మౌన ఛేదనే మార్పుకు నాంది
సమకాలీనం
‘బయటకు వెళ్లిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తున్నారంటే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సింది ఆడపిల్లల గురించి కాదు, మగపిల్లల గురించి’ అన్న కిరణ్‌ఖేర్ మాట అక్షర సత్యం! చట్టాల్లో, పోలీసు వ్యవస్థలో, న్యాయపాలనలో, సామాజిక దృక్పథంలో, మగవాళ్ల ఆలోచనల్లో... అంతటా మార్పు రావాల్సిందే! వర్ణిక, అదితిల ధైర్యం, పట్టుదల వికసిస్తున్న మహిళా చైతన్యానికి సంకేతం, ఇతరులకు ఆదర్శం. మహిళల పట్ల జరుగుతున్న అన్ని రకాల దాష్టీకాలకూ కాలం చెల్లే రోజులు వస్తున్నాయనడానికి వారి తెగువ బలమైన సంకేతం.
కొత్తతరం మహిళ వర్ణిక కుందు పెట్టిన పెద్ద పొలికేక భారతదేశమంతా ఇప్పుడు ప్రతిధ్వనిస్తోంది. అదింకా ఎన్నెన్నో రెట్లు పెరిగి, దిక్కులు పిక్కటిల్లే శబ్దమై ఘోషించాలి. దాన్ని అందిపుచ్చుకొని మహిళలు భవిష్యత్ బాటలు సుస్థిరం చేసుకోవాల్సిన తరుణమిది. న్యాయబద్ధంగా తమదైన ప్రతిష్టాత్మక స్థానాన్ని భారత మహిళ పదిలపరచుకోవాల్సిన సమయం వచ్చేసింది. పటి ష్టంగా వేళ్లూనుకున్న మన పురుషాధిక్య సమాజంలో మొగ్గతొడుగుతున్న మార్పులకిది చిరు సంకేతం! ఓ రకంగా చూస్తే ఘర్షణల పురిటి నొప్పులు పడుతున్న సంధి కాలమనిపిస్తుంది. 48 గంటల వ్యవధిలో చండీగఢ్‌లో వర్ణిక, ముంబైలో అదితి అనే ఇద్దరు వనితలు కనబరచిన అసాధారణ తెగువ అభినందనీయం! ‘మేం ఏం చేసినా చెల్లుబాటవుతుంద’నుకున్న ముగ్గురి పురుషాహంకారాన్ని చెంప చెళ్లు మనేలా తిప్పికొట్టారు.
ఈ వీర వనితలు, ఈ దేశపు 65 కోట్ల మహిళలకు ప్రతినిధులే కాదు, మరో 65 కోట్ల మందితో కూడిన పురుష సమాజానికి ప్రత్యక్ష గుణపాఠం చెబుతున్న సవాళ్లు! సమాజ గతి మార్పునకు తెరతీస్తున్న ‘చేంజ్ అంబాసిడర్లు’! రాత్రిపూట వీధుల్లో తమను వెంటాడిన వైట్‌కాలర్డ్ మానవ మృగాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నవారు. స్వీయ ప్రతిభతో విపత్తు నుంచి గట్టెక్కినా, ‘బయటపడ్డాం, బతుకుజీవుడా!’ అని సరిపెట్టుకోకుండా, సాహసించి ఆ ముష్కరుల్ని కటకటాల వెనక్కి పంపారు. పాలకపక్షం బీజేపీ హరియాణా శాఖ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు, వికాస్ బరాలాను రెండోసారి అరెస్టు చేయించి, అదనపు సెక్షన్లు పెట్టించిందా తెగింపే! ముంబైలో తనను వెంటాడి, కడకు ఇంటి తలుపు తట్టిన ‘టెక్కీ’కీ దాదాపు అదే గతి పట్టించింది ఓ ఇల్లాలి తెగువ! ప్రతికూల పరిస్థితిని వారు సమర్థంగా ప్రతిఘటించారు. సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుశ్చర్యను సామాజిక మాధ్యమాల్లో (ఫేస్‌బుక్) ఎండ గట్టారు. తగు చర్యలు తీసుకోవాలని సర్కార్‌ను డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోక తప్పని అనివార్య పరిస్థితుల్ని కల్పించారు.
పిరికితనంతో, పాడుప డిన సంప్రదాయ కట్టుబాట్ల గుహల్లో కుమిలి, మగ్గి పోవడానికి వారు సిద్ధంగా లేరు. ‘‘నా పేరును గోప్యంగా ఉంచి ముఖాన్ని దాచుకోవాల్సిన అవ సరం లేదు, ఎందుకంటే, నేను నేరస్తురాల్ని కాదు, బాధితురాలినీ కాదు. ఒక విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డ విజేతను’ అంటోంది వర్ణిక! ‘వేటాడి, కిడ్నాప్‌నకు యత్నించి, నన్నింత క్షోభకు గురిచేసిన నేరతత్వపు ముష్కరులకు తగిన శిక్ష పడాల్సిందే!’ అంటోందామె. ఆమె తండ్రి, సీనియర్ ఐఏఎస్ అధి కారి వరిందర్‌సింగ్ కుందు ఆమెకు కొండంత అండ. ఇంకా పడికట్టు పదా లతో, మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్న సంప్రదాయక సమాజంపై ప్రశ్నల పరంపరనే కురిపించింది వర్ణిక. ఆమె సంధించిన వాటిలో ఇంకా సమాధానం రాని, రావాల్సిన ప్రశ్నలు మనందరి చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.
సభ్య సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్ని రకాల దాష్టీకాలకూ క్రమక్రమంగా, కాలం చెల్లే రోజులు అనివార్యంగా సమీపిస్తున్నాయనేందుకు, వారిరువురి తెగువ ఓ బలమైన సంకేతం! ఆధిపత్య దురాలోచనలకు అడ్డు కట్ట, భావజాల సంస్కరణ, ప్రతిఘటన, నివారణ చర్యలు, దోషులకు కఠిన శిక్షల అమలు ద్వారా మాత్రమే ఆడవాళ్లపై జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, అత్యాచారాలను నియంత్రించగలుగుతాం. తాము చూపిన తెగువ, పట్టుదల, ప్రతిఘటన దేశవ్యాప్తం కావాలన్న గట్టి సందేశమే వారి ద్దరూ చూపిన సాహసం అంతరార్థం.
కళ్లను కనురెప్పలు కాటేస్తున్నాయ్!
స్విచ్ వేస్తే బల్బు వెలిగినంత వేగంగా వ్యవస్థలు మారవు. కానీ, మార్పు సంకే తాలున్నపుడు వాటిని గుర్తించడం, స్వాగతించడం, ప్రోత్సహించడం సమా జహితం కోరే వారి బాధ్యత. ఇప్పుడదే జరగాలి. తమపై పురుషులు జరిపే దాష్టీకాలను సాహసంతో ఎదురొడ్డి, మహిళలు ప్రతిఘటించే సంఘటనలు వేళ్లమీద లెక్కించగలిగినన్నే కావచ్చు! భవిష్యత్తులో చెటై్ట విశాలంగా విస్తరించే విత్తుపై ఇప్పుడా క్రాంతి ఓ సన్నని పొట్టులాంటిదే! చీకటి వ్యవహారాల్లా జరిగిపోయే ఈ దారుణాల్లో అసలు వెలుగు చూసేవే కొన్నయితే, అందులో పోరాట బాటన సాగేవి చాలా తక్కువ. డబ్బు, పలుకుబడి, రాజకీయ నేప థ్యమున్న కుటుంబాల వారు చేసే అకృత్యాలు అసలు పోలీసు కేసుల దాకానే రావు. వచ్చినా, కడదాకా నిలువవు. ప్రతిఘటనల నడుమ ప్రాణాలు పణంగా పెట్టి పట్టుదలగా ఎవరైనా పోరు సాగించినా, భ్రష్టుపట్టిన వ్యవ స్థల్ని వివిధ స్థాయిల్లో ప్రభావితం చేసే ‘పెద్ద మనుషులు’ కేసు దర్యాప్తుల్ని, నేర విచారణల్ని నిలువునా నీరుగారస్తారు.
పరిస్థితుల్ని తమకనుకూలంగా మలచుకుంటారు. నిర్దోషులుగా చలామణి అవుతారు. తుది ఫలితంపై భరోసా లేక, బాగా చదువుకున్న మహిళలు కూడా ఈ అఘాయిత్యాలను ప్రతిఘటించడానికి, పోరాడటానికి సాహసించలేక పోతున్నారు. మానసి కంగా నలగటం, నలుగురి నోళ్లలో నానటం తప్ప ఒరిగేదేమీ ఉండదని కొన్ని సార్లు ఫిర్యాదు కూడా చేయట్లేదు. కానీ, మారుతున్న పరిస్థితుల్లో, శాస్త్ర– సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొస్తున్న యుగంలో, నిజాల్ని నిప్పులా చూపే సీసీ కెమెరాల శకంలో, సామాజిక మాధ్యమాలు వేయి కళ్లతో చూస్తూ పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్న ఈ రోజుల్లో మహిళలు చూపే చొరవ, తెగింపే వారికి రక్ష. ముంబై, చండీగఢ్ వంటి పెద్ద నగరాల్లో జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ వారు చేసిందదే! పట్టు సడలనీయకుండా ప్రతిఘటిం చారు. అందుబాటులోని అన్ని వనరుల్ని సమీకరించి ‘మృగాళ్ల’ ఆట కట్టిం చారు. మహిళలపై అఘాయిత్యమైనా, అందుకు ప్రయత్నమైనా.... లోలోపల కుమిలే మౌనం, నిశ్శబ్దం వారికి రక్ష కాదు సరికదా, చెలరేగే అల్లరి మూకలకు కొత్త ఇంధనం.
2013 అక్టోబర్ 18న హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ ప్రాంతంలో క్యాబ్ ఎక్కిన యువతిని దారి మార్చి, ఓఆర్‌ఆర్‌లో తీసుకు వెళ్లి క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి తలపడ్డాడు. ‘అభయ’ పేరిట నమోదైన ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, ఈ దుష్కృత్యానికి పాల్పడ్డ డ్రైవర్, అతని మిత్రుడికి 2014 మేలో, ఇరవై ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఇది వరకెప్పుడూ నేనిటువంటి చర్యలకు పాల్పడలేదు, అత్యాచారం చేస్తే ఏమీ కాదు, ఇతరులెవరికీ వారు చెప్పుకోలేరు అని మా మిత్రుడు నన్ను పురిగొ ల్పాడు, ఇంతకు ముందు తానొకరిపై ఇలాగే అత్యాచారం చేసినా తనకేమీ కాలేద’ని చెప్పాడని విచారణలో వెల్లడించాడు. అదీ వారి భరోసా! గొంతెత్తి ప్రతిఘటించడం, అకృత్యాల్ని ఎలుగెత్తి చాటడం, పట్టుబట్టి నేరానికి తగ్గ శిక్ష ఇప్పించడమే ఉన్నంతలో సరైన మార్గం. వర్ణిక, అదితి ఇప్పుడీ మార్గాన్ని ఎలుగెత్తి చూపారు.
ఇప్పటికీ కోట్లాది కుటుంబాల్లో పెదాలు విచ్చుకోవట్లేదు. గొంతులు పెగలట్లేదు. ఉబికివచ్చే కన్నీరు తప్ప, గుండె పొరలు దాటని దుఃఖం లోలోనే సుడులు తిరుగుతోంది. సహోద్యోగుల నుంచి పై అధికారుల దాకా, సాటి పనివారి నుంచి యజమానుల దాకా, వరుసకు సోదరుల నుంచి ఇతర బంధువుల దాకా, పెంపుడు తండ్రుల నుంచి కన్నతండ్రుల దాకా.... కళ్లను కాటేస్తున్న కనురెప్పలెన్నో! గ్రామీణ భారతంలో, పేదరికంలో, పని ప్రదేశాల్లో, పాలన–అధికార వ్యవస్థల హోదా దొంతరల్లో... అంతటా ఆడ వారిపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది.
భావజాలమే మూల సమస్య
‘వాడు మగాడు, ఎలా అయినా తిరగొచ్చు, ఆడాళ్లకెందుకు...?’ ఇదీ, ఉగ్గు పాలతో మన వారు నూరిపోసే భావజాలం. మెజారిటీ తలిదండ్రులు పిల్లల పెంపకంలోనూ ఈ వివక్ష చూపుతున్నారు. చింత చచ్చినా పులుపు చావ లేదన్నట్టు, ఎన్ని చదువులు చదివినా అంతర్లీనంగా ఉన్న భావజాలం వద లడం లేదు. పైకెన్ని గంభీరమైన మాటలు చెప్పినా, లోలోపల ఇటువంటి ఆలోచనా సరళి ఉండటం వల్లే ఆడవాళ్ల పట్ల లింగ వివక్ష, లైంగిక వేధింపులు, మానసిక, భౌతిక దాడులూ, పెంపకం లోపం వల్ల మగాళ్ల వైఖరిలోనే ఆడాళ్ల పట్ల ఓ చిన్నచూపు అంతర్లీనంగా బలపడుతోంది. ఈ దుష్ప్రభావం వల్ల నేమో, ఎదుగుదల క్రమంలోనే మగపిల్లల్లో ఓ విచ్చలవిడితనం, ఆడపిల్లల్లో ఓ రకమైన బెరుకు, భయం అలవడి పోతున్నాయి. దీనికి పూర్తి భిన్నమైన పంథాను వర్ణిక, అదితి కనబర్చారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వాళ్లకన్నా, పరోక్షంగా వాటిని సమర్థిస్తూ మాట్లాడే పెద్ద మనుషులే ప్రతికూల భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
తాజా ఘటనలో కూడా, ‘అంత రాత్రి పూట ఆమెకు అక్కడేం పని, త్వరగా ఇంటికి వచ్చి ఉండాల్సింది. ఆమె తల్లి దండ్రులు ఈ విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు’ అని హరియాణా బీజేపీ ఉపా«ధ్యక్షుడు రామ్‌దీర్ భట్టి చేసిన వ్యాఖ్య ఈ కోవదే! మరి అదే విషయం వర్ణికను వెంటాడిన వికాస్ బరాలాకూ వర్తిస్తుంది కదా! ఇదేదో అతి సాధారణ విషయమైనట్టు, ‘అబ్బా యిలు అమ్మాయిల వెంటపడటం కాలేజీ విద్యార్థుల్లో మామూలే!’ అని మరో బీజేపీ నాయకుడి నిస్సిగ్గు వ్యాఖ్య, ‘కుర్రాళ్లు, కుర్రాళ్ల పనులే చేస్తారు’ అని వారి పోకిరీ పనుల్ని సమర్థిస్తూ లోగడ ములాయంసింగ్ యాదవ్ అన్న మాటల్ని గుర్తుకు తెస్తోంది. సంతానం ఆడో, మగో కనడం ఎవరి చేతు ల్లోనయినా ఉంటుందా? కాలం చెల్లిన సామెతే కావచ్చు!
‘కోడలు మగబిడ్డను కనిపెడతానంటే ఏ అత్త వద్దంటుంది?’ అని ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిగ్గా చేసిన వ్యాఖ్యలు ఏ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి? అంటే, ఆడబిడ్డని కంటే అత్తలు వద్దంటారని, అలా అనడం సముచితమేనని అర్థమే కదా! ‘కారు గ్యారేజీలో ఉంటే క్షేమంగా ఉన్నట్టు, ఆడవాళ్లు ఇంట్లోనే ఉంటే ఏ అఘాయిత్యాలూ జరుగవు కదా!’ అని సాక్షాత్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఇదొక దుర్మార్గమైన సమాజం, మరీ ముఖ్యంగా మహిళల పట్ల! బూజు పట్టిన భావజాలంలో బతికే సనాతన వాదులు మహిళల్ని... అవసరమైన పనులు చేసిపెట్టే, లైంగిక వాంఛలు తీర్చే, పిల్లల్ని కనిచ్చే జీవులుగా తప్ప, సాటి మనుషులుగా కూడా చూడలేక పోతున్నారు.
తామై కదిలితే తప్ప...
తాను కాకుండా మరో సాధారణ యువతి అయితే పోలీసులు స్పందించి ఉండేవారా? వారు కల్పించుకునే లోపలే పోకిరీలకు తాను చిక్కి ఉంటే? తెగించి తాను సాహసించకుంటే ఏమై ఉండు? ఇలాంటి ఆలోచనలూ వర్ణిక మదిలో మెదిలాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ‘ఏది ఏమైనా సరే, దోషులకు శిక్షపడే హేతుబద్ధ్దమైన ముగింపు వరకూ పోరాడుతా, ఈ సమయంలో ఆమెకు నేను అండగా నిలవకపోతే దేశంలో ఏ తండ్రీ తన బిడ్డల కోసం నిలబడలేడ’న్న వరిందర్ కుందు మాటలెంత సత్యం! ‘బయ టకు వెళ్లిన పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తున్నారంటే తల్లిదండ్రులు ఆందో ళన చెందాల్సింది ఆడపిల్లల గురించి కాదు, మగపిల్లల గురించి’ అన్న బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ అభివ్యక్తిలో ఎంత నిజముంది! చట్టాల్లో, వాటి అమలులో, పోలీసు వ్యవస్థలో, న్యాయపాలనలో, సామాజిక దృక్పథంలో, మగవాళ్ల ఆలోచనల్లో... అంతటా మార్పు రావాల్సిందే! ముఖ్యంగా మహిళల్లో మరింత చైతన్యం రావాలి. వర్ణిక, అదితిల ధైర్యం, పట్టుదల మహిళా సమా జానికి ఓ స్ఫూర్తి కావాలి.
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com