రాయల‘టీ’ రాజకీయమే!
ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వినపడకుండా నిరో ధించేందుకు కూడా రాయల తెలంగాణ అస్త్రం ఉపకరిస్తుందని అధిష్ఠానం నమ్మకం. రాయల తెలంగాణ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు హోంశాఖ వర్గాలే చెప్పడం ఈ వాదనలకు బలం కలిగిస్తోంది.
రాయల తెలంగాణ ప్రతిపాదన గత కొంతకాలం కిం దటే రాయలసీమకు చెందిన ఇద్దరు ముగ్గురు అధికార పార్టీ నేతలు తీసుకురాగా సీమ ప్రజానీకం ఆ ప్రతిపాద నను అప్పుడే ఒక జోక్ కింద కొట్టిపారేసింది. కొందరు నిర్ద్వందంగా ఖండించారు. మరికొందరైతే ఆ నేతలపై దుమ్మెత్తిపోశారు. అంతటితో సద్దుమణగవలసిన ఆ ప్రస్తా వన ఇటీవల తరుచూ తెరపైకి రావడం రాయలసీమ చరి త్రను అధ్యయనం చేసినవారికి మింగుడు పడటం లేదు. రాయలసీమ అస్థిత్వానికే ముప్పుగా పరిణమించే ఈ ప్రతి పాదనను సీమవాసులతోపాటు ఏ రాజకీయ పార్టీ కూడా స్వాగతించలేదు. రాయల తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కాలమే తెర వెనక్కి నెట్టివేస్తోంది.
రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాను రూపొందించేం దుకు ఏర్పాటైన జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్) 11 అం శాలను రూపొందించి వాటిపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరింది. తెలుగుదేశం మినహా మిగతా పార్టీలన్నీ జీఓఎం ముందు హాజరై తమ అభిప్రా యాలను వివరించాయి. మజ్లిస్ పార్టీ రాయలసీమ మొత్తం కాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలు మాత్ర మే తెలంగాణలో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవల సిందిగా కోరటం గమనార్హం! ఇది ఆ రెండు జిల్లాలకు చెం దిన కొందరు అధికార పక్ష నేతలు చేస్తున్న ప్రతిపాదనకు నకలే.
గతంలోనూ ఒకసారి మజ్లిస్ రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చింది. కానీ ఇప్పటిలా సీమ భూభాగాన్ని విభజించి రెండు జిల్లాలనే తెలంగాణలో కలపాలని చెప్ప లేదు. ఈ మార్పు మాట ఎలా ఉన్నా మజ్లిస్ మొత్తంగా చూస్తే రాష్ర్ట సమైక్యతనే కోరుకుంటోంది. హైదరాబాద్‌ను యూటీని చేస్తే ముస్లిం మైనారిటీలకు సమస్యలు తలెత్తు తాయనీ, అందువల్లే యూటీ ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని నాయకులు చెప్పారు. రాయలసీమలోని ఈ రెండు జిల్లాలలో ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్నారని ఈ జిల్లాలను తెలంగాణలో కలిపితే మైనారిటీల పరిస్థితి మెరుగ్గా ఉంటుందని జీఓఎంకు మజ్లిస్ విశదీకరించింది.
రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక వారి వ్యాపార లావాదేవీల వ్యవహారాలు ఉన్నా, స్థానిక నేతలు కొందరు ఆ అంశం భుజానికి ఎత్తుకోవడానికి అదొక్కటే కారణం కాదు. కాంగ్రెస్ అధిష్టానం కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు బిల్లుకు మెజారిటీ సాధించుకునేందుకు కేంద్రం ఈ వ్యూహం అనుసరిస్తోంది. రాయల తెలంగాణ పేరుతో సీమ ప్రాంతంలోని సగం మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టడమే దాని పరమా వధి. ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వినపడకుండా నిరో ధించేందుకు కూడా రాయల తెలంగాణ అస్త్రం ఉపకరి స్తుందని అధిష్ఠానం నమ్మకం. రాయల తెలంగాణ ప్రతి పాదన పరిశీలనలో ఉన్నట్లు హోంశాఖ వర్గాలే చెప్పడం ఈ వాదనలకు బలం కలిగిస్తోంది. అందుకే ఆ రెండు జిల్లాల కాంగ్రెస్ నేతలు తమ ప్రతిపాదన సార్వజనీన మైనదని నమ్మబలుకుతున్నారు.
రాష్ట్ర విభజన అనివార్యంగా కనిపించడం వల్ల సాగు నీటి సమస్యల సుడిగుండంలో అనంతపురం, కర్నూలు జిల్లాలు చిక్కుకోకూడదన్న ఉద్దేశంతోనే రాయల తెలం గాణ ప్రతిపాదన తెచ్చినట్లు ఆ ప్రాంత అధికార పక్షనేతలు చెబుతున్నారు. ఇది సహేతుకం కాదు. రాయలసీమకు సాగునీరు తుంగభద్ర, కృష్ణల నుంచే అందాలి. వేరే దారి లేదు. ఈ నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ రెండు జిల్లాలకు మాత్రమే సంబంధించినవి కావు. అన్నీ కూడా తెలంగా ణతో పాటు సీమ ప్రాంతం మొత్తానికి ప్రతిపాదించినవే! రాయల తెలంగాణలో భాగమైనంత మాత్రాన అనంత పురం, కర్నూలు జిల్లాలకే ఈ ప్రాజెక్టుల నీరు పరిమితం కాదు. ఒకవేళ తెలంగాణ వారి సహకారంతో ఆ ప్రాజెక్టుల సాగు నీరు ఆ రెండు జిల్లాలకే పరిమితం చేసుకోవచ్చని భావిస్తే అది అజ్ఞానమే. ప్రతిపాదిత జిల్లాలకు కాని సీమ మొత్తం ప్రాంతానికి గాని ఈ ప్రాజెక్టుల నుంచి సాగునీరు సవ్యంగా అందాలంటే అది సమైక్య రాష్ట్రంలోనే సాధ్యం.
రాయలసీమ అస్తిత్వానికీ శతాబ్దాలుగా దాని సమగ్ర విశిష్ట చరిత్రకూ హాని తలపెట్టిన కేంద్రం కుయుక్తులను తిప్పికొట్టాలి. రాయల తెలంగాణను ప్రతిపాదించి, మద్దతి స్తున్న నేతలు భ్రమల నుంచి బయటకు రావాలి. మజ్లిస్ పార్టీ కూడా తన అనుమానాలను వీడాలి. సీమ ప్రాంత నాలుగు జిల్లాలు మొదట సమైక్యతను కోరాలి. అది వీలు కాని పక్షంలో శ్రీభాగ్ ఒడంబడిక అమలుకు ఒత్తిడి తేవాలి.
- లెక్కల వెంకటరెడ్డి
రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు