గుడ్ ఫ్రైడే.. గ్రేట్ ఫ్రైడే | Good firday of the day | Sakshi
Sakshi News home page

గుడ్ ఫ్రైడే.. గ్రేట్ ఫ్రైడే

Published Fri, Mar 25 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

గుడ్ ఫ్రైడే.. గ్రేట్ ఫ్రైడే

గుడ్ ఫ్రైడే.. గ్రేట్ ఫ్రైడే

నేడు గుడ్‌ఫ్రైడే శుభదినం
చీకటిలో అల్లాడి విశ్వాన్ని చూడలేక వెలుగును సృష్టించిన దేవుడాయన. లోకానికి రక్షణ వెలుగుగా వేంచేసిన రక్షకుడాయన. అయితే ముష్కరులంతా ఒక ముఠాగా ఏర్పడి సాత్వికత్వానికి, ప్రేమకు, క్షమాపణకు ప్రతిబింబమైన ఏసుక్రీస్తును సిలువకు మేకులతో గుచ్చి ఆఖరిబొట్టుదాకా ఆయన రక్తాన్ని స్రవింపజేశారు.  చరిత్రలో నాటివరకు మరణమే లోకంలో రాజ్యమే లింది. మరణాన్ని చూపించి భయపెట్టి రాజ్యాధికా రాలు కైవసం చేసుకున్నారు. కాని అంతటి బలమైన ఆ మరణమే దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ముందు చిత్తుగా ఓడిపోయింది.

 అత్యంత విషాదకరమైన సిలువ ప్రస్థానం అలా మొదలైంది. ప్రజలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు, వ్యవస్థలు, శాసనాలు పాలకుల్లోని కుట్ర దారులు, పిరికిపందల చేతుల్లో ఆయుధాలుగా మారితే జరిగే అనర్థమేమిటో ఆనాడే క్రీస్తు సిలువతో రుజువయింది. కానీ ఏసుక్రీస్తుకు సిలువ విధించిన రోమా ప్రభుత్వం చరిత్రలో నామరూపాలు లేకుండా పోయింది. ఆ క్రీస్తు తాలూకు ఆత్మీయ ప్రేమ సామ్రాజ్యం మాత్రం రెండు వేల ఏళ్లుగా ఎల్లలు లేకుండా విస్తరిస్తోంది.
 
 సిలువలో క్రూరంగా హింసించినా ప్రతీకారాగ్ని చల్లారని చీకటి శక్తులు క్రీస్తును గజదొంగ స్థాయికి దిగ జార్చడం కోసం ఆయనకు ఇరువైపులా ఇద్దరు గజదొంగలను కూడా వేలాడదీశాయి. వారిలో ఒకడు క్రీస్తును తూలనాడితే సిలువలో మరణిస్తున్న మరొక గజదొంగ ‘ప్రభూ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో’ అని అర్థించాడు. సిలువలో మరణానంతరం ఏసు క్రీస్తుకు అంగరక్షకుడుగా మహాభక్తుడెవరైనా పరదైసు లోకి ప్రవేశిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ దేవదేవుడు ఒక దొంగకు ఆ ఆధిక్యతనిచ్చాడు. ఎందుకు? ఆ దొంగ చేసిన మొదటి, చివరి ప్రార్థన కూడా ఏసుక్రీస్తు ఈ లోకంలోకి రావడంలోని మూల ఉద్దేశాన్ని తాకింది. ఆయన పాపులను కూడా నీతిమంతులుగా మార్చి పరలోకానికి తీసుకెళ్లేందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆ దొంగ తన  మరణ సమయంలో పరలోకాన్నే కోరుకున్నాడు. ప్రభువు తక్షణం అనుగ్రహించాడు.
 
 రెండువేల ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం కల్వరి గిరిపై క్రీస్తును శిలువపైకి ఎక్కించారు. చేతుల్లోకి, పాదాల్లోకి మేకులు దిగ్గొట్టారు. రక్తం చివ్వున ఎగజిమ్మింది. ‘దేవా, నా దేవా.. నన్నెందుకు చేయి విడిచావు!’ క్రీస్తు బాధ నింగివరకు ప్రతిధ్వనించింది. మౌనమే సమాధానం. తండ్రి ఆజ్ఞపాలన కోసం తలవాలుస్తూ క్షమాప్రార్థన చేశారు ఏసుక్రీస్తు. ‘వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక తండ్రీ వీరిని క్షమించు’. ప్రార్థన పూర్తయింది. అకస్మాత్తుగా లోకాన్ని చీకటి కమ్ముకుంది. పునరుత్థానం కోసం మానవాళి పాపప్రక్షాళన కోసం ప్రాణాన్ని విడిచి మరణాన్ని ఓడించారు క్రీస్తు. అవమానికి ప్రతీకగా ఉండిన సిలువ ఏసుక్రీస్తు వల్ల ప్రేమకు, త్యాగానికి, పరలోకార్హత పొందడానికి, ఆయన ఆత్మీయ సామ్రాజ్యానికి ప్రతీకగా మారింది. అందుకే ఇది గుడ్ ఫ్రైడే.. గ్రేట్  ఫ్రైడే.
- డేనియల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement