తనో రాజధర్మ దీపస్తంభం | Dileep Reddy Article On Atal Bihari Vajpayee | Sakshi
Sakshi News home page

తనో రాజధర్మ దీపస్తంభం

Published Fri, Aug 17 2018 12:48 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

Dileep Reddy Article On Atal Bihari Vajpayee - Sakshi

అటల్‌జీతో రచయిత

భారత్‌ వైవిధ్య సామాజిక పరిస్థితుల నేపథ్యంలోనూ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి. మూడుమార్లు దేశ ప్రధాని అయి, దేశంలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డులకెక్కారు. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనావళి అభిమానం చూరగొన్న నేత అయ్యారు. ‘సరిపోని శిబిరంలో సరైన వ్యక్తి’ (ఎ రైట్‌ మ్యాన్‌ ఇన్‌ రాంగ్‌ పార్టీ) అన్న విమర్శే ఆయన పట్ల జనాదరణకు గీటురాయిగా నిలిచే పొగడ్తయింది! బాబ్రీ మసీదు కూల్చివేతను నిర్ద్వంద్వంగా ఖండించారు. గోద్రా నరమేధం ఆపే ‘రాజధర్మం’ లోపించిందన్నారు. సరిహద్దులు చెరిపే శాంతికపోతమయ్యారు.

‘‘హార్‌ నహీ మానూంగా... రార్‌ నహీ థానుంగా
కాల్‌కే కపాల్‌ పర్‌ దిఖాతా మిఠాతాహూ, గీత్‌ నయా గాతాహు...’’
‘‘ఓటమిని ఒప్పుకోను... పోరుకు వెనుకాడను
కాలం నుదుట పాతను చెరిపి, కొత్తను లిఖిస్తా... సరికొత్త గీతాన్ని ఆలపిస్తా!’’

జీవిత పర్యంతం పలు సందర్భాల్లో పాత రాతల్ని చెరిపి కొత్త రాతలు లిఖించిన రాజనీతిజ్ఞుడు, భారత రత్న మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆఖరి గీతం పాడారు. యావద్భారతం నిండైన అభిమా నంతో నివాళి అర్పించేలా సాగిందా గీతం! మృత్యు వును అంత తేలిగ్గా అంగీకరించని ఆయన, సుదీర్ఘ పోరు తర్వాత తుది శ్వాసతో విశ్రమించారు. సంఘ ర్షణ–సంయమనం, జాతీయత–కవితాత్మకత, అవ కాశాలు–సవాళ్ల మధ్య సాగిన 93 ఏళ్ల ఆయన జీవన గమనమే ఓ విలక్షణ గీతం! భారత్‌ వైవిధ్య సామా జిక పరిస్థితుల నేపథ్యంలోనూ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు. మూడు మార్లు దేశ ప్రధాని అయి, దేశంలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డులకెక్కారు. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనా వళి అభిమానం చూరగొన్న నేత అయ్యారు. ‘సరి పోని శిబిరంలో సరైన వ్యక్తి’ (ఎ రైట్‌ మ్యాన్‌ ఇన్‌ రాంగ్‌ పార్టీ) అన్న విమర్శే ఆయన పట్ల జనాదరణకు గీటురాయిగా నిలిచే పొగడ్తయింది! ప్రత్యర్థులూ ప్రశంసించే విశిష్ట వ్యక్తిత్వమాయనది. స్వాతంత్ర పోరు సాగిన తన చిన్నతనం నుంచే దేశభక్తి భావాలు, జాతీయతా దృక్పథం ఉన్న వాజ్‌పేయి క్రమంగా ఎదిగి భారత రాజకీయ యవనికపై తనదైన చెరగని ముద్రవేశారు. అధికారంలో కన్నా విపక్షంలోనే అధికకాలం ఉండి భవిష్యత్తరాలకు ఆదర్శ వంతమైన రాజకీయ బాట పరిచారు. ఉదాత్త వ్యక్తిత్వం, ఉన్నత వక్తృత్వంతో పలు రూపాల్లో భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేశారు. విశ్వ పటంలో భారత్‌ స్థానాన్ని పదిలపరిచారు.

ఆయన ఓ స్ఫూర్తి, ప్రేరణ
యువకుడిగా శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ వంటి పెద్దల మెప్పు పొందిన అటల్‌జీ తర్వాత తానే ఎందరెందరికో స్ఫూర్తి అయ్యారు. విషయాల్ని సులభంగా గ్రహించే శక్తి, పనిపట్ల నిబద్దత, స్పష్టమైన అభివ్యక్తి తక్కువ కాలంలో ఆయనకు పేరు తెచ్చాయి. దానికి తోడు స్పష్టమైన, ప్రభావవంతమైన హిందీలో అనర్గళంగా మాట్లాడగలగటం అదనపు శక్తి అయింది. సభల్లో జరిపే ప్రసంగాల్లోనే కాకుండా నలుగురు చేరి ముచ్చటించుకునే చోట కూడా హాస్యస్పోరకంగా మాట్లా డటం, మధ్యలో కవితల్ని వినిపించడం ద్వారా పలు వుర్ని ఆకట్టుకోగలిగేవారు. ప్రతి మాటలో వాస్తవిక తను ప్రతిబింబించడం, శ్రోతల్లో నిజమనే భావన కలిగించడం ఆయన ప్రత్యేకత.

భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన కొత్తలో ఒకసారి ఆయన మెదక్‌ జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. మున్సి పల్‌ మైదానంలో ఆయన సభ, ప్రసంగం ఉందని తెలిసి జోగిపేట పట్టణపు డిగ్రీ విద్యార్థులుగా యువ కులు కొందరం వెళ్లాం. ఆయన ప్రసంగానికి మేమే కాకుండా సామాన్యులూ మంత్రముగ్దులైనట్టు నిలబడిపోయారు. సభ ముగిసిందని నిర్వహకులు ప్రకటించే వరకు ఎవరూ తమ స్థానాల నుంచి కదల నంత నిశ్చేష్టులయ్యారు. ‘‘1952లో నేను తొలిసారి అటల్‌జీని కలిశాను. ఆయన అప్పుడు డా‘‘ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ రాజకీయ కార్యదర్శిగా ఉండేవారు.. రాజస్థాన్‌ కోట నుంచి వెళుతున్నారని తెలిసి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా నేను వెళ్లాను... యవ్వనపు ఆదర్శ భావాలు ఆయన పుణికి పుచ్చుకున్నారని నాకు సులభంగా అర్థమైంది. రాజకీయాల్లోకి ప్రవేశించినా, ఆయన చుట్టూ ఒక కవితాత్మక ఆకర్షణ నెలకొని ఉండేది. ఆయనలో ఏదో ఒక శక్తి జ్వలిస్తున్నట్టు, ఆ అంతర్జ్వాల ముఖంపై ప్రస్పుటంగా గోచరించేది, అప్పుడాయన వయసు 27 ఉండవచ్చు...’’ అని బీజేపీ సీనియర్‌ నాయకుడు లాల్‌క్రిష్ణ అడ్వాణీ తన ఆత్మకథ (నాదేశం, నా జీవితం)లో రాశారు. అప్పు డేర్పడ్డ తన తొలి అభిప్రాయమే అటల్‌జీపై చివరి అభిప్రాయమన్నారు.

పార్టీలకు అతీతమైన విశాల దృక్పథం
వాజ్‌పేయిది పార్టీల, సిద్దాంతాల మూసలో ఇరుక్కు పోయే హస్వ్ర దృష్టి కాదు. విషయాల్ని సమగ్రంగా పరిశీలించి భూత, వర్తమాన, భవిష్యత్‌ పరిణా మాల్ని పరిగణనలోకి తీసుకునే వాస్తవిక, విశాల దృక్పథం. అందుకే, ఆయన అత్యధికులకు నచ్చే వారు. జనతా ప్రభుత్వపు మురార్జీదేశాయ్‌ మంత్రి వర్గంలో విదేశీవ్యవహారాల మంత్రిగా తన కార్యాల యంలో ప్రవేశించినపుడు సిబ్బందిని ఒకింత విస్మ యానికి గురిచేశారు. ‘అంతకు మున్నొచ్చినపుడు గోడపై కనిపించిన చిత్రపటం ఇప్పుడు లేదేంట’ని అడిగి, ‘మీరొస్తున్నారని తీసేశామం’టే, అప్పటిక ప్పుడు దాన్ని తెప్పించి మరీ గోడకు పెట్టించారా యన. ఆ ఫోటో వేరెవరిదో కాదు, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూది. రాజకీయంగా ఎన్ని అంశాల్లో విభేదించినా, పార్లమెంటు వేదికగా తానెన్ని పోరాటాలు చేసినా... రాజకీయాల్లో తనకు ఆదర్శం నెహ్రూ అని బహిరంగంగా చెప్పగలిగిన ధీరోదాత్తుడు అటల్‌జీ.

‘స్పష్టమైన భావాలు, నిక్కచ్చి అభివ్యక్తి, సమ్యక్‌దృష్టీ ఉన్న ఈ యువకుడికి ఎంతో భవిష్యత్తు ఉంది, ఏదో ఒక రోజు దేశానికి గొప్ప నేత అవుతాడ’ని అదే నెహ్రూతో ప్రశంసలు పొందారాయన. మానవహక్కుల విషయమై జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానంలో దేశం తరపు వాదనలు వినిపించడానికి వెళుతున్న ప్రతినిధి బృందానికి అటల్‌జీనే నేతృత్వం వహించాలని నాటి ప్రధాని పి.వి. నర్సింహారావు కోరి పంపారు. బాబ్రీమసీద్‌ కూల్చారనే మకిలి అంటి, అంటరాని పార్టీగా ఉన్న బీజేపీతో ఇతర పార్టీల్ని భాగస్వాముల్ని చేసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ఏర్పర చడం వాజ్‌పేయి వల్లే సాధ్యపడింది. ‘1996లో అట ల్‌జీ 13 రోజుల ప్రధానిగా ఉన్నపుడు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన పార్టీ వైఫల్యం నుంచి, 1998లో విజయవంతంగా అధికారం చేప ట్టడం వరకూ... ఆయన వ్యక్తిగత ఆదరణే ప్రధానాం శమైందని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ ఆక ర్షణ పార్టీకున్న మద్దతు కంటే అధికమైంది, అతీత మైంది’ అని అడ్వాణీ స్వయంగా పేర్కొన్నారు.

జర్నలిజంపై ఉదాత్త భావన
దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని స్థాయిల జర్నలిస్టులకు వాజ్‌పేయి అంటే ఓ ప్రత్యేక గౌరవం, ఆరాధ్య భావం ఉండేది. సమాజ ఉన్నతికోసం జర్నలిస్టులు కూడా గురుతర బాధ్యత కలిగిన వృత్తిపని వారనేది ఆయన అభిప్రాయం. దేశంలో ఏ మూలకు వెళ్లినా అటల్‌జీ–జర్నలిస్టులది ఓ అవినాభావ బంధం! రాజకీయాలకు ముందు జర్నలిజంలోనూ వాజ్‌పేయి తనదైన ముద్ర వేశారు. 1948లో ‘పాంచజన్య’కు సంస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. శక్తి వంతమైన ఆయన సంపాదకీయాలు చదివి ఉత్తేజితు లైన రాజకీయ నాయకులు దేశంలో ఎందరో! హిందీ మాసపత్రిక ‘రాష్ట్రధర్మ’కు, దినపత్రిక ‘స్వదేశ్‌’కు ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. 1996లో అటల్‌జీ విపక్షనేతగా ఉన్నపుడు ఒక అధ్యయన బృందంలో సభ్యుడిగా నేను ఆయన్ని తొలిసారి, వారి అధికార నివాసంలో కలిసినపుడు రెండు గొప్ప మాటలు చెప్పారు. ఇచ్చిన సమయం కన్నా కాస్త ఆల స్యంగా వెళ్లిన మా బృందాన్ని ఆహ్వానిస్తూ, ‘‘రండి... మీ ఆలస్యం వల్ల నేనీరోజు ‘క్వశ్చన్‌ అవర్‌’ అందుకోలేకపోతున్నా, పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రజా సమస్యలకు సమాధానాలు వెతికే ఆ సమయమే అత్యంత కీలకమైంది’’ అన్నారు. తర్వాత మా వృత్తి గురించి చెబుతూ, ‘జర్నలిజం ఉద్యోగం కాదు, ఒక వృత్తి, వృత్తిని మించి ఉదాత్త కార్యం (మిషన్‌)’ అని స్ఫూర్తినిచ్చారు. తొలిసారి ప్రధానిగా ఉన్నపుడు హైదరాబాద్‌ వచ్చిన అటల్‌జీ, తనకు పూర్వ పరిచయమున్న ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోరితే 5 నిమిషాల సమయమిచ్చారు. ఓ ఆసక్తికర ప్రశ్నకు ముగ్దుడై, ‘మరో 5 నిమిషాలు పొడిగించాను పో!’ అని పగలబడి నవ్వారు.

సంస్కరణ రథం, శాంతి కపోతం
ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినపుడు (1998–99) దేశంలో 5.8 ఆర్థిక వృద్ధి రేటు సాధిం చింది వాజ్‌పేయి ప్రభుత్వం. మౌలికసదుపాయాల కల్పనకు మున్నెన్నడు లేనంత ప్రాధాన్యత దక్కింది. ఎన్నో సంస్కరణలు తెచ్చారు. రావణ కాష్టంలా రగిలే భారత్‌–పాక్‌ మధ్య, ఉద్రిక్త సరిహద్దుల్ని చెరిపి సౌహార్ద్ర బస్సుయాత్ర నడిపిన శాంతి కపోత మాయన! జనతా ప్రభుత్వంలో తాను విదేశాంగ మంత్రిగా విత్తిన విత్తనాలు మొక్కై ఎదిగిన సందర్భం. నమ్మిన నిజమైన లౌకికవాదం పునాదులపై విశ్వాసంతో, తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టి సాగించిన లాహోర్‌ యాత్ర అది! దౌత్య ప్రపం చంలోనే పెను సంచలనం! బాబ్రీ మసీదు కూల్చివేతను నిర్ద్వంద్వంగా ఖండించారు. గోద్రా నరమేధం ఆపే ‘రాజధర్మం’ లోపించిందన్నారు. అన్ని కాలా ల్లోనూ... రాజకీయ వ్యవస్థను సంస్కరించాలనుకునే ప్రజాస్వామ్యవాదులకు అస్త్రంగా ఆయన అందించిన ఒక గొప్ప కవితతో ముగిస్తా. ‘‘అధికారంతో సత్యం పోరాడుతుంది, నిరంకుశత్వంతో న్యాయం యుద్దం చేస్తుంది, చీకటి ఓ సవాల్‌ విసిరింది, వెలుగే కడపటి అస్త్రమౌతుంది, అన్నీ పణంగా పెట్టాం... ఇక ఆగలేం! విరిగైనా పొతాం కానీ, వంగేది లేదు!’’

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement