార్యకర్తల నుంచి జర్నలిస్టులు, ఎన్నికల ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, విపక్షనేతలు, మంత్రులు.. పరిమితి లేకుండా, ఎంపిక చేసిన అందరి కదలికల్ని, భావాల్ని, ఆలోచనల్ని, సంభాషణల్ని, ఫోటోలని, డాక్యుమెంట్లనూ చడీచప్పుడు లేకుండా ‘నిరంతర నిఘా’తో లాక్కుంటే ఇక ఏమి మిగులుతుంది? ప్రత్యక్షంగా ఇది ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి. మొత్తం పౌర సమాజమే ఓ అనధికారిక నిఘా నేత్రం కింద, నిరంతరం నలుగుతున్నట్టు లెక్క! తాజా ‘పెగసస్’ స్పైవేర్ అలజడి ఈ ఉల్లంఘనే! రాజ్యమే ఈ చర్యకు పాల్పడితే ఇక పౌరులకు దిక్కేది? గ్రీక్ ఇతిహాసంలోదే అయినా... ఎగిరే రెక్కల గుర్రం (పెగసస్) అంటేనే అసాధారణ శక్తి. అది ఆధునిక శాస్త్ర సాంకేతికత రూపంలో కనబడకుండా, వినబడకుండా అన్ని వ్యక్తిగత గోప్య ప్రదేశాల్లోకి చొర బడితే పరిస్థితి ఏంటి? పురమాయించిన పనే రహస్య నిఘా, నివేదిం చడం అయితే, రాజ్యాంగం దేశ పౌరులకు హామీ ఇచ్చిన వ్యక్తిగత గోప్యత హక్కు గాలికిపోయినట్టే! సదరు స్వేచ్ఛ ఆధారంగా అభిప్రా యాలు ఏర్పరచుకోవడం, భావ వ్యక్తీకరణ, పాలనలో పాల్గొనడం మొదలు... గౌరవప్రదంగా జీవించడం వరకుండే ప్రజాస్వామ్య మౌలిక హక్కులన్నీ భంగపోయినట్టే! హక్కుల కార్యకర్తల నుంచి జర్నలి స్టులు, ఎన్నికల ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, విపక్ష నేతలు, మంత్రులు.... పరిమితి లేకుండా, ఎంపిక చేసిన అందరి కద లికల్ని, భావాల్ని, ఆలోచనల్ని, సంభాషణల్ని, ఫోటోలని, డాక్యుమెం ట్లనూ చడీచప్పుడు లేకుండా ‘నిరంతర నిఘా’తో లాక్కుంటే ఇక ఏమి మిగులుతుంది? ప్రత్యక్షంగా ఇది ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి. మొత్తం పౌర సమాజమే ఓ అనధికారిక నిఘా నేత్రం కింద, నిరం తరం నలుగు తున్నట్టు లెక్క! తాజా ‘పెగసస్’ స్పైవేర్ అలజడి ఈ ఉల్లంఘనే! ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందెవరు? ఎవరు చేయిం చారు? విస్తృతి ఎంత? అన్నది తేలితే కాని, ప్రమాద తీవ్రత బోధ పడదు. విపక్షాలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నట్టు రాజ్యమే ఈ చర్యకు పాల్పడితే ఇక పౌరులకు దిక్కేది? కేంద్ర ప్రభుత్వం చెబుతు న్నట్టు తనకు ప్రమేయం లేకుంటే, మరెవరు చేసినట్టు? దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, వ్యక్తుల గోప్య సమాచారంపైన, కేంద్ర ప్రభు త్వానికి తెలియకుండా ఏ విదేశీ ఎజెన్సీలదో నిఘా ఉంటే, సమాచార మంతా రహస్యంగా వారికి చేరుతుంటే, దేశ భద్రతకది ముప్పు కాదా? నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇవీ తాజా ప్రశ్నలు. పార్లమెంటు కార్యకలాపాలు గత నాలుగు రోజులుగా ఇదే వివాదంపై దాదాపు స్తంభించాయి. సాంకేతిక పరిజ్ఞానమే ఉపకర ణంగా ‘పెగసస్’ ఓ నిఘా దాడి. ఇజ్రాయెల్‌కు చెందిన జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఓ) ఈ స్ఫై(సాఫ్ట్)వేర్ విక్రేత! ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లో యాబై వేలమంది మొబైల్ నంబర్లు ఈ నిఘా కింద ఉండగా, వెయ్యిమంది ఫోన్ల నుంచి సమాచార చౌర్యా(హాక్)నికి లంకె ఏర్ప డ్డట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. పారిస్ కేంద్రంగా పనిచేసే లాభా పేక్షలేని ఓ మీడియా కూటమి (ఫోర్బిడెన్ స్టోరీస్)– హక్కుల సంఘం (ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్) జరిపిన పరిశోధనలో ఇది ధ్రువపడింది. అందులో మన దేశానికి చెందిన 300 నంబర్లు బయట పడ్డాయి. తొలిసారి కాదు తెలియకుండానే ‘పెగసస్’ నిఘా దేశంలో పలువురిపై ఉందని వెల్లడ వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల కిందటే వెలుగులోకి వచ్చింది. భీమా–కోరేగావ్ నిందితులైన హక్కుల కార్యకర్తలు, న్యాయవాదుల టెలిఫోన్లు ట్యాప్/హ్యాక్ అయ్యాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తెలియకుండానే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలోకి ఓ మాల్వేర్ చొరబడి పోయింది. అప్పటికే పెగసస్ ప్రస్తావన వచ్చింది. 2019లో పార్ల మెంట్ (ఐటీ) స్థాయీ సంఘం విచారించినపుడు, 121 మంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు తెలిపారు. రిమోట్ పద్ధతిలో మొబై ల్లోకి వచ్చి తిష్టవేసే ఈ మాల్వేర్, ఫోన్ యజమానికి స్పృహలో లేకుండానే సమాచారాన్ని వేరెక్కడో కేంద్రకంగా పనిచేసే నిర్వాహ కులకు చేరుస్తుంది. కాంటాక్ట్ నంబర్లు, మెసేజ్‌లు, కాల్డాటాయే కాకుండా సంభాషణలు, మెయిల్ సమాచారం, పత్రాలు, ఫోటోలు కూడా పంపిస్తుంది. రిమోట్ ఆపరేషన్ పద్ధతిలోనే కెమెరా కూడా పని చేస్తుంది. మన దేశంలో, బయట కూడా ఇది వెలుగుచూశాక... వాట్సాప్, ఫేస్బుక్, యాపిల్ వంటి సామాజిక మా«ధ్యమ వేదికలు పెగసస్ బారిన పడకుండా సెక్యూరిటీ ఫీచర్స్‌ను ఆధునికీకరించు కున్నాయి. అయినా, ఆ స్ఫైవేర్ మరింత ఆధునికతతో ఆపిల్, ఆండ్రా యిడ్లలో చొరబడగలుగుతోంది. ‘పెగసస్’ సేవల్ని ప్రభుత్వం విని యోగించుకుంటోందా? అన్న నిర్దిష్ట ప్రశ్నకు నాటి ఐ.టీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ రాజ్యసభలో సూటిగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. ‘ఏది జరిగినా చట్టనిబంధనలకు లోబడి, అధికారిక అనుమ తులతోనే నిఘా ఉంటుంది’ అని ఓ నర్మగర్భ సమాధానమిచ్చారు. మాల్వేర్ విక్రేత ఎన్ఎస్ఓ కథనం ప్రకారం ఇది కేవలం ప్రభు త్వాలకు, వారి అధీకృత సంస్థలకే విక్రయిస్తారు. నిర్దిష్టంగా దేశ భద్రత, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ కోసమే! అలాంట ప్పుడు సమాజంలోని వివిధ వృత్తుల, స్థాయిల వారి ఫోన్లు ఎందుకు హ్యాక్ అయ్యాయి? ప్రభుత్వ విధానాలను నిరసించే వారు, చీకటి వ్యవహారాల నిగ్గుతేల్చే పరిశోధనా జర్నలిస్టులు, గిట్టని అధికారులు, రాజకీయ ప్రత్యర్థులు ఎందుకు లక్ష్యం అవుతున్నారు? జాబితాలోని పేర్లను బట్టి చూసినా, ఈ నిర్వాకం ఎవరి చర్య? వారిపై నిఘా వేయా ల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అన్నది ఇట్టే తెలిసిపోతోంది. వెల్లడైన జాబితా ఊహాజనితమని ఒకసారి, తామేమీ నిర్వహించం, స్ఫైవేర్ ఒకసారి విక్రయించాక, నిర్వహణ అంతా ఆయా దేశాలదే అని మరోమారు ఎన్ఎస్వో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోంది. సంస్కరణలు రావాలి మన దేశంలో నిఘా వ్యవస్థ నిర్వహణ సరిగా లేదు. సమూల సంస్క రణల అవసరం. వ్యక్తుల గోప్యత హక్కు–దేశ భద్రత మధ్య సమ తూకం సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కేంద్ర గృహమంత్రి అమిత్ షా తాజా వివాద నేప«ధ్యంలో వెల్లడించారు. కానీ, చట్టాలకు అతీతంగా, అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రభుత్వ నిఘా నిర్వాకాలు భంగం కలిగించిన సందర్భాలే ఎక్కువ. ‘వ్యక్తిగత సమాచార సంరక్షణ చట్టం’ దేశంలో ఇంకా తుది రూపు సంతరించుకోలేదు. ‘గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే’ అని 2018లోనే సుప్రీంకోర్టు తేల్చింది. పౌరుల వ్యక్తిగత సమాచారంలోకి అనుచితంగా జొరబడే అధికారం ప్రభుత్వానికి, దర్యాప్తు–నిఘా సంస్థ లకి లేదు. సంభాషణల్ని అడ్డగిస్తూ, టెలిఫోన్ ట్యాప్ వంటివి చేయాల్సి వచ్చినా.. చట్టాలకు లోబడి, సుప్రీంకోర్టు వేర్వేరు సంద ర్భాల్లో వెల్లడించిన తీర్పుల స్ఫూర్తిని నిలబెడుతూ జరపాలి. అలా నిఘా వేయాలంటే, ఏయే పరిస్థితులు ఉండాలో 2017లో, 2019లో జస్టిస్ పుట్టుస్వామి ఇచ్చిన తీర్పులే స్పష్టం చేశాయి. ‘నేర ప్రక్రియ çస్మృతి’ (సీఆర్పీసీ) సెక్షన్ 92, ‘భారత టెలిగ్రాఫ్ చట్టం’, నిబంధన 419ఎ తో పాటు ‘ఐ.టీ చట్టం’, సెక్షన్లు 69, 69బి కింది నిబంధనల ప్రకారమే ప్రస్తుతం పౌరుల టెలిఫోన్ సంభాషణలు, ఇతర సమా చార–ప్రసార మార్పిడులలో అధికారులు కల్పించుకుంటున్నారు. నిఘా వేస్తున్నారు. విధివిధానాల్లో స్పష్టత లేక, రాజకీయ ప్రయోజ నాలకోసం దురుపయోగం ఎక్కువనేది విమర్శ. హిమాచల్‌ప్రదేశ్‌లో, 2012లో కొత్త ప్రభుత్వం పోలీసు దర్యాప్తు సంస్థలపై దాడి జరిపి నపుడు, వెయ్యి మందికి సంబంధించిన లక్ష సంభాషణలు దొరికాయి. 2009లో సీబీడీటీ–నీరారాడియా వ్యవహారంలో, 2013లో గుజరా త్లో అమిత్‌షాపై అభియోగాలు వచ్చిన కేసులో... ఇలా చాలా సంద ర్భాల్లో ఇదే జరిగింది. పౌరుల హక్కుల భంగంతో పాటు దేశ ప్రతిష్ట విశ్వవేదికల్లో ఇటీవల దిగజారిపోతోంది. అమెరికాకు చెందిన ‘ఫ్రీడమ్ హౌజ్‘ భారత్‌ను స్వేచ్ఛాయుత స్థితి నుంచి పాక్షిక స్వేచ్ఛా దేశంగా వెల్లడిం చింది. ‘వి–డెమ్’ అనే స్వీడన్ సంస్థ అతిపెద్ద ప్రజాస్వామ్యమే కాదు, మనది ‘ఎన్నికల నియంతృత్వం’ అని తన వార్షిక నివేదికలో అభివ ర్ణించింది. ‘ప్రజాస్వామ్య సూచిక’లో భారత్ ‘లోపభూయిష్ట ప్రజా స్వామ్యం’గా ముద్రపడి 53వ స్థానానికి పడిపోయింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 142 (180 దేశాలకు) స్థానానికి దిగజారి పోయాం. నిర్హేతుకమైన నిఘా, వ్యక్తిగత గోప్యతపై దాడి జరిగిన తాజా వివాదంపై నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తు జరగాలి. నిజాలు నిగ్గుతేలాలి. అప్పుడే, పౌరులకు రక్ష, మన ప్రజాస్వామ్యానికి విలువ. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సయోధ్య సర్కారు విధి
ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రభుత్వం జవాబుదారుగా నిలవాలి. సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా అందుకు దారితీసే పరిస్థితుల్ని తానే సృష్టించుకోవాలి. దారులు మూసుకుపోయే పరిస్థితులు కల్పించడం తన వైపు నుంచి జరుగకూడదు. వ్యవసాయం బాగు చేసి, రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చేందుకే ఈ చట్టాలు అంటున్న కేంద్రం, సదరు విశ్వాసాన్ని రైతుల్లో ఏ దశలోనూ కల్పించలేకపోయింది. ఆందోళన కొన్ని రాష్ట్రాల్లోనే ఉందని ప్రచారం చేసినా, వ్యతిరేక భావన అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని వెల్లడవుతూ వచ్చింది. వివాదాస్పద చట్టాల జన్మస్థానమైన పార్లమెంటు వైదికనుంచైనా ఈ సమస్యకు పరిష్కారం లభించాలని, ప్రస్తుత ప్రతిష్టంభన తొలగాలని రైతులతో పాటు ఇతర ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్ష. వెన్నెముక శస్త్రచికిత్స సున్నితమనే భావన వైద్యవర్గాల్లోనే కాక సామాన్యుల్లోనూ ఉంది. అందుకే, వైద్యులు శ్రద్ధతో సిద్ధమౌతారు. వైద్యపరంగా అనివార్యం, రోగి అంగీకారం అయితే తప్ప శస్త్రచికిత్సకు పూనుకోరు. దేశానికి వెన్నె ముక అయిన రైతు వ్యవసాయ సమస్యల్ని పరిష్కరించేప్పుడు పాలకు లకు ఎందుకు ఆ శ్రద్ధ ఉండదు. ఇది కోటిరూకల ప్రశ్న! జనాభాలో అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయరంగంలో సంస్కరణలు వెన్నెముక శస్త్రచికిత్సకన్నా కీలకం. రైతుల ఎడతెగని పోరొకవైపు కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి మరోవైపు సమస్యను జటిలం చేశాయి. ప్రతిష్టంభన కొనసాగుతోంది. చర్చల ద్వారా పరిష్కార అవకాశాలు సజీవంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా... అటు కేంద్రం, ఇటు రైతాంగం పర స్పర విశ్వాసరాహిత్య స్థితికి చేరాయి. సర్కారు కవ్వింపు చర్యలు ఉద్యమిస్తున్న రైతాంగాన్ని రెచ్చగొడుతున్నట్టున్నాయి. ఉద్యమంలో అసాం ఘిక శక్తులు చేరాయంటున్న సర్కారు, గణతంత్ర దినోత్సవం నాటి దుర్ఘటనల్ని ఉటంకిస్తోంది. ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రభుత్వం జవాబుదారుగా నిలవాలి. సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా అందుకు దారితీసే పరిస్థితుల్ని తానే సృష్టించుకోవాలి. వ్యవసాయం బాగుచేసి, రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చేందుకే ఈ చట్టాలు అంటున్న కేంద్రం, సదరు విశ్వాసాన్ని రైతుల్లో ఏ దశలోనూ కల్పించ లేకపోయింది. ఆందోళన కొన్ని రాష్ట్రాల్లోనే ఉందని ప్రచారం చేసినా, వ్యతిరేక భావన అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని వెల్లడవుతూ వచ్చింది. వ్యవసాయరంగ మనుగడతో నేరుగా ముడివడిన మూడు కీలక చట్టాల ప్రతిపాదన, పొందుపరచిన అంశాలు, ముసాయిదా తీరు, పార్లమెంటులో ఆమోదించుకున్న వైనం, కడకు అమలు... అన్నీ వివా దాస్పదమే! అమలు నిలిపివేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రైతు సందేహాలను నివృత్తిచేసే సంతృప్తికర జవాబు ఇంతవరకు రాలేదు. పైగా, తాజా బడ్జెట్లోని వ్యవసాయ అంశాలు దేశ రైతాంగంలో కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. తమ అనుమా నాలు అపోహలు కాదని, వాటిని ధ్రువీకరించే సంకేతాలు బడ్జెట్ ప్రతి పాదనల్లో పుష్కలంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. వ్యవసా యాన్ని రైతుల చేతుల్లోంచి జార్చి, కార్పొరేట్లకు ధారాదత్తం చేసే భూమికను కేంద్రం సిద్ధం చేస్తున్న జాడలే çస్ఫుటమని వారంటున్నారు. కొత్తగా వ్యవసాయ మౌలికరంగాభివృద్ధి సెస్ (ఎఐడీసీ) విధింపుపైనా రైతాంగానికి అనుమానాలున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి భంగం పరిమిత వస్తువులపై వేర్వేరు శాతాల్లో ఎఐడీసీ విధింపును కొత్త బడ్జె ట్లో ప్రతిపాదించారు. పెట్రోలు, డీజిల్ పైనే కాకుండా కొన్ని ఆహార పదార్థాల దిగుమతి పైనా ఈ సెస్ రానుంది. అది వినియోగదారులపై భారం కాకుండా ఉండేందుకు ఆ మేర, ప్రస్తుత కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ తొలగింపో, తగ్గింపో ప్రతిపాదించారు. ఇక్కడొక మతల బుంది. సెస్‌పై కేంద్ర ప్రభుత్వానికే పూర్తి అజమాయిషీ! రాష్ట్రాలకు వాటా ఇచ్చే పనిలేదు. కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ కింద వసూలయిం దాంట్లో రాష్ట్రాలకు నిర్ణీత వాటా ఇవ్వాలి. ఇలా రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు తాజా మార్పు గండి కొడుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కొన్ని రాష్ట్రాలు స్పందించాయి. వ్యవసాయం రాష్ట్ర ప్రభు త్వాల జాబితాలోని అంశమైనా కేంద్రం ఏకపక్షంగా మూడు చట్టాలను తీసుకువచ్చిందనే విమర్శ ఉంది. సదరు చట్టాల్లోని అంశాలు ప్రభావం చూపకుండా ఉండే విరుగుడు చట్టాలను దేశంలోని ఏడు రాష్ట్రాలు ఇప్పటికే తీసుకువచ్చాయి. ఇది కూడా సమాఖ్య స్ఫూర్తికి భంగమే! వ్యవసాయరంగంలోకి పెద్ద మొత్తంలో ప్రయివేటు పెట్టు బడుల్ని ఆకర్శించి తద్వారా ఉత్పాదకత, సామర్థ్యం పెంచాలంటే సంస్కరణలు అనివార్యం అని కేంద్రం అంటోంది. ప్రభుత్వం ఇదే విషయం రాష్ట్రాలతో సంప్రదించి, రైతాంగాన్ని ఒప్పించి చేసి ఉండా ల్సిందనే అభిప్రాయం ఉంది. పార్లమెంటులోనూ బిల్లుపై విపులంగా చర్చించలేదని, స్థాయీ సంఘానికో, సంయుక్త పార్లమెంటరీ కమిటీకో పంపి ఏకాభిప్రాయ సాధన చేసి ఉండాల్సిందంటారు. అలా జరిగి ఉంటే రాష్ట్రాల సహకారంతో చట్టాల అమలు సజావుగా సాగేదనేది అంతరార్థం. అది లోపిండం వల్లే ఇంతటి వ్యతిరేకత, ప్రస్తుత ప్రతిష్టంభన! ఆధిపత్యానికి ఊతం కొత్త చట్టాల్లో పొందుపరచిన పలు అంశాలు తమకు ప్రతికూలమని రైతాంగం అంటోంది. వాటి వల్ల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోళ్లు, వ్యవస్థీకృత మార్కెటింగ్, తద్వారా ప్రయి వేటులోనూ లభించే మార్కెట్ స్పర్ధ క్రమంగా కొరవడుతాయని వారి ఆందోళన. అది తప్పు, వారిది అపోహ మాత్రమే అని కేంద్రం అంటోంది. కనీస మద్దతుధర కొనసాగుతుందని, వ్యవసాయోత్ప త్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లు ఉంటాయని ప్రభుత్వం నమ్మ బలుకుతోంది. ప్రయివేటు రంగం రాకవల్ల పోటీ ఏర్పడి వ్యవసాయో త్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని, రైతులకు మేలని సర్కారు వాదన. బడా వ్యాపారులు రిటేల్ వస్తు విక్రయరంగంలోకి వచ్చి, చిన్నా, చితకా దుకాణాలు, నాలుగు చక్రాల బళ్లపై విక్రయాలు లేకుండా చేసి, పూర్తి ఆధిపత్యం సాధించిన తర్వాత తమకు అను కూలంగా ధరల్ని నియంత్రించిన ఉదాహరణలు కోకొల్లలు. తమది అపోహ కాదని, ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రయివేటు ఆధిపత్యంలోకి వ్యవసాయంరంగం చేజారాక తలెత్తే అనర్థాలకు అంతుండదని రైతు సంఘాలంటున్నాయి. ఇదంతా ఓ పెద్ద కుట్ర అని, సంస్కరణల ముసుగులో ప్రయివేటుకు తివాచీలు పరచి, క్రమంగా రైతును నిస్స హాయ స్థితిలోకి నెడతారనేది రైతు సంఘాల భయాందోళన. ప్రయి వేటు పెట్టుబడుల్ని పెద్ద మొత్తాల్లో ఆకర్శించి, ఆహ్వానించకుండా వ్యవ సాయాన్ని లాభసాటిగా మార్చలేమని ప్రభుత్వం చెబుతోంది. మొదట అలా కనిపించినా, రాను రాను అసంఘటిత రైతాంగాన్ని మరింత దీనస్థితిలోకి నెడుతుందనే అభిప్రాయం అత్యధికుల్లో ఉంది. బడ్జెట్లోనూ కవ్వింపు ప్రతిపాదనలా? వ్యయ ప్రయాసలకోర్చి, రైతాంగం ఎడతెగని ఉద్యమం చేస్తున్నా, వారిని అనునయించి మచ్చిక చేసుకునే సర్కారు ప్రయత్నమేదీ బడ్జెట్ ప్రతిపాదనల్లో లేదని వ్యవసాయ నిపుణులంటున్నారు. పైగా కొన్ని కవ్వింపు చర్యల సంకేతాలున్నాయనేది వారి భావన! వ్యవసాయ రంగానికి నిధులు పెంచకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. రుణ సదుపా యాన్ని స్వల్పంగా పెంచినా ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతాంగానికి అందిస్తున్న పెట్టుబడి సహాయానికి కత్తెర వేశారు. గత సంవత్సరపు నిధి రూ. 75 వేల కోట్ల నుంచి ఈ సారి రూ. 65 వేల కోట్లకు (13 శాతం) తగ్గించారు. రైతు సంక్షేమ వ్యయం లోనూ 8.5 శాతం కోత విస్మయం కలిగించింది. కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యానికి సర్కారు దారులు పరుస్తోందన్న విమర్శకులే, తాజా బడ్జెట్లో కేంద్రం ఆ దారుల్ని మరింత చదును చేయజూస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రయివేటు శక్తుల ఇష్టారాజ్యానికి కొత్తచట్టాల పక డ్బందీ అమలుకు భూమిక, అదికూడా ప్రజాధనంతో సిద్ధం చేస్తోం దనేది అభియోగం. వ్యవసాయ మౌలికరంగాభివృద్ధే సెస్ సమీకరణ వెనుక ఉద్దేశం. కానీ, ఈ నిధుల్ని ఎక్కడ? ఏ మౌలిక వ్యవస్థ ఏర్పా టుకు? ఏ ప్రాతిపదికన వెచ్చిస్తారో స్పష్టత ఉండాలని రైతాంగం కోరు తోంది. రోడ్లు వేస్తారా? గిడ్డంగులు కడతారా? యాంత్రికత పెంచు తారా? ఏం చేస్తారు? తద్వారా ఎవరికి ప్రయోజనం, రైతుకా, పరిశ్ర మకా? వ్యాపారులకా? స్పష్టత ఉండాలనేది విమర్శకుల వాదన. వివా దాస్పద చట్టాల జన్మస్థానమైన పార్లమెంటు వైదికనుంచైనా ఈ సమ స్యకు పరిష్కారం లభించాలని, ప్రస్తుత ప్రతిష్టంభన తొలగాలని రైతు లతో పాటు ఇతర ప్రజాస్వామ్యవాదులంతా కోరుకుంటున్నారు. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
తనో రాజధర్మ దీపస్తంభం
భారత్ వైవిధ్య సామాజిక పరిస్థితుల నేపథ్యంలోనూ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. మూడుమార్లు దేశ ప్రధాని అయి, దేశంలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డులకెక్కారు. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనావళి అభిమానం చూరగొన్న నేత అయ్యారు. ‘సరిపోని శిబిరంలో సరైన వ్యక్తి’ (ఎ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ) అన్న విమర్శే ఆయన పట్ల జనాదరణకు గీటురాయిగా నిలిచే పొగడ్తయింది! బాబ్రీ మసీదు కూల్చివేతను నిర్ద్వంద్వంగా ఖండించారు. గోద్రా నరమేధం ఆపే ‘రాజధర్మం’ లోపించిందన్నారు. సరిహద్దులు చెరిపే శాంతికపోతమయ్యారు. ‘‘హార్ నహీ మానూంగా... రార్ నహీ థానుంగా కాల్కే కపాల్ పర్ దిఖాతా మిఠాతాహూ, గీత్ నయా గాతాహు...’’ ‘‘ఓటమిని ఒప్పుకోను... పోరుకు వెనుకాడను కాలం నుదుట పాతను చెరిపి, కొత్తను లిఖిస్తా... సరికొత్త గీతాన్ని ఆలపిస్తా!’’ జీవిత పర్యంతం పలు సందర్భాల్లో పాత రాతల్ని చెరిపి కొత్త రాతలు లిఖించిన రాజనీతిజ్ఞుడు, భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆఖరి గీతం పాడారు. యావద్భారతం నిండైన అభిమా నంతో నివాళి అర్పించేలా సాగిందా గీతం! మృత్యు వును అంత తేలిగ్గా అంగీకరించని ఆయన, సుదీర్ఘ పోరు తర్వాత తుది శ్వాసతో విశ్రమించారు. సంఘ ర్షణ–సంయమనం, జాతీయత–కవితాత్మకత, అవ కాశాలు–సవాళ్ల మధ్య సాగిన 93 ఏళ్ల ఆయన జీవన గమనమే ఓ విలక్షణ గీతం! భారత్ వైవిధ్య సామా జిక పరిస్థితుల నేపథ్యంలోనూ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు. మూడు మార్లు దేశ ప్రధాని అయి, దేశంలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డులకెక్కారు. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనా వళి అభిమానం చూరగొన్న నేత అయ్యారు. ‘సరి పోని శిబిరంలో సరైన వ్యక్తి’ (ఎ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ) అన్న విమర్శే ఆయన పట్ల జనాదరణకు గీటురాయిగా నిలిచే పొగడ్తయింది! ప్రత్యర్థులూ ప్రశంసించే విశిష్ట వ్యక్తిత్వమాయనది. స్వాతంత్ర పోరు సాగిన తన చిన్నతనం నుంచే దేశభక్తి భావాలు, జాతీయతా దృక్పథం ఉన్న వాజ్‌పేయి క్రమంగా ఎదిగి భారత రాజకీయ యవనికపై తనదైన చెరగని ముద్రవేశారు. అధికారంలో కన్నా విపక్షంలోనే అధికకాలం ఉండి భవిష్యత్తరాలకు ఆదర్శ వంతమైన రాజకీయ బాట పరిచారు. ఉదాత్త వ్యక్తిత్వం, ఉన్నత వక్తృత్వంతో పలు రూపాల్లో భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేశారు. విశ్వ పటంలో భారత్ స్థానాన్ని పదిలపరిచారు. ఆయన ఓ స్ఫూర్తి, ప్రేరణ యువకుడిగా శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వంటి పెద్దల మెప్పు పొందిన అటల్జీ తర్వాత తానే ఎందరెందరికో స్ఫూర్తి అయ్యారు. విషయాల్ని సులభంగా గ్రహించే శక్తి, పనిపట్ల నిబద్దత, స్పష్టమైన అభివ్యక్తి తక్కువ కాలంలో ఆయనకు పేరు తెచ్చాయి. దానికి తోడు స్పష్టమైన, ప్రభావవంతమైన హిందీలో అనర్గళంగా మాట్లాడగలగటం అదనపు శక్తి అయింది. సభల్లో జరిపే ప్రసంగాల్లోనే కాకుండా నలుగురు చేరి ముచ్చటించుకునే చోట కూడా హాస్యస్పోరకంగా మాట్లా డటం, మధ్యలో కవితల్ని వినిపించడం ద్వారా పలు వుర్ని ఆకట్టుకోగలిగేవారు. ప్రతి మాటలో వాస్తవిక తను ప్రతిబింబించడం, శ్రోతల్లో నిజమనే భావన కలిగించడం ఆయన ప్రత్యేకత. భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన కొత్తలో ఒకసారి ఆయన మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. మున్సి పల్ మైదానంలో ఆయన సభ, ప్రసంగం ఉందని తెలిసి జోగిపేట పట్టణపు డిగ్రీ విద్యార్థులుగా యువ కులు కొందరం వెళ్లాం. ఆయన ప్రసంగానికి మేమే కాకుండా సామాన్యులూ మంత్రముగ్దులైనట్టు నిలబడిపోయారు. సభ ముగిసిందని నిర్వహకులు ప్రకటించే వరకు ఎవరూ తమ స్థానాల నుంచి కదల నంత నిశ్చేష్టులయ్యారు. ‘‘1952లో నేను తొలిసారి అటల్‌జీని కలిశాను. ఆయన అప్పుడు డా‘‘ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రాజకీయ కార్యదర్శిగా ఉండేవారు.. రాజస్థాన్ కోట నుంచి వెళుతున్నారని తెలిసి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా నేను వెళ్లాను... యవ్వనపు ఆదర్శ భావాలు ఆయన పుణికి పుచ్చుకున్నారని నాకు సులభంగా అర్థమైంది. రాజకీయాల్లోకి ప్రవేశించినా, ఆయన చుట్టూ ఒక కవితాత్మక ఆకర్షణ నెలకొని ఉండేది. ఆయనలో ఏదో ఒక శక్తి జ్వలిస్తున్నట్టు, ఆ అంతర్జ్వాల ముఖంపై ప్రస్పుటంగా గోచరించేది, అప్పుడాయన వయసు 27 ఉండవచ్చు...’’ అని బీజేపీ సీనియర్ నాయకుడు లాల్‌క్రిష్ణ అడ్వాణీ తన ఆత్మకథ (నాదేశం, నా జీవితం)లో రాశారు. అప్పు డేర్పడ్డ తన తొలి అభిప్రాయమే అటల్‌జీపై చివరి అభిప్రాయమన్నారు. పార్టీలకు అతీతమైన విశాల దృక్పథం వాజ్‌పేయిది పార్టీల, సిద్దాంతాల మూసలో ఇరుక్కు పోయే హస్వ్ర దృష్టి కాదు. విషయాల్ని సమగ్రంగా పరిశీలించి భూత, వర్తమాన, భవిష్యత్ పరిణా మాల్ని పరిగణనలోకి తీసుకునే వాస్తవిక, విశాల దృక్పథం. అందుకే, ఆయన అత్యధికులకు నచ్చే వారు. జనతా ప్రభుత్వపు మురార్జీదేశాయ్ మంత్రి వర్గంలో విదేశీవ్యవహారాల మంత్రిగా తన కార్యాల యంలో ప్రవేశించినపుడు సిబ్బందిని ఒకింత విస్మ యానికి గురిచేశారు. ‘అంతకు మున్నొచ్చినపుడు గోడపై కనిపించిన చిత్రపటం ఇప్పుడు లేదేంట’ని అడిగి, ‘మీరొస్తున్నారని తీసేశామం’టే, అప్పటిక ప్పుడు దాన్ని తెప్పించి మరీ గోడకు పెట్టించారా యన. ఆ ఫోటో వేరెవరిదో కాదు, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూది. రాజకీయంగా ఎన్ని అంశాల్లో విభేదించినా, పార్లమెంటు వేదికగా తానెన్ని పోరాటాలు చేసినా... రాజకీయాల్లో తనకు ఆదర్శం నెహ్రూ అని బహిరంగంగా చెప్పగలిగిన ధీరోదాత్తుడు అటల్జీ. ‘స్పష్టమైన భావాలు, నిక్కచ్చి అభివ్యక్తి, సమ్యక్దృష్టీ ఉన్న ఈ యువకుడికి ఎంతో భవిష్యత్తు ఉంది, ఏదో ఒక రోజు దేశానికి గొప్ప నేత అవుతాడ’ని అదే నెహ్రూతో ప్రశంసలు పొందారాయన. మానవహక్కుల విషయమై జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానంలో దేశం తరపు వాదనలు వినిపించడానికి వెళుతున్న ప్రతినిధి బృందానికి అటల్‌జీనే నేతృత్వం వహించాలని నాటి ప్రధాని పి.వి. నర్సింహారావు కోరి పంపారు. బాబ్రీమసీద్ కూల్చారనే మకిలి అంటి, అంటరాని పార్టీగా ఉన్న బీజేపీతో ఇతర పార్టీల్ని భాగస్వాముల్ని చేసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ఏర్పర చడం వాజ్‌పేయి వల్లే సాధ్యపడింది. ‘1996లో అట ల్‌జీ 13 రోజుల ప్రధానిగా ఉన్నపుడు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన పార్టీ వైఫల్యం నుంచి, 1998లో విజయవంతంగా అధికారం చేప ట్టడం వరకూ... ఆయన వ్యక్తిగత ఆదరణే ప్రధానాం శమైందని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ ఆక ర్షణ పార్టీకున్న మద్దతు కంటే అధికమైంది, అతీత మైంది’ అని అడ్వాణీ స్వయంగా పేర్కొన్నారు. జర్నలిజంపై ఉదాత్త భావన దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని స్థాయిల జర్నలిస్టులకు వాజ్‌పేయి అంటే ఓ ప్రత్యేక గౌరవం, ఆరాధ్య భావం ఉండేది. సమాజ ఉన్నతికోసం జర్నలిస్టులు కూడా గురుతర బాధ్యత కలిగిన వృత్తిపని వారనేది ఆయన అభిప్రాయం. దేశంలో ఏ మూలకు వెళ్లినా అటల్జీ–జర్నలిస్టులది ఓ అవినాభావ బంధం! రాజకీయాలకు ముందు జర్నలిజంలోనూ వాజ్‌పేయి తనదైన ముద్ర వేశారు. 1948లో ‘పాంచజన్య’కు సంస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. శక్తి వంతమైన ఆయన సంపాదకీయాలు చదివి ఉత్తేజితు లైన రాజకీయ నాయకులు దేశంలో ఎందరో! హిందీ మాసపత్రిక ‘రాష్ట్రధర్మ’కు, దినపత్రిక ‘స్వదేశ్’కు ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. 1996లో అటల్జీ విపక్షనేతగా ఉన్నపుడు ఒక అధ్యయన బృందంలో సభ్యుడిగా నేను ఆయన్ని తొలిసారి, వారి అధికార నివాసంలో కలిసినపుడు రెండు గొప్ప మాటలు చెప్పారు. ఇచ్చిన సమయం కన్నా కాస్త ఆల స్యంగా వెళ్లిన మా బృందాన్ని ఆహ్వానిస్తూ, ‘‘రండి... మీ ఆలస్యం వల్ల నేనీరోజు ‘క్వశ్చన్ అవర్’ అందుకోలేకపోతున్నా, పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రజా సమస్యలకు సమాధానాలు వెతికే ఆ సమయమే అత్యంత కీలకమైంది’’ అన్నారు. తర్వాత మా వృత్తి గురించి చెబుతూ, ‘జర్నలిజం ఉద్యోగం కాదు, ఒక వృత్తి, వృత్తిని మించి ఉదాత్త కార్యం (మిషన్)’ అని స్ఫూర్తినిచ్చారు. తొలిసారి ప్రధానిగా ఉన్నపుడు హైదరాబాద్ వచ్చిన అటల్జీ, తనకు పూర్వ పరిచయమున్న ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోరితే 5 నిమిషాల సమయమిచ్చారు. ఓ ఆసక్తికర ప్రశ్నకు ముగ్దుడై, ‘మరో 5 నిమిషాలు పొడిగించాను పో!’ అని పగలబడి నవ్వారు. సంస్కరణ రథం, శాంతి కపోతం ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినపుడు (1998–99) దేశంలో 5.8 ఆర్థిక వృద్ధి రేటు సాధిం చింది వాజ్‌పేయి ప్రభుత్వం. మౌలికసదుపాయాల కల్పనకు మున్నెన్నడు లేనంత ప్రాధాన్యత దక్కింది. ఎన్నో సంస్కరణలు తెచ్చారు. రావణ కాష్టంలా రగిలే భారత్–పాక్ మధ్య, ఉద్రిక్త సరిహద్దుల్ని చెరిపి సౌహార్ద్ర బస్సుయాత్ర నడిపిన శాంతి కపోత మాయన! జనతా ప్రభుత్వంలో తాను విదేశాంగ మంత్రిగా విత్తిన విత్తనాలు మొక్కై ఎదిగిన సందర్భం. నమ్మిన నిజమైన లౌకికవాదం పునాదులపై విశ్వాసంతో, తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టి సాగించిన లాహోర్ యాత్ర అది! దౌత్య ప్రపం చంలోనే పెను సంచలనం! బాబ్రీ మసీదు కూల్చివేతను నిర్ద్వంద్వంగా ఖండించారు. గోద్రా నరమేధం ఆపే ‘రాజధర్మం’ లోపించిందన్నారు. అన్ని కాలా ల్లోనూ... రాజకీయ వ్యవస్థను సంస్కరించాలనుకునే ప్రజాస్వామ్యవాదులకు అస్త్రంగా ఆయన అందించిన ఒక గొప్ప కవితతో ముగిస్తా. ‘‘అధికారంతో సత్యం పోరాడుతుంది, నిరంకుశత్వంతో న్యాయం యుద్దం చేస్తుంది, చీకటి ఓ సవాల్ విసిరింది, వెలుగే కడపటి అస్త్రమౌతుంది, అన్నీ పణంగా పెట్టాం... ఇక ఆగలేం! విరిగైనా పొతాం కానీ, వంగేది లేదు!’’ దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మౌన ఛేదనే మార్పుకు నాంది
సమకాలీనం ‘బయటకు వెళ్లిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తున్నారంటే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సింది ఆడపిల్లల గురించి కాదు, మగపిల్లల గురించి’ అన్న కిరణ్‌ఖేర్ మాట అక్షర సత్యం! చట్టాల్లో, పోలీసు వ్యవస్థలో, న్యాయపాలనలో, సామాజిక దృక్పథంలో, మగవాళ్ల ఆలోచనల్లో... అంతటా మార్పు రావాల్సిందే! వర్ణిక, అదితిల ధైర్యం, పట్టుదల వికసిస్తున్న మహిళా చైతన్యానికి సంకేతం, ఇతరులకు ఆదర్శం. మహిళల పట్ల జరుగుతున్న అన్ని రకాల దాష్టీకాలకూ కాలం చెల్లే రోజులు వస్తున్నాయనడానికి వారి తెగువ బలమైన సంకేతం. కొత్తతరం మహిళ వర్ణిక కుందు పెట్టిన పెద్ద పొలికేక భారతదేశమంతా ఇప్పుడు ప్రతిధ్వనిస్తోంది. అదింకా ఎన్నెన్నో రెట్లు పెరిగి, దిక్కులు పిక్కటిల్లే శబ్దమై ఘోషించాలి. దాన్ని అందిపుచ్చుకొని మహిళలు భవిష్యత్ బాటలు సుస్థిరం చేసుకోవాల్సిన తరుణమిది. న్యాయబద్ధంగా తమదైన ప్రతిష్టాత్మక స్థానాన్ని భారత మహిళ పదిలపరచుకోవాల్సిన సమయం వచ్చేసింది. పటి ష్టంగా వేళ్లూనుకున్న మన పురుషాధిక్య సమాజంలో మొగ్గతొడుగుతున్న మార్పులకిది చిరు సంకేతం! ఓ రకంగా చూస్తే ఘర్షణల పురిటి నొప్పులు పడుతున్న సంధి కాలమనిపిస్తుంది. 48 గంటల వ్యవధిలో చండీగఢ్‌లో వర్ణిక, ముంబైలో అదితి అనే ఇద్దరు వనితలు కనబరచిన అసాధారణ తెగువ అభినందనీయం! ‘మేం ఏం చేసినా చెల్లుబాటవుతుంద’నుకున్న ముగ్గురి పురుషాహంకారాన్ని చెంప చెళ్లు మనేలా తిప్పికొట్టారు. ఈ వీర వనితలు, ఈ దేశపు 65 కోట్ల మహిళలకు ప్రతినిధులే కాదు, మరో 65 కోట్ల మందితో కూడిన పురుష సమాజానికి ప్రత్యక్ష గుణపాఠం చెబుతున్న సవాళ్లు! సమాజ గతి మార్పునకు తెరతీస్తున్న ‘చేంజ్ అంబాసిడర్లు’! రాత్రిపూట వీధుల్లో తమను వెంటాడిన వైట్కాలర్డ్ మానవ మృగాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నవారు. స్వీయ ప్రతిభతో విపత్తు నుంచి గట్టెక్కినా, ‘బయటపడ్డాం, బతుకుజీవుడా!’ అని సరిపెట్టుకోకుండా, సాహసించి ఆ ముష్కరుల్ని కటకటాల వెనక్కి పంపారు. పాలకపక్షం బీజేపీ హరియాణా శాఖ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు, వికాస్ బరాలాను రెండోసారి అరెస్టు చేయించి, అదనపు సెక్షన్లు పెట్టించిందా తెగింపే! ముంబైలో తనను వెంటాడి, కడకు ఇంటి తలుపు తట్టిన ‘టెక్కీ’కీ దాదాపు అదే గతి పట్టించింది ఓ ఇల్లాలి తెగువ! ప్రతికూల పరిస్థితిని వారు సమర్థంగా ప్రతిఘటించారు. సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుశ్చర్యను సామాజిక మాధ్యమాల్లో (ఫేస్బుక్) ఎండ గట్టారు. తగు చర్యలు తీసుకోవాలని సర్కార్‌ను డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోక తప్పని అనివార్య పరిస్థితుల్ని కల్పించారు. పిరికితనంతో, పాడుప డిన సంప్రదాయ కట్టుబాట్ల గుహల్లో కుమిలి, మగ్గి పోవడానికి వారు సిద్ధంగా లేరు. ‘‘నా పేరును గోప్యంగా ఉంచి ముఖాన్ని దాచుకోవాల్సిన అవ సరం లేదు, ఎందుకంటే, నేను నేరస్తురాల్ని కాదు, బాధితురాలినీ కాదు. ఒక విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డ విజేతను’ అంటోంది వర్ణిక! ‘వేటాడి, కిడ్నాప్‌నకు యత్నించి, నన్నింత క్షోభకు గురిచేసిన నేరతత్వపు ముష్కరులకు తగిన శిక్ష పడాల్సిందే!’ అంటోందామె. ఆమె తండ్రి, సీనియర్ ఐఏఎస్ అధి కారి వరిందర్సింగ్ కుందు ఆమెకు కొండంత అండ. ఇంకా పడికట్టు పదా లతో, మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్న సంప్రదాయక సమాజంపై ప్రశ్నల పరంపరనే కురిపించింది వర్ణిక. ఆమె సంధించిన వాటిలో ఇంకా సమాధానం రాని, రావాల్సిన ప్రశ్నలు మనందరి చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి. సభ్య సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్ని రకాల దాష్టీకాలకూ క్రమక్రమంగా, కాలం చెల్లే రోజులు అనివార్యంగా సమీపిస్తున్నాయనేందుకు, వారిరువురి తెగువ ఓ బలమైన సంకేతం! ఆధిపత్య దురాలోచనలకు అడ్డు కట్ట, భావజాల సంస్కరణ, ప్రతిఘటన, నివారణ చర్యలు, దోషులకు కఠిన శిక్షల అమలు ద్వారా మాత్రమే ఆడవాళ్లపై జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాలను నియంత్రించగలుగుతాం. తాము చూపిన తెగువ, పట్టుదల, ప్రతిఘటన దేశవ్యాప్తం కావాలన్న గట్టి సందేశమే వారి ద్దరూ చూపిన సాహసం అంతరార్థం. కళ్లను కనురెప్పలు కాటేస్తున్నాయ్! స్విచ్ వేస్తే బల్బు వెలిగినంత వేగంగా వ్యవస్థలు మారవు. కానీ, మార్పు సంకే తాలున్నపుడు వాటిని గుర్తించడం, స్వాగతించడం, ప్రోత్సహించడం సమా జహితం కోరే వారి బాధ్యత. ఇప్పుడదే జరగాలి. తమపై పురుషులు జరిపే దాష్టీకాలను సాహసంతో ఎదురొడ్డి, మహిళలు ప్రతిఘటించే సంఘటనలు వేళ్లమీద లెక్కించగలిగినన్నే కావచ్చు! భవిష్యత్తులో చెటై్ట విశాలంగా విస్తరించే విత్తుపై ఇప్పుడా క్రాంతి ఓ సన్నని పొట్టులాంటిదే! చీకటి వ్యవహారాల్లా జరిగిపోయే ఈ దారుణాల్లో అసలు వెలుగు చూసేవే కొన్నయితే, అందులో పోరాట బాటన సాగేవి చాలా తక్కువ. డబ్బు, పలుకుబడి, రాజకీయ నేప థ్యమున్న కుటుంబాల వారు చేసే అకృత్యాలు అసలు పోలీసు కేసుల దాకానే రావు. వచ్చినా, కడదాకా నిలువవు. ప్రతిఘటనల నడుమ ప్రాణాలు పణంగా పెట్టి పట్టుదలగా ఎవరైనా పోరు సాగించినా, భ్రష్టుపట్టిన వ్యవ స్థల్ని వివిధ స్థాయిల్లో ప్రభావితం చేసే ‘పెద్ద మనుషులు’ కేసు దర్యాప్తుల్ని, నేర విచారణల్ని నిలువునా నీరుగారస్తారు. పరిస్థితుల్ని తమకనుకూలంగా మలచుకుంటారు. నిర్దోషులుగా చలామణి అవుతారు. తుది ఫలితంపై భరోసా లేక, బాగా చదువుకున్న మహిళలు కూడా ఈ అఘాయిత్యాలను ప్రతిఘటించడానికి, పోరాడటానికి సాహసించలేక పోతున్నారు. మానసి కంగా నలగటం, నలుగురి నోళ్లలో నానటం తప్ప ఒరిగేదేమీ ఉండదని కొన్ని సార్లు ఫిర్యాదు కూడా చేయట్లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల్లో, శాస్త్ర– సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొస్తున్న యుగంలో, నిజాల్ని నిప్పులా చూపే సీసీ కెమెరాల శకంలో, సామాజిక మాధ్యమాలు వేయి కళ్లతో చూస్తూ పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్న ఈ రోజుల్లో మహిళలు చూపే చొరవ, తెగింపే వారికి రక్ష. ముంబై, చండీగఢ్ వంటి పెద్ద నగరాల్లో జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ వారు చేసిందదే! పట్టు సడలనీయకుండా ప్రతిఘటిం చారు. అందుబాటులోని అన్ని వనరుల్ని సమీకరించి ‘మృగాళ్ల’ ఆట కట్టిం చారు. మహిళలపై అఘాయిత్యమైనా, అందుకు ప్రయత్నమైనా.... లోలోపల కుమిలే మౌనం, నిశ్శబ్దం వారికి రక్ష కాదు సరికదా, చెలరేగే అల్లరి మూకలకు కొత్త ఇంధనం. 2013 అక్టోబర్ 18న హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ ప్రాంతంలో క్యాబ్ ఎక్కిన యువతిని దారి మార్చి, ఓఆర్ఆర్లో తీసుకు వెళ్లి క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి తలపడ్డాడు. ‘అభయ’ పేరిట నమోదైన ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, ఈ దుష్కృత్యానికి పాల్పడ్డ డ్రైవర్, అతని మిత్రుడికి 2014 మేలో, ఇరవై ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఇది వరకెప్పుడూ నేనిటువంటి చర్యలకు పాల్పడలేదు, అత్యాచారం చేస్తే ఏమీ కాదు, ఇతరులెవరికీ వారు చెప్పుకోలేరు అని మా మిత్రుడు నన్ను పురిగొ ల్పాడు, ఇంతకు ముందు తానొకరిపై ఇలాగే అత్యాచారం చేసినా తనకేమీ కాలేద’ని చెప్పాడని విచారణలో వెల్లడించాడు. అదీ వారి భరోసా! గొంతెత్తి ప్రతిఘటించడం, అకృత్యాల్ని ఎలుగెత్తి చాటడం, పట్టుబట్టి నేరానికి తగ్గ శిక్ష ఇప్పించడమే ఉన్నంతలో సరైన మార్గం. వర్ణిక, అదితి ఇప్పుడీ మార్గాన్ని ఎలుగెత్తి చూపారు. ఇప్పటికీ కోట్లాది కుటుంబాల్లో పెదాలు విచ్చుకోవట్లేదు. గొంతులు పెగలట్లేదు. ఉబికివచ్చే కన్నీరు తప్ప, గుండె పొరలు దాటని దుఃఖం లోలోనే సుడులు తిరుగుతోంది. సహోద్యోగుల నుంచి పై అధికారుల దాకా, సాటి పనివారి నుంచి యజమానుల దాకా, వరుసకు సోదరుల నుంచి ఇతర బంధువుల దాకా, పెంపుడు తండ్రుల నుంచి కన్నతండ్రుల దాకా.... కళ్లను కాటేస్తున్న కనురెప్పలెన్నో! గ్రామీణ భారతంలో, పేదరికంలో, పని ప్రదేశాల్లో, పాలన–అధికార వ్యవస్థల హోదా దొంతరల్లో... అంతటా ఆడ వారిపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. భావజాలమే మూల సమస్య ‘వాడు మగాడు, ఎలా అయినా తిరగొచ్చు, ఆడాళ్లకెందుకు...?’ ఇదీ, ఉగ్గు పాలతో మన వారు నూరిపోసే భావజాలం. మెజారిటీ తలిదండ్రులు పిల్లల పెంపకంలోనూ ఈ వివక్ష చూపుతున్నారు. చింత చచ్చినా పులుపు చావ లేదన్నట్టు, ఎన్ని చదువులు చదివినా అంతర్లీనంగా ఉన్న భావజాలం వద లడం లేదు. పైకెన్ని గంభీరమైన మాటలు చెప్పినా, లోలోపల ఇటువంటి ఆలోచనా సరళి ఉండటం వల్లే ఆడవాళ్ల పట్ల లింగ వివక్ష, లైంగిక వేధింపులు, మానసిక, భౌతిక దాడులూ, పెంపకం లోపం వల్ల మగాళ్ల వైఖరిలోనే ఆడాళ్ల పట్ల ఓ చిన్నచూపు అంతర్లీనంగా బలపడుతోంది. ఈ దుష్ప్రభావం వల్ల నేమో, ఎదుగుదల క్రమంలోనే మగపిల్లల్లో ఓ విచ్చలవిడితనం, ఆడపిల్లల్లో ఓ రకమైన బెరుకు, భయం అలవడి పోతున్నాయి. దీనికి పూర్తి భిన్నమైన పంథాను వర్ణిక, అదితి కనబర్చారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వాళ్లకన్నా, పరోక్షంగా వాటిని సమర్థిస్తూ మాట్లాడే పెద్ద మనుషులే ప్రతికూల భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. తాజా ఘటనలో కూడా, ‘అంత రాత్రి పూట ఆమెకు అక్కడేం పని, త్వరగా ఇంటికి వచ్చి ఉండాల్సింది. ఆమె తల్లి దండ్రులు ఈ విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు’ అని హరియాణా బీజేపీ ఉపా«ధ్యక్షుడు రామ్దీర్ భట్టి చేసిన వ్యాఖ్య ఈ కోవదే! మరి అదే విషయం వర్ణికను వెంటాడిన వికాస్ బరాలాకూ వర్తిస్తుంది కదా! ఇదేదో అతి సాధారణ విషయమైనట్టు, ‘అబ్బా యిలు అమ్మాయిల వెంటపడటం కాలేజీ విద్యార్థుల్లో మామూలే!’ అని మరో బీజేపీ నాయకుడి నిస్సిగ్గు వ్యాఖ్య, ‘కుర్రాళ్లు, కుర్రాళ్ల పనులే చేస్తారు’ అని వారి పోకిరీ పనుల్ని సమర్థిస్తూ లోగడ ములాయంసింగ్ యాదవ్ అన్న మాటల్ని గుర్తుకు తెస్తోంది. సంతానం ఆడో, మగో కనడం ఎవరి చేతు ల్లోనయినా ఉంటుందా? కాలం చెల్లిన సామెతే కావచ్చు! ‘కోడలు మగబిడ్డను కనిపెడతానంటే ఏ అత్త వద్దంటుంది?’ అని ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిగ్గా చేసిన వ్యాఖ్యలు ఏ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి? అంటే, ఆడబిడ్డని కంటే అత్తలు వద్దంటారని, అలా అనడం సముచితమేనని అర్థమే కదా! ‘కారు గ్యారేజీలో ఉంటే క్షేమంగా ఉన్నట్టు, ఆడవాళ్లు ఇంట్లోనే ఉంటే ఏ అఘాయిత్యాలూ జరుగవు కదా!’ అని సాక్షాత్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఇదొక దుర్మార్గమైన సమాజం, మరీ ముఖ్యంగా మహిళల పట్ల! బూజు పట్టిన భావజాలంలో బతికే సనాతన వాదులు మహిళల్ని... అవసరమైన పనులు చేసిపెట్టే, లైంగిక వాంఛలు తీర్చే, పిల్లల్ని కనిచ్చే జీవులుగా తప్ప, సాటి మనుషులుగా కూడా చూడలేక పోతున్నారు. తామై కదిలితే తప్ప... తాను కాకుండా మరో సాధారణ యువతి అయితే పోలీసులు స్పందించి ఉండేవారా? వారు కల్పించుకునే లోపలే పోకిరీలకు తాను చిక్కి ఉంటే? తెగించి తాను సాహసించకుంటే ఏమై ఉండు? ఇలాంటి ఆలోచనలూ వర్ణిక మదిలో మెదిలాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ‘ఏది ఏమైనా సరే, దోషులకు శిక్షపడే హేతుబద్ధ్దమైన ముగింపు వరకూ పోరాడుతా, ఈ సమయంలో ఆమెకు నేను అండగా నిలవకపోతే దేశంలో ఏ తండ్రీ తన బిడ్డల కోసం నిలబడలేడ’న్న వరిందర్ కుందు మాటలెంత సత్యం! ‘బయ టకు వెళ్లిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తున్నారంటే తల్లిదండ్రులు ఆందో ళన చెందాల్సింది ఆడపిల్లల గురించి కాదు, మగపిల్లల గురించి’ అన్న బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ అభివ్యక్తిలో ఎంత నిజముంది! చట్టాల్లో, వాటి అమలులో, పోలీసు వ్యవస్థలో, న్యాయపాలనలో, సామాజిక దృక్పథంలో, మగవాళ్ల ఆలోచనల్లో... అంతటా మార్పు రావాల్సిందే! ముఖ్యంగా మహిళల్లో మరింత చైతన్యం రావాలి. వర్ణిక, అదితిల ధైర్యం, పట్టుదల మహిళా సమా జానికి ఓ స్ఫూర్తి కావాలి. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
హక్కును హరిస్తే, బతుకు బజారే!
సమకాలీనం బతుక్కు సంబంధమున్న పలు అంశాల్లో హక్కులుండీ, రాజ్యాంగ భద్రత కలిగీ, చట్టాలేర్పడి, ప్రత్యేక సంస్థలున్నచోటే రక్షణ కరువవుతోంది. నట్టింట చిచ్చు పెట్టిన ‘డ్రగ్స్’ మహమ్మారిని చూస్తూనే ఉన్నాం. హక్కులు ఒక్కొక్కటే హరించి, సమాజాన్ని పాలనా సంకెళ్లలో బంధించడం సరికాదు. వ్యక్తిగత గోప్యత హక్కునూ హరిస్తే పిల్లలు, మహిళలతో సహా సామాన్యుల బతుకులు రోడ్డున పడతాయి. పరస్పర ప్రయోజనాలతో ప్రభుత్వాలతోఅంటకాగే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్లు, ప్రయివేటు శక్తుల ఆగడాలకు హద్దుండదు. కుక్క తోకనూపడమా? తోకే కుక్కనూపడమా? ఏం జరుగుతోందన్నది ముఖ్యం! విశిష్ట గుర్తింపు కార్డు, ఆధార్‌లో పాటించే పద్ధతుల చట్టబద్ధతను రాజ్యాంగం కల్పించిన ‘వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) హక్కు’ పరిధిలో పరిశీలించాలా? లేక, ఆధార్ ఓ మంచి ప్రక్రియ గనుక దాని నీడలో, అసలు భారత పౌరులకు గోప్యత ప్రాథమిక హక్కేనా అని నిర్ణయించాలా? ఇదీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల సారం. సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఏర్పరచిన తొమ్మండుగురు జడ్జీల ధర్మాసనం ముంది పుడు వాదనలు సాగుతున్నాయి. అవి ముగింపునకు వస్తున్న తరుణంలో, ఈ సంవాదం రేపుతున్న సందేహాలెన్నో! ‘ఆధార్’ను కాసేపు పక్కన పెట్టి చర్చిం చినా, పౌరులకు బోలెడంత వ్యక్తిగత జీవితం ఉంటుంది. దానికనేక పార్శా్వ లుంటాయి. అవి గోప్యంగా ఉంచుకోవాలనే స్వేచ్ఛా భావన ఉంటుంది. సదరు గోప్యతను ప్రభుత్వాలు కాపాడాలనే ఆశ, అనుచితంగా అందులోకి చొరబడే వాళ్లని శిక్షించాలనే ఆకాంక్ష సహజం! వాదనలెలా ఉన్నా ఓ హక్కు, హక్కు కాకుండా ఎలా పోతుంది? పైగా, మారుతున్న కాలమాన పరిస్థి తుల్లో... ఉన్న హక్కులకు భద్రత కల్పిస్తూ, చట్టాలకు పదును పెట్టాల్సింది పోయి వాటిని నీరు గార్చడం దారుణం! సర్కారు కనుసన్నల్లో సమాచార వ్యవస్థను గుప్పిట పట్టిన ప్రయివేటు శక్తులు పౌరుల గోప్యతను గాలికొదిలి, సగటు మనిషిని నిలువునా గుడ్డలిప్పి నడిబజార్లో నిలబెడుతున్న సంధికాల మిది! శాస్త్రసాంకేతికత పుణ్యమా అని ఇతరుల వ్యక్తిగత సమాచార వ్యవస్థ (డాటా) పరిధిలోకి ఎవరైనా చొరబడటం తేలికైన రోజులివి. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే కాదంటే, దీనికొక రాజ్యాంగ భద్రతే లేదంటే, కార్పొరేట్ శక్తులు అనుచితంగా చొరబడటం ఒక ఆటవిడుపవుతుంది. కేంద్రీకృతంగా అధికారాన్ని గుప్పిట పట్టాలనుకునే సర్కార్లకు ఇక అడ్డూ అదుపుండదు. తమ వర్తక, వాణిజ్య, రాజకీయార్థిక ప్రయోజనాల కోసం పౌరుల కనీస హక్కుల్ని కాలరాచే తీరు విలువల పతనానికే దారితీస్తుంది. పౌరులది, ముఖ్యంగా బల హీనులది... తమదైనదేదీ కాసింత గోప్యంగా ఉంచుకోలేని బజారు బతుకవు తుంది. వారేదైనా ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని సమగ్ర తీర్పు చెప్పాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు సుప్రీం ధర్మాసనంపైనే ఉంది. గత అనుభవాల నేపథ్యంలో ఓ చరిత్రాత్మక తీర్పు కోసం దేశం నిరీక్షిస్తోంది. పరిమిత దృష్టితోనే ప్రమాదం హక్కు అప్రతిహతం కాదంటే, పరిమితులు విధించవచ్చు. ఎవరి హక్కులైనా ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదన్నదే రాజ్యాంగ స్ఫూర్తి. దానికి లోబడి సహేతుకమైన పరిమితుల్ని వ్యక్తిగత గోప్యత హక్కుకూ విధించ వచ్చు. ఆధార్ కోసం పౌరుల నుంచి సేకరించిన బయోమెట్రిక్, ఇతర ముఖ్య సమాచారం యథేచ్ఛగా జనబాహుళ్యంలోకి రావడం పట్ల పలువురు అభ్యం తరం వ్యక్తం చేశారు. దురుపయోగమయ్యే ప్రమాదాన్నీ శంకించారు. ఈ విష యమై సుప్రీం సమక్షానికి పలు వినతులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు రావ డంతో ఇది వార్తలకెక్కింది. వ్యక్తిగత గోప్యత అసలు ప్రాథమిక హక్కే కాదని గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. పౌరులకు సంక్రమించిన రెండు హక్కుల మధ్య హెచ్చు–తగ్గుల పోటీ పెట్టి చోద్యం చూసే వింత పంథాను కేంద్రం ఎంచుకుంది. ‘ఏదో కొందరు తమ వ్యక్తిగత గోప్యత హక్కు గురించి మాట్లాడుతున్నారు, మరో వైపు మేం ‘ఆధార్’ ఆసరాతో 27 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం, ఆహారపు హక్కు కన్నా వ్యక్తిగత గోప్యత హక్కు గొప్పదా?’ అన్న ప్రభుత్వ న్యాయవాది మాటల్లోనే సర్కారు వాదన డొల్ల తనం బయటపడింది. ఆధార్‌తో ఎంతో ప్రయోజనం ఉన్నందున, ఆ ప్రక్రియలో తప్పిదాల్ని ప్రశ్నించే మరొకరి హక్కులకు లెక్కే లేదనే వాదన తప్పు. ఆరున్నర దశాబ్దాల మన రాజ్యాంగ చరిత్రలో వ్యక్తిగత గోప్యత అంశం పలు మార్లు ఉన్నత న్యాయస్థానం సమక్షానికి వచ్చింది. ఇది ప్రాథమిక హక్కు కాదని రెండు మార్లు సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. 1954లో ఎంపీ శర్మ కేసులో 8 మంది న్యాయమూర్తుల ధర్మాసనం, తర్వాత 1962లో ఖరక్ సింగ్ కేసులో ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తదనంతర కాలంలో విచారణకు వచ్చిన గోవింద్–మనేక (1975) కేసులో, గోప్యత రాజ్యాంగం నిర్దేశించిన హక్కు అని సుప్రీం తీర్పు స్పష్టం చేసింది. అధికరణం 21లోని జీవించే హక్కుతో పాటు అధికరణం 19లోని పలు ప్రాథమిక హక్కుల్లోనూ వ్యక్తిగత గోప్యత మూలాలు, ఆనవాళ్లు ఉన్నా యని చెబుతూ ఇది రాజ్యాంగపు హక్కని స్పష్టం చేసింది. ఇంకా పలు సందర్భాల్లో, మలక్(1981), రాజగోపాల్ (1994), పీయూసీఎల్ (1997), డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ (2005), సుచిత (2009), సెల్వీ(2010), నల్సా (2014) కేసుల్లోనూ వ్యక్తిగత గోప్యతను రాజ్యాంగం కల్పించిన హక్కుగా గుర్తిస్తూ తీర్పులు వెలువడ్డాయి. కానీ, రాజ్యాంగంలో ఏదైనా అంశంపై స్పష్టత కొరవడి, సందిగ్ధత నెలకొన్నపుడు సుప్రీంకోర్టు తీర్పులే ప్రామాణికమౌతాయి. గోప్యత ప్రాథమిక హక్కు కాదని అంతకు ముందు తీర్పిచ్చినవి విస్తృత ధర్మాసనాలయినందున, తదనంతర కాలంలో తక్కువ మంది న్యాయమూర్తులతో ఏర్పడ్డ ధర్మాసనాలిచ్చిన గోప్యత అనుకూల తీర్పులు కాల పరీక్షకు నిలువలేదు. ఇప్పుడు విచారిస్తున్నది 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కనుక, ఈ తీర్పు ఇకపై శిరోధార్యమౌతుంది. మాట మార్చింది అందుకేనేమో! గోప్యత ప్రాథమిక హక్కు కాదని తీర్పిచ్చిన సందర్భాలు వేరు. ఎంపీ శర్మ (1954) కేసు, దర్యాప్తు అధికారులు దాల్మియా సంస్థల్లో జరిపిన సోదాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్. ఖరక్ సింగ్ (1962) కేసు, నేరారో పణలు ఎదుర్కొంటున్న ఖరక్ సింగ్‌పై దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన నిఘా, నియంత్రణ, తనిఖీలను సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన సందర్భం. అవన్నీ, ఆరోపణలెదుర్కొంటున్న వారిపై దర్యాప్తు సంస్థలు జరిపే నిఘా, నియంత్రణ, సోదాలకు సంబంధించిన వ్యవహారాల్లో గోప్యత విషయమై వెలువరించిన తీర్పులు. ఆ తీర్పే అన్ని సందర్భాలకూ సరిపోతుందను కోవడం సరికాదు. సగటు మనిషి వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాధాన్యతను, అందుకవసరమైన పరిమితుల్ని నిర్ణయించడమే ప్రస్తుతం ధర్మాసనం ముందున్న కర్తవ్యం. అందుకే, మొత్తానికిది ప్రాథమిక హక్కు అవునా? కాదా? అన్నది తేలితే తప్ప తాము తదుపరి తీర్పు వెలువరించలేమన్న ధర్మాసనం అభిప్రాయానికి అర్థముంది. 2012 నుంచి ఆధార్ వివాదంపై కేసు విచారణ సాగుతోంది. దీని చట్టబద్ధతను కర్ణాటకకు చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె.ఎస్. పుట్టుస్వామి లోగడ ఓ సందర్భంలో సవాల్ చేశారు. తదనంతరం 2016లో చట్టం తీసుకువచ్చి ఆధార్‌కు చట్టబద్ధత కల్పించిన తీరే ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. కేవలం ఆధార్ దృష్టి కోణంలోనే కాకుండా, విస్తృతార్థంలో గోప్యత హక్కును నిర్వచించి, పౌరుల హక్కును నొక్కిచెప్పి, ఏ మేరకు పరిమితులు విధించే హక్కు–అధికారం ప్రభుత్వానికుందో తేల్చాల్సిన సందర్భం వచ్చింది. రెంటి మధ్య సమతు ల్యత సాధించాలి. ఇన్నాళ్లూ ఇది ప్రాథమిక హక్కే కాదంటూ వచ్చిన కేంద్రం గొంతు మార్చింది. ప్రాథమిక హక్కు అయితే అయివుండవచ్చు, కానీ, పరిమితులేలేని సంపూర్ణ హక్కేం కాదనే తాజా వాదన వినిపిస్తోంది. వ్యక్తిగత గోప్యతలోని పలు అంశాలు, ఉప అంశాల్లో కొన్ని అప్రతిహత హక్కే అయినా, ఇంకొన్నిటికి దాన్ని య«థాతథంగా వర్తింపజేయలేమనే వాదనను తెరపైకి తెచ్చింది. ఇలా అన్ని అంతర్గత అంశాలు, ఉప అంశాలకు ఒకే స్థాయి కల్పిస్తే, అవి ఇతర ప్రాథమిక హక్కుల అమలుకు భంగం కల్గించే ప్రమా దముందన్నది కేంద్ర ప్రభుత్వ భావన! ఐటీతో ప్రపంచమే మారింది ఆధునిక శాస్త్రసాంకేతికత వల్ల సమాచార వ్యవస్థే సమూలంగా మారి పోయింది. వ్యక్తిగత గోప్యతకు అర్థం, ప్రాధాన్యం, ప్రభావం అన్నీ మారాయి. ప్రతి వ్యక్తి తన శరీర, ఆరోగ్య, ఆస్తి, ఆలోచన, భావన, సంబంధాలు తదితర వ్యక్తిగత అంశాల్లో గోప్యత ఆశించడం సహజం. అందులో జోక్యం–దానిపై నియంత్రణ ఏదైనా తనకు తెలిసి, తన స్పృహ–ప్రమేయంతో జరగాలనుకోవడమూ న్యాయబద్ధమే!గోప్యతకు చట్ట బద్ధమైన రక్షణ లేకుంటే సగటు మనుషులు తీవ్రంగా నష్టపోతారు. ఆర్థిక, సామాజిక, హోదా–గౌరవపరమైన అంశాల్లో ఇబ్బందులెదురవుతాయి. ఎవ రితో పంచుకోకుండా తమతోనే అట్టేపెట్టుకోగల సొంత విషయాలే లేని దుస్థితి దాపురిస్తుంది. ‘వ్యక్తిగత గోప్యత హక్కు అంటే, తన మానాన తనని బతకనివ్వడం’ అనే ఓ ప్రసిద్ధ నిర్వచనం కూడా ఉంది. ఇది వ్యక్తి గౌరవం, స్వేచ్ఛకు ప్రతీక! ఒకవైపు గోప్యతకు రక్షణ కరువై, మరోవైపు అందులోకి ఇతరులు సులువుగా చొరబడే, అనుచితంగా జోక్యం చేసుకునే, ‘డాటా’ను య«థేచ్ఛగా వాడుకునే ఆస్కారం పెరగటమన్నది ఏ రకంగా చూసినా ప్రమా దకరమే! హక్కు భద్రత లేనపుడు, అటువంటి అనుచిత జోక్యాలు తనకు నిక రంగా నష్టం కలిగించినా, కారకులైన సదరు వ్యక్తులు, సంస్థలు, ప్రభు త్వాల నిర్వాకాల్ని ప్రశ్నించలేని స్థితి పౌరుడికి ఎదురౌతుంది. ఇంటర్నెట్ విస్తృతి పెరిగి, ఫేస్బుక్, వాట్సాప్, ట్వీటర్ తదితర సామాజిక మాధ్యమాలు మనిషి జీవితంలోకి అతి లాఘవంగా చొచ్చుకు వచ్చాక ‘డాటా’ భద్రత తీరే మారి పోయింది. పోటీ పెరిగిన వ్యాపార ప్రపంచంలో రకరకాల పద్ధతుల్లో వ్యక్తి గోప్యతలోకి చొరబడే యత్నం నిరంతరం సాగుతోంది. ఉచితాల మోజులో పడి మనమే ఎందరెందరికో ఆ ఆస్కారం కల్పిస్తున్నాం. దారపు పోగులా ఓ చిరుబంధం ఏర్పడ్డా చాలు, మనకు సంబంధించిన ఎంత వ్యక్తిగత సమా చారాన్ని జనబాహుళ్యంలోకి లాగుతారో? ఎంతలా మన బతుకును తెరచిన పుస్తకం చేస్తారో? ఆ లెక్కకు అంతే ఉండదు. బహిరంగ వేదిక ‘ఫేస్బుక్’ కన్నా, పరస్పర సమాచార వాహిక ‘వాట్సాప్’ కాస్త సురక్షితం అనుకున్న వారు తమ వ్యక్తిగత సమాచారాన్ని అక్కడ పంచుకున్నారు. వాట్సప్‌ను ఫేస్ బుక్ స్వాధీనపరచుకున్న తర్వాత అంతా బహిరంగమే అయి వినియోగ దారులు భంగపడ్డారు. ఇటువంటివెన్నెన్నో! సంకెళ్లు సరికాదు తరం మారింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన తొలిరోజుల నాటి నాయకులు, పాలకులు, వారి ఆలోచనా ధార, హక్కులకై పోరాడే పంథా, విలు వలు... క్రమంగా అన్నీ నశిస్తున్నాయి. ఇప్పుడవేమీ లేవు. మనిషి బతుక్కు సంబంధమున్న పలు అంశాల్లో హక్కులుండీ, రాజ్యాంగ భద్రత కలిగీ, చట్టాలేర్పడి, ప్రత్యేక సంస్థలున్న చోటే రక్షణ కరువవుతోంది. నట్టింట చిచ్చు పెట్టిన ‘డ్రగ్స్’ మహమ్మారిని కళ్లారా చూస్తూనే ఉన్నాం. హక్కులు ఒక్కొక్కటే హరించి, సమాజాన్ని పాలనా సంకెళ్లలో బంధించడం సరికాదు. ఇక వ్యక్తిగత గోప్యత హక్కునూ హరిస్తే పిల్లలు, మహిళలతో సహా సామాన్యుల బతుకులు రోడ్డున పడతాయి. పరస్పర ప్రయోజనాలతో ప్రభుత్వాలతో అంటకాగే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్లు, ప్రయివేటు శక్తుల ఆగడాలకు ఇక హద్దుం డదు. వ్యక్తిగత గోప్యతను విస్తృతార్థంలో చూసి, సమాజ విశాల హితంలో అన్వయించి ఆ సర్వోన్నత న్యాయస్థానమే గోప్యత హక్కును కాపాడాలి. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నీచ భాషకు ‘రాచ’ గౌరవం
(సమకాలీనం) ఒక పక్షం నుంచి ఎన్నికై, ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అభ్యర్థిని ఓడించారో అదే పార్టీలోకి పదవుల కోసమో, ఇతర ప్రయోజనాల కోసమో నిస్సిగ్గుగా వెళ్లటం తెలుగునాట మామూలై పోయింది. తెలంగాణలో తెరాసలోకి, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలోకి ఈ ‘అధికారిక వలసలు’ నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలు, ప్రజాభిప్రాయం, ఓట్ల రూపంలో వెల్లడించిన ప్రజాభీష్టం అన్నీ గాలికి పోతున్నాయి. ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పినా... ఎన్నికలయ్యాక ఏం చేసైనా అధికారపక్షం ఒడిలో వాలాలి. ‘బుద్ధిభూములేలాలని ఉంటే, వంతు వాకిలి ఊడవమంటుంద’ని సామెత. దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరస్పర విరుద్ధ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని సామాజిక మాధ్యమాలు క్రియాశీల పాత్ర పోషిస్తు న్నాయి. పాలనతో సహా వివిధ వ్యవస్థల్లో పారదర్శకత పెరుగుతోంది. ఫలితంగా ప్రజలు నిత్య చైతన్యంతోఅన్నీ తెలుసుకుంటున్నారు. మరోపక్క పాలనాపగ్గాలు చేతబట్టిన రాజకీయ వ్యవస్థ మాత్రం రోజు రోజుకు తోలు మందం వ్యవస్థగా మారడమే విచిత్రం. సభ్య సమాజం సిగ్గుతో తలదించు కునేలా నాయకుల మాటలైనా, నిస్సిగ్గుగా పార్టీలు మారే ప్రజాప్రతినిధుల చేష్టలయినా, వాటిని నగ్నంగా ప్రోత్సహిస్తున్న పార్టీల వైఖరులైనా, ప్రజలకి చ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా అధికారం చెలాయిస్తున్న పాలకపక్షాల పోకడలైనా... ‘ఔరా! ఎంత తోలుమందం?’ అనిపిస్తున్నాయే తప్ప మరో ఆలోచన కలిగించడంలేదు. జనమేమనుకుంటారో అనే భావనే లేకుండా ఇవన్నీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇదివరలో ఉన్నట్టు, ఇటు వంటి నిర్వాకాలకు కాసింత మొహమాటమో, తెరచాటుతనమో, దాపరికమో ఏమీలేదు. వారి విచ్చలవిడితనం వల్లో, సంప్రదాయ ప్రసారమాధ్యమాలకు తోడైన సోషల్‌మీడియా క్రియాశీలత వల్లో ఇప్పుడీ విషయాలు ప్రజలకు తేటతెల్లమౌతున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ దుశ్చేష్టలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయే తప్ప అదుపులోకి రావడం లేదు. నరంలేని నాలుకలకింత స్వేచ్ఛా? ఇదివరలో, ఓసారి ఒకమాట మరోమారు ఇంకోమాట మాట్లాడితేనే రెండు నాల్కల ధోరణి అని విమర్శించేవారు. ఇప్పుడు, నాయకులు ఏం మాట్లాడు తున్నారో వారికీ స్పృహలేదేమో అనే అనుమానం కలిగిస్తున్నారు. బెయిల్‌పై విడుదలై వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు వివిధ వర్గాల్లో విస్మయం కలిగించాయి. ముఖ్యమంత్రిపైన, మంత్రులపైన ఆయన చేసిన వ్యాఖ్యలు స్థాయికి తగ్గట్టు లేవు. సీఎంతోపాటు ఇద్దరు మం త్రుల గురించి చేసిన వ్యాఖ్యల్ని పత్రికలు ప్రచురించినా... ఇంకో మంత్రి నుద్దేశించి చెప్పిన మాటలు ప్రచురణార్హంగా లేకపోవడంతో వదిలేశాయి. రేవంత్‌రెడ్డి ఏం తెలియని వ్యక్తి కాదు. బాగా చదువుకొని ఒకసారి ఎమ్మె ల్సీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం షరతులతో బెయిల్ మంజూరు చేసి ఒక రోజైనా గడవక ముందే ఇలా మాట్లాడటాన్ని ఎవరైనా ఎలా పరిగణిస్తారు? ఆయన ఇంకా నిందితుడే కనుక హుందాగా వ్యవహరించి, సంయమనం పాటించాల్సిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. గద్దె దించుతానని, పోరాటం కొనసాగిస్తానని... సాక్షాత్తూ ముఖ్యమంత్రినే లెక్కచేయనితనంతో మాట్లాడటం, మంత్రుల్ని తూలనా డటం పరోక్షంగా దర్యాప్తు అధికారుల్ని, సాక్షుల్ని ప్రభావితం చేసేలా ఉందనే కారణంతో ఆయన చేసిన ప్రసంగం టేపుల్ని వివిధ మీడియా సంస్థల్నించి దర్యాప్తు బృందం సేకరిస్తోంది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ముందు వినిపించే వాదనల్లో ఈ టేపుల్ని భాగం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అభిమానులు ఆయనకు స్వాగతం పలికిన తీరు, ఆయా బృం దాల్ని పార్టీ నాయకత్వం సమాయత్తపరచిన వైనం, అది వేదికగా ఆయన చేసిన గర్జన ఒక కొత్త సంస్కృతికి తెరలేపినట్టుగా ఉంది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సహజ న్యాయసూత్రాల ప్రకారం ఏ కేసులో అయినా బెయిల్ ఇవ్వడం సాధారణ నియమం, ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్ నిరాకరిం చడం మినహాయింపు, కనుక బెయిల్ లభించింది. నేర నిర్ధారణ జరిగేవరకు ప్రతి నిందితుడూ నిరపరాధి అయినట్టే, బెయిల్ లభించినప్పటికీ విడుదలైన వ్యక్తి, కడపటి తీర్పు వచ్చే వరకు నిందితుడే! ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, రాజకీయ ప్రత్యర్థులపై నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇటీవల ఓ ఫ్యాషన యింది. ‘మా తెలంగాణలో ఇట్లాగే మాట్లాడుతాం...’ అనే ముసుగు కింద ఇటువంటి నిందాపూర్వక మాటలకు, తిట్లకు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీయారే ఆద్యుడని నిందించేవారూ ఉన్నారు. తమచే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌నే ‘గంగిరెద్దు‘ అని తూలనాడిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరి మాటలకు తెలుగువారంతా సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు, కీలకస్థానాల్లో-హోదాల్లో ఉన్న ఎంపీలు, ఇతర నేతలు కొందరి నోటికి హద్దూపద్దూ ఉండట్లేదు. దేశంలోని మైనారిటీలపైన, ముఖ్యంగా ముస్లిం మైనారిటీల మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రికీ, ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికీ తలవంపులు తెచ్చిన సందర్భాలు కొల్లలు. ప్రజలేమనుకుంటారో! అన్న ఇంగితం కూడా లేకపోవడాన్ని చూసి వ్యవస్థ చాలా తోలుమందంగా తయా రయిందనే భావన వ్యక్తమౌతోంది. నైతిక విలువలే కాదు చట్టాలూ బేఖాతర్! ఒక పక్షం నుంచి ఎన్నికై, ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అభ్యర్థిని ఓడించారో అదే పార్టీలోకి పదవులకోసమో, ఇతర ప్రయోజనాల కోసమో నిస్సిగ్గుగా వెళ్లటం తెలుగునాట మామూలై పోయింది. తెలంగాణలో తెరాసలోకి, ఆంధ్రప్ర దేశ్‌లో టీడీపీలోకి ఈ ‘అధికారిక వలసలు’ నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలు, ప్రజాభిప్రాయం, ఓట్ల రూపంలో వెల్లడించిన ప్రజాభీష్టం అన్నీ గాలికి పోతున్నాయి. ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పినా... ఎన్నికల య్యాక ఏం చేసైనా అధికారపక్షం ఒడిలో వాలాలి. వీలయితే పెద్ద పైరవీనో- ఓ మాంచి పదవో కొట్టేయడం, ముందు అది మాట్లాడుకొనే గోడ దూకడం, ఇవ్వాళ పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్నదే! ప్రత్యర్థి రాజకీయ పక్షాల ఉనికినే మట్టుపెటి,్ట వచ్చే ఎన్నికల నాటికి తాము మాత్రమే నిలవాలనుకుం టున్న రెండు పాలకపక్షాల ధ్వంసనీతి కూడా ఇదే! నిజానికిది తిమ్మరుసు ధీయుక్తిలోని పెద్దగీత లాంటిది! ఎందుకంటే, దీన్ని చూపించే.... తమ కేసు చిన్నదని తేలిక చేసి చూపడానికి తెలుగుదేశం నాయకత్వం పరోక్షంగా యత్ని స్తోంది. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు 5 కోట్ల రూపాయల బేరానికి ఓ ఎమ్మెల్యే ఓటు కొనుగోలు వ్యవహారంలో 50 లక్షల నగదుతో పట్టుబడ్డ కేసు రేవంత్‌ది. ప్రభుత్వ పనుపుతో, ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్ని పట్టుకుంటే బట్టబయలైన ఈ కేసును కూడా బలహీనపరచడా నికి.... ఇదే పాలకపక్షం తమ ఎమ్మెల్యేల్ని కొల్లగొట్టుకుపోయిన నిర్వాకం గురించి టీడీపీ అరిచి గీపెడుతోంది. తమ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుల్ని పార్టీలో చేర్చుకొని ఏకంగా మంత్రిపదవులే ఇవ్వడమేమిటని నిలదీస్తోంది. పార్టీ ఫిరాయింపుల చట్ట నిబంధనల్ని తుంగలో తొక్కడాన్ని ఎత్తిచూపుతు న్నారు. వారి సభ్యత్వాల్ని రద్దు చేయమన్న తమ విజ్ఞప్తులపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్‌లు తప్పుపడుతున్నాయి. తెలంగాణలో ఈ వాదన వినిపించే టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లో తానూ అదే ‘దొమ్మీ’ వ్యవహారం నడుపుతోంది కనుక తేలుకుట్టిన దొంగలా అక్కడ కిమ్మ నటం లేదు. వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన ఎంపీల్ని, ఎమ్మెల్సీల్ని, ఇతర కింది స్థాయి ప్రజాప్రతినిధుల్ని ఎరవేసి లాక్కొని తానూ అదే నిర్వాకాన్ని దర్జాగా వెలగబెట్టడాన్ని ఎవరూ చూడటం లేదనుకోవడమే విచిత్రం! ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కాదు, ఇతర పక్షాల్లో ఉండి ఓడిపోయిన నాయకులు, ‘పెద్ద మను షులూ’ పాలకపక్షాల వైపు దొంగ చూపులు చూస్తున్నారు. రాజ్యసభ- ఎమ్మెల్సీ వంటి ఎగువసభల సభ్యత్వాలో, ఇతర నామినేటెడ్ పదవులో.... అవీ కుదరవంటే కనీసం నాలుగైదు పనులన్నా అవుతాయన్న ఆశే ఇంధ నంగా అధికారపక్షాలతో అంటకాగాలని చూస్తున్నారు. పైకి మాత్రం, తాము పాలకపక్షంలోకి చేరేది నియోజకవర్గ ప్రజల కోసమే అని అందమైన ముసుగు కప్పుతున్నారు. పాలనలోనూ ప్రతిబింబిస్తున్న పెడధోరణి ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా రాజకీయ వ్యవస్థలో బలపడుతున్న ఈ తోలుమందం వైఖరి పాలనలోనూ కనిపిస్తోంది. కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఏడాదిలోనే పలురకాల అవినీతి ఆరోప ణల్ని ఎదుర్కొంటున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పరీక్షా కాలమే! ఎన్డీయే ప్రభుత్వపు పెద్దన్న బీజేపీకి చెందిన పలువురు కేంద్ర మంత్రులు, ఓ ముఖ్యమంత్రి, ఇంకా చాలా మంది వివిధ రాష్ట్రాల్లోని మంత్రులు అవినీతి ఆరోపణలనెదుర్కొంటున్నారు. లలిత్‌గేట్ వణుకు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఒత్తిడి పెంచుతోంది. దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉంది. తీయని మాటలు, గంభీరోపన్యాసాలు, దేశభక్తి భావోద్వే గాలు తప్ప... హామీ ఇచ్చిన ‘మంచిరోజులి’ంకా మొదలు కావేమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలుగునేలపై పరిస్థితీ ఏం భిన్నంగా లేదు. ఎన్నికల ముందరి హామీలు, అధికారంలోకొచ్చాక ఇచ్చిన వాగ్దానాల మేరకు తెలం గాణలో కొన్ని పనులు మొదలయినట్టు కనిపిస్తున్నా... ఫలాలు, ఫలితాలు తామింకా చవి చూడనేలేదని ఇక్కడి జనం వాపోతున్నారు. రాజకీయ క్రీడ మాత్రం ముప్పొద్దులా సాగుతోంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, ప్రగతి-సంక్షేమ ఫలాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే అభిప్రాయం పాలకపక్ష అనుకూల వాదులూ వినిపిస్తున్నారు. ఏ కొత్త నిర్ణయానికీ ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తామెలా స్పందించాలో ప్రజలకు ఇదమిత్థంగా తోచడం లేదు. సామాజిక మాధ్య మాలు క్రియాశీలంగా మారుతున్న తరుణంలో రాజకీయ వ్యవస్థ ఇంత స్పందనా రహితంగా, ప్రజాభీష్టాన్ని బేఖాతరంటూ ఉండటం పట్ల మేధావి వర్గం కూడా విస్మయానికి గురవుతోంది. రానున్నది డిజిటల్ విప్లవమే! అన్న ప్రధానమంత్రి మోదీ మాటల్ని ప్రజలు, ప్రజా సమూహాలు జాగ్రత్తగా విశ్లేషించుకుంటున్నాయి. వివక్ష నుంచి ఆడపిల్లలను కాపాడుకోవా లనే సదుద్దేశంతో ‘సెల్ఫీ విత్ డాటర్’ అన్న ప్రధాని పిలుపు వల్ల సామాజిక ఆలోచనా దృక్పథంలో పెనుమార్పులు సంభవిస్తాయని అధినాయకత్వం ఆశిస్తున్న తరుణమిది. నిజంగానే, మారిన పరిస్థితుల్లో పౌరులు, పౌర సంఘాలు స్వీయ చేతన పొంది స్పందిస్తే.... మందగించిన మన రాజకీయ వ్యవస్థ తోలు పలచబడదా? ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా జనా భిప్రాయం మేరకు సర్కార్లు స్పందించవా? చూడాలి! సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్. దిలీప్ రెడ్డి ఈమెయిల్ : dileepreddy@sakshi.com -
పులుల వృద్ధి నిలిస్తేనే ఫలం
సమకాలీనం పులుల వృద్ధి ఊర్ధ్వముఖంగా, ఆవరణ ఆరోగ్యం నిలకడగా ఉండాలి. కేంద్రం తీసుకుంటున్న తెంపరి నిర్ణయాలు ప్రమాద సంకేతాల్ని సూచిస్తున్నాయి. అభివృద్ధి లక్ష్యంతో సంస్కరణల పేరిట విచ్చలవిడిగా పర్యావరణ అనుమతులిస్తున్న తీరు ఆందోళనకరం. జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు అంతరించి, పులుల సంఖ్య తగ్గింది. ఆ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు, ఇతర ప్రాజెక్టులతో బహుళజాతి కంపెనీలు పాగా వేస్తున్నాయి. మోదీ సర్కార్ గత జూలైలో ఏర్పాటు చేసిన ‘జాతీయ పన్య ప్రాణి బోర్డు’ ఏకంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే వంద ప్రాజెక్టులను అనుమతించింది. అభినందించదగ్గ స్థాయిలో దేశంలో పులుల సంఖ్య పెరిగింది. ఘనవిజయ మని కేంద్ర పర్యావరణ మంత్రి జవదేకర్ మూడు రోజుల కింద ‘విజయ గాథ’ వినిపించారు. నిజమే! ఇది ఖచ్చితంగా ఘనవిజయమే! ఏ ప్రమాణా లతో చూసినా ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం మన దేశంలోనే ఉండ టం, వాటి సంఖ్య గడచిన నాలుగేళ్లలోనే బాగా, అంటే 30 శాతం పైన పెరగ డం ఆహ్వానించదగ్గ పరిణామమే. అది కూడా... అడవులు నశిస్తుండటం, అటవీ నడవల (కారిడార్స్) మధ్య సంబంధాలు తెగిపోవడం, అడ్డగోలు ఖనిజ తవ్వకాలు, పులిని చంపడం, దాని ఆహారమైన ఇతర వన్యమృగాల వేట, కలప తదితర అటవీ ఉత్పత్తుల స్మగ్లింగ్ వంటి దుష్పరిణామాల తర్వాత కూడా పులుల జనాభా వృద్ధి అభినందనీయమే! అంతరించిపోతున్న జాతిగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన మన జాతీయ జంతువు, వారసత్వ సంపద పులిని బతికించుకుంటున్న బలమైన సంకేతమిది. అటవీ చట్టాల్ని సవరించడం, ప్రత్యేక జోన్లను ప్రకటించడం, టైగర్ రిజర్వుల్ని పెంచడం వంటి కార్యక్రమాల ద్వారా పులుల సంరక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అడవి బిడ్డలకు ప్రత్యామ్నాయ నివాస ప్రాంతాలు చూపి, అడవిలో జనసం చారాన్ని తగ్గించడం ద్వారా పులి-మనిషి స్పర్థని నివారించారు. అయితే, ముందుంది ముసళ్ల పండుగ అన్నట్టు ఇక అసలైన కార్యభారం రాబోయే రోజుల్లో ఉంది. పూర్వ ప్రభుత్వాల మంచి-చెడులకు తర్వాతి ప్రభుత్వాలు ప్రాతినిధ్యం వహించాల్సి రావడమన్నది ప్రజాస్వామ్య పాలనావ్యవస్థ లక్షణాల్లో ఒకటి. చెడు జరిగితే వారికే ఆపాదించి, మంచయితే తమ ఖాతాలో వేసుకోవడం పరిపాటి. ఇప్పుడదే జరిగింది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వపు తాజా నిర్వాకాల ఫలితాలు వెనువెంటనే కనబడవు. ముఖ్యంగా పులుల సంరక్షణ వంటి దీర్ఘకాలిక పథకాల నిర్వహణ ఫలితాలు ఎప్పుడో నాలుగేళ్లకు మళ్లీ పులుల గణన జరిగినపుడు తెలుస్తాయి. అప్పటివరకు అటు పర్యావర ణానికి, ఇటు అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపైనే ఉంది. కానీ, ఇప్పటి వరకు ఈ దిశలో కనిపిస్తున్న సంకేతాలు సందేహాల్నే రేకెత్తిస్తున్నాయి. ఎలా సాధ్యమైంది? 2006లో దేశంలో 1,411 పులులుండేవి. 2010లో ఆ సంఖ్య 1,706కి, 2014లో అది 2,226 కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం 3,200 పులులలో ఇది 70 శాతం పైనే. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న శ్రీశైలం-నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్టుతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవాల్లోని అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇంకా, అక్కడక్కడ అటవీ నడవల మధ్య ఖాళీలుండి పులులు స్వేచ్ఛగా సంచరించే అవకాశం లేకుండా పోతోంది. దేశంలోని 18 రాష్ట్రాల్లో 3.78 లక్షల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలోని పులుల గణన ద్వారా ఈ గణాం కాలు తీశారు. పులుల పాదముద్రల సేకరణకు తోడు, దాదాపు వెయ్యి సీసీ కెమెరాలను వినియోగించి 1,500లకు పైగా పులుల ఫోటోలను విశ్లేషించి, శాస్త్రీయంగా ఈ గణన జరిపారు. ‘ఈ వృద్ధి కాకతాళీయంగా సాధ్యమైంది కాదు, తగు సంరక్షణ చర్యలు, సమర్థ నిర్వహణ, నిబద్ధత కలిగిన కొందరు అటవీ అధికారులు, సడలని రాజకీయ సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది’ అని భారత వన్యప్రాణి సంరక్షణ సంఘం అంటోంది. వేటను నిరోధించే చర్యలు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. అటవీ ప్రాంతంలోని గిరిజన తెగల విష యంలో ద్విముఖ వ్యూహాన్ని అనుసరించారు. పులులు సంచరించే ప్రధాన అటవీ ప్రాంతం నుంచి వారి నివాసాల్ని బయళ్లకు, అటవీ అంచు ప్రాంతా లకు తరలింపజేశారు. అటవీ ఉత్పత్తుల్లో వారికి వాటా కల్పించడం, వారినే అటవీ సంరక్షకులు (ఎఫ్జీ)గా నియోగించడం ద్వారా కూడా మంచి ఫలితాలొ చ్చాయి. మన నల్లమలలో ఉన్న మన్ననూరు, ఆమ్రాబాద్, శ్రీశైలం, మార్కా పురం వంటి అటవీ ప్రాంతాల్లో గిరిజనుల్ని ఈవిధంగా వినియోగించు కున్నారు. ‘రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్’ (ఆర్బీయస్) ఆర్థిక సహా యంతో పలు కార్యక్రమాలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా టైగర్ రిజర్వుల్లో చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. భారత ప్రభుత్వం 1970లో పులుల సంరక్షణ ప్రాజెక్టును చేపట్టింది. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 2006లో సవరించడం సత్ఫలితాలనిచ్చింది. ఫలితంగా పులుల రక్షణకు జాతీయ సంస్థ (ఎన్టీసీయే), పులి తదితర అంతరించిపోయే జీవజాతుల క్రైమ్ కంట్రోల్ బ్యూరో వంటివి ఏర్పడ్డాయి. చర్మం, గోళ్లు తస్కరించే వేటగాళ్ల నుంచి పులికి రక్షణ కల్పించడంతో పాటు, పులి ఆవాస ప్రాంతాల్ని సంరక్షించే ఉద్దేశంతో టైగర్ రిజర్వుల్ని క్రమంగా పెంచుతూవచ్చారు. 1970లో తొమ్మిది రిజర్వు లుంటే ఇప్పుడా సంఖ్య 39కి చేరింది. ఇవి కాకుండా బయటి అడవుల్లో కూడా పెద్ద సంఖ్యలోనే పులులున్నాయి. పులులు పెరిగితే ఏంటంట? పులుల సంఖ్య పెరగటం వల్ల ఏమొస్తుంది? అని అడిగే వారూ ఉంటారు. ‘జూ’లలోనూ, బయటా క్లోనింగ్, తదితర సాంకేతిక పరిజ్ఞానంతో పులుల సంఖ్యను పెంచొచ్చు. కానీ, దాని వల్ల ప్రయోజనం ఉండదు. దేశంలోని జూలలోని పులుల సంఖ్య ఎక్కువైందని, ఇతర దేశాల వారికి ఇస్తామని అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ అడవిలో పులుల సంఖ్య పెరగడం పర్యా వరణ సమృద్ధికి ప్రతీక. పులులు ఆ సంఖ్యలో ఉన్నాయంటే, వాటికి ఆహార మైన దుప్పులు, లేళ్లు, కణితలు, అడవి పందులు ఇతర జీవులున్నట్టు. అవన్నీ సంచరిస్తున్నాయంటే వాటికి ఆహారమైన గడ్డి, గాదం పుష్కలంగా లభించ డమే కాక మంచి, దట్టమైన అడవి ఉన్నట్టు లెక్క. జీవ ఆహార శృంకలం సమృద్ధిని బట్టి సమతుల్య జీవవైవిధ్యం, పర్యావరణం, అడవి, నేల నీటి సామర్థ్యం, భూగర్భనీటి మట్టాలు బాగా ఉన్నట్టు గ్రహించవచ్చు. అది ఆవ రణ వ్యవస్థ ఆరోగ్య స్థితి. ఒకసారి వచ్చిన ఆరోగ్యస్థితి శాశ్వతం కాదు, దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే, అన్ని సందర్భాల్లో పులుల సంఖ్య పెరుగుదలతో పర్యావరణ సమృద్ధి జరిగినట్టే అనుకోవడానికీ లేదని టైగర్ ప్రాజెక్టుల అనుభవజ్ఞులు డాక్టర్ తులసీరావు అంటారు. అది ఆవాస అభి వృద్ధి వల్ల పెరిగిందా? వేటను నియంత్రించడం వల్లనా? ఇతరేతర కార ణాలా? అనేది ఆవాస నేపథ్యంలో మాత్రమే చూడాలి. పులుల ప్రకృతి సిద్ధమైన వృద్ధి వాటి ఆవాస పరిమాణం, ప్రమాణాల్ని బట్టి ఉంటుంది. వాటి ఆవరణ వ్యవస్థ పరిధిని బట్టి చూస్తే దేశంలో పులుల సంఖ్య, ఉండవలసిన దానికన్నా తక్కువే. వేర్వేరు అడవుల మధ్య నడవలు నశించి, పులుల సంచా రానికి పరిమితులేర్పడ్డాయి. ప్రత్యేక చర్యలతో నడవల్ని మెరుగుపరచాలి. సంకేతాలిప్పుడు సానుకూలంగా లేవు! పులుల సంఖ్య వృద్ధి గ్రాఫ్ ఊర్ధ్వ ముఖంగా, ఆవరణ ఆరోగ్యం నిలకడగా ఉండాలి. ఆ నమ్మకం కలిగించకపోగా, నిర్వచనం లేని ‘అభివృద్ధి’ నినాదం కింద ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న తెంపరి నిర్ణయాలు ప్రమాద సంకే తాల్నే సూచిస్తున్నాయి. అభివృద్ధి లక్ష్యంతో సంస్కరణల పేరిట విచ్చలవిడిగా పర్యావరణ అనుమతులిస్తున్న తీరు ఆందోళనకరం. జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే అడవులు అంతరించి, పులుల సంఖ్య రమారమి తగ్గింది. ఆ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు, ఇతర ప్రాజెక్టులతో బహుళజాతి కంపెనీలు పాగా వేస్తున్నాయి. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే, గత జూలైలో ‘జాతీయ వన్యప్రాణి బోరు’్డను ఏర్పాటు చేసిం ది. అది ఆశ్చర్యకరంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే వంద ప్రాజెక్టులను అనుమతించేసింది. ఆ అనుమతులు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇక బోర్డు అనుమతితో నిమిత్తం లేకుండానే వన్య ప్రాణి సంరక్షణ క్షేత్రాలకు 5 కిలోమీటర్ల పరిధిలో పలు ప్రాజెక్టుల్ని పర్యా వరణశాఖ ఏకపక్షంగా మంజూరు చేసింది. అడవుల రక్షణలో ఇవన్నీ తిరోగ మన చర్యలని పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల వారంటున్నారు. సమర్థులైన, తపన కలిగిన అధికారుల్ని నియోగించడం ఎంతో అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపితేనే పులుల పెరుగుదలకు సార్థకత. అప్పుడే పులుల, జీవవైవిధ్య, పర్యావరణ పరిరక్షణకు మోక్షం. ఈమెయిల్: dileepreddy@sakshi.com